మధ్యాహ్నానికి ప్రసాదరావు ఇంటికి వచ్చాడు. జరిగినదంతా విని-"అమ్మబాబోయ్-మనమింక ఈ ఇంట్లో వుండవద్దు-" అన్నాడు ప్రసాదరావు. అతడా మాటలు పూర్తిచేసేలోగా ఇన్ స్పెక్టర్ బాబూరావు భద్రమ్మతో సహా అక్కడ ప్రవేశించాడు. భద్రమ్మను చూస్తూనే విమల చాలా ఆశ్చర్యపడింది. చంద్రమ్మకూ ఈమెకూ వున్న పోలికలు చాలా స్వల్పం.
బాబూరావు నెమ్మదిగా కథ చెప్పాడు.
భద్రమ్మ రెండు సంవత్సరాల క్రితం సినీ ఫీల్డు వదిలి పెట్టింది. సంతోషరావనే ఓ ఘరానా దొంగ ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. సుమారు ఆర్నెల్ల క్రితం సంతోషరావు ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు. అతడి ఆధ్వర్యంలో కట్టబడినదే ఈ యిల్లు.
ప్రత్యేకంగా భూ గృహం ఏర్పాట్లతో ఆ యింటిని కట్టించాడతడు. ఆ యింట్లో భూ గృహం వున్న సంగతి సంతోషరావుకూ, భూ గృహాన్ని నిర్మించిన మేస్త్రీకీ తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ మేస్త్రీని సంతోషరావు చంపేశాడు. భూ గృహం పక్కగా వుంటుంది. అక్కన్నించి ఇంట్లోని అన్ని గదులకూ కనెక్షన్సున్నాయి. భూ గృహంలో మెయిన్ ఆపి ఇంట్లోని దీపాలు ఆర్పవచ్చును. ఇంట్లోని ప్రతి దీపాన్నీ భూ గృహం నుంచి కంట్రోల్ చేయవచ్చును.
ఆ భూ గృహాన్ని నేరస్థులను దాచడానికి, వ్యభిచారం సాగించడానికీ ఉపయోగించి డబ్బు గడించాలని సంతోషరావు పథకం వేశాడు. కానీ అతడి దురదృష్టం కొద్దీ హత్యానేరంమీద దొరికిపోయాడు. ఇంటిని నమ్మకస్థుడైన తన స్నేహితుడికి అప్పగిస్తే అతడది యాభైవేలకు ప్రసాదరావుకు అమ్మేశాడు. సంతోషరావును మోసం చేశాడు.
ఈలోగా కొద్దిరోజుల క్రితం సంతోషరావు జైలు నుంచి పారిపోయి భద్రమ్మను చేరాడు. జరిగింది తెలుసుకుని పోగొట్టుకున్న ఇంటిని మళ్ళీ సంపాదించుకుని భూగృహంలో తనకు రక్షణ కల్పించుకోవాలనుకున్నాడు. భూ గృహంలో అతడికెన్నో సదుపాయాలున్నాయి. అందులో వుండగా అతణ్ణి పట్టుకోవడం ఎవరితరమూ కాదు.
భార్యాభర్తలు ఆలోచించి పథకం వేశారు. భద్రమ్మ భూ గృహంలో ప్రవేశించింది. దెయ్యం రూపంలో విమలను భయపెట్టాలనుకుంది. అర్ధ రాత్రివేళ ఆమెను చూడగానే విమల మూర్చపోవాలి. కానీ విమల ధైర్యవంతురాలు. అందుకని మోహినీ పిశాచి నాటకమాడింది. ఏ ఆడదీ తన భర్తను మరో ఆడదానికి అప్పగించాలని అనుకోదు. ఇల్లు వదిలిపెట్టడం మంచిదని భద్రమ్మ పరోక్షంగా చాలా పర్యాయాలు సూచించింది.
అయితే విమల పరిశోధన మొదలుపెట్టింది. ఆఖరికి భద్రమ్మ విమలను దెయ్యంగా భయపెట్టింది. తర్వాత అసలు రూపంలో వచ్చి ఇల్లు కొంటానన్నది. రమేష్ ఆమెను గుర్తుపట్టి బాబూరావుకు అప్పగించాడు. బాబూరావామెను గురించి సంతోషరావు ఉనికి తెలుసుకుని పట్టి పోలీసులకు అప్పగించాడు. భద్రమ్మను కస్టడీ తీసుకుని ఆమె కథ అంతా తెలుసుకున్నాడు.....
భద్రమ్మ సాయంతో ఆ యింట్లోని భూ గృహాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. దానికి ప్రవేశ ద్వారం మంచంకింద వున్నది. తాళం భద్రమ్మ వద్ద వున్నది. మనుషులకు మత్తు తెప్పించే వాయుపదార్ధాన్ని తను భూ గృహం నుంచి, బయట నుంచి ఎలా పంపు చేసినదీ, స్విచ్ వేయకుండానే దీపాలనెలా అదుపు చేసినదీ భద్రమ్మ వివరించి చెప్పింది.
"సంతోషరావుగానీ, భద్రమ్మగానీ పోలీసులకు దొరికి వుండేవారు కాదు. వారు దొరకడానికి విమల ధైర్యం ఒక కారణం. చిన్న నటీనటులను కూడా గుర్తించగల సినిమా పరిజ్ఞానం రమేష్ కుండడం రెండవకారణం. చంద్రమ్మను యాదృచ్చికంగా విమల తెరమీద చూడడమూ-ఆ చంద్రమ్మ పుట్టు పూర్వోత్తరాలూ, అసలు రూప విశేషాలూ రమేష్ ఎరిగి వుండడమూ- భద్రమ్మను మాకు పట్టిచ్చాయి. తనను రమేష్ భద్రమ్మగా గుర్తించగలడని తెలిస్తే ఆమె అసలు రూపంలో మీ యింటికే వచ్చేది కాదు...." అన్నాడు బాబూరావు.
భద్రమ్మ తల వంచుకుంది. నటిగా తనకింత గుర్తింపు వున్నదని ఆమె ఆనందిస్తున్నదో, లేక ప్రసాదరావు వుండగానే తను విమలను బెదిరించి వున్నట్లయితే వ్యవహారం ఇంతవరకూ వచ్చి వుండేది కాదన్న నిజాన్ని తఃల్చుకుని బాధపడుతున్నదో....
ఏది ఏమైనా నేరస్థులకోసం భగవంతుడు తను చేయవలసిన ఏర్పాట్లు చేసే వుంచుతాడు....
భద్రమ్మతోపాటు భూ గృహ తాళాలు కూడా తీసుకుని-రమేష్ కీ, విమలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుని ఇన్ స్పెక్టర్ బాబూరావు
వెళ్ళిపోయాడు.
-:అయిపోయింది:-
