9
ఆరోజు ఘనంగా వేడుక జరుగుతోంది.
సుందర్రామయ్య కోడలు శోభ గర్భం ఫలించి పండంటి కొడుకును కన్నది. సంతాన ప్రాప్తి కోసం ఆమె, ఆమె భర్త తీర్ధ యాత్రలకు వెళ్ళిన సందర్భంలో ఇది జరిగింది. ఈ రోజున సుందర్రామయ్య మనుమడి నామకరణం మహోత్సవం జరుగుతోంది.
పీటల మీద కూర్చున్న శోభ ముఖం కళకళలాడిపోతోంది.
"అమ్మా- నేను గుర్తున్నానా ?" అన్న మాటలు విని శోభ వులిక్కిపడి తలెత్తి చూసింది. ఆవ్యక్తిని చూసి ఆశ్చర్య పడింది.
గుర్తుందో లేదో -- నా పేరు జోగినాధం . సంవత్సరం తర్వాత మిమ్మల్ని కలుసుకుంటానని మాటిచ్చాను. కానీ ఇంకా ముందే వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను. అప్పట్లో మీ కోరిక యేమిటో నాకు తెలియదు. కానీ సంతానమే మీ కోరిక అని ఈరోజు తెలిసింది. మీ ఆనందాన్ని కళ్ళారా చూడ్డం కోసం వచ్చాను ...." అన్నాడు జోగినాధం.
శోభ అప్రయత్నంగా చేతులు జోడించి "మీరు నిజంగానే దైవ స్వరూపులు " అంది.
"వీడా ?" దైవ స్వరుపుడా.... పనికి మాలిన ముష్టి వెధవ!" అన్నాడు సుందర్రామయ్య.
జోగినాధం సుందర్రామయ్య వంక చూడకుండా 'అమ్మా - మీ మంచితనం కారణంగా మీ మమగారికో పర్యాయం బుద్ధిగా మసలు కోమని హెచ్చరించాను. కానీ అయన నా హెచ్చరిక చవిని బెట్టలేదు. ఇక నేనాయన్ను రక్షించలేనమ్మా శోభ " అన్నాడు.
అంతలో పోలీసులు ప్రవేశించారు అక్కడికి. ఇన్ స్పెక్టర్ కుటుంబరావు వెతుక్కుంటూ వచ్చి సుందర్రామయ్యకు బేడీలు వేసి "నీ ముఠాకి ఈరోజుతో స్వస్తి!" అన్నాడు.
సుందర్రామయ్య ఆశ్చర్యంగా ఏదో అనబోగా "ఇందులో పొరపాటే మీ లేదు మిస్టర్ సుందరరామయ్య . జోగినాధం గారు మీ ముఠా కార్యకలాపాలు గురించి చాలా సమాచారం సేకరించి యిచ్చారు. అప్పట్నించి నిన్ను వెయ్యి కళ్ళతో కనిపెట్టి వున్నాం. స్మగ్లింగ్, దొంగతనం నీ వృత్తి. నువ్వు దొంగతనాలు చేసిన స్థలంలో ఒకచోట ఆటోమేటిక్ కెమేరాతో నీ ఫోటో కూడా తీయడం జరిగింది. నీ ముఠా సభ్యిలందరూ పట్టు బడ్డారు" అన్నాడు ఇన్ స్పెక్టర్ కుటుంబరావు.
"ఈ జోగినాధం చేపట్టిన కేసు ఏదీ ఫెయిల్ కాదు. శోభకు సంతానం కలిగింది. సుందర్రామయ్య కు జైలు ప్రాప్తించింది. ఇంక బలరాం .....ఉమ లభించాలి...." అన్నాడు.
"బలరాం, ఉమ ఎవరు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"విడిపోయిన ప్రేమికులు లెండి. ఈకేసుకూ వాళ్ళకూ సంబంధం లేదు " అన్నాడు జోగినాధం.
సుందర్రామయ్య కలవర పాటుతో జోగినాధం వంక చూసి "శోభ క్షేమం కోరేవాడివయితే నువ్వో సారి నన్ను జైల్లో కలుసుకోవాలి" అన్నాడు.
జోగినాధం అప్పటికేమీ మాట్లాడక పోయినా తర్వాత సుందరామయ్యను కలుసుకున్నాడు.
"డాక్టర్లు పరీక్ష చేసి చెప్పన ప్రకారం శోభకు సంతాన యోగం లేదు. లోపం నా సుపుత్రుడిది. వాడు నాకులా కాక మంచి మనసు కలవాడు. వాడికి, వాడి భార్యకూ ఈ అన్యాయం జరగడం నాకు నచ్చలేదు.
మా వంశాంకురాన్ని సంపాదించడం కోసం నేను ఒక విచిత్రమైన పద్దతి అవలంభించాను. మా కులానికి, గోత్రానికి చెందిన వారూ, ఆరోగ్య వంతులూ అయిన ఇద్దరు యువతీ యువకులను ఒక చోట చేర్చి ఉద్రిక్తత కలిగించే పరిస్థితులు లేర్పరిచాను. వాళ్ళు దాంపత్య జీవితం నెరవేర్చారు.
అమ్మాయి గర్భవతి అయిన అయిదు నెలలకు అబ్బాయి అక్కణ్ణించి తప్పించాను. అమ్మాయికి లేడీ డాక్టర్ ని ఏర్పాటు చేసి పురుడు పోయించి శిశువు పుట్టి మరణించి నట్లు తెలియ బర్చాను. ఇదంతా ఎవరు చేయించారో ఆమెకు తెలియదు.
కనబడని ఆమె భర్త కోసం చనిపోయిన తన శిశువు కోసం ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఆమెకు నాకు తెలిసిన ఒక స్త్రీ యింట్లో ఆశ్రయం ఏర్పాటు చేశాను.
ఆమె తన భర్తను కలుసుకోవడం నాకిష్టం లేదు. యువకుడు, ఆ యువతి వేర్వేరు జీవితాలు గడపాలని నా ఆశయం. వాళ్ళ పేర్లే బలరాం, ఉమ.
నీవు వాళ్ళ పేర్లుచ్చరించడం నాకు భయాన్ని కలిగించింది. ఎటువంటి నిజాన్నయినా బయట పెట్టించగల శక్తి నీకున్నదని నా కర్ధమైంది. బలరాం నీ, ఉమనీ కలాపాలను కుంటే ఉమా ఎక్కడున్నదీ చెబుతాను. కనీ ఆమె కొడుకు బ్రతికి వున్నట్లు చెప్పవద్దు. తన కొడుకు పోయాడని ఆమె అనుకొంటున్నది. ఆమెకు ఆ భ్రమ లోనే వుండనీ. సంపూర్ణారోగ్యం గల ఆమె మళ్ళీ తప్పక సంతానవతి కాగలదు."
శోభ బిడ్డకు తల్లిగా మరెవ్వరి పోటీ వుండరాదు. అందుకే ఈ పని చేశాను. ఇలాంటి ఏర్పాటు చేసున్నట్లు శోభకు చూచాయిగా తెలుసు. భార్యాభర్త లను తీర్ధ యాత్రలకు పంపి -- ఉమ ప్రసవించగానే ఆ బిడ్డ ను శోభ కడకు చేర్చాను.
జీవితంలో నే చేసిన తప్పులన్నింటి కీ శిక్ష అనుభవించడానికి సిద్దంగా వున్నాను. కానీ, బలరాం, ఉమ లకు శోభ దగ్గర పెరుగుతున్నవాడే తమ బిడ్డ అన్న రహస్యాన్ని రహస్యంగానే వుంచితే అటు శోభ, ఇటు నేను కూడా నీకు జీవితాంతం ఋణపడి వుంటాం."
సుందర్రామయ్య చెప్పిన కధంతా ఆశ్చర్యంగా విన్నాడు జోగినాధం . "ఏం చేయాలో నాకూ తోచడం లేదు. కానీ నిన్ను హెచ్చరించి కొన్ని నెలల పాటు వదిలి పెట్టడమూ, ఆ సమయంలో శోభకు బిడ్డ నివ్వడానికి నువ్వు చేస్తున్న ఏర్పాటు సక్రమంగా నెరవేర్చడం కోసమే జరిగిందని పోస్తోంది. అలా జరగడం ఈశ్వరాజ్న అనే అనుకోవాలి. నువ్వు చేసిన పనిలోని మంచి చెడ్డలను విచారించకుండా నువ్వు కోరిన శోభ సంతోషం కలకాలం వుండేలా చేస్తాను, సెలవు...."
ఈ ప్రపంచం లోని విచిత్రాలకు ఆశ్చర్యపడుతూ ఇక్కడ్నించి కదిలాడు జోగినాధం.
--అయిపొయింది ----
