4
ఒక్కత్తిని ఇంట్లో కూర్చుని నా జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాను.
తండ్రెవరో నాకు తెలీదు. చిన్నతనం నుండీ అమ్మువన్ను కంటికి రెప్పలా సాకింది. నన్ను కార్లలో తిప్పి మేడల్లో తిరిగేలా చెయ్యకపోయినా ప్రపంచంలో ప్రేమకు మించిన ధనం ఏమీ లేదని నాకు తోచేలా మసిలింది.
అమ్మ చరిత్ర నాకు తెలియదు. ఆమె ఎన్నడు పుణ్య స్త్రే లాగే చేతికి గాజులూ, ముఖానికి బొట్టూ వుంచుకునేది. ఎప్పుడైనా నేను నాన్నను గురించి ప్రశ్నిస్తే ఏమీ చెప్పేది కాదు. అమ్మకు ఇష్టం లేని ప్రశ్న అది అని నాకు తెలిశాక మరి నేనా ప్రశ్న వేయలేదు.
మొదట్లో అమ్మ కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే ఉంటుంది. కానీ నాకు ఊహ తెలిసేసరికి అమ్మకు చుట్టూ పక్కల గౌరవ స్థానం వుందని నాకు అర్ధమైంది.
అమ్మ చదువు కున్నది. తెలివైనది. పోరుషం గలది, అభిమానం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. మనిషి నిప్పు లాంటిది -- "వగైరా మాటలు అమ్మ గురించి ఇతరుల చెప్పుకోగా విన్నాను.
అమ్మ ఈఊరు వచ్చిన కొత్తల్లో తన ఒంటి మీద బంగారాన్న మ్మి ఇప్పుడు నేనుంటున్న ఈ ఇల్లు కొన్నదట. జీవనోపాధి కి మొదట్లో ట్యూషన్లు ప్రారంభించి నోటి మంచితనంతో ఎందరిదో ఆకట్టుకుని చివరకు ఒక కమిటీ స్కూల్లో టీచరు గా వుద్యోగం సంపాదించుకోగలిగింది.
నన్ను చిన్నతనం నుంచి అటు గారాబమూ, ఇటు క్రమశిక్షణా రెంటినీ మేళవించి పెంచింది. ఎన్నో సార్లు అమ్మ నాతొ -- "నిన్నొక ఇంటిదాన్ని చెయ్యడమే నా జీవితాశయం ." అంటుండేది.
కానీ నేను ఎదుగుతున్న కొద్దీ అమ్మలో క్రమంగా మార్పు వస్తోందని నేను గమనించాను. నాకు పది సంవత్సరాల వయసప్పుడు -- 'అమ్మా నాకు కారేక్కలని వుందే--" అన్నాను.
దానికి జవాబుగా అమ్మ కళ్ళలో నీళ్ళు చూశాను. సాధారణంగా నేను పెద్ద కోరికలు కోరినప్పుడు అమ్మ వివరంగా ప్రపంచ పరిస్థితి , మా ఇంటి పరిస్థితి చెప్పేది కానీ ఇలా కళ్ళ నీళ్ళతో ఊరుకోవడం అరుదు.
బహుశా నా పన్నెండవ ఏట అనుకుంటాను -- నేను క్లాసులో వుపన్యాసం పోటీలో మొదటి బహుమతి పొందినందుకు ఇంటికి వచ్చేక అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకొని అమ్మ కాళ్ళకు దణ్ణం పెట్టాను.
అమ్మ కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ -- "మీ అమ్మ నీకు చేయగలిగిన దంతా చేయడం లేదు తల్లీ!" అంటూ నన్ను దగ్గరగా తీసుకుంది. అమ్మ మాటలు నా కర్ధం కాలేదు.
గత రెండు సంవత్సరాలుగా అమ్మ ప్రవర్తనలో విపరీతమైన ధోరణీ పెరుగుతూ వచ్చింది.
ఒక పర్యాయం కన్న బిడ్డ కోసం నీకులా శ్రమపడే తల్లి ఉండదంటూ నేను అమ్మను మెచ్చుకోగా అమ్మ ముఖం వివర్ణమయింది.
తను కేవలం స్వార్ధపరురాలనీ కన్న బిడ్డ సుఖం కంటే తన స్వార్ధానికే ప్రాముఖ్య మిస్తున్న మనిషి ననీ అమ్మ అంది.
ఆ క్షణంలో నాకు అమ్మ మీద చాలా కోపం వచ్చి ఇలా మాట్లాడితే నేను నిన్ను వదిలి ఎక్కడికైనా పొతానంతే"అన్నాను.
అమ్మ నవ్వి "ఎక్కడి కైనా పోయే రోజులు దగ్గర పడుతున్నాయిలే" అని ప్రేమగా నా తల నిమిరింది.
మరోసారి ఒక సందర్భంలో "నేను చేసిన తప్పు నీకు తెలిస్తే బహుశా ఎన్నటికీ నన్ను క్షమించలేవనుకుంటాను" అంది అమ్మ.
నాకేదో అనుమానం రాగా "నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు. నీ మాటల నాకర్ధం కావడం లేదు" అన్నాను.
నా కళ్ళలోని అనుమానం , భయం , అమ్మకు సరిగ్గానే అర్ధమయాయనుకుంటాను.
"చూడు పాపా ఒక అమూల్యమైన నిధి వుందనుకో, మన ఇంటి పెరట్లో ఉందనుకో . ఆ నిధి ఎక్కడ ఉన్నదో నాకు తెలుసుననుకో, అయినా నేను ఆ నిధిని వెలికి తీయడానికి ప్రయత్నించక , నీకు నిధి ఆచూకీ తెలుసుకునే అవకాశమివ్వక ఒక స్వార్ధ బుద్దితో అలా కాలం గడిపేస్తున్నావనుకో, అది నీ దృష్టిలో తప్పవునా, కాదా?' అంది అమ్మ.
"ఈసారి నీమాటలు ఇంకా విచిత్రంగా వున్నాయి. ఏదైనా నిధి ఆచూకీ నీకు నిజంగా తెలిసి ఉంటె మనకీ కర్మ ఏమిటి? ఆనిది ఆచూకీ తెలపక పోవడానికీ , నీ స్వార్ధానికి ఎంత ఆలోచించినా నాకు సంబంధం కనబడలేదు.
అమ్మ అదోలా నవ్వి "మన పెరట్లోనే వున్న నిధిని నువ్వు కళ్ళారా చూసినపుడు బహుశా ఈ అమ్మను ఎన్నటికీ క్షమించలేవను కుంటాను."అంది.
నేను అత్రుతనూ, ఆవేశాన్ని కంఠం లో వ్యక్త పరుస్తూ "మన పెరట్లోనే నిధి ఉందా? ఇది నిజమా? అది ఎక్కడ? అన్నాను.
అమ్మ తాపీగా ఇలా అంది. "చెప్పానుగా నేను స్వార్ధ పరురాలినని. మన పెరట్లో నిధి వుంది. దాని ఆచూకీ ఇప్పుడు నేను నీకు చెప్పను. ఈ విషయంలో ఇంకేం మాట్లాడకు."
నేను స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాక అమ్మకు జబ్బు చేసింది. ఏదో సామాన్యమైన రోగమే అని ముందు అనుకున్నా అది క్రమేపీ ముడురుతూ వచ్చి మొత్తం మీద అమ్మను మంచాన పడేసింది. డాక్టర్లు కనీసం ఆరు నెలలైనా అమ్మ మంచం దిగకుండా పూర్తీ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
అమ్మ జబ్బు పడ్డ రెండు నెలలకు నా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను ప్యాసయ్యాను. అమ్మ సంతోషించింది. నన్నింకా చదివించాలని తను అనుకున్నట్లు చెప్పింది.
స్కూలు తెరిచినా అమ్మ వుద్యోగంలో జాయిన్ కాలేదు. తన పరిస్థితి స్కూలు హెడ్ మాస్టరుకు విపులీకరించి చెప్పింది. అమ్మ అనారోగ్యం సంగతి విని చూడ్డానికి వచ్చిన అనేక మందిలో స్కూలు హెడ్ మాష్టారు వొకరు.
అమ్మ పరిస్థితి నర్దం చేసుకున్న హెడ్ మాష్టారు గారు ఆమెకు సానుభూతి వాక్యాలతో ధైర్యం చెప్పడమే కాక నా భవిష్యత్తు గురించి కూడా కొన్ని సలహాలిచ్చారు. అయన సలహా ప్రకారం ఆ ఊళ్ళో నే దొరికే పక్షంలో నన్నుద్యోగంలో ప్రవేశ పెట్టడానికి అమ్మ అంగీకరించింది.
సరిగ్గా అయిదు వారాలకు ఊళ్ళో ని ఒక చిన్న కంపెనీలో నాకొక చిన్న గుమస్తా ఉద్యోగం దొరికింది. హెడ్ మేష్టారు గారు నాకా ఉద్యోగం రావడానికి చాలావరకు సహకరించారు.
ఉద్యోగం రావడం వల్ల అమ్మ పనులు చూసి పెట్టడానికి ఓ మనిషిని కూడా నేను కుదర్చ గలిగాను. నేను ఇంట్లో లేని సమయంలో అమ్మను జాగ్రతగా చూడడం ఆమె బాధ్యత. అయితే ఆ మనిషి ఉపయోగం నాకు నెలరోజులు మాత్రమే కనబడింది.
అమ్మ జబ్బు ముదిరి ఆమెను జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యవలసి వచ్చింది. జనరల్ హాస్పిటల్ లో అమ్మ సరిగ్గా పన్నెండు రోజులు గడిపింది.
పదమూడో రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నాకు ఆఫీసుకు ఫోన్ వచ్చింది. అమ్మ పరిస్థితి ప్రమాదకరంగా వుందని, నేను చూడ్డానికి వెళ్ళేసరికి మరి నాకిక అమ్మ లేదు.
చనిపోయే ముందు నాగురించే అదేపనిగా అమ్మ కలవరించినట్లు హాస్పిటల్ నర్స్ నాతో చెప్పింది.
అమ్మ ఈలోకంలో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది.
5
ఎవరో తలుపు తట్టారు. వెళ్ళి తలుపు తీసి ఆశ్చర్యం "అరే మీరా?" అన్నాను.
ఆమె నవ్వింది "మీ అడ్రసు నా దగ్గర ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు నేను అనుకోకుండా మీ ఇంటికి ఏ అడ్రసు సహాయమూ లేకుండా వచ్చాను." అంది.
'అంటే?' అన్నాను అర్ధం కాక.
"నేను ఇళ్ళ కోసం వెతుకుతున్నాను. ఈ ఇంట్లో గది కాళీ ఉందని ఈ వీధి చివర ఒకావిడ చెబితే వచ్చాను. మిమ్మలి కలిశాను. ఇదేనన్న మాట మీ ఇల్లు అందామె.
ఆమెను లోపలి కావ్వానించాను. నేను మా ఇంట్లో ఒక గది ఎవరైనా ఆడపిల్లకు అద్దె కివ్వాలని అనుకున్నాను. ఈ విషయం మా వీధిలోని చాలా మందికి చెప్పాను.
సుజాత స్నేహితురాలి పేరు శోభ. ఆమె కూడా ఈ మహానగరంలో ఒకమూల నాకు లాగే ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇల్లంతా కలియతిరిగి చూసింది. ఆమెకు నచ్చింది. వెళ్ళి పోబోయే ముందు "మళ్ళీ వసంత పేరుతొ వున్న సుజాత రూపానికి చేరువౌతునన్నమాట" అంది శోభ.
మరుసటి నెల ఒకటవ తేదీన శోభ నా ఇంటికి అద్దెకు ప్రవేశించింది.
శోభ రాక నాకు మంచి కాలక్షేపాన్ని తద్వారా మనశ్శాంతి ని ప్రసాదించింది. ఒక వారం రోజులు గడిచేక శోభ నాతొ "ఇంత మంచి పెరడుంది ఇలా వదిలేయడం బాగాలేదు. ఏమైనా మొక్కలు వేద్దాం" అంది.
ఈ అయిడియా నాకు వచ్చింది. ఆరోజు సాయంత్రమే ఇద్దరం కలిసి ఒకసారి పెరడంతా కలియతిరిగి ఒక పధకం వేసుకున్నాం. శోభ అంటుంది సపోటా, మామిడీ, కొబ్బరి లాంటి పెద్ద వాటిని ఒకటి రెండు దొడ్లో పాతాలని.
నా అబిప్రాయంలో చిన్న పూల మొక్కలూ, ఏమైనా కూరల మొక్కలూ వేయాలని, కాస్సేపు చర్చ అనంతరం ఒక కొబ్బరి మొక్క, ఒక మామిడి మొక్క వేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అయితే అవి ఎక్కడ పాతాలీ అన్నది ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శోభ ప్రత్యేకంగా దొడ్డిని పరిశీలించింది.
"పెరట్లో కాస్త పెద్ద మొక్కలు వేసేముందు చాదస్తమంటూ తీసిపారేయక కొన్ని శాస్త్ర నియమాలు పాటించితే బాగుంటుంది. ఈ విషయంలో నాకాట్టే తెలియదు ఎవరైనా పెద్దలను సంప్రదించండి మంచిది." అంది శోభ.
"ఏ నియామాలూ పాటించకుండా మనకి తోచిన చోట పాతేస్తే ఏమవుతుంది?" అనడిగాను.
"నాకు తెలీదు, కాని అరిష్టమని అంటారు." అంది శోభ.
"నా జీవితంలో ఇంకా అరిష్టాలు లేముంటాయిలే." అన్నాను నిస్పృహగా.
"అలాగనకు. నీ ముందింకా నూరేళ్ళ జీవితముంది!"
"కనీసం మరి పాతికేళ్ళు అయినా బ్రతుకుతానని మా అమ్మ చనిపోయే ముందు క్షణం వరకు అనుకుంటుండేది , నేను నూరేళ్ళ ఇంకా జీవించవలసి వుందని నువ్వంటుంటే నాకీ సంగతి గుర్తుకొస్తుంది. నేను మరో నెల తిరక్కుండా చనిపోయాననుకో , నువ్వాశ్చర్యం పడతావా?" అనడిగాను.
శోభ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది.
