"ప్లీజ్ శారదా-అలా అనకు...." అన్నాడు రఘు.
"మీరు నన్ను చంపేయండి. లేకపోతే నేనే చచ్చిపోతాను...." అంది శారద.
రఘు చటుక్కున ఆమె నోరు మూసి-"ఇంకెప్పుడూ అలా అనొద్దు శారదా-" అన్నాడు.
4
రఘులో చాలా మార్పు వచ్చింది. అతను బుద్దిగా ఉండడం ప్రారంభించాడు. పరిమళ అతడి దగ్గరకు రావడానికిప్పుడు భయపడుతోంది.
ఒక నెలరోజులు గడిచాయి.
ఒకరోజున బిజినెస్ పనిమీద ఒకాయన రఘుని చూడ్డానికి వచ్చాడు. ఆయనతోపాటు ఆయన కూతురు హేమ కూడా వచ్చింది. హేమకు ఇరవై ఏళ్ళు. పేరుకు తగ్గట్లుగా పుత్తడి బొమ్మలా వుంది.
ఇద్దరూ బైటకు వెళ్ళాక ఒక నిముషంలో హేమ మళ్ళీ వెనక్కు వచ్చింది. "మీతో ఒక్క నిముషం పర్సనల్ గా మాట్లాడాలి. గదిలో ఇంకెవరైనా ఉన్నారా?"
"లేరు. నేను పిలిస్తే తప్ప ఇంకెవ్వరూ ఈ గదిలోకి రారు-"
"మీరు నాకు నచ్చారు. ఐ లవ్ యూ-" అంది హేమ.
"థాంక్స్-" అన్నాడు రఘు.
"నాకు పెళ్ళికాకపోతే మిమ్మల్నే పెళ్ళిచేసుకుని ఉండేదాన్ని-" అంది హేమ.
"ఇట్సె ప్లెజర్. కానీ నాక్కూడా వివాహమై పోయింది-" అన్నాడు రఘు.
"ఐ ఎన్వీ యువర్ వైఫ్-" అంది హేమ.
"ఐ ఎన్వీ యువర్ హజ్బెండ్-" అన్నాడు రఘు. అతనికీ వ్యవహారం అనుమానంగానే వుంది. తమ కంపెనీతో పనివున్న చాలామంది కూతుళ్ళనీ, కోడళ్ళనీ వంకపెట్టి ఇలా ఆడవాళ్ళను తీసుకొచ్చి ఎరవేసి పనులు సాధించుకు పోతూంటారు. అందులోనూ తను ఈ విషయంలో కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
హేమ మనిషి చాలా చాలా బాగుంది.
"హి ఈజే యూస్ లెస్ పెర్సన్-" అంది హేమ. అతడు నపుంసకుడట.
హేమ రఘుపట్ల యెంతో ఆసక్తి చూపించినా అతను అవును, కాదని అనలేదు. వింటూ ఊరుకున్నాడు.
"మీరేమీ మాట్లాడ్డంలేదు.....మీరూ నా భర్తకు లాగే....." అంది హేమ వాక్యం పూర్తి చేయకుండా.
రఘు ముఖం ఎర్రబడింది-"ఆడదంటే యెవరికైనా ఆశే-కానీ నా ఇబ్బందులు నాకున్నాయి-"
"ఏమిటి మీ యిబ్బందులు...." వెటకారంగా అంది హేమ.
"పరాయి ఆడదాని చేయి ముట్టుకోగానే నాభారయకు తెలిసిపోతుంది-" అన్నాడు అతను.
"ఇత్స్ ఇన్క్రెడిబుల్-ఐ డోంట్ బిలీవ్ ట్" అంది హేమ.
"నేనే నమ్మలేకపోతున్నాను-" అన్నాడు రఘు- "కానీ ఇది నిజం-" అంటూ రఘు తన అనుభవాలు చెప్పాడు.
"మీకు నేను నచ్చలేదు. అందుకే కోస్తున్నారు-" అంది హేమ.
"అందమైన ఆడపిల్ల కోరి ఆహ్వానిస్తూంటే ఇలాంటి అబద్దాలు చెప్పేటంత మూర్ఖుణ్ణి కాను నేను...."
"మై గాడ్-జస్టు-ఎ లిటిల్ టెస్టు...." అంటూ ఆమె చటుక్కున అతణ్ణి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.
చాలా కాలం తర్వాత-పరాయి ఆడదాని స్పర్శ...రఘు వెంటనే ఆమెను వదలలేకపోయాడు. అతడామెను వదిలేలోగానే బల్లమీద ఫోన్ మ్రోగింది.
రఘు శరీరం ఆపాదమస్తకం వణికిపోయింది. చటుక్కున అతడామెను వదిలి ఫోన్ తీశాడు.
"మళ్ళీ మీ బుద్ధి పెడదారి తొక్కి వుంది-" అంది శారద.
ఆ మాటలు హేమ కూడా వింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
"చాలా విచిత్రంగా ఉంది-" అందామె.
"శారదా-నేను కావాలని ఈ పని చేయలేదు. ఒక అమ్మాయి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంది-" అంటూ జరిగింది వివరించాడతను.
"ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని కత్తితో పొడవబోతూంటే చూస్తూ ఊరుకుంటారా? శాయశక్తులా ప్రతిఘటిస్తారు కదా- అలా ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయలేదేం?" అంది శారద.
"బాప్ రే!" అంది హేమ-"ప్రతిఘటించలేదని కూడా ఆమెకు తెలిసిపోయింది-"
రఘు ఫోన్ పెట్టేసి-"ఇదీ నా పరిస్థితి!" అన్నాడు.
"వేర్ దేరీజ్ విల్-దేరీజ్ వే-" అంది హేమ.
"అంటే?"
"శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు-" అంది హేమ.
"ఒక్కటి చెప్పు-...."
"మీ భార్యకు మానవాతీత శక్తులున్నాయని నేను భావించడంలేదు. ఎవరో నమ్మకస్థుల్ని ఆమె తెలివిగా ఉపయోగించుకుంటోంది. అయితే నాకు మీ మీద మోజయింది కాబట్టి మంచి ఉపాయం అలోచించాను. ఆవిడ ఏజంట్లు ఎవరైనా మీరు ఆమే కలిసివున్నప్పుడు నిఘా వేయరుకదా! ఏదో వంకన నేను మీ యింటికి వస్తాను. ఒక రాత్రికి ఆశ్రయం సంపాదిస్తాను. మీ భార్యకు నిద్రమాత్రలు తినిపించండి. ఆమె సమక్షంలోనే సరదా తీర్చుకుందాం. ఏ చిక్కూ ఉండదు. ఈ ట్రిక్కు పలికితే మీకేలోటూ ఉండదు. అప్పుడప్పుడామెను ఇతర ప్రాంతాలక్కూడా తీసుకువెళ్ళి-మీ క్కావలసిన అమ్మాయిని నీ పక్కరూంలో వుంచుకుని కధ నడిపించవచ్చు. దీన్నే కోటలో పాగా వేయడం అంటారు-" అంది హేమ.
"వండర్ ఫుల్-" అన్నాడు రఘు. ఇలాంటి అయిడియా తనకు తట్టనందుకు అతను ఎంతగానో బాధపడ్డాడు కూడా!
5
"ఈ ఒక్కరోజు మీ యింట్లో ఉంటాను. మా మామగారు మీవారికి తెలుసు. మాది సంప్రదాయమైన కుటుంబం. ఒక్కర్తెనూ హోటల్లో ఉంచడానికి మామగారి కిష్టముండదు. మీవారి నడిగితే ఇంటికివెళ్ళి మిమ్మల్ని అడగమన్నారు. మీ రంగీకరించకపోతే ఉన్నపళంగా తిరుగుప్రయాణం చేయల్సొస్తుంది. అందువల్ల మామగారికి అయిదు లక్షలు నష్టం...." అంటూ ఏవేమో చెప్పుకుపోయింది హేమ.
