క్లూ
వసుంధర
సీతమ్మ, రాజమ్మ నోట్ బుక్స్ పట్టుకుని సిద్దంగా వున్నారు.
"చెప్పండి !" అన్నాడు వెంకన్న.
'చెప్పడానికి ఏమీ లేదు. మోహన్ నిరపరాధి -- అంతే అన్నాడు సూర్యారావు.
వెంకన్న నవ్వి "మోహన్ పైన నాకేమీ పగ లేదు. అసలతడేవరో కూడా నాకు తెలియదు . నా క్లయింట్ కాళీ ప్రసాద్ హత్య నేరంలో యిరుక్కున్నాడు. అందువల్ల ఆ హత్య కేసును పరిశోధించాల్సి వచ్చింది. పరిశోధనలో మోహన్ హంతకుడని తేలింది. అందుకు బలమైన సాక్ష్య ధారాలున్నాయి " అన్నాడు.
"సాక్ష్యాధారాలు మనకి నిజాన్ని చూపించే సాధనాలు. కానీ వాటికవి నిజాలు కావు" అన్నాడు సూర్యారావు.
"పోనీ నిజాలేమిటో మీరు చెబుతారా?" అన్నాడు వెంకన్న.
'చెప్పను " అన్నాడు సూర్యారావు.
వెంకన్న నవ్వి "మీరు వచ్చిన పనేమిటో నాకు తెలియలేదు" అన్నాడు.
సూర్యారావు గొంతు సవరించుకున్నాడు. "విశాల అనబడే యువతి హత్య చేయబడింది. కాళీ ప్రసాద్ హంతకుడిగా అనుమానించబడ్డాడు. అతడు మీ సాయం కోరాడు. మీరతడు నిర్దోషి అని నిరూపించడమే కాక మోహన్ అనబడే అతడిని హంతకుడిగా నిరూపించబోతున్నారు. మోహన్ ని హంతకుడిగా నిరూపించకపోయినా కాళీప్రసాద్ నిర్దోషిగా బయటపడే స్థాయికి వచ్చింది కేసు.
మోహన్ విషయంలో మీరు సంపాదించిన సాక్ష్యాధారాలు పోలీసులకు చేరకూడదు. ఫలితంగా నేను మీకు లక్ష రూపాయలిస్తాను. అయితే డబ్బు తీసుకుని హంతకులను వదిపెట్టరు మీరు. కానీ మోహన్ హంతకుడు కాదు. అతడి దురదృష్టం కొద్దీ హంతకుడిగా అనుమానించబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే జాలి తలచమంటూన్నాను--"
"డిటెక్టివ్ వెంకన్న జాలి హంతకుల పై ఉండదని తెలుసు గదా ."
"తెలుసు కానీ మోహన్ హంతకుడు కాదు."
"అవునని నేనంటున్నాను ."
"ఆ విధంగా ఓ నిర్దోషిని ఉరికంబ మెక్కిస్తున్నారు. నిర్దోషి అయితే అతడిని ఉరికంబ మేక్కించిన పాపం మీకే కానీ నాకు చెందదు" అన్నాడు వెంకన్న.
"మీరు సంపాదించిన సాక్ష్యాధారాల పైన మీ కంత నమ్మకం కూడదు వెంకన్న గారూ !" అన్నాడు సూర్యారావు.
"నేను నీటిలో జాడలు తీయగలను. నేను తీసిన జాడలను నేను నమ్ముతాను. చిన్న క్లూ ఆధారంగా పెద్ద విషయాన్నీ పట్టగలను. అది నా గొప్పతనం కాదు. భగవంతుడిచ్చిన శక్తి" అన్నాడు వెంకన్న.
'అయితే అసలు హంతకుడెవరో మీకు చిన్న క్లూ యిస్తాను. అ ఆధారంగా ఆ హంతకుడి పేరు, వివరాలు తెలుసుకుని నాకు చెప్పండి. అప్పుడు మీకు లక్ష రూపాయలు ముడుతుంది. ఎటొచ్చీ ఇద్దరు హంతకుల్నీ మీరు కరుణించాలి. అదీ నా కోరిక !"
"అసలు హంతకుడు బయటపడితే హంతకులిద్దరెందుకవుతారు? హంతకుడొక్కడే! అతణ్ణి బయటపెట్టాలా కూడదా అన్నదీ నా అబీష్టం --"
"నా ఉద్దేశ మది కాదు, ఇద్దరి సాక్ష్యాధారాల గురించీ మీరు బయట పెట్టకూడదు...."
"మీరేదో క్లూ గురించి అన్నారు" అన్నాడు వెంకన్న .అవును, ఆ క్లూ మీకు పరీక్ష లాంటిది, హంతకుడు నాకు తెలుసు. నేనిచ్చే క్లూ లో అతడిని మీరు గుర్తించగలిగితే -- మీరు నీటిలో జాడలు తీయగలరని నేను నమ్ముతాను. మీరతడిని గుర్తించలేకపోతె మోహన్ గురించి సాక్ష్యాధారాలను రహస్యంగా వుంచాలి. మీకు ముట్టవలసిన లక్ష ఎలాగూ ముడుతుంది" అన్నాడు సూర్యారావు. మీరిచ్చే క్లూ లో మోసముండకూడదు" అన్నాడు వెంకన్న.
మోసముండదు ....అబద్దముండదు ...." అన్నాడు సూర్యారావు.
"చెప్పండి " అన్నాడు వెంకన్న.
"విశాలను నిజంగా హత్య చేసినవాడు ఒక పర్యాయం మీరో సందర్భంలో మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాడు " అన్నాడు సూర్యారావు.
"ఇది క్లూ అనిపించుకోదు" అన్నాడు వెంకన్న.
"పూర్తిగా వినండి" అన్నాడు సూర్యారావు . "సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం సెప్టెంబరు 17 వ తేదీన ఆ హంతకుడు మీ ఆఫీసుకు వచ్చి మీతో మాట్లాడి వెళ్ళాడు. ఏం మాట్లాడాడో నాకు తెలియదు . కానీ జరిగిందది."
"ఎలా తెలిసింది మీకు ?" అన్నాడు వెంకన్న.
"ఎలా తెలుసునని అడక్కండి. తెలిసింది మాత్రం నిజం ...."
వెంకన్న ఆలోచనలో పడ్డాడు.
"ఇది క్లూ అంటారా, కాదంటారా ?" అన్నాడు సూర్యారావు.
"ఇది క్లూ అనడంలో సందేహం లేదు. కానీ ఒకోసారి క్లూ కంటే -- ఆ క్లూ ఎలా వచ్చిందో అన్న విషయం పరిశోధనకు బాగా ఉపకరిస్తుంది ."
"అది మామూలు విషయంలో ...కానీ నీటిలో జాడలు తీసే మీవంటి వారి విషయంలో కాదు...."
"డిటెక్టివ్ లెవరైనా నీటిలో జాడలు తీయగలిగినప్పుడే ఎవరైనా డిటెక్టివ్ వృత్తిని చేపట్టాలి" అన్నాడు వెంకన్న.
"సరే -- అయితే నీటిలో జాడలు తీయండి. వస్తాను " అంటూ లేచాడు సూర్యారావు.
"మీరొక డిటెక్టివ్ ను సవాలు చేసి వెడుతున్నాడు.అందువల్ల మీకే ప్రమాదం వాటిల్లినా నేను చేయగలిగిన దేమీ వుండదు" అన్నాడు వెంకన్న.
2
సూర్యారావు వెళ్ళిపోయాక వెంకన్న అతడు త్రాగు మంచినీళ్ళ గ్లాసును లోపలకు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వచ్చాడు. రాజమ్మతో "ఈ గ్లాసు నెంబరు నాలుగే కదా అన్నాడు. ఆమె తల వూపింది.
డిటెక్టివ్ వెంకన్న ఇంట్లో ఒక ఏర్పాటుంది. అతడింటికి కొత్త వారేవరోచ్చినా ఆటోమేటిక్ కెమెరా ఫోటోలు తీయడానికి, గొంతు రికార్డు చేయడానికీ, వేలి ముద్రలు తీసుకునేందుకు ఏర్పాట్లున్నాయి. ఇదంతా సమాచారంగా సేకరించాక ఆ వ్యక్తీ ఫోటో, వేలి ముద్రలు --మీ పుస్తకంలో జత పర్చడం జరుగుతుంది.
ఆవిధంగా సూర్యారావు ఆరోజు వెంకన్న రికార్డులలో కెక్కాడు.
గ్లాసు నుంచి వేలిముద్రలు తీసుకొనడం అయినాక వెంకన్న ఉత్సాహంగా పాత డైరీలు తీశాడు. సెప్టెంబరు 17 వ తేదీ -- సూర్యారావు చెప్పిన రోజు -- తన యింటికి యనమండగురు వచ్చారు. అందరూ పురుషులే!
వెంకన్న వివరాల కోసం చూశాడు. అందులో ముగ్గురు స్నేహ భావంతో వచ్చినవాడు. అతడికి బాగా తెలిసినవారు.
ఇంక అయిదుగురున్నారు. ఆ అయిదుగురు యేవో కేసుల గురించి వచ్చినవారే! వెంకన్న వాళ్ళ ఫోటోల కోసం చూశాడు. తన వద్ద నున్న విశాల కేసులోని అనుమానితుల జాబితా చూశాడు. అందులోని ఏ ఒక్కరూ ఈ అయిదు ఫొటోలలోనూ సరిపోలడం లేదు.
వెంకన్న అయిదు ఫోతోలోనూ చూస్తూ తల కొట్టుకుంటున్నాడు.
విశాల హత్యకూ ఆ అయిదుగురిలో ఒక్కరికీ ఏదో సంభంధముంది?
ఏమిటది ?
వెంకన్న ఆ అయిదుగురినీ కలుసుకుని మాట్లాడాలను కున్నాడు. అడ్రసుల కోసం చూశాడు.
అందులో ముగ్గురే ఆ వూళ్ళో వుంటున్నారు. మిగతా యిద్దరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు.
ముగ్గురిలో ఇద్దరు వెంకన్న కు సులభంగా దొరికారు. వాళ్ళతో మాట్లాడ్డం వల్ల వెంకన్న కు పనికి వచ్చే సమాచారమేమీ లభించలేదు. మూడో వ్యక్తీ మాత్రం ఆ అడ్రసులో దొరకలేదు.
వెంకన్న చుట్టుపక్కల వాకబు చేశాడు. ఒక్కొక్కరే తెలియదంటున్నారు. ఆఖరికి ఓ పనిమనిషి "ఆ సదానందం బాబుగారా -- అయన ఈ వీధిలో ఎవరితోటి మాట్లాడే వాడు కాదు. పక్క వీధి ముకుందరావు బాబుతో రోజూ సాయంత్రం గంటల తరబడి కబుర్లు చెప్పేవారు" అంది.
వెంకన్న ముకుందరావును కలుసుకున్నాడు.
'అతడు రోజూ నా వద్దకు వచ్చేవాడు. రెండేళ్ళ క్రితం కాబోలు మెయిన్ రోడ్లో ఓ ఫ్యాన్సీ షాపు ఓపెన్ చేశారు. పేరు ఆనంద్ ఫ్యాన్సీ స్టోర్స్. ఒపెనింగు కి నన్ను పిలిచాడు. మళ్ళీ మేము కలుసుకోలేదు."
"అతడింకా ఆ ప్యాన్సీ స్టోర్స్ నడుపుతున్నాడా? అన్నాడు వెంకన్న.
'అతడు నడుపుతున్నాడో లేదో తెలియదు --కానీ ఫ్యాన్సీ స్టోర్స్ మాత్రం ఇంకా వుంది --" అన్నాడు ముకుందరావు.
వెంకన్న ఫ్యాన్సీ స్టోర్స్ కి వెళ్ళాడు. అందులో కూర్చున్న వ్యక్తితో -- "సదానందంగారు లేరా?" అన్నాడతడు.
"నేనే సదానందాన్ని " అన్నాడతడు.
వెంకన్న చిరాగ్గా అతడి వంక చూసి -- "నేనడిగేది ఈ షాపు పోప్రయిటర్ సదానందం గురించి -- అన్నాడు.
"నేనే సదానందాన్ని " అన్నాడతడు.
వెంకన్న చప్పున తన జేబులోని ఫోటో ఒకటి అతడికి చూపించి -- "మరి ఇతడేవరు?" అనడిగాడు.
ఆ వ్యక్తీ ఫోటో చూసి కంగారు పడ్డాడు -- "మీరెవరు ?" అన్నాడు.
"ముందు నువ్వెవరో చెప్పు" అన్నాడు వెంకన్న.
"నా పేరు సదానందం ."
"నీపేరు సదానందం కావచ్చు. కానీ ఈషాపు ప్రొప్రయిటర్ నువ్వు కాదు. ఆ విషయం ఋజువు చేయగలను..." అన్నాడు వెంకన్న.
