"ఈ స్నేక్ డాన్స్ అయ్యగారు ఎందుకు చేస్తున్నారో తెలుసా! తనకి పడబోయే అక్షింతలు తలుచుకుని" కనకారావు అహోబిలం చెవి దగ్గర గుసగుసలాడాడు.
పోలీసుల వల్ల పోలీసు కుక్కలవల్ల పనులుకాలేదు.
దొంగలు పగలగొట్టిన వకవేపు మళ్ళీ యధాతధంగా రాళ్ళుపరిచి సిమెంటు చేస్తూనే మరోవేపు నుంచి భక్తులని దేవీదర్శనానికి వీలుగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
భక్తులు వచ్చి పరమేశ్వరీదేవిని దర్శించి కొలిచి వెళ్ళటమేగాక బుగ్గన వేలేసుకుని, ముక్కున వేలుంచుకుని దొంగలు తొవ్విపోసిన చోట మళ్ళీ రిపేరు చేస్తున్నచోట చూసి వెళుతున్నారు. అలా వచ్చి వెళ్ళినవాళ్ళు చర్చలు చేస్తున్నారు. కొత్త విషయాలు పుట్టిస్తున్నారు. ఆ వార్తలు గాలిలో ప్రయాణంచేసి రంగులు పూసుకుంటున్నాయి.
"గుడిలో లంకెబిందెలు ఉన్నాయి. అది తెలిసి ఎవరో తొవ్వుకెళదామని వచ్చారు" వకావిడ అంటే.
"ఇంతకీ లంకెబిందెలు దొంగలకి దొరికాయో లేదో మనకి తెలియదుకదా వదినా!" అని వాపోయింది మరో ఇల్లాలు.
"లంకెబిందెలు లేవు తమ్మకాయ గొలుసులూ లేవు. తెలిసీ తెలియని విషయాల గురించి మాట్లాడకండి" అంటూ ఆమెగారి భర్తగారు సమయానికి అక్కడవుంటే ఏదో వకటి అని వాళ్ళ నోరుమూయించటం జరిగింది.
దొంగలు తొవ్విన విషయంలో జోక్సు కూడా పుట్టాయి.
"ఓ యిల్లాలికి భర్తమీద చచ్చేంత కోపం. భర్త ముఖం చూస్తే చాలు చిరాకు ఆయనగారి మాటవింటే చాలు వళ్ళు మంట ఈమెగారి దైవభక్తి ఎక్కువ. మాటకుముందు మొక్కుతుంటుంది. మొక్కు తనది పాట్లు భర్తవి. ఆమెగారికి కాలునొప్పో కన్నునొప్పో వచ్చి ఉంటుంది. "అమ్మా! పరమేశ్వరీదేవీ! నా నొప్పి తగ్గితే మా ఆయనచేత నీ గుడిచుట్టూతా ఆయనగారిచేతనే తవ్వించి ఆయనగారిచేతనే తవ్వించి ఆయనగారిచేతనే కొత్త బండలు పరిపించి ఆయనగారి చేతనే సిమెంటు అతుకులు పెట్టిస్తాను అని మొక్కుకొని ఉంటుంది. ఇల్లాలు విధేయుడు అయిన ఆయనగారు రాత్రికి రాత్రి గుడి చుట్టూతా తొవ్విపారేసి ఉంటాడు. రేపు ఆమెగాదు మరో మొక్కుమొక్కి "గుడిలో లింగాన్ని మింగిరావయ్యా మగడా! అంటే ఆ పనికూడా చేస్తాడేమో!
ఇలాంటి పిట్టకధలు కూడా పుట్టాయి.
ఓ మహా ఇల్లాలు వంటిమీదకి అమ్మవారు వచ్చి "పది మేకల పాతిక కోళ్ళనీ కోయాలిరోయ్! లేకపోతే ఊరుకోనురోయ్! ఊరునిమింగుతా దేశాన్ని మింగుతా ఆ తర్వాత అమెరికా, రష్యాని కూడా మింగుతా హుహుహు హహహు" అని గంతులేస్తూ అనేస్తుంటే ఆమె మాటల ఎవరూ పట్టించుకోక "కుంకుమార్చనలను కోరే అమ్మవారు కోళ్ళ కుక్కలని కోరారు చాలించు నీ గోల" అని నలుగురూ కేకలేయటంతో ఆమెకి పూనిన అమ్మవారు దిగిపోయింది.
ఇదే సందు అదే మందు. సరీగా అలాగే ఏదోవక సందులో బొమ్మనో రాయినో పెట్టి నాలుగురకాల బొట్లుపెట్టి బ్రతకనేర్చిన మహానుభావుడు కొత్త భక్తులతో "అయ్యా! పరమేశ్వరీ అమ్మవారు ఓ పర్యాయం ఇక్కడ పది నిమిషాలు విశ్రాంతి తీసుకుని వెళ్ళారు. ఈ పవిత్ర స్థలంలో రెండు నిమిషాలు కళ్ళుమూసుకుని నుంచుంటే సర్వపాపాలు హరిస్తాయి, అని చెప్పటం మొదలుపెట్టాడు.
ప్రతివాడూ ఇంతో అంతో పాపాత్ముడే కాబట్టి అక్కడ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నుంచోటం అలా నుంచున్నందుకు తోచిన కానుక పళ్ళెంలో వేసి, చేసిన పాపాలు కడుక్కుని పోవటం అలా వకళ్ళు చేసేసరికి.....చరిత్ర తెలియకపోయినా చేసిన పాపాలు కారుచౌకగా తుడిచేసుకోటానికి వకళ్ళ తర్వాత మరొకళ్ళు రావటం పోవటం.....రావటం.....పోవటం......
ఇలా సందుకొకటి గొందికొకటి చిల్లరదేముళ్ళు వెలిశాయి.
రెండు నెలలు తిరిగేసరికి.
అసిరిపల్లె మహా దివ్యక్షేత్రంగా మారిపోయింది.
మాచెమ్మ అల్లుడు మల్లయ్య కాదూ! అంటే అవును కాబోలు అత్తపోలికే అల్లుడిది కూడా అన్నట్టు అసిరిపల్లె వాళ్ళకే తెలియని దేముళ్ళు పుట్టుకొస్తుంటే వాళ్ళుకూడా అదికాదు ఇది అనక కాబోలు అనుకుంటున్నారు.
అసిరిపల్లె కధ అలావుంటే.
మరి రెండుచోట్ల కధలు మరోరకంగా తయారవుతున్నాయి, చాలా రహస్యమైనచోట చాలా రహస్యంగా.
రెండుచోట్ల చాలా తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి. కొత్త పథకాలు తయారవుతున్నాయి.
అవి అలా సాగుతుండగానే గుడిలో మరో ఘోరం జరిగిపోయింది
8
అక్కడంతా.
చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దంగా వుంది.
