క్రికెట్ గుర్తొచ్చినప్పుడల్లా అప్రయత్నంగా ఎడమకన్ను పైన నుదుటి మీదికి చేయి పోతుంది. ఇంజనీరింగు లాస్టియర్ లో క్రికెట్ మాచ్ క్లోజు ఫీల్డింగు చేస్తున్నప్పుడు తగిలింది ఆదెబ్బ. ఇప్పటికీ నిశితంగా చూస్తే కన్పిస్తుంది. కాలేజి స్పోర్ట్స్ మెన్ లో నాకు పెద్ద పేరు వుండేది. చాలా గేమ్స్ ఆడేవాడిని. ఎస్పెషల్లీ క్రికెట్ లైక్ చేస్తాను-ఎన్. సి. సి. లో శిక్షణ పొంది ఫస్ట్ గ్రేడ్ లో పాసయ్యాను. షూటింగులో ప్రైజు వచ్చింది. ఓసారి కాలేజీ డే కి శ్రీ సంజీవరెడ్డి భుజం తట్టి "గుడ్ బాయ్!" అంటూ అభినందిస్తూ ప్రైజు అందించారు- ఆరోజుల్లో ఫ్రెండ్స్ ఘనంగా గౌరవించేవాళ్ళు - కాని నాకా ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకో. బేట్ పట్టు కోవటమే మర్చిపోయానేమో కూడా. రానురాను బ్రతుకు భారమై పోతూంటే నాకు సర్దాలేమిటి?
"నువ్వు చాలా వుత్సాహంగా వుండేవాడివి. ఏమిటి మధూ? నాకు చెప్పకూడదా?" అన్నాడు వాడు ప్రేమగా. వాడికి అనుమానం రాకుండా ఏదో చెప్పాను. నేను చిన్నతనం నుంచి నేర్చుకున్న అలవాటే అది. గుట్టుగా వుండటమే నాకుకావాలి. ఎంత స్నేహితుడైనా-నా భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తుందని తెలిస్తే-వాడి దృష్టిలో నేను చులకనైపోవచ్చు-సరే! వాడిదగ్గర శలవు తీసుకు ఇంటికొచ్చేశాను.
కొంతసేపయ్యాక లక్ష్మి అడిగింది. "వదిన చీరచూసి ఏమందన్నయ్యా?" అని.
"మన చీరలూ మనం కావలసిన వదిన కాదు లక్ష్మీ!" అన్నాను. లక్ష్మి ఎందుకో మళ్ళా మాట్లాడలేదు. అమ్మ అడిగింది-"అమ్మాయి నెప్పుడు పంపుతామన్నారు? అంతా బావున్నారా?" అని.
"ఎప్పుడు పంపేదీ నేనేం అడగలేదు. అసలక్కడ ఒక్కరోజే వుండి వచ్చేశాను. ఆవిడ ఈఇంట్లో వచ్చి కాపరం చేసే లక్షణాలు లేవమ్మా! నాకేమిటో ఏమీ అర్ధం గావటంలేదు" అన్నాను. నామాటల్లో నాకే ఏదో బాధ ధ్వనించింది. అమ్మ చాలాసేపు మవునంగా వుండి "సరేలే. నువ్వెందుకిప్పుడు బాధ పడాలి? మామయ్యా వాళ్ళంతా వున్నారు కదా?" అంది. తర్వాత రెండు మూడు రోజులకి సమాచారం చాలా వరకు లక్ష్మికి చెప్పాను.
ఆఫీసుకెళ్ళి చూసుకొంటే రామం బావ రాసిన వుత్తరం వుంది.
"నువ్వెళ్ళిపోయిన సంగతి విని ఎంత బాధ పడ్డానో భగవంతుడికి తెలుసు. అరుణని ఎంతో తిట్టాను. ఎప్పుడూ రానంత కోపం వచ్చింది నాకు. అది మూర్ఖంగా ప్రవర్తిస్తే నువ్వయినా కొంత ఓర్చుకొంటే సరిపోయేది బావా' నా చెల్లిలిని నేను సమర్ధించుకు రావటంలేదు. అటువంటి మనిషితో పంతం పట్టి నిముషాల మీద మార్చ గలిగిందేమీ వుండదు. నీమీద నేను ఎన్నోవిధాల నమ్మకం పెట్టుకున్నాను. అరుణని నువ్వే మార్చుకో గల గాలి. జరిగింది మర్చిపో. వెంటనే జవాబు రాయి. నాకోసమైనా అరుణని క్షమించు".
ఓ నిట్టూర్పు విడిచి వుత్తరం జేబులోపెట్టుకున్నాను. బావకి జవాబు రాశాను-"నీ వుత్తరం చూశాను. నీ ఆదరవు లేకపోతే మా ఇద్దరికీ ఏనాడో తెగతెంపులై వుండేదేమో అనిపిస్తుంది. నన్ను ధిక్కరించి వీధిలో కెళ్ళిపోయిన అరుణని క్షమించేంత శాంతం లేకపోయింది బావా! సరే! జరిందిందానికి, అయిందానికి విచారించటం-మర్చిపోవటం అలవాటే అయింది. అరుణని పంపమని అడగాలని కూడా వచ్చాను నేను. కాని అవకాశం లేకపోయింది. మాఅమ్మ రోజూ నీకూ అత్తయ్యకూ వుత్తరాలు రాయమని చెప్తూనే వుంది. నేనే అశ్రద్ధ చేస్తూ వచ్చాను. మీకెంత గారమైనా ఆవిడ ఇక్కడికి రావల్సిందేకదా? మంచిరోజుచూసి అరుణని తీసుకొచ్చి దిగబెట్టు. నాకుమళ్ళా ఇంతలో రావటం కుదరదు. వెంటనే జవాబు రాయి". అరుణకి కూడా మరో వుత్తరం రాశాను.
నీకు చెప్పాలనుకున్న విషయమే సమయం కుదరక చెప్పలేదు. అసలు నిన్ను తీసుకొచ్చెయ్యాలనే వుద్దేశ్యంతోనే వచ్చాను. మన మధ్య ఒచ్చే పొరపొచ్చాలతో పోటీ పెట్టుకుని కూర్చోటానికి దాంపత్య బంధాన్ని నువ్వు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోను. నీకు ఇష్టమైనా, కాకున్నా నాదగ్గరికి రావటం తప్పేది కాదు. అమ్మకూడా ఆతృత పడుతోంది. మీ అన్నయ్యకి వుత్తరం రాశాను. ఎప్పుడు బయల్దేరుతున్నదీ వెంటనే జవాబు రాయి".
ఆరెండు వుత్తరాలకీ వెంటనే జవాబులు వచ్చాయి. ముందు అరుణ వుత్తరం తెరిచాను-' మీ వుత్తరం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నన్ను మీ ఇంటికి రమ్మని పిలవటం ఏమిటో అర్ధంకాలేదు. బహుశా మీరు పెళ్ళికి ముందు అంగీకరించిన విషయం మర్చిపోయి వుంటారు. నన్ను ఇంట్లోనే వుంచుకోవాలనేది నా చిన్నతనం నుంచీ నాన్నగారూ-అమ్మా అనుకున్న విషయమే. నాన్నగారు పోయేటప్పుడు కూడా అదే అన్నారట. అమ్మక్షణం నన్ను చూడలేకపోతే వుండలేదు. కాకపోయినా అందరిలా నాకు ఓ యింటికి వెళ్ళి పడివుండాల్సిన అగత్యం లేదు. అన్నయ్యతో సమనంగా ఆస్థి ఇచ్చారు. ఈ విషయము మీకు పెళ్ళికి ముందే తెలుసు. ఇప్పుడు నన్నెలా మీ ఇంటికి రమ్మని అడుగుతున్నారో అర్ధం కావటంలేదు. అన్నయ్య ఒక్కడే బిజినెస్సంతా చూసుకోలేక పోతున్నాడు కూడా. మీరాక విషయమే తొందరగా రాయండి". నాకా వుత్తరం ఏమీ అర్ధం కాలేదు. ఏమిటది? పెళ్ళికిముందు విషయం ఎవరితో సంప్రదించారు? ఎవరు ఒప్పుకున్నారు? ఏమిటిదంతా? వెంటనే పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి వుత్తరం అమ్మకి చూపించాను. సారాంశంవిని ఆవిడా తెల్లబోయింది.
"ఏమిటమ్మా ఇదంతా?" అన్నాను.
"కంగారుపడకు. మీ బావమర్ధేం రాశాడో చూశావా?" అంది శాంతంగా ఆ వుత్తరంమాటే మర్చిపోయాను. గబగబా జేబులు వెదికి వుత్తరం బైటికి తీశాను-
"నీ వుత్తరం అందింది. అరుణని పంపమని రాశావు. పెళ్ళికిముందు బాబాయితో మాట్లాడిన సంగతి అసలు నీకు తెలుసా? అని ఇప్పుడు అనుమానంగా వుంది. మొన్న ఇక్కడ కొచ్చినప్పుడు ఆఫీసులో ఆ సంగతి ఎత్తితే కూడా-'నాకీ లేనిపోనీ పెత్తనం దేనికి బాబు! నా బ్రతుకు తెరువు నాకుంది" అన్నావు. అప్పుడే అనుకున్నాను గానీ సరే తర్వాత అడుగుదామని వూరుకున్నాను. నువ్వు అంతలో అనుకోకుండా వెళ్ళిపోయావు. అరుణని ఇంట్లోనే వుంచుకోవాలని అమ్మపట్టు. అరుణకి కూడా అదే ఇష్టం. నేను వాళ్ళతో వాదించదల్చుకో లేదు. అందుకు ఇష్టపడేవాడినే చూస్తే సరిపోతుందనుకున్నాను. పెళ్ళిముందు ఈ విషయం బాబాయికి విపులంగా చెప్పాను. మీ అభ్యంతర మేమీ లేదని చెప్పాడు. అమ్మ అందుకే ఈ సంభందానికి అంగీకరించింది-చూడు బావా! ఒకవేళ నీకీ సంగతి పెళ్ళికి ముందు తెలీకపోయినా ఇప్పుడు విచారించాల్సిన పనిలేదు. నాకు మరొక తోడబుట్టి నవాడుంటే భాగం పంచుకోకపోడు. అరుణ కిచ్చిందేదో నీదే అవుతుంది. నీదినువ్వు చూసుకో వాలిగాని ఎన్నాళ్ళు నేను చేస్తాను?
ఇక్కడికి రావటం గురించి పెద్దగా ఏమీ ఆలోచించకు. నేనుండగా నీకెటువంటి లోటూ రాదు. సరే! వుంటాను జవాబు రాయి".
"ఇదంతా మావయ్య చేసిందన్నమాట" అన్నాను తలెత్తుతూ అమ్మ ఏమీ మాట్లాడలేదు.
"పెళ్ళికి ముందు నీకు గాని చెప్పాడా?"
"అబ్బే! నాకేం తెలీదు. ఇలాని తెలిస్తే వాళ్ళెంత వున్నవాళ్ళయితే మాత్రం ......." అంటూ ఆగిపోయింది అమ్మ.
నాకోపం కట్టలు తెంచుకొంది-"దుర్మార్గుడు ఎవర్నడిగి ఈ షరతు కంగీకరించాడు? పెళ్ళిచేసుకొనేదెవరనుకున్నాడు?" అంటూ మావయ్యని దుయ్యపడుతూంటే అమ్మ అడ్డువచ్చి-
"సరే! ఇప్పుడు అనవసరంగా అరుచుకోటం దేనికి? వుత్తరం రాసి కనుక్కుందాం ఆగు" అంది.
వెంటనే మావయ్యని వచ్చి వెళ్ళమని మాట్లాడాల్సిన అవసరంవుందనీ వుత్తరం రాశాను. మూడోనాడు ఆఫీసునుంచి వచ్చేసరికి మావయ్య అమ్మతో మాట్లాడుతున్నాడు. నా ఒళ్ళు ఉడికి పోయింది. ఆయన్ని చూస్తూనే.
"ఏం రా? అర్జంటుగా రమ్మని వుత్తరం రాశావ్" అన్నాడు ఏమీ తెలీనట్టు.
"నీ నాటకాలకేంగానీ ఎవర్నడిగి వాళ్ళడిగిందానికి ఒప్పుకున్నావ్? నాకు తెలీనివ్వకుండా ఈ తంతు జరపటానికి నీకెన్ని గుండెలు?" నేనెలా మాట్లాడుతున్నానో నాకు తెలీలేదు. ఎంత తొందరగా నాకోపాన్నంతా వెళ్ళగక్కుతావా అన్నదొక్కటే నా తాపత్రయం.
