Previous Page Next Page 
అష్టపది పేజి 12


    
    అదృష్టదేవత ఒక్కసారే తలుపు తడుతుంది. కాస్త బద్దకించి అప్పుడు తలుపు తీయకపోతే ఎప్పటికీ ఆ అదృష్ట దేవత మళ్ళీ తిరిగి రాదు. తలుపు తట్టదు. ఈ సత్యం ఎవరూ కాదనలేరు. తనకి బాగా తెలుసు. వచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు.
    
    తను కోరినంత కట్నం మారుమాట్లాడకుండా గోవర్ధనరావు ఇవ్వటానికి ఒప్పుకున్నాడూ అంటే ఏదో పెద్ద కారణం వుండే వుంటుంది. ఫలానా కారణం అని తనకి తెలియకపోయిన అదేదో ప్రేమకి సంబంధించినది అని గ్రహించగలిగాడు. ఆ మూడు ముళ్ళు పడితే ఆ తర్వాత నయన్ చూసుకుంటాడు శీతల్ కొంకులు విరగ్గొట్టడం.
    
    అలా అనుకున్నాడు తను. ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. గోవర్ధనరావుతో చేయి కలిపాడు. శీతల్ ఏదో పాడు పని చేయటమో, ప్రేమ వ్యవహారం నడపటమో చేసి వుంటుంది అనుకున్నాడు గాని, ఇలా హత్యా నేరంలో...
    
    ఆ...ఇప్పుడు అర్ధమైంది. ఈ హత్యానేరంలో శీతల్ రాణి వుంది. ఈ విషయం గోవర్ధనరావుకి తెలుసు. కూతురుకి అర్జెంట్ గా పెళ్ళిచేసి దేశంగాని దేశం పంపించాలని పెద్ద ప్లాను వేశాడు తనకి డబ్బు అవసరం. దాంతో తను దూరం ఆలోచించకుండా వెంటనే తక్కువ వ్యవధిలో ఈ పెళ్ళి చేయటానికి తను కూడా సై అన్నాడు.
    
    శీతల్ రాణి హంతకురాలు.
    
    ఈ విషయం మరి కొద్ది గంటలలో...
    
    "సురేంద్రనాథ్ జీ!"
    
    తనని పిలవటం విని త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు సురేంద్రనాథ్. అంతవరకు ఆలోచిస్తూనే వున్నాడు.
    
    సి.బి.ఐ. అధికారి, ఆయన సహచరుడు, ఆమె రూమ్ లోకి ఎప్పుడు వచ్చారో తెలియదు. సురేంద్రనాథ్ ఎదురుగా నిలబడి వున్నారు.
    
    "మీరు అక్కడనుంచి అప్పుడే వచ్చేశారా?" సురేంద్రనాథ్ సోఫాలో సర్దుకుని సరిగ్గా కూర్చుంటూ అడిగాడు.
    
    "ఆ..." సి.బి.ఐ. అధికారి సోఫాలో కూర్చుంటూ అన్నాడు.
    
    "శీతల్ హంతకురాలో కాదో తేలిందా?" సురేంద్రనాద్ కాస్త ముందుకు వంగి ఆతృతగా అడిగాడు.
    
    "ఇష్. మీరలా పైకి మాట్లాడకూడదు. ఇది కోర్టు కాదు, పోలీసు స్టేషను కాదు, పెళ్ళివారిల్లు."
    
    "సారీ, మనసంతా ఆ విషయం మీదనే లగ్నమై వుండడంతో నోరు జారాను."    

 

    "అది సహజమే లెండి. మేమంటే ఇలాంటి విషయాలలో ట్రైనింగ్ పొంది వుంటాము కాబట్టి ఎంతో జాగ్రత్త వహిస్తాము" ఈ దఫా ఆమె అంది.
    
    "అమ్మాయిని చూసి మాట్లాడారా?" సురేంద్రనాథ్ స్వరం తగ్గించి అడిగాడు.
    
    "ఆ..." అన్నాడు సి.బి.ఐ అధికారి.
    
    "ఎక్కువ మాట్లాడింది నేనే" ఆమె చెప్పింది.
    
    "నిజం తెలిసిపోయిందా?"
    
    "ఉహూ"
    
    "అదేమిటి మాట్లాడానన్నారు కదా!" సురేంద్ర నాథ్ అసహనంగా అడిగాడు.
    
    "నేను అమ్మాయి ప్రక్కనే కూర్చున్నాను. అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ మాటలు మొదలు పెట్టాను. మంచినీళ్ళు తెమ్మని అవతలికి పంపాను నౌకరుని. ఐనా రెండిబ్బందులు ఎదురయ్యాయి."
    
    "ఏమిటని?"
    
    "అమ్మాయికి చూపుడు వేలుకి, మధ్యవేలికి గోరుకిందగా మా లెక్కన బ్రౌన్ కలర్ పుట్టుమచ్చలు రెండు వుండాలి. రెండు వేళ్ళకి సరిగ్గా పక్క పక్కల ఒకేసైజు, ఒకే రకం పుట్టుమచ్చలు వుండడం చాలా అరుదు. శీతల్ చేతిమీద చూద్డామంటే..."  

 

    "కుదరలేదా? అమ్మాయి చెయ్యి మీ చేతిలోనే వుంది కదా?" ఆమె చెబుతున్న మాటలకి అడ్డు వచ్చి సురేంద్రనాథ్ అడిగాడు.
    
    "పెళ్ళికూతురుకదా, చేతులనిండా మెహంది తీర్చి దిద్దారు. పుట్టుమచ్చలు కాదుకదా చేతులమీద గీతలు కూడా కనపడటం లేదు. ఏదో ఒక వంకపెట్టి ఇంకా దీక్షగా చూద్దా మనుకుంటే నౌకరుతో పాటు గోవర్ధనరావు వచ్చాడు. అది తాగుతారా ఇది తాగుతారా అని ఒకటే మర్యాద. ఎంతకీ వదలడు, చంపేశాడు. మా దగ్గరనుంచి కదలడు. చివరకు లేచి వచ్చేశాము. మాతోపాటు విడిది దాకా ఆయన వచ్చాడు. ముందు పుట్టుమచ్చల క్లూ చిన్నదో పొన్నదో దొరికినట్లయితే మరి కాస్త ముందు వెళ్ళటానికి వీలయేది" ఆమె నిట్టూరుస్తూ చెప్పింది.
    
    "అమ్మాయిని ఏదో మాటల్లో పెట్టి వేళ్ళకి పుట్టు మచ్చలు వుండాలే, అని అడగాల్సింది" బోలెడు నిరాశ పడిపోతూ అన్నాడు సురేంద్రనాథ్.
    
    సి.బి.ఐ. అధికారి నవ్వాడు. "అలా అడిగితే దొరికేవాడా! నిన్ను పట్టుకోటానికి మేము వచ్చాము. జాగ్రత్త పడు అని ముందుగా హెచ్చరించినట్లు ఔతుంది. నేరాలను పట్టుకోటానికి మేమెన్నో ముందు జాగ్రత్తలు తీసుకుంటాము. నేరస్తులు తమ నేరం బైట పడుతుందేమో క్షణం క్షణం జాగ్రత్త పడుతుంటారు. అందులో మా డిపార్టుమెంటుకన్నా జాగ్రత్తలు తీసుకునే విషయం నేరస్తులే ఓ అడుగు ముందుకేసి వుంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS