6
"చూడమ్మా! దొడ్లో నీకోసం నిధి ఉంచాను. మరెవ్వరి పాలు కాకుండా నేను కాపాడుతున్నాను. త్వరగా నువ్వా నిధిని వశం చేసుకోవాలి. అంతవరకూ నేను పుణ్య లోకాలకు పోకుండా ఇక్కడే ఉండాల్సి వుంటుంది.
హటాత్తుగా నాకు మెలకువ వచ్చింది. అది అర్ధరాత్రి సమయం. నాకు కాస్త భయం వేసింది. అమ్మ కలలో కనిపించడం నాకు కొత్త కాదు కానీ ఇలా చనిపోయిన వ్యక్తీగా కలలో కనిపించడం ఇదే మొదలు.
నేను లేచి తడుముకుంటూ గోడ దాకా వెళ్ళి స్విచ్ నొక్కాను. లైటు వెలగలేదు. అంటే కరెంటు లేదన్న మాట. హటాత్తుగా నాలో మొండి ధైర్యం కలిగి ఒకసారి పెరట్లో కి వెళ్ళా లనిపించింది.
అమావాస్య రోజులు కావు కాబట్టి మరీ అంత చీకటిగా లేదు. నా కళ్ళు కూడా కాస్త అలవాటు పడ్డం వల్ల నేను శ్రమ లేకుండానే పెరట్లో కి నడిచి వెళ్ళగలిగాను.
అయితే పెరట్లో నేనుచూసిన దృశ్యం నన్ను ఆపాద మస్తకం కంపింపచేసింది. కెవ్వుమని కేక పెట్టవలసింది కానీ ఎవరో నా గొంతు పట్టి నోక్కేసినట్లుగా నోరు పెగల్లేదు.
పెరట్లో ఒక స్త్రీ మూర్తి కలయ తిరుగుతోంది. ఆమె అమ్మ కాదు గదా! అదే నిజమయితే అమ్మ దేయ్యమైందా అసలు దెయ్యాలున్నాయా? ఇప్పుడు నేనేం చెయ్యాలి.
అంతకాలం ప్రేమతో నన్ను సాకిన అమ్మ ప్రాణాలు కోల్పోగానే నాలో ఇంత భయాన్ని రేకెత్తిస్తోందేమిటి? -- అని అనిపించగానే కాస్త ధైర్యం కూడా గట్టుకుని ఆ మూర్తిని సమీపించాను.
అడగుల చప్పుడుకు ఆమె తటాలున వెనుతిరిగింది. ఒక్క క్షణం పట్టినప్పటికీ ఆమెను గుర్తు పట్టగలిగాను--
"నువ్వా, శోభా!" అన్నానశ్చర్యంగా.
శోభ తడబడింది-- "నిద్ర పట్టడం లేదు --" అంది.
ఆ సమాధానం నాకంత సంతృప్తి ని కలిగించలేదు. ఇంత రాత్రి వేళ నిద్ర పట్టని కారణంగా శోభ పెరట్లో తిరుగుతోందంటే అసహజంగానూ, అసందర్భంగానూ నాకు తోచింది. అందులోనూ మా అమ్మ చనిపోయి కొద్ది నెలలు మాత్రమే అయిందన్న విషయం శోభకు తెలుసు. సాధారణంగా నా వయసు వారికి, అందులోనూ ఆడపిల్లలకు భయంగా ఉండడానికి ఈ మాత్రం చాలు. కానీ శోభ నిర్భయంగా పెరట్లో తిరుగుతోంది. ఇందులో రహస్యం వుండి వుండాలి.
ఇద్దరం ఇంట్లోకి వచ్చాం, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నాం. నాకు వెంటనే నిద్ర పట్టలేదు. ఆలోచిస్తుండగా ఒక చిన్న అనుమానం వచ్చింది.
శోభ వయసులో వుంది. బహుశా తన స్నేహితుడెవరి కోసమైనా ఎదురు చూస్తుందేమో! అదే నిజమయితే శోభను ఇంట్లోంచి బయటకు పంపేయాల్సి వుంటుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరేనా యువకుడు శోభ గురించి నా యింటి పెరట్లో కి రావడం ఎవరి దృష్టిలో నైనా పడితే అపవాదు నా మీద పడగల అవకాశాలు చాలా వున్నాయి. నేనూ వయసులో వున్న ఆడపిల్లనే మరి!
అసలు శోభ ఇంకా పడుకున్నాడో లేదో చూద్దామని ఒకసారి అమెగదికి వెళ్ళి తలుపు తట్టాను. మరో క్షణం లోనే తలుపు తీసింది శోభ. "ఇంకా నిద్ర పట్టలేదా"- అనడిగాను.
"నిద్ర రావడం లేదు --" అంది శోభ.
"అయితే నా గదిలోకి రాకూడదూ? నాకూ నిద్ర రావడం లేదు. ఇద్దరం ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు" అన్నాను. శోభ సంతోషంగా అంగీకరించింది.
శోభ మంచం నా గదిలోకి మార్చేసింది. ఇద్దరం చాలా సేపు కబుర్లాడుకున్నాం. నేను శోభతో "రోజూ మనమిలాగే కాలక్షేపం చేస్తే బాగుంటుందేమో --" అన్నాను. శోభ మారు మాటాడకుండా తన అంగీకారాన్ని తెలపడం నాకు ఆశ్చర్యాన్నే కలిగించింది.
ఆ తర్వాత పది రోజుల పాటు రాత్రిళ్ళు ఆమె కనుమానం రాని విధంగా శోభను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. ఆమె ప్రవర్తనలో అనుమానించ వలసినదేమీ లేనట్లు నాకు రూడి కాసాగింది. క్రమంగా మా ఇద్దరి మధ్యా స్నేహంతో పాటు ప్రేమాభిమానాలు కూడా వర్ధిల్లసాగాయి. నా జీవితంలోని కొంత దిగులు , బరువూ దూరం కావడానికి శోభ స్నేహం నాకు ఉపయోగపడింది.
7
అనుకున్న పదిహేను రోజులకు ఒక కొబ్బరి మొక్కను కొన్నాం."
పొరుగింటి నుంచి నేను గునపం తేవడానికి వెళ్ళగా పోరుగింటావిడ -- "గునప మెందుకమ్మా నీ పెళ్ళికి పందిరి నువ్వే వేసుకుంటున్నావేమిటి--" అంది వేళాకోళమాడింది. విషయం చెప్పాను. "ఆడపిల్లవు. ఒకర్తివీ ఇలాంటి పనులు చేయగలవా? వుండు మా వెంకును పంపిస్తాను --" అందావిడ.
నేను నవ్వి -- "పదిహేనేళ్ళ కుర్రాడికి మాత్రం ఇది బరువు పని కాదా, ఆమాత్రం నేనే చేసుకోగలను లెండి--" అన్నాను.
ఆవిడ నా మాటను చెవిని పెట్టలేదు. నాతొ పాటే వాళ్ళాబ్బాయి వెంకట్రావును గునపం ఇచ్చి పంపించింది.
మేమిద్దరం వెళ్ళేసరికి శోభ నాకోసమే ఎదురు చూస్తోంది. వెంకట్రావు వంక ప్రశ్నార్ధకంగా చూస్తున్న శోభతో -- "మనకు సాయపడ్డానికి వచ్చిన మగవాడు" అన్నాను నవ్వుతూ. వెంకట్రావు కొంచెం యిబ్బందిగా సిగ్గు పడ్డాడు. కొంతసేపు తవ్వేక అంత చిన్న కుర్రవాడికి కాస్సేపు శ్రమ తగ్గించాలనిపించి నేను అతన్ని వారించి స్వయంగా తవ్వబోయాను. చాలా కష్ట మనిపించింది. శోభ కూడా ప్రయత్నించి కష్టం ఫీలయ్యింది. పోరుగింటావిడ మాటల్లోని నిజం అర్ధం కాగా మళ్ళీ వెంకట్రావు కే పని అప్పగించాం.
అతను మరో పావుగంట త్రవ్వాడో లేదో -- ఖంగుమన్న పెద్ద శబ్దం అయింది. నా కళ్ళు మెరిశాయి . నా ఊహల్లో నిధి మెదిలింది.
శోభ మాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ -- "పడ్డ శ్రమంతా వృధా అయింది. ఇంత కష్టపడీ తవ్విన చోట రాయి తగిలింది. మళ్ళీ మొదటి కొచ్చాం" అంది.
'అయితే ఆ శబ్దం రాయి వల్లనే నంటావా?" అన్నాన్నేను.
"రాయి కాకపోతే నిధులూ, నిక్షేపాలూ ఉన్నాయంటావా?" అంది శోభ తేలిగ్గా. అయితే ఆ శబ్దానికి నిధే కారణమయుండవచ్చునని ఆ అమాయకురాలికి తెలియదు. తెలియజెప్పాలనే ననుకోనూ లేదు.
ఇప్పుడు నా మనసులో తీవ్రంగా ఒకేఒక ఆలోచన మెదుల్తోంది. ఎవరికీ తెలియకుండా నేను నిధిని దక్కించుకోవాలి.
తాత్కాలికంగా తవ్వకం పని అపు చేశాం. వెంకట్రావు వాళ్ళ గునపాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నేనూ, శోభా కాస్సేపు మొక్కల పెంపకం మీద జోక్సు వేసుకున్నాం. నా మనసంతా ఖంగుమన్న ఆ శబ్దం చుట్టే తిరుగుతోంది. మనసు నిండా ఆశలు పెరుకుంటున్నాయి.
శోభ మనసులోకి నిధి గురించిన ఆలోచన రాకూడదని దేవుణ్ణి ప్రార్ధించుకుంటున్నాను. ఆమెను తాత్కాలికంగా ఇక్కడి నుంచి బయటకు పంపించాలి. కానీ ఎలా?
ఇద్దరం గునపం కూడా తీసుకుని ఇంట్లోకి వచ్చాం. నేను గునపాన్ని గోడ వారగా నేలమీద పడుకోబెట్టాను. ఆ తర్వాత ఇద్దరం నా గదిలోకి వెళ్ళాం.
"ఇంకా చాలా వేలుగుంది. మనం ఈరోజు కొబ్బరి మొక్కను పాతెయాల్సింది?" అంది శోభ.
"నిజమే ననుకో కానీ నాకు తెలీకడుగుతాను. మొక్క పాతడానికి అంతలోతు తవ్వాలా?' అన్నాను.
"నాకూ తెలీదు. కానీ మా నాన్నగారు మా దొడ్లో కొబ్బరి మొక్క పాటించినపుదు చాలా పెద్ద గొయ్య తవ్వించారు. ఆ తర్వాత సగం గోతిని మట్టితో వదులు వదులుగా నింపారు. ఆపైన మొక్కను పాతారు. అలా వెయ్యడం వల్లనే ఆ మొక్క పెరిగి పెద్దదై కాయలు కాసిందని నేననుకున్నాను" అంది శోభ.
"సరే -- ఈవెల్టికి అంతపని మళ్ళీ చేయలేం" అని బద్దకంగా ఆవలించి "ఈవేళ నీకు సినిమా ప్రోగ్రాం వుందనుకుంటాను--" అన్నాను.
"అబ్బే--- అలాంటిదేమీ లేదు" అంది శోభ.
నేను నవ్వి -- "నిన్న నువ్వు అలా చెప్పినట్లు గుర్తు." అన్నాను.
ఇద్దరం కలిసి భోం చేశాం. మామూలు విధంగానే ఇద్దరం నా గదిలోనే పడుకున్నాం. నాకు నిద్ర రావడం లేదు. మనసు పెరట్లో తిరుగుతోంది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక -- "పడుకుందాం, నిద్ర వస్తోంది --" అంది శోభ.
మాట లాగిపోయాయి. దీపం అర్పెశాం. నేను నిద్ర పట్టక మంచంమీద అటూ ఇటూ దొర్లుతున్నాను. చాలా సేపు గడిచేక మరి ఉండబట్టలేక నెమ్మదిగా మంచం మీంచి లేచాను.
"నీకూ నిద్ర పట్టడం లేదా?' అన్న శోభ మాటలు విని ఉలిక్కిపడ్డాను.
"ఈ రాత్రికి నాకు నిద్ర వచ్చేలా లేదు" అన్నాను.
'ఆశ్చర్యంగా వుంది. నేను ఏవో మా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. అందువల్ల నిద్ర రావడం లేదు. మరి నీ కేమయింది?' అంది శోభ.
నేను ఒక క్షణం తటపటాయించి -- "మనం దొడ్లో సగం గొయ్యి తీసి వదిలేశాం. అలా చేయడం అరిష్టదాయమని మా అమ్మ చెబుతుండేది --" అన్నాను.
