Previous Page Next Page 
నన్ను నన్నుగా ప్రేమించు పేజి 12

 

    "నే బియ్యం తెస్తున్నాగా - ఈలోగా అంత ఖంగారేం?" పళ్ళెం నిండా పోసిన బియ్యం ఎత్తి చూపుతూ అడిగింది లీల, కోపంగా ప్రభాకరంవైపు చూస్తూ.
    "పోనీ లెద్దూ! పాప డబ్బు లియ్యమంది. అనడమే కాదు...చూశావో లేదో....దర్జాగా నా జేబులోంచి లాగేసుకుని వాడి కిచ్చింది." గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్పాడు ప్రభాకరం.
    "పాప ఇస్తూంటే చూస్తూ ఊరుకొన్నారా? ఏనాడయినా పనివాళ్ళకి డబ్బులిచ్చే ఆనవాయితీ ఉందా?"
    "అబ్బ... పాప ఇచ్చింది. నన్నేమీ అనకు." నవ్వుతూ అన్నాడు ప్రభాకరం.
    "అలాగే రేపు అది మెళ్ళో గొలుసు తీసి మరొకడికిస్తుంది. అప్పుడూ చూస్తూనే ఊరుకోండి."    
    "ఒక్కసారి డబ్బులిస్తే ఇంత రాద్దాంతం ఎందుకు, లీలా?"
    "ఈ ఒక్కడితో సరిపోతుందా? మిగిలిన వాళ్ళు మాత్రం గోల పెట్టరూ? అయినా...ఇచ్చుకోండి. మోసేవాడికే బరువు తెలియనప్పుడు చూసేదాన్ని నా కెందుకు?" అంటూ విసురుగా వెళ్ళిపోయింది లీల.
    "మా లీల కీమధ్య చిరాకు ఎక్కువయిపోయింది" అన్నాడు ప్రభాకరం హుషారుగా.

                               *    *    *

    "ఏమి టలా నిలుచుండిపోయావు?" పేపరు లోంచి తల తిప్పి కొద్ది సేపటినుంచీ కదలిక లేకుండా నోరు తెరిచి బీరువా దగ్గర అలాగే నిలబడిపోయిన లీలను చూసి అడిగాడు ప్రభాకరం.
    "ఏమండీ....ఇందులో డబ్బంతా ఏమైంది?" ముఖం దరిదాపు పాలిపోయినట్లయి పోగా, భయం భయంగా అడుగుతున్న లీలను చూసి నవ్వుతూ, "డబ్బంతా అంటున్నావు? ఎంతేమిటి?" అన్నాడు.
    అతని నవ్వు విచిత్రంగా కనిపించింది లీలకు.
    "ఎంతో రూపాయి అణాలతోనే లెక్క పెట్టలేదు కానీ అయిదారు వేలకి తక్కువ ఉండదు..."
    "ఏమో అనుకున్నాను. నువ్వూ డబ్బుమీద కన్నేసే ఉంచారేన్న మాట!"
    "నస... నే నడిగింది చెప్పండి-డబ్బేది?"
    "ఉందిలే....ఎక్కడికి పోతుంది - ఖంగారు!"
    "ఎక్కడికో పోయింది కాబట్టే ఖంగారు."
    "ఎక్కడికీ పోలేదు. నే తీశాలే."
    "తీసుకున్నారా? అయిదు వేలు ఒక్కసారిగా వాడేశారా?"
    "ఏమిటి, లీలా, సిల్లీగా -తీశానని చెపుతున్నాగా!"
    "అయిదు వేలకి పెట్టవలసిన ఖర్చేమొచ్చింది? మళ్ళీ ఎవరికో ఏ పాలేరు గాడికో పత్రం గిత్రం లేకుండా ఇచ్చేసుంటారు."
    "ఏవో వస్తుంటాయి మొగాడి కన్నాక - సవాలక్ష ఉంటాయి. అన్నిటికీ నిలేసి అడిగితే కష్టం..." విసురుగా పేపరు టీపాయ్ మీద పడేసి వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకరం.
    మెల్లిగా బీరువా తాళం వేసి తిరుగుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చుంది పోయింది లీల.
    'ఏమిటీ ఇతని వరస? ఎందుకు కిలా రోజు రోజుకీ భయంకరంగా మారిపోతున్నాడు? కోరి మరీ దూరం ఎందుకవుతున్నాడు?
    ఆ నాడు....శరణాలయానికి వెళ్ళి వచ్చిన పిల్లాడినే తెచ్చుకుందాం అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన మనిషి.... వారం రోజులు తిరగకమునుపే పాపని వెంటబెట్టుకు వచ్చాడు. అనాథ శరణాలయానికి వెళదామనడం, వచ్చిన బాబు రికార్డు మంచిది కాదనడం ఇవన్నీ అతనాడిన నాటకాలు కావుగదా?
    అయినా...పాప ఇమ్మంది. పాప కావాలంది...అంటూ మంచీ చెడూ ఆలోచించకుండా డబ్బు విరజిమ్మేస్తున్నాడు. పాప వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా లెక్క పెడితే పాప వచ్చాక రెండు రోజుల కొక వెయ్యి రూపాయలైనా ఖర్చు పెట్టినట్లు తేలుతూంది.
    పాప "నాన్నా, కారు..." అంటూ మాటయినా పూర్తిచేయకుండానే హడావిడిగా వెళ్ళి వచ్చిన కారును దబ్బు వెదజల్లి తెచ్చారు. పాలేరుకు రెండు-ఈ రోజు అయిదు...ఏమిటి, వందలు కావు, వేలు! ఈ విధంగా ఎన్నాళ్ళు నిలిచేనూ ఎంత ఆస్తి అయినా!
    అస లీ పిల్ల ఎవరు? దీని తల్లిదండ్రు లెవరు? అంటే సక్రమమైన సమాధానం రాదు. జన్మంతా మన ఇంట్లో ఉండవలసిన పిల్ల.....హోమం, మంత్రం లేకుండా ఎవరిచ్చారు? 'పాప మనది' అంటే నలుగురూ నవ్వుతారనయినా అతనికి తోచలేదా? పోనీ.....వాళ్ళెవరో పాపని పెంచడానికి బరువై నట్టు అనుకుంటే గుమ్మం దాకా తెచ్చి, శుభాకాంక్షలు తెలిపి ఇవ్వరాదా? మరునాటి నుంచీ కాబోయే తల్లిని కదా-నా పరిచయం చేసుకో కుండా ఎక్కడో కనబడిన వారికి, అక్కడి కక్కడే పాపని చేతుల్లో ఎలా పెట్టారు? అసలిది సక్రమమైన సంతాన మేనా?
    ఈయనకైనా పిల్లని పెంచుకోవాలన్న కోర్కె చాలా కొత్తది. ఆడపడుచువారు వచ్చి సంధ్యని చేసుకోమన్నప్పుడు కదా ఇది కలిగింది! ఆ తరవాత ఈయన చూపిన అనాథ శరణాలయాలెన్ని? బంధువుల ఇళ్ళెన్ని? తనను తీసుకెళ్ళకుండా అందర్నీ చూపకుండా ఏదో ఒక పాపను తీసుకురావడం అసందర్భంగా ఉందే!'
    రెండు రోజులు గడిచాయి.
    జేబులో కాగితాలు తీసి షర్టు చాకలికి వేస్తూ ఉంటే అందులో ఒక చిన్న ఉత్తరం లాంటిది కనబడింది. అందులో పేరూ ఊరూ లేదు. అదొక చిత్తు ఉత్తరం. "ఈ ఇన్స్యూర్డ్ కవర్ లో అయిదు వేల రూపాయలు పంపుతున్నాను. ఇది చిట్టి చెల్లాయి తన తమ్ముడికీ, అక్కలకీ, అన్నలకీ పంపిన కానుకగా స్వీకరించాలి. విలువలేని మీ (మన) పాపకి వెల కడుతున్నా ననుకోవద్దు. ఇటువంటి దాన్ని కనలేకా, కొనలేకా నేను పడే బాధ మీ రర్ధం చేసుకుంటే ఎంత బాగుండును!" అని ఉంది ఆ చీటీలో.
    అంటే ఎవరికో పంపేశారన్న మాట! అయిదు వేల రూపాయలు! అప్పూ కాదు, బాకీకాదు-ఊరికే ఇచ్చెయ్యటమే!
    ఇంకా తమ్ముడూ, అక్కలూ, అన్నలూ ఉన్నారుట ఈ పాపకి! వాళ్ళంతా ఇతని కేమవుతారు? మన పాప-అని వ్రాశాడు అందులో. ఈ ఉత్తరం ఎవరో స్త్రీకి కాదు గదా?    
    ఈ దబ్బు ఎవరికి పంపాడు? పిల్ల తండ్రికా, పిల్ల తల్లికా? తల్లి కేనేమో! ఎవరో ఆమె! పల్లెటూళ్ళో పొలాలు ఉన్నాయి. సంవత్సరానికి రెండు సార్లు అక్కడికి విధిగా వెళతాడు. మొదటిసారి వెళ్ళేటప్పుడు రోజులకు పైగా ఉంటాడు. రెండోసారి పదిహేను రోజులకు తక్కువ కాకుండా ఉంటాడు. వరిచేలు అని? ధాన్యం పండుతాయి. నాట్లు, కోతలు, మార్పులు గడ్డి కుప్పలు-ఏమిటేమిటో పనులు ఉంటాయి. ఆ సీజన్స్ లో తన అవసరాల కోసం అక్కడ మరో స్త్రీ ఉందో ఏమో? కామం, భార్యాభర్తలు, సంతానం అంటూ ఏమీ సిద్దాంతాలు మాట్లాడుతాడు. ఇత నా సిద్దాంతాలలోని భావాలకు అతీతుడా? ఏమో?
    దీనితో తానొక గొడ్రాలినని ఋజువు చేసినట్లయింది.
    ఇదివరకంతా కొంత ఆశ ఉండినట్లూ, ఈ పాప వచ్చాక, దీన్ని డబ్బిచ్చి కొన్నాక ఆ ఆశ లేనట్లూ కాదా?

                              *    *    *

                                  11

    రాత్రి పదకొండయింది.
    లీల నిద్ర పోలేదు.
    మంచం పక్కన కుర్చీ వేసుకు కూర్చుంది.
    ప్రభాకరం చాలాసేపటివరకు పాపకి కథలు, నర్సరీ రైమ్స్ చెప్పేడు, అది బొక్కిపళ్ళతో 'హికరీ డికరీ డాక్' అంటూంటే అతనూ ఆ పాటలు చదువుతూ ఆడుకొంటూ చివరికి అనగా అనగా రాజు, రాజు కేడుగురు కొడుకులు, ఏడుగురూ కొడుకులు వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అని కథ చెప్పేడు.
    "వేటకి వెళితే చేపలెలా దొరుకుతాయి నాన్నా? కాలవగట్టు కెళతారు చేపల కోసం" అన్నది పాప.
    'అద్భుతమైన ఆ తెలివి'కి పరవశించిపోయాడు ప్రభాకరం. అక్కణ్ణించి కథలో ఏడుగురు కొడుకులు కాలవగట్టు కెళ్ళి తలో చేప తెచ్చారు అని మారి పోయింది.
    తను అక్కడ కూర్చున్న సంగతే విస్మరించి వాళ్ళిద్దరూ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోగలరు. ఆ కాసేపట్లో మంచం బస్సయి పోతుంది. దోమతెర ఏరో ప్లేనయి పోతుంది. వాళ్ళిద్దరూ దిగిపోయి రైలు బండీ అయిపోతారు. క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం.
    ఆ ధోరణి రోజూ చూస్తున్నదే అయినా ఏ రోజుకారోజు కొత్తగా టెంప్ట్ చేసేటంత అసహ్యం వేస్తూంది.
    "నాన్నా!
    "ఓయ్ నాన్నా!"
    "అమ్మ మాట్లాడదేం?"
    "మాట్లాడుతుంది. నీతో ఇప్పుడప్పుడే మాట్లాడదు.
    "మరెప్పుడు మాట్లాడుతుంది?"
    "నీ అదృష్టం పోనీ ఓ సారి పలకరించి చూడ కూడదూ?"
    "అమ్మా"
    "..."
    "అమ్మ పలకలేదు."
    "మళ్ళీ ట్రై చెయ్యి."
    "ట్రై' అంటే?"
    "మళ్ళీ పిలుపు అన్నమాట!"    
    "ట్రై అంటే పిలవడమా! అమ్మా....నిన్ను రెండు సార్లు ట్రై చేసేను."
    "..."
    "పలకదు, నాన్నా."
    "బబ్బో..."
    "ఓ యబ్బో..."
    "అమ్మ బబ్బోమంటూంది."
    "ఓబ్బో కాదు ఓ యబ్బో అంటూంది."
    "అంటే?"
    "గొప్ప"
    "గొప్పా?"
    "అవును.... గొప్ప అని అదొకటి ఉంటుంది కొందరికి."
    "గొప్పా గోటూ చెవిలో పోటూ"
    "అదే"
    "పొద్దున్న పాడతాను."
    "ఒబ్బో..."
    "ఓ యబ్బో... నాకు చెప్పక్కర్లేదు"
    "కొన్న ఖరీదుకి ఉంటే?"
    "అదుగో, అమ్మ మాట్లాడింది.
    "అవును మరి కొన్న ఖరీదుకి ఉంది కదా అని."
    ఇలా నిద్ర పోయేవరకూ ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ ధోరణి రోజు చూస్తున్నదే అయినా రోజు కొత్తగా టెంప్ట్ చేస్తూ అసహ్యం వేస్తూ ఉంటుంది.
    పదకొండూ ఇరవై నిమిషాలకి ప్రభాకరం లేచాడు.
    "ఇంకా నిద్ర పోలేదూ?"
    "నిద్రపోతే ఇక్కడెందుకుంటాను?"
    ప్రభాకరం మాట్లాడలేదు.
    "నిజం చెప్పండి. పాప ఎవరు?"
    "పాపా?" నవ్వాడు. "పాప పాపే!"
    "పాప పాప కాకపోతే బాబెలా అవుతుంది?"
    "నా కదే పాప, అదే బాబు."    
    "ఏం అంత కక్కుర్తి? ఒక బాబును కూడా తెచ్చుకోలేకపోయారా? ఈ భుజంమీద ఒకన్ని ఆ భుజం మీద ఒకర్తిని మొయ్యచ్చుకదా?"
    "నాకా ఐడియా తట్టలేదు."
    "బ్రతికేరు. లేకపోతే ఆస్తంతా అయిదేళ్ళలోనే అయిపోయేది."
    "ఇప్పుడు పదేళ్ళు వస్తుందంటావా?"
    "ఈ లెక్కనైతే రావచ్చేమో?"
    "అన్నేళ్ళు నా ఓపిక లేదు. ఇంకా తొందరగా అయిపోయే ఉపాయం ఉంటే చెబుదూ!"
    "ఏముందీ అయిదు వేలు పంపారుగా, ఇంకో ఏడాది ఊరుకొని, ఏడాది కైదువేలు కదా మనం అనుకొన్నది అని అప్పుడొక అయిదు వేలు పంపితే సరి."
    "లీలా..."
    "ఎదురుగుండానే ఉన్నాను కదా చెప్పండి."
    "నీకు ఎందుకు పాపని చూస్తే అసూయ?"
    "అసూయ కాదు. అసహ్యం అనండి..."
    "పోనీ...అదైనా ఎందుకు?"
    "అదెవరో చెప్పండి. నా కసహ్యం పోతుంది."
    "నే చెప్పినా నమ్మవు."
    "ఇంకొక రెవరికైనా చెప్పి చూడండి, వాళ్ళు నమ్మితే నేను సిద్ధమే."
    "లేచి వెళదాం పద."
    "లెండి."
    అతను నవ్వుతున్నాడు. ఆమె వెటకారం చూస్తే మొండికోపం వచ్చింది. అతన్ని ఎలాగ చిత్తు చెయ్యాలా అని ప్లాను వేస్తూంది. ఆమె కాలోచన తెమల్లేదు. కుర్చీలోంచి లేచింది లీల. "లెండంటే లేవరేం? దైర్యం చాలదు మళ్ళీ!"
    అతను లేవడానికి ప్రయత్నించాడు. పాప అతని మెడ చుట్టూ చేతులు వేసి ఉంది. పట్టు విడవడం లేదు, నిద్రలోంచి మెలకువ వస్తే కాని పట్టు వదిలేటట్టు లేదు.
    "చూడు"
    "ఏమిటి?"
    "ఈ మాత్రందానికి ఫ్రూఫ్ ఎందుకు హాయిగా పడుకోమంటూంది."
    "విడవరాని బంధం కాబోలు!"
    "ఇంచు మించు అలాటిదే. పోనీ నువ్వొచ్చి విడిపించుచూద్దాం."
    "నా క్కోపం వస్తే విదిలించి పారేస్తాను అలా గారాలు కురిసినవాళ్ళని."
    ఆమె మంచం మీద పడక సరిచేసుకుంటూంది. ప్రభాకరం లేచాడు.
    లీల దుప్పటి దులిపి లెయ్యబోతూంది. ప్రభాకరం వెనకనుంచి వచ్చి ఆమె చేతుల్లో ఉన్న రెండు కొసలు పట్టుకున్నాడు.
    దుప్పటి కొసలు వదలకుండా మెడతిప్పి వెనక్కి చూసింది లీల. "ఏమిటిది?" అన్నట్టు చూపులో కాఠిన్యం ప్రభాకరాన్ని రెచ్చగొట్టింది.
    గడ్డంతో గడ్డంమీద రుద్దాడు.
    "ఛీ....మోటు"
    "ఊఁ?"
    కితకితలు పెట్టాడు. లీల నవ్వింది. ఆమెని పడిపోయేటంతగా అల్లరి చేశాడు. చివరికి, పడిపోబోతూంటే పట్టుకొన్నాడు. నిలదొక్కుకునేవేళకి మళ్ళీ పడేసినట్టు కొంటెతనం చేశాడు.
    లీలకి నీరసం వచ్చింది.
    ఎన్నాళ్ళయిందో ప్రభాకరం తనని నిండుగా పట్టుకొని?
    "నీకు ఒంట్లో బాగా లేదు!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS