Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 12


    కిరణ్ తెప్పరిల్లాడు. ఈ క్షణంనుంచీ నేను నాటకం ఆడాలి కదూ అనుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో "ఒక్కొక్కసారి నీ ధైర్యం చూస్తూంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నీ ముందు మహాప్రవాహంలొ కొట్టుకుపోతున్న గడ్డిపోచలా నాకు నాకే అనిపిస్తుంది." అంటూ కామినిని మృదువుగా ముద్దుపెట్టుకుని వదిలేశాడు.
    కామిని తనలో తాను నవ్వుకుంది.
    "నీవు చెప్పినదానికి నేను ఒప్పుకున్నాను. శవాన్ని ఎలా మాయంచేయాలో చెప్పు."
    కిరణ్ ఆతృతగా అడగడం గమనించింది కామిని.
    "ముందు నీ ఆలోచన ఏమిటో చెప్పు. నువ్వు ఎలా మాయం చేద్దామనుకున్నావూ?"
    కిరణ్ తన ఆలోచన చెప్పాడు.
    అది విని కామిని పక పక నవ్వింది.
    "ప్రేమ కథలోలాగా ఆలోచించావు కిరణ్, మారువేషాలు, యాసిడ్ పోసి మొహాన్ని కాల్చటం, పెట్టెలో శవాన్ని దాయటం, ఇవన్నీ కధల్లో జరుగుతాయి. ఇలాంటి పధకాలే బెడిసికొట్టేది." అంది కామిని.
    "అయితే నీ పధకాన్ని చెప్పు."
    "పధకం చెప్పేముందు ఒక్కమాట, ఒక్కమాట కాదు మాట ఇవ్వాలి."
    "ఇస్తాను అదేమిటో చెప్పు."
    "నువ్వు మాటలతో కాదు అన్నీ చేతలతో చూపించాలి. కొద్దిసేపట్లో మనం బయటకు వెళ్ళాలి. ఒక ఫోటో గ్రాఫర్ ని వెంటబెట్టుకుని, నీవు నీ ఇద్దరు ఫ్రెండ్స్ తో, నేనొక ఇద్దరు ఫ్రెండ్స్ తో ఏదో ఒక చిన్న దేవునిగుడికి వెళదాం. అక్కడ దండలతోను, నీవు నా మెళ్ళో మంగళ సూత్రం కట్టేటప్పటి ఫోటోలు, ఫ్రెండ్స్ సమక్షంలోను, దైవసమక్షంలోను పెళ్ళి జరిగినప్పుడు తీయించాలి. ఆ సాక్ష్యాధారాలు నాకు ముందు కావాలి."
    "నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాకదా! నిన్ను ఈ క్షణం నుంచి భార్యగా స్వీకరిస్తాను అని చెప్పాను కదా! అయితే నామీద నమ్మకం లేదన్నమాట."
    "నీమీద నమ్మకంలేక కాదు. ఇది నా జాగ్రత్త కోసం."
    "ఈ క్షణంనుంచే నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావ్ నన్ను. ముందేది చెబితే అది చేయటానికి సిద్దంగా వున్నాను." నిండామునిగిన వాడికి చలేమిటి అన్న తీరులో కిరణ్ ఒప్పుకున్నాడు.
    "డెడ్ బాడీని ఎదురుగా పెట్టుకుని మనం పెళ్ళిమాటలు మాట్లాడుకోవటం తమాషాగా లేదు."
    "నాకు తమాషాగాలేదు. ఊబిలో చిక్కుకున్నవాడు తమాషామాటలు, పరాచికాలు ఆడలేడు. వాడికుండేది ప్రాణభయం. ప్రస్తుతం నేను ఆ పరిస్థితులలో వున్నాను కామిని. ఇక నా సహనాన్ని పరీక్షించనక్కరలేదు. నన్ను అనుమానించక్కరలేదు. నువ్వు ఎలా చెబితే అలా." కిరణ్ దృఢంగా అన్నాడు. కానీ అదే క్షణంలో లోలోపల కామిని గురించి నీ చావు నా చేతిలో వుంది, జాగ్రత్తగా వుండు సుమా అనుకున్నాడు.
    "మనం పెళ్ళిచేసుకొని మీ ఫాదర్ కి ఎక్కడినించైనా ఫోన్ చెయ్. రెండే రెండు మాటలు. "డాడీ, నేను ఈరోజు మారేజ్ చేసుకున్నాను. రేపు నా భార్యతో ఇంటికి వస్తున్నాను. కోడలికి ఘనస్వాగతం ఇవ్వాలి. ఎల్లుండి ఈవెనింగ్ తెలిసినవాళ్ళందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలి. ఆ ప్రయత్నంలో వుండండి. అని చెప్పి ఫోన్ పెట్టెయ్యాలి. సరేనా!" అంది కామిని.
    "ఓ.కె. ప్రొసీడ్."
    "వెంటనే హోటల్ కు వచ్చి నడుం బిగించి రంగంలో దిగి. ఈ డెడ్ బాడీని, హుష్ కాకి." తమాషాగా అంది కామిని.
    "నేనొకటి అడుగుతాను నీకు అభ్యంతరం లేదుగా నీకు యిష్టమయితేనే చెప్పు." అన్నాడు కిరణ్.
    "నిరభ్యంతరంగా చెబుతాను."
    "మళ్ళీ అనుమానిస్తే!"
    "ఇంక అనుమానించే ప్రసక్తిలేదు. నేపెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు. భార్య మాటకు భర్త విలువిచ్చినట్లే భర్త మాటకు నేను విలువిస్తాను. తొందరగా అడుగు." కామిని నవ్వుతూ అంది.
    "డెడ్ బాడీని మాయంచేసే నీ పధకం ఏమిటా అని...నీకభ్యంతరం లేకపోతేనే సుమా!...... నీ పథకంలో కూడా తప్పులు వుండచ్చు కదా! అందుకని" కిరణ్ నసుగుతున్నట్టు అడిగాడు.
    ఆ అడిగే తీరులో కామినీకి కోపం వస్తుందేమో అన్న భయం అతని ముఖ కవళికలో తెలిసిపోతోంది.
    "నా పధకంలో లొసుగులు అనే మాటకు తానేలేదు. నేనొక పనిచేస్తే నరమానవుడికి తెలిసే ప్రసక్తి లేదు. అయినా అడిగింది భర్త కాబట్టి చెబుతున్నాను.
    కిరణ్ మొహం వికసించింది.
    కామినీ చెప్పటం మొదలుపెట్టింది తన ప్లాన్ గురించి.
    
                                8
    
    రాత్రి, పదకొండూ పది.
    ఇరువురూ సోఫాలో ఆనుకుని కూర్చుని చిన్నగా మాట్లాడుకుంటున్నారు.
    "మనం ఇంకా రెండుగంటలపైన ఆగాలి కదూ!" కిరణ్ అడిగాడు.
    "కొన్ని పనులు చేయటానికి మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చోకూడదు. కానీ మరికొన్ని పనులు చేయటానికి మాత్రం సమయంకోసం వేచిచూడాల్సిందే. తప్పదు. మనం ఇంకా రెండు గంటలు వేచి వుండాలి.
    "రెండు గంటలా! అమ్మో" భారంగా నిట్టూర్చాడు కిరణ్.
    "ఇరువురు కొద్దిసేపు ఎవరి ఆలోచనలో వారు మిగిలి పోయారు.
    కిరణ్, కామినీదేవి చెప్పినట్లు అక్షరాలా చేశాడు. గుళ్ళో కామినీని పెళ్ళి చేసుకున్నాడు. కామిని ప్రక్కనుండగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.
    "జోక్ చేస్తున్నావా కిరణ్?" కిరణ్ తండ్రి అడిగాడు జోక్ కాదు డాడీ. నా వైఫ్ ప్రక్కనే ఇక్కడే వుంది. కావాలంటే మాట్లాడిస్తాను అన్నాడు కిరణ్.
    జోక్ కాదన్నమాట."
    "ముమ్మాటికీ జోక్ కాదు."
    "ఇప్పుడు నువ్వు ఎక్కడినుండి ఫోన్ చేస్తున్నావు."
    "ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి."
    "దాంతోనైనాసరే, నువ్వైనాసరే తక్షణం ఇంటికి వచ్చేయ్."
    తండ్రికి చాలా కోపం వచ్చినట్టు మాటలబట్టి గ్రహించాడు కిరణ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS