"ఎదురుగుండా కనిపిస్తున్న హోటల్ కి జట్కా ఎందుకండీ" అన్నాను.
"రెండు పెట్టెలున్నాయి అదీగాక, నేను నడుస్తుంటే నా వెనకాల మీరు పరిగెత్తలేరు. అందుకనే" అన్నారాయన.
సిగ్గువేసింది. మా పరుగుని గమనిస్తున్నారన్నమాట.
జట్కావాడి పక్కన ఆయన కూర్చున్నారు. సామాను పడేసి అమ్మా, నేనూ వెనక్కి కూర్చున్నాం.
గాయత్రి హోటల్ ముందునుండి జట్కా వెళ్ళిపోతోంది.
"హోటల్ దాటిపోతున్నాం" అన్నాను. ఆయన సంధానం చెప్పలేదు. రెండు ఫర్లాంగులు దాటి జట్కా బజారులో ఆగింది.
శ్రీశ్రీగారు దిగారు.
పది నిముషాల్లో వచ్చి కూర్చుని "హోటల్ కి పోనీ" అన్నారు.
చేతిలో కాగితాలు చుట్టిన రెండు పెద్ద సీసాలున్నాయి.
జట్కా కట్టించినందుక్కారణం అప్పుడు గానీ నాకు అర్ధం కాలేదు.
ఆ సీసాలు మా అమ్మ చూసింది "ఏవిటే అవి?" అని అడిగింది.
"నాకు మాత్రం ఏం తెలుసమ్మా" అన్నాను.
"సినీ ఫీల్డులో అడుగు పెడుతున్నాం. శ్రీశ్రీగారి దగ్గర పనికి వచ్చాం' అన్న సంతోషమే లేదు.
మనసు అశాంతితో అలజడిగా వుంది.
ఏమిటీ మనిషి? తాగుడికి ఇంత బానిసేమిటి? పట్టపగలే తీసుకుంటారా? అని ఆలోచిస్తుంటే చిరు చెమట్లతో గుండె బరువెక్కింది. పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టుంది. నా అవస్థ.
ఈ రోజు మా అమ్మతో యుద్ధం తప్పదనుకున్నా.
మళ్ళీ జట్కా ఆగింది.
ఆ బాటిల్స్ నా చేతికిచ్చి "పట్టుకో" అన్నారు.
"ఇదేమిటి సార్" అన్నాను.
"పట్టుకో చెప్తానుగా? .... అని ఒక కొట్లో దూరి, కత్తెర మార్కు (సిజర్స్) సిగరెట్ పేకట్లు, ఆరు అగ్గిపెట్టెలూ కొనుక్కొని జట్కా ఎక్కారు.
నేనూ, మా అమ్మా కూడా బిక్కచచ్చిపోయాం.
మా అమ్మ మెల్లగా బొటనవేలు నోటి దగ్గర పెడుతూ "అదేనా?" అంది.
నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది, ఆయన కొనుక్కున్నందుకు కాదు- పట్టుకొమ్మని నా చేతికిచ్చినందుకు. జీవితంలో ఇదే మొట్టమొదటిసారి డ్రింక్ బాటిల్ ని చూడడం.
హోటల్ కి వెళ్ళిన తర్వాత తెప్పించుకోవచ్చుగా ఆడవాళ్ళం మమ్మల్ని బండిలో పెట్టుకుని ఏమిటీ కక్కుర్తిపనులు! హోటల్ ముందునుండేగా వెళ్ళాం. పోనీ మమ్మల్ని దింపేసి తను వెళ్ళొచ్చుగా దీని కోసం ఒక రౌండ్ తిరిగిరావాలా.
ఎంత అణగదొక్కుకున్నా కోపం, ఏడుపు ఆగడంలేదు.
అందరూ చెప్పుకుంటున్న దానికి ఈయన చేస్తున్న దానికి సరిగ్గాసరి పోయింది- అని లోలోనే గింజుకుపోయాను.
రెండు బాటిల్స్ చేతిలో పడేసరికి శ్రీశ్రీగారి ముఖమే మారిపోయింది. కళ కళ లాడిపోతోంది. ఎంత హుషారుగా కన్పించారో చెప్పలేం.
"బండిలో నిద్రపోయారా?" అని అడిగారు.
"కూర్చున్నాం అంత వరకూ అదృష్టవంతులమే" అన్నాను.
నాకు వొళ్ళు మండిపోతోంది.
"నిన్నటి సంగతులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చేయాండీ" అని అడిగాను.
"ఎప్పుడూ జ్ఞాపకం వుంటాయి పట్టించుకోను అంతే".
"ఏడిసినట్టుంది" అన్నాను.
"ఏమిటి" అన్నారు.
"మీ వ్యవహారం".
నిజంగానే నా మాటలు పట్టించుకున్నట్టులేరు.
"సరే దిగండి. వచ్చేశాం".
నాకు పరిచయం అయినప్పటి నుండీ అడపాదడపా నేను చూస్తున్న శ్రీశ్రీగారికి, గాయత్రి హోటల్ లో దిగిన శ్రీశ్రీగారికీ వున్న తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది.
అంతవరకూ అన్నిటినీ ఒర్చుకున్న నాకు ఈ రెండు సీసాలు కళ్ళబడేసరికి కళ్ళు చెమ్మగిల్లాయి. 'నిజంగానే చిక్కుల్లోపడ్డాం కాబోలు'ననిపించింది. చిత్తుగాతాగి ఒళ్ళూపై తెలియకుండా ఈయనెలా ప్రవర్తిస్తారోనన్న భయం ఎక్కువైంది.
"దిగండ"ని అంటున్న మాటలు ఎక్కడినుండో వస్తున్నట్టు వినిపించాయి. నేను హోటల్ గేటు దగ్గర చతికిలబడ్డాను. బాయ్ ని చూసి "నీళ్ళు కావాలన్నారు. చల్లటినీళ్ళు రెండు గ్లాసులు గడగడా తాగేశాడు. అమ్మ అయితే మూడు గ్లాసులు తాగింది.
బాయ్ చేతికి పది రూపాయలు ఇచ్చి ఆరు సోడాలు తేమ్మన్నారు. "గదిలో సామానులు పెట్టిన తర్వాత వెళతా"నని బాయ్ తాళాలు సామాన్లు పట్టుకుని మేడ మీదకి వెళ్ళిపోయాడు.
కౌంటర్ దగ్గరికి, వెళ్ళి శ్రీశ్రీ మద్రాసని సంతకం చేశారు. ఒకే రూమ్ మా ముగ్గురికీ ఎలాట్ చేశారు. అయితే డబుల్ రూమ్ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూవుంటే నా గుండె చల్లచల్లగా జారిపోతోంది.
"ఒకే రూమ్ తీసుకున్నారేమిట"ని ఉండలేక అడిగేశాను.
"నేనా తీసుకున్నాను? నువ్వూ వస్తావని కంపెనీ వాళ్ళకి తెలీదుకదా నా కోసం ఒకరూం బుక్ చేశారు. అయితేనేం అది డబుల్ బెడ్ రూమ్ ఒక బెడ్ మీద నేను పడుకుంటాను. రెండో దాని మీద నువ్వు మీ అమ్మ పడుకోండి. మనమే కదా? ఎందుకు వేస్టు ఫరవాలేదన్నారు."
"ఫరవాలేదేమిటి నాయనా' అనుకున్నాను. ముగ్గురం రూమ్ లో ప్రవేశించాం.
ఫస్ట్ ఫ్లోర్ లోనే వీధి కెదురుగా వుంది రూమ్.
దోమ తెరలు, రెండు మచాలు చాలా పెద్దగది. ఓ వైపు పెద్ద టేబుల్, రెండు మంచినీళ్ళ జగ్గులు, నాలుగు గ్లాసులు మరో వైపు డ్రస్సింగ్ టేబుల్, నాలుగు కుర్చీలు, రెండు సీలింగ్ ఫ్యానులు, అటాచ్ డ్ బాత్ రూం గదంతా ముందుగానే శుభ్రంచేసి సిద్దంగా వుంచినట్టున్నారు.
స్టేషన్ కెదురుగా, మెయిన్ రోడ్ లో బజారుకి దగ్గరగా సందడిగా వున్న చోటనే వున్నందుకు కాస్త తృప్తి పడ్డాను. గది వాతావరణం చూసింది. మొదట నాలో పిరికితనం ఆవహించింది.
బాయ్ వచ్చాడు. సోడాలు టేబుల్ మీద పెట్టివెళ్ళిపోయాడు.
శ్రీశ్రీగారు టేబుల్ మీద సిగరెట్ పాకెట్లు అగ్గిపెట్టెలూ పెట్టుకున్నారు. సోపూ, షేవింగ్ సామాన్లు, బ్రష్ వగైరాలున్న ఆయన చిన్న డబ్బా పెట్టెలో నుండి తీసి ఓపెనర్ తీసుకున్నారు.
షరాయి, లాల్చీ ఇప్పేశారు.
ఒక బాటిల్ దాచేశారు.
రెండో బాటిల్ ఓపెన్ చెయ్యటం చూసి మా అమ్మ వీధి వరండాలోకి వెళ్ళి కూర్చుంది.
బెంగతో నాకు నీరసం ఆవహించింది.
ఇవన్నీ మాకు కొత్త! జీవితంలో ఏనాడూ చూసి ఎరగం!
నేను మా అమ్మ దగ్గరికే వెళ్ళి చతికిలబడ్డాను.
'టప్' అని చప్పుడైంది.
* * *
సీసాతో శ్రీశ్రీ
లోపల శ్రీశ్రీగారు సోడా ఓపెన్ చేసిన చప్పుడది.
షరాయి, లాల్చీ ఇప్పేసి పొడుగాటి లాగుమీద వున్నారు.
గ్లాసునిండా డ్రింక్ పోసుకున్నారు. మంచినీళ్ళు తాగేసినట్టు గడగడ తాగేశారు. సిగరెట్ వెలిగించి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.
వింతగా చూస్తున్నాను.
"ఏమిటా చప్పుడు సరోజా?" అంది మా అమ్మ.
దాచి లాభంలేదు అనుకుని "శ్రీశ్రీగారు సోడా ఓపెన్ చేశారమ్మా" అన్నాను. కొంపదీసి ఇప్పుడే తాగడం ప్రారంభించరుకదా?"
"ప్రారంభించడం ఏమిటి? నువ్వు కాఫీ గడగడమని తాగేసినట్టు ఫుల్ గ్లాస్ తాగేశారు" అన్నాను.
"నాకేందారమ్మా! ఒకే గదిలో ఈ తాగుబోతు మనిషితో మనం ఎలాగుంటామే...ఇదెక్కడి బాధొచ్చిందే.....నన్నిలా బతకనివ్వకండే......ఛస్తేకానీ నా ప్రాణానికి సుఖం లేదు.....బతికుండగానే తినేస్తున్నారు.....అంటూ ప్ర్రారంభించింది.
"తొందరపడి మాటలనెయ్యకమ్మా! ఏం జరుగుతుందో, ఏం చేస్తారో చూద్దాం. మద్రాసు నుండి మైసూరు వచ్చేశాంకదా అన్నీ అనుకూలంగా జరిగితే సంతోషం. లేదా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోదాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో - జీవితంలో ముందుకి రావాలనుకుంటే రండికీ, మొండికీ ఓర్చాలి. ఇంకా అడుగుపెట్టి అరగంటయినా కాలేదు. 'ఏందార'ని ప్ర్రారంభించావు. ఉన్న దారుల్లో ఈదారి కావాలనే కదా ఎన్నుకొని వచ్చాను.
ధైర్యం అవసరం అమ్మా! నేనంత సుళువుగా ఎవరికీ లొంగను. లొంగదీసుకోలేరు కూడా. నీలాగే నేనూ అయోమయస్థితిలో వున్నాను. నీకేం ఫర్వాలేదు. నిన్ను నాన్నగారి దగ్గరికి సురక్షితంగా చేరుస్తాను. నే నేమైపోతానోనన్న బెంగపడకు" అని ధైర్యం చెప్పాను. అమ్మ సర్దుకుంది. వీధి వరండాలోనే కూర్చుంది.
