Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 12

 

    అతడు తడబడి -- "ఒక్క క్షణం ఆగితే మనం మాట్లాడుకుందాం" అన్నాడు.
    "ఎందుకు?"
    "సేల్సు ,మన్ భోం చేసి వస్తాడు --" అన్నాడు సదానందం.
    సేల్సు మన్ రాగానే ఇద్దరూ ఎదురుగా వున్న పార్కు లోకి నడిచారు.
    "నాకు ఊరూ పేరూ లేదు. సదానందం కారణంగానే నాకు ఓదారి కనబడింది. రెండేళ్ళ క్రితం అతడు ఈ షాపు ఓపెన్ చేసి తన పేరులో నన్ను చలామణి కమ్మన్నాడు. అలాగే అవుతున్నాను. ఓపెనింగ్ సేరమనీ కి మాత్రం అతడున్నాడు...."
    "ఇప్పుడు సదానందం ఏమయ్యాడు ?"
    "తెలియదు. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుసుకుని అడిగి డబ్బు తీసుకుని వెడుతుంటాడు...."
    "నీకు తెలుసు. ఏదో దాస్తున్నావు?" అన్నాడు వెంకన్న.
    "నాకేమీ తెలియదు " అన్నాడతడు.
    "సదానందం గురించి నాకు చాలా తెలుసు. అతడి గురించి దాచడం వలన నీకు కూడా ప్రమాదం" వెంకన్న హెచ్చరించాడు.
    "మీకింకా వివరాలు కావాలంటే పార్వతి చెప్పగలదు."
    వెంకన్న అడిగి పార్వతి వివరాలు తెలుసుకున్నాడు.
    పార్వతి ఏదో ఆఫీసులో స్టెనో గా పని చేస్తోంది. ఇరవై రెండేళ్ళు అందంగా ఆకర్షణీయంగా వుంటుంది. ఇంకా పెళ్ళి కాలేదు. సదానందం తరచూ ఆమెను కలుసు కుంటుంటాడు.
    "సదానందం నిన్ను కలుసుకుని ఎంత కాలమయింది?"
    "రెండు నెలలు."
    వెంకన్న పార్వతిని కలుసుకున్నాడు.
    "వారం రోజుల క్రితం సదానందం నన్ను కలుసుకున్నాడు -- " అని చెప్పిందామె. అమెచేత ఈ సమాచారం చెప్పించడానికి వెంకన్నకు పావుగంట పట్టింది.
    "ఇప్పుడతడెక్కడున్నాడు?"
    "నాకు తెలియదు " అంది పార్వతి.
    ఆమె కనులు చూస్తుంటే ఆమెకు తెలుసుననే అనిపించింది వెంకన్న కు --"సదానందం చాలా ప్రమాదంలో వున్నాడు. నేనతడిని అర్జంటుగా కలుసుకోవాలి --"
    కానీ పార్వతి ఏమీ చెప్పలేదు.
    వెంకన్న అక్కణ్ణించి వెళ్లిపోయినట్లు నటించి యింటి మీద నిఘా వేశాడు. కొద్ది క్షణాల్లో పార్వతి అతడు ఊహించినట్లే ఇంటి నుంచి బయల్దేరింది హడావుడిగా.
    అతడామెను అనుసరించాడు.
    హోటల్ పుష్పక్ లో ఏడో నెంబరు గదికి వెళ్ళి అయిదు నిమిషాలు మాత్రం గడిపిందామె.
    వెంకన్న ఏడో నంబరు గదిలోని వ్యక్తీ గురించి రిసెప్షనిస్టు వద్ద వాకబు చేశాడు. అందులో ఒక స్త్ర్రీ వుంటోంది. పేరు వనజ.
    వెంకన్న వనజను కలుసుకున్నాడు.
    "ఎవరు నువ్వు? నాతొ నీకేమిటి పని?" అంది వనజ.
    "నా పేరు వెంకన్న. నేను డిటెక్టివ్ ను....' అన్నాడు వెంకన్న.
    "నాతో నీకేమిటి పని ?"
    "సదానందం ఎక్కడ?"
    "ఏ సదానందం ?"
    'ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్సు ప్రొప్రయిటర్ ...."
    "నాకు తెలియదు ..."
    "నీకు తెలుసు...." అన్నాడు వెంకన్న.
    వనజ చిరాకు పడుతోంది. వెంకన్న జిడ్డులా పట్టుకున్నాడు. చివరికామే కోపంగా "ఇదో పెద్ద న్యూసెన్స్ గా వుంది. మర్యాదగా వెళ్ళకపోతే నిన్ను గెంటించవలసి వుంటుంది" అంది.
    "అలాంటి ప్రయత్నం చేస్తే నేను జైలు కైనా వెడతాను గానీ నలుగురిలో నీ బట్టలు విప్పి పోతాను"అన్నాడు వెంకన్న.
    "ఏమిటా మాటలు -- నీకు సభ్యత తెలియదా?"
    'అన్నీ తెలుసు నాకు. నువ్వు ఆడవేష మెందుకు వేశావు?"
    వనజ ఆశ్చర్యంగా -- "ఏమిటీ నువ్వనేది ?" అన్నది.
    "నిన్ను చూస్తూనే -- నువ్వే సదానందానివని నేను గుర్తుపట్టాను" అన్నాడు వెంకన్న.
    ఆమె నిట్టూర్చి -- "మీరు పొరబడ్డారు" అంది.
    'అంటే ?"
    "సదానందం నా అన్నయ్య -- మా ఇద్దరివీ ఒక్కటే పోలికలు...."
    "నేను నమ్మను...."
    "మిమ్మల్నెలా నమ్మించేది ?"
    "నీకు సిగ్గు లేకపోతె -- ఇక్కడే తేలిపోతుంది. సిగ్గున్న పక్షంలో నాతొ మా యింటికి పద. సదానందం వేలిముద్రలతో నీ వేలిముద్రలు పోల్చి ...."
    వెంకన్న ఏదో అనబోతుండగా -- 'అన్నయ్య వేలిముద్రలు మీవద్ద వున్నాయా ?" అన్నది వనజ.
    "ఉన్నాయి " అన్నాడు వెంకన్న.
    "డిటెక్టివ్ లు -- మీవద్ద సిగ్గుపడి ప్రమాదం తెచ్చుకోలేను " అన్నదామె. ఆమె ఆడదేనని ఋజువు కావడానికి కొద్ది క్షణాలు పట్టింది.
    "ఆయామ్ సారీ ..." అన్నాడు వెంకన్న.
    "ఇట్సాల్ రైట్ ...." అంది వనజ.
    "ఇప్పుడు మీ అన్నయ్య గురించి చెప్పండి" అన్నాడు వెంకన్న.
    'అన్నయ్య పరారీ అయి తిరుగుతున్నాడు. వాడు విశాల అనే అమ్మాయిని హత్య చేసినట్లు తిరుగులేని సాక్ష్యాలున్నాయి ...." అంది వనజ.
    "విశాల హత్య నేను పరిశోదిస్తున్నాను. మీ అన్నయ్యకూ ఆ హత్యకూ ఏ సంబంధమూ లేదు...." అన్నాడు వెంకన్న.
    "లేదు ...." అంది వనజ -- "కానీ కోర్టు గురించి నేనంటున్నాను...."
    "నేనూ కోర్టు మాటే చెబుతున్నది ...." అన్నాడు వెంకన్న.
    'విశాల అన్నయ్య మీద అబద్దపు టారోపణలు చేస్తోంది. అతడు తన్ను ప్రేమ పేరు చెప్పి మోసం చేశాడంది. కోపంలో అన్నయ్య ఆమెను చంపేస్తానని అన్నాడు. ఆ మాటలు రికార్దయ్యాయి. మర్నాడే ఆమె హత్య చేయబడింది. హత్యకు పయోగించబడిన కత్తి అన్నయ్యది, దాని మీద అన్నయ్య వేలిముద్రలు కూడా వున్నాయి...."
    విశాలను చంపిన కత్తి మీద ముగ్గురి వేలిముద్రలున్నాయి. అందులో కాళీ ప్రసాద్ వీ, మోహన్ వి, గుర్తించబడ్డాయి. ఈ విషయం వెంకన్నకు గుర్తుంది.
    'అసలా విశాల ఎవరు?" అన్నాడు వెంకన్న.
    "ఆమె సూర్యారావు మనిషి ...." అంది వనజ.
    'సూర్యారావు మనిషా ?" వెంకన్న ఆశ్చర్యపడ్డాడు.
    వనజ తమ కధ చెప్పింది.
    సదానందం వనజలను పది సంవత్సరాల వయసప్పుడు సూర్యారావు చేరదీసాడు, సదానందాన్ని తన కనుగుణంగా తీర్చి దిద్దాడాయన. పదహారేళ్ళ వయసు రాగానే వనజను  క్యాబరే నర్తకిని చేశాడు. మొదట్లో సదానందానికి అర్ధం కాలేదు. తన చెల్లి ఎంత ఘోరమైన జీవితం గడుపుతున్నదో తెలిశాక అతడు సూర్యారావు నుంచి విడిపోవాలనుకున్నాడు. అయితే సూర్యారావు వనజను హెచ్చరించాడు --" నీ అన్నకు బుద్ది చెప్పకపోతే అతడి ప్రాణాలే పోగలవని ."
    వనజ ఆ హెచ్చరికకు భయపడి అన్న కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమాలింది. అతడు వినకుండా వేరే వుండసాగాడు. అప్పుడు సూర్యారావు సదానందంతో -- "నువ్వో ఫ్యాన్సీ స్టోర్సు ప్రారంభించు. నా స్మగ్లింగుకు సహకరించు. బాగా డబ్బు సంపాదించుకో. ఆ తర్వాత రెండు లక్షలు నాకిచ్చి నీ చెల్లెల్ని విదిపించుకో " అన్నాడు. సదానందం ఒప్పుకున్నాడు. తను కాకుండా వేరెవరిచేతనో షాపు ప్రారంభింపచేశాడు. సూర్యారావును వ్యాపారంలో మోసం చేసి పది లక్షలు కాజేశాడు. తను అజ్ఞాతంగా వుండసాగాడు.
    వనజ కోసం రెండు లక్షలు సంపాదించడానికీ అతడు అడ్డమైన పనులూ చేయడానికి సిద్ద పడతాడని సూర్యారావు అనుకుంటే కధ మరోలా జరిగింది.
    "నా చెల్లెలేలాగూ చెడింది. దాన్ని నేను విడిపించుకుని బాగు చేసేదేమీ లేదు --" అనేవాడు సదానందం. అతడు రహస్యంగా సూర్యారావుకు సంబంధించిన సమాచార మంతా సేకరిస్తున్నాడు. ఏదో ఒకరోజున అతడి బ్రతుకు బయట పెట్టాలని అనుకుంటున్నాడు.
    అప్పుడు సూర్యారావు మాస్టర్ ప్లాన్ వేశాడు. విశాల అనే అమ్మాయిని సదానందం హత్య చేయాలనుకుంటున్నట్లు ఆధారాలు సృష్టించాడు. ఆ విశాలను చంపించాడు. ఇప్పుడు సదానందాన్ని వేటాడతాడు.
    'అయితే సదానందం ఎక్కడ ?"
    "వారం రోజుల క్రితం వాడు పార్వతిని కలుసుకున్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు. వాడికోసమే నేనిక్కడ మకాం పెట్టాను" అంది వనజ.
    "ఇక్కడ మకాం పెట్టి ఏం ప్రయోజనం ?"
    "వాడు పార్వతి కోసం వస్తాడు. పార్వతి వాణ్ని నా దగ్గరకు పంపుతుంది....."
    "మీ అన్నయ్య ఎక్కడుంటాడో చెప్పలేవా ?"
    వనజ కళ్ళు వోత్తుకుని -- "అసలు వాడు బ్రతికున్నాడో లేదో చెప్పలేను"అంది.
    "అంటే?"
    "వాడా సూర్యారావు చేతిలో హతమయుండవచ్చు --" అన్నదామె.
    వెంకన్న అక్కణ్ణించి బయటకు వచ్చాడు. హోటలు రిసెప్షనిస్టు ని కలుసుకుని ఏదో మాట్లాడాడు.
    
                                   3
    "నమస్కారం -- సూర్యారావుగారూ -- నేను వెంకన్న ను మాట్లాడుతున్నాను. సదానందం దొరికాడు ...." అన్నాడు వెంకన్న -- "మీరు వచ్చేటప్పుడు అన్న ప్రకారం లక్షరూపాయలు తీసుకు రండి --"
    ఓ పావు గంటలో సూర్యారావు వెంకన్న ఆఫీసులో వున్నాడు.
    "వెంకన్నగారూ -- నేనిచ్చిన చిన్న క్లూ ఆధారంగా మీరు హంతకుడి పేరు సదానందం అని తెలుసుకున్నారు. ఇటీజ్ సింప్లీ మార్వలెస్ .....ఇంతకీ ఆ సదానందం ఎక్కడ?" అన్నాడు సూర్యారావు ఆశ్చర్యానందాలతో.
    వెంకన్న అతడిచ్చిన డబ్బు లెక్క పెట్టుకుని -- ఇంట్లో పద్మావతి దేవికి ఇచ్చివచ్చాడు.
    "సదానందం -- ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్సు ప్రొప్రయిటరు--"
    "ఆ సంగతి నాకూ తెలుసు ....కానీ ...."
    "నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ...." అన్నాడు వెంకన్న.
    విశాలకు అందంతో పాటు విచ్చలవిడితనం వుంది. ఆ విధంగా ఆమె కాళీప్రసాద్ , మోహన్ , సదానందం లతో పరిచయం పెట్టుకుంది. ముగ్గురికీ అసలు విషయం తెలియగానే ఆమె హత్య కావించబడింది. హత్యలో ఇరుక్కున్న మోహన్ సూర్యారావు కు దగ్గర బంధువు. విశాలను హత్య చేసిందెవరో సూర్యారావు కు తెలుసు. అందుకని సూర్యారావు మోహన్ ని రక్షించాలనుకున్నాడు. హత్య చేసిన వ్యక్తినీ రక్షించాలనుకున్నాడు. ఓ క్లూ ఇచ్చాడు.
    "కానీ మిస్టర్ సూర్యారావ్ ! మీరు మీ ప్రియురాలు వనజను రక్షించు కోలేరు. ఆయామ్ సారీ ఫర్ దిస్ ...." అన్నాడు వెంకన్న.
    "ఏమిటి మీరనేది?" అన్నాడు సూర్యారావు ఆశ్చర్యంగా.
    "మిస్టర్ సూర్యారావ్ -- నేను ముందే చెప్పాను -- డిటెక్టివ్ లను సవాలు చేయడం వల్ల ప్రమాదమని ....'అని సీతమ్మ వంక తిరిగి -- "మైడియర్ అసిస్టెంట్ ....ఈయన కధ ఈయనకు నువ్వే నీ ఈయని కంఠం తో వినిపించు --' అన్నాడు.    
    సూర్యారావు సదానందాన్ని చిన్నప్పట్నించి చేరదీసి పెంచాడు. అతడి చెల్లెలు వనజను క్యాబరే డ్యాన్సర్నీ చేశాడు. సదానందం చచ్చుమనిషి. దేనికి ప్రతిఘటించలేడు. అతడు సూర్యారావు చెప్పినట్లే ఆడేవాడు. వనజ తెలివైనది. ఆమె తన తెలివితేటలతో సూర్యారావు హృదయంలో స్థానం సంపాదించుకుని అతడికి ఉంపుడు కత్తే అయింది.
    తన స్మగ్లింగ్ వ్యవహారాల కోసం సూర్యారావు కొంత కాలం వనజను పురుష వేషంలో వేరే వుంచాడు. అప్పుడే ఆమె ఒకసారి డిటెక్టివ్ వెంకన్న ను కలుసుకొనడం కూడా జరిగింది. వనజ సదానందం పేరుతొ చలామణీ అవుతూ - అన్నకు ఓ ప్యాన్సీ స్టోర్సు ప్రారంభించింది. ఆమె స్నేహితురాలు పార్వతికి ఆమె గురించి అంతా తెలుసు. ఆమె కష్ట సుఖాలను స్నేహితురాలితో పంచుకునేది.
    ఈలోగా సూర్యారావు విశాల వలలో పడ్డాడు. వనజను నిర్లక్ష్యం చేయ నారంభించాడు. వనజకు సూర్యారావు రహస్యాలు చాలా తెలుసు. భార్య స్థానం లేకపోయినా ప్రియురాలి స్థానమైనా భద్రంగా వుండాలని కోరుకున్నదామె. ఒకరోజు ఆవేశంలో విశాలను చంపిందామే.
    అప్పుడు సూర్యారావు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ ప్రపంచంలో లేని సదానందాన్ని ఆ హత్యలో ఇరికించాలనుకున్నాడు. ఆ ప్రకారం వెంకన్నకు ఓ చిన్న క్లూ ఇచ్చాడు.
    "ఇప్పుడు మీ ప్రియురాలితో పాటు మీ నేరాలు కూడా బయటపడతాయి ...." అన్నాడు వెంకన్న.
    సూర్యారావు ముఖం పాలిపోయింది -- "మీ గొప్పతనం మీద నాకు నమ్మకముంది కానీ వనజను సదానందంగా అనుమానిస్తారనుకోలేదు. సదానందం కోసం విడవకుండా వెతుకుతుంటారనీ -- ఆ విధంగా అటు వనజ , ఇటు మోహన్ కూడా రక్షించబడుతారనీ అనుకున్నాను" అన్నాడు నీరసంగా.
    "మీ ప్లాను గొప్పదే -- నేనూ వనజను సదానందంగా గుర్తించకపోదును. తన వేలిముద్రలు పరీక్షిస్తాననీ, తన అన్న వేలిముద్రలు నావద్ద వున్నాయనీ అనగానే ఆమె -- స్త్రీ సహజమైన సిగ్గును కూడా విడిచి తను ఆడదానినని నాకు నిరూపించాలనుకుంది. అప్పుడే నాకు అనుమానం కలిగింది." అన్నాడు వెంకన్న.
    "పాపం -- మోహన్ ని రక్షించడం కోసం ...." అంది రాజమ్మ నిట్టుర్చుతూ.
    "ఏం చేస్తాం -- ఏ రోజునైనా చేసిన పాపానికి శిక్ష అనుభవించడం ఎవరికీ తప్పదు...." అన్నాడు వెంకన్న.

                                     ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS