Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 12


                               సుబ్బారావు చావు
                                                                     --వసుంధర


    డిటెక్టివ్ వెంకన్న అసిస్టెంట్సు సీతమ్మ, రాజమ్మకార్లోంచి దిగగానే ఇన్ స్పెక్టర్ శంకర్రావు వారికి ఎదురెళ్ళి-"రండి రండి-మీ కోసమే యెదురు చూస్తున్నాను-" అన్నాడు.
    వెంకన్న మందహాసం చేసి అసిస్టెంట్సు వంక చూశాడు. వాళ్ళిద్దరూ చేతిలో నోట్ బుక్ తో, పెన్సిల్ తో సిద్దంగా ఉన్నారు. వెంకన్న చిరునవ్వు చూస్తూనే వాళ్ళు శంకర్రావు మాటలు నోట్ చేసుకున్నారు.
    "మీరు మా కోసం యెదురుచూస్తున్నాననడం రికార్డయింది. తర్వాత మీ రొప్పుకోకపోయినా ఈ రికార్డు నా మనసుకు తృప్తినిస్తుంది-...." అన్నాడు వెంకన్న.
    "నా కారణంగా మీరు తృప్తిపడితే-అదే నాకు సంతోషం...." అన్నాడు శంకర్రావు.
    "శవమెక్కడుంది?" అన్నాడు వెంకన్న విషయానికి వస్తూ.
    "బెడ్రూంలో మంచంమీద-చాలా విషాదమైన కేసు. భార్యాభర్తలిద్దరూ ఒకే మంచంమీద పడుకున్నారు. అప్పుడిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తెల్లారి లేచేసరికి భర్త శవంగా మారాడు. భార్య వళ్ళు తెలియని నిద్రలో వుంది. పాల వాడదేపనిగా తలుపు తట్టగా తట్టగా మెలకువ వచ్చింది....."
    "హార్టు ఎటాకా?" అన్నాడు వెంకన్న.
    అప్పటికి శంకర్రావు, వెంకన్న, శవమున్న గదిలో ప్రవేశించారు. సీతమ్మ, రాజమ్మ వారి ననుసరించారు.
    శవం నీలంరంగులో వుంది.
    "మీ ప్రశ్నకు జవాబు లభించిందా?" అన్నాడు శంకర్రావు.
    "విషప్రయోగమన్నమాట!" అన్నాడు వెంకన్న.
    శంకర్రావు తలాడించి-"ఎలా జరిగిందో తెలియడం లేదు. ఇల్లంతా గాలించినా ఎక్కడా ఎలాంటి విషమూ దొరకలేదు. ఇంటి తలుపు లన్నివైపుల నుంచీ వేసి ఉన్నాయి. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. లోపలకెవరూ వచ్చిన జాడలేదు. తన భర్త కెటువంటి దిగులూ లేదనీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదనీ భార్య అంటోంది. వారిది నలుగురూ అసూయపడే అన్యోన్య దాంపత్యమనీ, భార్యది మంచి మనస్తత్వమనీ ఆమె సుగుణవతీ అనీ యిరుగూ పొరుగూ అంటున్నారు. ఇది ఆత్మహత్య అయుండాలి. హత్యయితే భార్యే చేసి ఉండాలి. ఆమె చాలా అందంగా, అమాయకంగా ఉంది, అనుమానంమీద ఆమెనరెస్టు చేయడానికి మన సొప్పడం లేదు. ఏం చేయాలో పాలుపోక మీకు ఫోనుచేశాను-" అన్నాడు.
    వెంకన్న అతని మాటలు వింటూ శవాన్ని చూస్తున్నాడు.
    హతుడి వయసు ముఫ్ఫై దాటదు. కనుముక్కు తీరుచక్కగా వుంది. మనిషి మంచి పొడగరి. సుమారైనలావు. అందమైన గంభీరమైన మీసాలు....
    అప్రయత్నంగా-"నేనొకసారి హతుడి భార్యను చూడాలి...." అన్నాడు వెంకన్న.
    "పక్క గదిలో ఉందామె. భోరున ఏడుస్తోంది-...."
    వెంకన్న పక్కగదిలోకి వెళ్ళాడు. అతడి ననుసరించారు అసిస్టెంట్సు.
    లోపల గోడవారగా కూర్చుని ఏడుస్తోందో యువతి. ఆమె తల మోకాళ్ళపై ఉంది. వెక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయి.
    వెంకన్న అసిస్టెంట్సువంక చూశాడు.
    సీతమ్మ, రాజమ్మ ఆమె చెరోపక్కన వెళ్ళి కూర్చున్నారు. సీతమ్మ ఆమె భుజంమీద చేయి వేసింది.
    ఉలిక్కిపడి తలెత్తిందా యువతి. ఆమెకు ఎదురుగా వెంకన్న కనిపించాడు.
    "నా పేరు వెంకన్న. నేనొక డిటెక్టివును. ఈ కష్ట సమయంలో నీకు సాయపడాలని వచ్చాను. నీ పేరు చెప్పమ్మా" అన్నాడు వెంకన్న.
    "వసంత-" అందామె.
    "మీ వారి పేరు?-"
    "సుబ్బారావు!"
    "వారేం' చేస్తున్నారు?"
    "సెంట్రల్ గవర్నమెంట్ లేబరేటరీలో సైంటిస్టు-..."    
    "ఆయనకు శత్రువులున్నారా?"
    "ఉన్నారు-...."
    వెంకన్న కళ్ళు మెరిశాయి-"వారి వివరాలు చెప్పమ్మా!"    
    "నేనే ఆ శత్రువుని నేనే వారిని చంపాను...." అంటూ ఆమె భోరున ఏడ్చింది.
    వెంకన్న ఆమెను తమాయించుకోనిచ్చి-"చూడమ్మా! దుఃఖాన్ని అణచుకో, పోయిన వారెలాగూ తిరిగిరారు. నువ్వు జైలుపలుకావడం నా కిష్టం లేదు. నీకు సాయపడాలనే వచ్చాను...." అన్నాడు.
    "నాకెవరి సాయమూ వద్దు. వారు లేకపోయాక నా బ్రతుక్కి అర్ధం లేదు. ఈ హత్య నేనే చేశాను. నన్నురితీస్తే నేనూ వారిని చేరుకుంటాను...." అందామె జీరవోయిన కంఠంతో.
    "సరే-హత్య నువ్వే చేశావు. అందుక్కారణ మేమిటి?"
    "నేను దుర్మార్గురాల్ని-పాపాత్మురాల్ని నావంటి వాళ్ళు మనుషుల్ని చంపడానికి కారణాలుండవు...." అంది వసంత ఏడుస్తూనే.
    "నీ భర్తపోయిన దుఃఖంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. నువ్వే ఈహత్య చేశావంటే నీకు పడేది ఉరిశిక్ష కాదు. యావజ్జీవకారాగారశిక్ష. నేరం చేయకపోయినా జైలుపాలై నేరస్థుల మధ్య నికృష్ట జీవితం అనుభవించాలి....."
    "అన్నింటికీ నేను సిద్దంగా వున్నాను...." అంది వసంత.
    వెంకన్న ఆమెతో ఇంకేమీ మాట్లాడకుండా బయటకు వచ్చాడు.
    "ఏమంటుందామె?" అన్నాడు శంకర్రావు.
    "నేనే మడిగినా ఏడుస్తుంది తప్ప నోరు విప్పదు. మీరామెచేత పలికించడమే పెద్ద విశేషం.....అంతా విన్నాను నేను. అంటే ఆమె యీ హత్యచేసి తర్వాత బాగా అప్సెట్టయిందన్నమాట... ...." అన్నాడు శంకర్రావు.
    "ఆమె హత్యచేసిందని చెప్పలేను కానీ అప్సెట్ మాత్రం అయింది-"
    "ఏమైనా ఆమెను నేనరస్టు చేయాలనుకుంటున్నాను...."
    "వద్దు...." అన్నాడు వెంకన్న.
    "కుదరదు వెంకన్నగారూ! ఇది హత్యకేసు. హత్య చేసే అవకాశం ఆమెకు తప్పలేదు. ఆమె తనే హత్య చేశానంటోంది...."
    "ఆమె తరఫున నేను హామీ ఉంటాను. ఇదామే నరెస్టు చేయడానికి సమయంకాదు. నేనామెను మా యింటికి తీసుకుని వెడతాను. ఆమెను సముదాయించి మామూలు మనిషిని చేసే బాధ్యత నా శ్రీమతికి అప్పగిస్తాను. ఈలోగా మనం సేకరించవలసిన సమాచారం చాలా వుంది-" అన్నాడు వెంకన్న.
    "మీరు హామీ ఉంటానంటే సరే-అయితే బాధ్యత మీదే!" అన్నాడు శంకర్రావు.
    "బాధ్యతగల పౌరుణ్ణి నాకు బాధ్యత గురించి మీరు హెచ్చరించాల్సిన అవసరంలేదు-" అన్నాడు వెంకన్న.

                                       2


    వేలిముద్రల నిపుణుడి రిపోర్టు ప్రకారం-అనుమానప్రదేశాల్లో లభించిన వేలిముద్రలు - సుబ్బారావుని, వసంతని, మూడో మనిషివిలేవు.
    పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం-ఒక అద్భుత విశేషం తెలిసింది. సుబ్బారావు ప్రాణంతీసిన విషం ఎక్స్ థర్టీటూ అది కొత్తగా కనిపెట్టబడిన విశేషం. దాన్ని కాఫీ, టీలలో కూడా కలిపివ్వవచ్చు. మంచినీళ్ళలో కలిపివ్వవచ్చు. దానివల్ల ద్రావకానికి రంగు మారదు. దానికి రుచిలేదు. పుచ్చుకున్నాక పన్నెండుగంటలదాకా దాని ప్రభావముండదు. అప్పుడది ఉన్నట్టుండి ప్రభావం చూపిస్తుంది. గుండెల్లో నొప్పి వస్తుంది. అరుద్దామన్నా గొంతు పెగలదు. కాళ్ళు, చేతులు కదపాలన్నా సాధ్యంకాదు, ప్రాణం పోవడానికి రెండు మూడు నిముషాలు పడుతుంది. అప్పుడు హతుడనుభవించే నరకయాతన వర్ణ నా తీతం. చనిపోవడానికి నిముషంముందు శరీరం నీలంగా మారుతుంది. ఆ సమయంలో ఆ శరీరం నుండి ఓ వింత పరిమళం వస్తుంది. అది పక్కనున్న వారిలో గాఢ నిద్రను కలగజేస్తుంది. సుబ్బారావు తెల్లవారుఝామున మూడుగంటలకు మరణించాడు. అంటే అంతకుముందు రోజు మధ్యాహ్నం రెండుగంటల మధ్యలో అతడిపై విషప్రయోగం జరిగి ఉండాలి.
    వెంకన్నకు ఎక్స్-32 విషం గురించి తెలుసు. ఆ విషప్రయోగంలో గత ఆరుమాసాల్లోనూ ప్రపంచమంతటా యెనిమిది హత్యలు జరిగాయి. అయితే ఆ విషం సామాన్యుల కందుబాటులో ఉండదు. మెడికల్ షాప్సులో దొరకదు. దాన్ని ప్రత్యేకంగా కొన్ని డిపార్టుమెంట్సు ఇంపోర్టు చేసుకుంటాయి. అందులో పోలీసు డిపార్టు మెంటు కూడా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS