Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 12


    కన్నయ్యకి లభించిన భిక్షా పాత్రలో ఏదో మహాత్యమున్న వార్త భద్రయ్య క్కూడా చేరింది. వాడికి పొట్ట చెక్కలయ్యేటంత నవ్వు వచ్చింది. తనకా కబురు తీసుకు వచ్చిన మనిషితో -- "బిచ్చగాడి వేషం లో కన్నయ్య కు ఆ పాత్ర నిచ్చింది నేనే ! దాంట్లో ఏ మాయలూ ఉండవు. నిజంగా అందులో ఏమైనా మాయలు జరుగుతుంటే కన్నయ్య ఏదో కనికట్టు విద్య నేర్చుకుని మనమీద ప్రయోగిస్తున్నాడనుకోవాలి. అంతే!" అన్నాడు భద్రయ్య
    ఈ విషయమై  వాగ్వివాదా లవుతూండగానే గురవయ్య ఇంటి ముందుకు కన్నయ్య తో సహా పెద్ద గుంపు వచ్చింది.
    విషయమేమిటో చూడ్డానికి గురవయ్య కుటుంబంతో సహా వీధిలోకి వచ్చాడు.
    "ఎప్పుడూ మిమ్మల్నేదీ అడగలేదు. ఈ ఒక్క రోజుకీ నాకేదైనా దానం చేశారంటే మళ్ళీ మిమ్మల్నేమీ అడగను" అన్నాడు కన్నయ్య గురవయ్యతో.
    "ఇప్పటికే చాలా ఇళ్ళు తిరిగినట్లున్నావు. నీ భిక్షా పాత్ర చూస్తె ఖాళీగా వుంది. ఎవరూ ఏమీ ఇవ్వలేదా ?' అనడిగాడు గురవయ్య.
    "ఇది మహిమ గల భిక్షా పాత్ర చూడ్డానిక లాగే కనబడుతుంది. మీరిందులో బస్తా బియ్యం పోసినా ఇది ఖాళీగానే ఉంటుంది." అన్నాడు కన్నయ్య.
    "అదే నిజామైతే నీకు బస్తా బియ్యం ఇస్తాను. అబద్దమై తే నువ్వు ఓ ఏడాది పాటు నా యింట్లో ఊరికే చాకిరీ చేయాలి " అన్నాడు గురవయ్య.
    కన్నయ్యందుకు ఒప్పుకొన్నాడు గురవయ్య. భద్రయ్య కలిసి ఓ బస్తా మోసుకుని వచ్చి కన్నయ్య భిక్షా పాత్రలో పోయసాగారు. ఎంత పోసినా అ పాత్ర నిండడం లేదు. కన్నయ్య చేయి బరువేక్కడం లేదు. చూస్తుండగా బియ్యం బస్తా ఖాళీ అయి పోయింది.
    గురవయ్య గుండెలు బాదుకుని 'అయ్య బాబోయ్ నా బస్తా బియ్యమూ ఏమైపోయాయ్ !" అని అరిచాడు.
    "నేను ముందే చెప్పానుగా ! నాది మహిమ గల భిక్షా పాత్ర !" అన్నాడు కన్నయ్య.
    "నా బియ్యం నాకిచ్చి వెళ్ళు " అన్నాడు గురవయ్య.
    "ఒకసారి నాకు దానం చేశాక మళ్ళీ వెనక్కేలా అడుగుతారు ?" అన్నాడు కన్నయ్య.
    చుట్టూ ఉన్నవారంతా కన్నయ్య చెప్పింది సబబే నని అన్నారు.
    "నాన్నా! కన్నయ్య నేడిపిద్దామని నేనే బిచ్చగాడి వేషంలో వెళ్ళి ఈ భిక్షా పాత్ర నిచ్చాను. అందులో ఏ మహిమా ఉండడానికి వీల్లేదు. వీడేదో గారడీ చేస్తున్నాడు" అన్నాడు భ్రద్రయ్య
    "నాకే గారడీలు లేవు. నేను మీరంతా ఎరిగిన మామూలు కన్నయ్యను. ఈ పాత్ర నువ్వే ఇచ్చి వుంటే దేవుడు బహుశా నీకటు వంటి బుద్ది పుట్టించి వుంటాడు. ఇందులో మహిమ వున్నదనడం లో సందేహం లేదు. నాకు వచ్చిన ప్రతి కలా నిజమవుతుందని సాధువు నన్నాశీ ర్వదించాడు" అన్నాడు కన్నయ్య.
    "ఈ భిక్షాపాత్ర దేన్నయినా తీసుకుంటుందా ? నా ఇల్లు కూడా దానమిస్తాను. తీసుకుంటుందా ?" అన్నాడు భద్రయ్య వెటకారంగా .
    'ఈ ఇల్లు నీదే అయితే , నువ్వు మనస్పూర్తిగా నాకిస్తానన్నావంటే అది నాదే అవుతుంది " అన్నాడు కన్నయ్య నిశ్చలంగా.
    "ఒరేయ్ వీడు మాయలు నేర్చిన మనిసి లాగున్నాడు. వీడితో మనకు మాటలెందుకూ ! ఇప్పటికే బస్తాడు బియ్యం పోయాయి" అన్నాడు గురవయ్య.
    "పొతే పోయాయి . దీని అంతు తేల్చాల్సిందే ! ఈ ఇల్లు కూడా నేను కన్నయ్య కు దానమిచ్చే స్తున్నాను" అని భద్రయ్యేదో అనబోతుండగా "నాయనా , కన్నయ్యా! కుర్రాడి మాటలు లెక్క చేయకు. ఈ ఇల్లు నాది , ఇది నేను నీకివ్వడం లేదు " అన్నాడు గురవయ్య.
    "ఈ ఇల్లు నాది కాదు సరే! ఊళ్ళో తాత నాకిచ్చిన ఇల్లింకొకటుందిగా అది నేను కన్నయ్య కిచ్చేస్తున్నాను. ఐతే దాన్ని కన్నయ్య భిక్షా పాత్ర తీసుకోవాలి. అప్పుడే అది వాడికిస్తాన్నేను. లేని పక్షంలో వాడు నాకు జన్మాంతం సేవకుడిగా వుండాలి !" అన్నాడు భద్రయ్య.
    అప్పటికి కన్నయ్యకు తన కల మీద బాగా నమ్మకం వచ్చేసింది. "ఐతే నీ ఇల్లు నువ్వు నాకిచ్చేసి నట్లేగా !" అన్నాడు.
    'అవును !" అన్నాడు భద్రయ్య.
    "ఐతే పద - ఆ ఇంటికి పోదాం !" అన్నాడు కన్నయ్య.
    కన్నయ్య గుంపుతో పాటు భద్రయ్య కూడా కలిసి ఆ ఇంటికి బయల్దేరాడు.
    భద్రయ్య పేరున వున్న ఆ ఇల్లు ఆ ఊళ్ళోనే అందమైన భవనం. గురవయ్య దానిని అద్దె కిచ్చి డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక నెల్లాళ్ళ క్రితం గురవయ్య అందర్నీ ఖాళీ చేయించి మరామత్తులు చేయించాడు. మరమత్తు లయ్యాక ఆ భవనం ఇప్పుడు మరింత అందంగా వున్నది. రెండు మూడు రోజుల్లో కొత్త వాళ్ళ నందులో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాడు గురవయ్య.
    అంతా అక్కడుకు వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం
    అక్కడ ఏ భవనము లేదు, కానీ ఒకప్పుడు డక్కడ భవనం ఉండేదనడానికి సూచనగా పునాదులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి.
    ఆశ్చర్యంతో కన్నయ్య క్కూడా నోట మాట రాలేదు.

                                     4
    పంతులు ప్రేమాభిమానాలతో కన్నయ్య నాదరించి
    'ఈ రోజు నువ్వు చేసిన అద్భుతాలన్నీ విన్నాను. నువ్వు సామాన్యుడి వని నాకనిపించడం లేదు " అన్నాడు.
    కన్నయ్య భిక్షా పాత్రను తల వద్ద పెట్టుకుని నిద్రకు పక్రమిస్తూ "చాలా అద్భుతాలు జరిగాయి. కానీ వాటి అర్ధమేమిటో నాకూ అర్ధంగావడం లేదు " అన్నాడు.
    'అన్నీ కాలమే వివరిస్తుంది" అన్నాడు పంతులు.
    ఆ రాత్రి - కన్నయ్యకు మళ్ళీ ఇంకో కల వచ్చింది. కలలో సాధువు కనపడ్డాడు.
    "నాయనా, కన్నయ్యా ! నీ వద్దనున్న భిక్షా పాత్ర ఎంతో మహత్తు గలది. అది ఏ వస్తువు నైనా ఇముడ్చు కోగలదు అందులో ఒకసారి ప్రవేశించిన వస్తువు అక్షయమౌతుంది. అందులో ప్రవేశించిన ఏ వస్తువు నైనా నువ్వు ఎప్పుడు ఎంత కావాలను కుంటే అంతా దాని నుండి పొందవచ్చు. ఆ పాత్ర ముందు నిలబడి నమస్కరించి నువ్వు కోరుకోగానే ఆ వస్తువు నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది " అన్నాడు సాధువు.
    'ఆ పాత్రను నేనేం చేసుకుంటాను స్వామీ ?" అన్నాడు కన్నయ్య.
    "ఇక నుంచీ సేవాధర్మం మాని గోప్పవాడిలా జీవించు. నీ సిరి సంపదలతో పదిమందికీ సాయపడు. నీ మంచి బుద్దిని విడనాడనంత కాలం నీ పాత్ర మహత్తును కలిగే వుంటుంది. నీవంటి వాడు ప్రపంచానికి చేయాల్సిన సేవ ఎంతో ఉంది. అందుకే భగవంతుడు నీకీ అవకాశ మిచ్చాడు" అన్నాడు సాధువు.
    "ధన్యుణ్ణి స్వామీ! కానీ ఇంత విలువైన భిక్షా పాత్రను నేనెలా దాచేది ! దాని కోసం ఎందరైనా పూనుకుని ఎన్నయినా అకార్యాలు చేయవచ్చును గదా ! అన్నాడు కన్నయ్య.
    "ఆ భిక్షా పాత్రను నీనుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. అది ఎప్పుడూ నీవద్దనే వుంటుంది. ఆ విషయ మై దిగులు చెందకు. ఒకే ఒక్క విషయం గుర్తుంచుకో , నువ్వా పాత్ర నుంచి ఏ వస్తువు నైనా అక్షయంగా కావాలనుకుంటే ముందా వస్తువును అందులో ప్రవేశ పెట్టాలి " అన్నాడు సాధువు.
    కన్నయ్య ఇంకా ఏదో అడుగుదామనుకున్నాడు. గానీ ఏదో చప్పుడై వాడికి మెలకువ వచ్చేసింది. ఉలిక్కిపడి లేచేసరికి వాడికి అల్లంత దూరంలో ఎవరో మనిషి క్రిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు.
    కన్నయ్య లేచి ఆ మనిషి దగ్గరకు వెళ్ళాడు. వాడు భ్రద్రయ్య .
    "ఏం జరిగింది ?" అన్నాడు కన్నయ్య.
    అప్పటికి భద్రయ్య కాస్త తమాయించుకున్నాడు. "ఇది నమ్మశక్యం కాకుండా వుంది. నేనిచ్చిన ఆ ముష్టి చిప్ప లోకి ఇంత మహత్తు ఎలా వచ్చిందో నాకు అర్ధం కావడం లేదు " అన్నాడు నీరసంగా.
    అప్పటికి పంతులు కూడా అక్కడికి వచ్చి జరిగింది విచారించాడు.
    భద్రయ్య తాను కన్నయ్య కిచ్చిన భిక్షా పాత్రను దొంగిలించుకు పోదామని వచ్చాడు. ఐతే దాన్ని ముట్టుకో గానే వాణ్ణి ఎవరో గట్టిగా పట్టుకుని విసిరేసినట్లయింది.
    'అసలు నువ్వు కన్నయ్య కా పాత్ర నెందు కిచ్చావు ?' నీకా బుద్ది ఎలా పుట్టింది ?" అన్నాడు పంతులు.
    "కన్నయ్యను ఎదిపిద్దామని బుద్ది పుట్టింది?" అన్నాడు భద్రయ్య ఏడుపు కంఠంతో.
    'అందుకే నీకు అలా జరిగింది. నువ్వెవరినైతే ఏడిపించాలను కుంటే దేవుడు నీవల్లే వాళ్లకు మేలు జరిపించి నిన్నేడిపిస్తాడు " అన్నాడు పంతులు.
    "ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ది తక్కువ పని చెయ్యనండి !' అంటూ కన్నయ్య వంక భయంగా చూసి అక్కణ్ణించి జారుకున్నాడు భద్రయ్య.  
    కన్నయ్య పంతులుకు తన కల వివరాలన్నీ చెప్పాడు.
    "బాబూ, కన్నయ్యా! నువ్వు చాలా అదృష్ట వంతుడివి. ఈ ఊళ్ళోనే నువ్వు స్థలం కొనుక్కుని పెద్ద యిల్లు కట్టుకుని సుఖంగా వుండు. ఇంక మీదట నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. అని దేవుడి అజ్ఞా! అన్నాడు పంతులు.
    కన్నయ్య భిక్షా పాత్ర నడిగి తగినన్ని బంగారు కాసులు తీసుకుని ఊరి చివర పెద్ద స్థలం కొన్నాడు. భద్రయ్య అతడికి దానం చేసిన భవనం భిక్షా పాత్ర ను కోరగానే ఆ స్థలంలో వెలిసింది. కన్నయ్య అ ఇంట్లోకి మకాం మార్చేసి, దానదాసీ జనాల నేర్పాటు చేసుకుని హాయిగా జీవించసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS