Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 11


    అయినా-అంత కచ్చితంగా టైము యెలా చెప్పగలిగింది శారద?
    కొంపతీసి ఆమె మనసు నిజంగా తనను అంటిపెట్టుకుని ఉన్నదా?
    రఘు భయం భయంగా తన శరీరం వంక చూసుకున్నాడు.
    శారద నిజంగానే తనను మనసారా ప్రేమించింది. తనూ ఆమెను ప్రేమించాడు. శారద తండ్రికీ వివాహం ఇష్టంలేదు. యెందుకంటే ఆయనకు తన గురించి తెలుసు. తనకు స్త్రీలోలత్వం ఉంది. తన మోజులోపడ్డ శారద ఎవరేం చెప్పినా నమ్మలేదు. తనామెను భార్యగా ప్రేమించి ఆదరించినా స్త్రీలోలత్వాన్ని వదల్లేకపోతున్నాడు. ఆ దుర్గుణాన్నామె సహించలేదు.
    యేమిటి చేయడం?    
    ఒకవేళ పరిమళే శారదకు ఈ విషయం చెప్పిందేమో? అవును-లేకపోతే ఇంకెవరు చెబుతారు?
    కానీ పరిమళకు విషయం చెప్పడంవల్ల లాభమేమిటి?
    రఘుకు కారణం తోచలేదు. అతడు పరిమళనే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు.
    బల్లమీద మీట నొక్కాడు అతను. మరుక్షణంలో పరిమళ అతడిముందు ఉంది.
    తొడలవరకూ మాత్రమే ఉన్న స్కర్టు-ఆమె విశాల హృదయాలను బహిర్గతపరచే డిజైన్ లో వుంది. తీర్చి దిద్దినట్లున్న ఆమె శరీరపు వంపులు స్పష్టంగా తెలియడం కోసం-ఇంచుమించు చర్మాన్నంటి పోయేటంత బిగుతైన డ్రస్సు ధరించిందామె.
    రఘు పరిమళనేదో అడగాలనుకున్నాడు. ఆమె నవ్వింది.
    నవ్వుతున్న పరిమళ అతడికి పక్కనే వుంది.
    ఆమె నిలబడివుంది.
    రఘు ఆమెనేదో అడగాలనుకున్నాడు. కానీ తనూ లేచినిలబడ్డాడు.
    ఇద్దరి పెదవులూ కలిశాయి. రఘుచేతులు ఆమె వెనుక బిగుసుకుంటున్నాయి.
    సరిగ్గా అప్పుడే టెలిఫోన్ మ్రోగింది.
    రఘు తీయలేదు. పరిష్వంగ సుఖంలో మరేపనీ చేయలేకున్నాడతను.
    ఫోన్ అలా ఆగకుండా మ్రోగుతూనే వుంది.
    ఆఖరికి అతను ఫోన్ యెత్తి-"హలో!" అన్నాడు.
    "నేను-శారదను!" అంది అవతలి కంఠం.
    రఘు తడబడ్డాడు-"శారదా, నువ్వా-యెందుకు....యేమిటయింది?"
    "యేమీ కాలేదు. ముద్దు...." అంది శారద.
    "అంటే?"
    "నిన్న మూడూఇరవైకి చేసిన పని ఈ రోజు పదీ యాభైకి చేశారు-" అంది శారద.
    అతని చేతిలోని ఫోన్ జారిపోయింది.
    "మై గాడ్-ఇదెలా సాధ్యం-" అనుకున్నాడతను.
    పరిమళ జారిపడిన ఫోన్ అందుకని జాగ్రత్తగా క్రెడిల్ చేసి అక్కడే నిలబడింది!
    "పరిమళా-నువ్వు వెళ్ళవచ్చు-" అన్నాడు రఘు అతడి మనసు ఏదోలాగైపోయింది.
    నిజంగానే శారద మనసు తనను వెన్నంటి ఉందా?
    పరిమళ వెళ్ళిపోయింది. సరిగ్గా పదీయాభైకి తను పరిమళను ముద్దు పెట్టుకుంటానని తనకే తెలియదు. అలాంటప్పుడీ విషయం మరొకరిద్వారా శారదకు చేరుతుందనుకోవడం అసంభవం.
    మరి శారదకు ఎలా తెలిసింది?
    ఆఫీసులో ఎవరైనా తనను రహస్యంగా కనిపెడుతున్నారా? ఏది యేమైనా-క్షణాల మీద ఆమెకెలా తెలిసిపోతోంది?
    తనిలా పరిమళను ముద్దు పెట్టుకోవటమేమిటి?-ఫోన్ మ్రోగింది!
    తనింక శారదను దబాయించి ప్రయోజనంలేదు. ప్రవర్తన మార్చుకోవాలి.

                                       3

    ఒక వారంరోజులు రఘు బాగానే వున్నాడు. అతడు పరిమళవైపు చూడనుకూడా చూడలేదు. పరిమళ అతడిలోని మార్పు కనిపెడుతోంది.
    "బాస్-మీరేదోలాగున్నారు-" అందామె.
    "నేను బాగానే ఉన్నాను-" అన్నాడు రఘు.
    "లేదు-మీ ఆరోగ్యంలో ఏదో లోపం కనపడుతోంది-" అంది పరిమళ.
    రఘు ఆమెవైపు చూడకుండా-"పరిమళా-మనల్నెవరో రహస్యంగా గమనిస్తున్నారు. నువ్వెళ్ళి నీ పని చూసుకో-" అన్నాడు.
    "మననెవరో గమనించడమా? అసాధ్యం...." అంది పరిమళ.
    "అలా అనుకోవడానికి వీల్లేదు" అన్నాడు రఘు.
    "మీరు నీడను చూసి బెదురుతున్నారేమో" అంది పరిమళ.
    అది నిజమే. భర్తకు భార్యనీడ! తను భార్య అనే నీడను చూసి బెదురుతున్నాడు. కానీ అందుక్కారణం లేదా? తను తన నీడను మోసగించడం లేదా?
    "నువ్వు వెళ్ళు-" అన్నాడు రఘు.
    పరిమళ కదల్లేదు-"మీరు నన్ను అనుమానిస్తున్నారు" అంది.
    అతను ఆమెవంక అదోలా చూసి-"అవును నీడను కూడా అనుమానించాల్సిన పరిస్థితి యేర్పడింది నాకు" అన్నాడు.
    "మీరేం చేయమంటే అది చేస్తాను. నన్ననుమానించవద్దు ప్లీజ్!" అంది పరిమళ.
    "ఆల్ రైట్-అయితే పద-బైటకు వెళదాం-" అన్నాడు రఘు.
    రఘు, పరిమళ బైటకు బయల్దేరారు.
    ఆ కంపెనీలో ఉద్యోగులందరికీ రఘును చూస్తే అసూయ. అతడిది యెంతో సుఖ జీవితం. అతడు తమందరికీ అధికారి!
    స్కూటర్ మీద రఘు, పరిమళ ఒక హోటల్ కు వెళ్ళారు. రఘు అందులో ఒక గది కంపెనీ పేరున బుక్ చేశాడు. ఇద్దరూ గదిలోకి వెళ్ళారు.
    "రూమ్ చాలా బాగుంది. రోజంతా ఇక్కడే గడుపుధామా!" అంది పరిమళ.
    "రూమ్ నాకు నచ్చలేదు. నీకు నచ్చింది కాబట్టి రోజంతా నువ్వు ఇక్కడే గడుపు. మళ్ళీ నేను వచ్చి తాళం తీసేవరకూ ఏ అల్లరీ చేయకు-" అంటూ అతను గదితలుపు తాళంవేసుకుని వెళ్ళిపోయాడు.
    తర్వాత అతను మహావిష్ణు హోటల్ కి వెళ్ళాడు. అక్కడ అండర్ గ్రౌండ్ బ్రోతల్ హౌస్ రాత్రి పగలు పనిచేస్తూంటుంది. రఘు ఓ అమ్మాయిని కుదుర్చుకుని ఓ గంటసేపు గడిపి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. శారద ఏజెంట్లెవరో తెలుసుకోవాలని అతడికి చాలా కుతూహలంగా వున్నది.
    తలుపు తీస్తూనే శారద వెక్కి వెక్కి ఏడ్చింది. అంత క్రితం కూడా ఆమె ఏడ్చిందనడానికి సూచనగా ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి వున్నాయి.
    "యేమయింది శారదా!" అన్నాడతను.
    "కట్టుకున్న భర్త నాకు పూర్తిగా అన్యాయం చేశాడు...." అంది శారద.
    "యేం జరిగిందిప్పుడు?"
    "పెళ్ళాముండగా మీరు పరాయి ఆడదాన్ని మరిగారు. ఇప్పుడు....." అంటూ ఆమె టైముతో సహా వివరించి అతనేం చేశాడో చెప్పింది.
    రఘు తెల్లబోయి-"ఇలా నీకెవరు చెప్పారు?" అన్నాడు.
    "నా మనసు...."
    "నేను నమ్మను యెవరో నీకు నామీద విషం నూరిపోస్తున్నారు. వాళ్ళెవరో తెలిస్తే పీకపిసికి చంపేస్తాను" అన్నాడు రఘు.
    "అయితే నన్ను చంపేయండి-" అంది శారద.
    "శారదా!" అన్నాడు రఘు.
    "భార్య వుండగా భర్త పరాయి స్త్రీలవెంట తిరుగుతున్నాడంటే అది ఆడదానికి ఎన్నివిధాల అవమానమో ఆలోచించారా?" అంది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS