Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 12

 

    వెంకన్న పద్మావతి దేశంలోని సాంఘిక పరిస్థితులపై పరిశోధనలు చేస్తున్నామని చెప్పుకుని సమాచారం కోసమన్నట్లు అందరిళ్ళకు వెళ్ళారు.
    వారి శ్రమ ఫలించింది.
    కిషోర్ ఆచూకీ దొరికింది. అతడు జానకి స్నేహితురాలు లలితకు అన్న!
    కిషోర్ ఆ ఊళ్ళో చిన్న సైజు కాంట్రాక్టరు.
    కిషోర్, లలిత -- ఈ ఇద్దరికీ తలిదండ్రులు చిన్నతనం లోనే పోయారు. మేనమామ యింట ఆ ఇద్దరూ కొంతకాలం వున్నారు. అక్కడ వాళ్ళను పనిమనుషుల కన్నా హీనంగా చూసేవారు. కిషోర్ అక్కడ వుండలేక పోయాడు. కిషోర్ తనకు తానై ఎన్ని కష్టాలైనా భరించ గలడు. కానీ చెల్లెలు అతడి ఆరో ప్రాణం. ఆమె కష్టపడుతుంటే అతను చూడలేడు. అందుకే చెల్లెల్ని తీసుకుని ఓ రాత్రి ఇల్లు వదిలిపెట్టి ఈ ఊరొచ్చాడు. అప్పుడు కిషోర్ కు పదేళ్ళు. చెల్లెలికి ఆరేళ్ళు. ఏం చేసేవాడో ఎలా సంపాదించే వాడో లలితకు తెలియదు. కానీ లలిత  అందరాడపిల్లలాగే దర్జాగా పెరిగింది. బజారులో పేపర్లు అమ్మేవాడనీ, సైకిల్ షాపులో మెకానిక్కు పని నేర్చుకుంటూన్నాడని, సినిమా పోస్టర్లు అంటించేవాడనీ -- ఇలా అతడి గురించి రకరకాల వింది లలిత. కానీ ఆమెకు అవసరమైనవన్నీ అమరేవి. తిండికి, గుడ్డకు ఎన్నడూ లోటు లేదు. తలిదండ్రులున్నా అంత గొప్పగా ఉండేది కాదేమోననుకుంటుంది లలిత.
    చిన్నప్పట్నీంచి లలితకూ జానకికీ స్నేహముంది. లలిత జానకికి కిషోర్ గురించి తెగ చెప్పేది. జానకి అతడి కధ విని ఆశ్చర్య పోతుండేది. ఆమెకు కిషోర్ అంటే ఎంతో గౌరవ భావమేర్పడింది. ఆ అన్నా చెల్లెళ్ళకు సాయపడాలని ఆమె అనుకునేది. అయితే కిషోర్ అయాచితంగా ఎవరి సాయాన్నీ స్వీకరించే వాడు కాదు. అతడు కష్టపడి పనిచేస్తూనే ప్రయివేటు గా మెట్రిక్ కట్టి చెల్లెలు కంటే ముందుగానే అది పూర్తీ చేశాడు. అలాగే బియ్యే వరకూ చదివాడు. నెమ్మదిగా అతడి సంపాదన పెరిగింది. చిల్లర వ్యాపారాలు, చిన్న కాంట్రాక్టులు చేస్తూ అతనిప్పుడు ఈ స్థితికి ఎదిగాడు. చెల్లెలి పెళ్ళి ఘనంగా చేయాలన్నది అతడి ఆలోచన.
    "జానకి కిషోర్ ని ప్రేమించిందా?"
    ఈ ప్రశ్నకు లలిత ఆశ్చర్యపడింది. అసలా విషయమే ఆయింట ఎన్నడూ స్పురించలేదు. జానకి గొప్పింటి బిడ్డ. స్నేహితురాలు లలితకూ, కిషోర్ కూ సంబంధించినంతవరకూ ఆమె అంతే!
    "ఒకవేళ లలితకు తెలీకుండా వారివురి మధ్యనూ ప్రేమ కధ నడిచిందేమో!"
    ఈ ప్రశ్నకు లలితకు కోపం వచ్చింది. లలితకు తెలీకుండా చిన్నమెత్తు రహస్యం కూడా దాచడు కిషోర్. అతడి జీవితం పూర్తిగా లలితకే అంకితమై పోయింది.
    'అయితే మీ అన్నయ్య ఇంక పెళ్ళి చేసుకోడా?"
    ఈ ప్రశ్న లలితను కలవరపరిచినట్లుంది. పెళ్ళి చేసుకుంటే కిషోర్ తన ప్రేమను మరొకరికి పంచి పెట్టాలి. అ ఊహ లలిత కంత బాగోలేదు.
    వెంకన్న కు పరిస్థితి కొంత అర్ధమయింది. కిషోర్ చిన్నప్పట్నించీ తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా పూర్తిగా  చెల్లెలి గురించే బ్రతికాడు. అందుకు లలిత బాగా అలవాటు పడింది. అన్నయ్య పూర్తిగా తన మనిషని ఆమె  భావిస్తోంది. తను వివాహం చేసుకుని మరొకరి మనిషి కావడానికి అభ్యంతరం లేదు కానీ అన్నయ్య మరొకరి మనిషవుతాడంటే అమెకు బెంగగా వుంది. అది లలిత లోపం కాదు. కిషోర్ పెంపకం లోపం.
    లలిత పరిస్థితి కిషోర్ కి అర్ధమై ఉంటుంది. అందుకే అతడు జానకిని ప్ర్రేమించినా ఆ విషయం లలితకు తెలియనివ్వలేదు. ఇద్దరూ బహుశా రహస్యంగానే కలుసుకునే వారు.
    తన జీవితాన్ని పూర్తిగా చేల్లెలికే ధారపోసి -- పేదరికపు అట్టడుగు నుంచి ధనిక వర్గపు స్థాయిని చేరుకున్న మగావాడిని ఏ యువతి ఆరాధించదు? కన్నెతనపు ముగ్ధత్వంలో ఆమె అతణ్ణి మనసు నిండా నింపుకొని-- మనస్పూర్తిగా ఆహ్వానించి ఉంటుంది. అ తరువాత.....
    అతను ,   ఆమె కూడా భయపడి వుంటారు --పెద్ద లకు చెప్పడానికి!
    అదే నిజమైతే జానకి తండ్రి అమెనో అనామకుడి కిచ్చి ఎందుకు వివాహం చేస్తాడు?    
    బహుశా అందుకు కులం కారణమై వుంటుంది.... జానకికీ కిషోర్ కి కులం కలవదు.
    వెంకన్న కిషోర్ ని కలుసుకున్నాడు -- "మీ గురించి జానకి చెప్పింది. నా పరిశోధనకు మీ వివరాలేంతైనాపనికొస్తాయి. పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాల కోసం ప్రాకులాడుతూ రోడ్లమ్మట తిరిగే యువతరానికి మీ కధ ఆదర్శం. నాకు మరి కాసిని వివరాలు కావాలి!"
    "జానకి ఎవరు?" అన్నాడు కిషోర్.
    ఈ ప్రశ్నకు వెంకన్న ఆశ్చర్యపడ్డాడు. కిషోర్ ఆ ప్రశ్న చాలా మాములుగా అడిగాడు. ఎక్కడా తడబడడం లేదు. వెంకన్న కిషోర్ కు జానకీ గురించి చెప్పాడు.
    "ఓహో - లలిత స్నేహితురాలా, ఆమెకు పెళ్ళయి పోయిందనుకుంటాను--....ఇంకా మా లలితకు వరుడు దొరకడం లేదు ...." అంటూ నిట్టూర్చాడు కిషోర్.
    అతనేక్కడా జానకి గురించి ఆసక్తి కనబర్చక పోవడం వెంకన్నకు ఆశ్చర్యం కలిగించింది. అతను చాలా తెలివైనవాడై వుండాలి. ఎంతో జాగ్రత్తపరుడై ఉండాలి.
    వెంకన్న, జానకి సూర్యారావు ల సంసార జీవితాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.
    కిషోర్ నిట్టూర్చి -- "మీరు మీ పరిశోధన పేరు చెప్పి చాలామందిని కలుసుకుంటారనుకుంటాను. నా చెల్లెలికి ఓ మంచి సంబంధం చెప్పగలరా?" అనడిగాడు.
    వెంకన్న అతనితో ఎంత మాట్లాడినా జానకి గురించి ఏమీ సమాచారం లభించలేదు.

                                     7
    "కిషోర్ దొరికాడు ....కానీ జానకికీ అతడికీ ఏమీ సంబంధమున్నట్లు తోచడం లేదు. అసలు జానకి అతణ్ణి ప్రేమించినట్లు కిషోర్ కి తెలుసునా అని నా అనుమానం...." అన్నాడు వెంకన్న.
    సూర్యారావు అంతా విని -- "అయితే కిషోర్ అనేవాడున్నాడు. వాడు జానకి స్నేహితురాలి అన్న. చాలా కష్టపడి పైకి వచ్చాడు. మనిషెలా ఉంటాడు?' అనడిగాడు.
    "జానకికి అన్ని విధాల తగ్గ వరుడనిపిస్తుంది...." అన్నాడు వెంకన్న తాపీగా.
    సూర్యారావు అవేశాపడలేదు -- "అంతే ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యా కధ కూడా నడిచే వుండాలి....."
    "ఆధారం లేనపుడు ఆ విషయం గురించి ఆలోచించడమెందుకు? ఇది మనసుకు సంబంధించిన విషయమే కానీ శరీరానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటె మీరామేను చేతిలో తాకి ఆమె పతిత అవునో కాదో తెలుసుకోలేరు. ఆమె ఎంతో మంచిది. మిమ్మల్ని అభిమానిస్తోంది. గతంలో చెడినట్లుగా ఆధారాలేమీ లేవు. మరి హాయిగా ఉండడానికేం?" అన్నాడు వెంకన్న.
    "కేసు మీది కానప్పుడు ఎన్ని సలహాలైన ఇవ్వవచ్చు. నా బాధ మీకెలా అర్ధమవుతుంది. నా భార్య ఆరాధిస్తున్న పురుషుడొకడు ఈ భూమ్మీద ఇంకా బ్రతికి వున్నాడు. ఆమె యింకా వాణ్ని అరాదిస్తోంది...."
    "అయితే ఏం చేస్తారు?" అన్నాడు వెంకన్న విసుగ్గా.
    "ఓసారి వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడే ఏర్పాటు చేయండి--"
    "ఎలా?"
    "ఎలాగో మీరే చెప్పాలి...."
    వెంకన్న ఆలోచించాడు. అందుకు ఒక్కటే ఉపాయముంది. లలితకు సంబంధం చూస్తె రెక్కలు కట్టుకుని వాలుతాడు కిషోర్. అదే చెప్పాడు సూర్యారావు.
    సూర్యారావుకీ సలహా నచ్చింది. అతను అయిదారు రోజులు శ్రమపడి లలితకు మంచి సంబంధాలు రెండు చూశాడు. ఆ వివరాలు నోట్ చేసుకుని వెంకన్న సూర్యారావుని పంపించేశాడు.
    తర్వాత వెంకన్న తన స్నేహితుడింటికి వెళ్ళి ఆ వివరాలు కిషోర్ కి వ్రాయమన్నాడు.
    రెండు రోజుల్లో కిషోర్నించి సూర్యారావు కి ఉత్తరం వచ్చింది. అతను తన్ను తాను పరిచయం చేసుకుంటూ -- తన చెల్లెలి వివాహం విషయంలో తనకు సాయపడవలసిందిగా సూర్యారావు నర్దిస్తూ ఆ ఉత్తరం రాశాడు. ఉత్తరంలోని భాష ఎంతో మర్యాదగా వుంది.
    "వాడు సరాసరి నా యింటికే వస్తున్నాడు. ఎంత చనువో చూడండి?" అన్నాడు సూర్యారావు.
    "చనువు కాదు. అతడు అమాయకుడని నా అభిప్రాయం లేకపోతే అంత ధైర్యంగా మీ కుత్తరం రాయడు. తప్పు చేసినవాడిలో బెదురుంటుంది...." అన్నాడు వెంకన్న.
    "నేనంటే అందరికీ లోకువే. జానకి నా గురించి అతడికి అంతా చెప్పేసి వుంటుంది. అందుకే ధైర్యంగా ఉత్తరం రాశా డు...." అన్నాడు సూర్యారావు.
    "అయితే వారిద్దరూ మరోసారి మిమ్మల్ని మోసం చేస్తారని మీ అభిప్రాయమా?"
    "అదే జరిగితే ఇద్దరూ ఒక్కసారే చస్తారు...." అన్నాడు సూర్యారావు.


                                     8
    తలుపు తెరిచింది జానకి.
    "నమస్కారమండీ -- గుర్తున్నానా?" అన్నాడు కిషోర్.
    "అయ్యో-- మీరు లలిత అన్న కదూ -- " అంటూ  లోపలకు ఆహ్వానించింది జానకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS