"అంటే?"
"రాత్రి నిద్రలో ఆమె కిషోర్ గురించి కలవరిస్తుంది...."
"ఆ కిషోర్ మీరేనేమో!"
"నేనేలాగౌతాను. ఈ జన్మ కెలాగూ ఒకటి కాలేక పోయాం. వచ్చే జన్మలో నైనా ఒకటవుదాం కిషోర్.....అంటూ కలవరిస్తుందామె...."అన్నాడు సూర్యారావు దిగులుగా.
"మీ ఆవిడికి సినిమాల పిచ్చి వుందా?' అడిగాడు వెంకన్న.
"పిచ్చి లేదు కానీ సినిమాలు చూస్తుంది..." అన్నాడుసూర్యారావు.
"మీకు తెలియదు. నేటి సమాజం పై సినిమాల ప్రభావం చాలా వుంది. చాలామంది కలలు సినిమాల వల్ల ప్రభావితమైనవే! మీ ఆవిడ కూడా ఏ సినిమాలో సీక్వెన్స్ అయినా కలగంటుంటే మీరింకో విధంగా భావిస్తున్నారేమో! ఆమె కలలో హీరో మీరే అయి ఉంటారు....' అన్నాడు వెంకన్న.
"హీరోని నేనే అయితే సూర్యారావు పేరు తల్చుకోక ఆ కిషోర్ పేరు తల్చు'కోవడమెందుకు?"
"అది ఆమె మీకు పెట్టుకున్న పేరు...."
"అసలామే నాకు వేరే పేరెందుకు పెట్టాలి?' పెట్టినా కిషోర్ అనే ఎందుకు పెట్టాలి?"
"పేరెందుకు పెట్టాలి అంటే చెప్పవచ్చును కానీ - కిషోర్ అనే ఎందుకు పెట్టాలంటే చెప్పడం కష్టం. ఎందుకంటె ఏ పేరు పెట్టినా ఆ పేరు గురించి అదే సందేహం కలుగుతుంది...."
"కానీ నాకలాంటి సందేహాలేమీ లేవు. కిషోర్ అన్న పేరు ఆమె నాకెందుకు పెట్టిందో -- నాకు తెలుసు౧"
"ఆమె కిషోర్ అనే వాణ్ని ప్రేమించిందంటారు అంతేగా!"
"అనడానికి తిరుగులేదు. సాక్ష్యమున్నప్పుడు అనడానికేం?" అన్నాడు సూర్యారావు.
"ఏమిటా తిరుగులేని సాక్ష్యం ?" వెటకారంగా అన్నాడు వెంకన్న.
"ఆమె స్వహస్తాలతో రాసుకునే డైరీ!"
ఆశ్చర్యంతో వెంకన్న కు నోట మాట రాలేదు. సూర్యారావు చెప్పే విషయాలు విని నోట్సు ప్రిపేరు చేస్తున్న రాజమ్మ, సీతమ్మ ల కలాలు కూడా ఒక్క క్షణం స్తంభించి పోయాయి.
5
డిటెక్టివ్ వెంకన్న కుర్చీలో వెనక్కు జారగిలబడి సూర్యారావు కధకు మనసులో మెరుగులు దిద్దు కుంటున్నాడు.
సూర్యారావు ఆనామకుడు. అప్రయోజకుడు. అతణ్ణి జానకి కోరి వివాహమాడింది. నలుగురిలో అతణ్ణి ప్రయోజకుడిగా తీర్చి దిద్దడానికి ప్రయత్నిస్తోంది. భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ సమాజంలో అతడికి స్థానం లభించేలా కృషి చేస్తోంది. కానీ ఆమె మనసులో కిషోర్ అనే మనిషి వున్నాడు. అతడు పొడగరి, అందగాడు. ప్రయోజకుడు. సర్వ సమర్ధుడు. ఏ కారణం వల్లనో జానకి అతణ్ణి వివాహం చేసుకోలేక పోయింది. అయినా అతణ్ణి మరిచి పోలేక పోతోంది. అమమకారం తో భర్తకు కిషోర్ అని పేరు పెట్టుకుంది. అతడిలో కిషోర్ ను ఊహించుకుంటూ బ్రతుకుతోంది. అయితే భర్త పట్ల ఆమెకు అసంతృప్తి వుంది. అందుకే మానసికంగా ఆమె కిషోర్ తోనే వుంది. ఆమె కల్లోకి కిషోర్ మాత్రమే వస్తున్నాడు.
ఈ విషయాలన్నీ ఆమె డైరీలో రాసుకుంది. అది తిరుగులేని సాక్ష్యం.
ఏ భర్తయినా సహించలేని దారుణం ఇది. కానీ సూర్యారావు మంచివాడు. ఇది సహించి ఆమెను క్షమించాలను కుంటున్నాడు. కానీ ఎలా? ఆమె అతడి కౌగిలి లో కరిగిపోతూ -- "ఓహ్ , కిషోర్!" అంటుంది. అతడి రక్తం మరిగిదంటే మరగదూ!
ఇప్పటికీ సూర్యారావు ఆమెను చంపాలనుకోవడం లేదు. చంపుతానేమోనని భయపడుతున్నాడు. తనీ ఆవేశం నుంచి బైట పడే మార్గం చూపించమని వెంకన్న ను వేడుకుంటున్నాడు.'
సూర్యారావు కోరిక ఏమిటంటే, ఆ కిషోర్ ఎవరో తెలుసుకోవాలి. అతడికీ, జనకికీ మధ్య ఏమైనా కధ నడిచిందేమో కనిపెట్టాలి. ఆ కిషోర్ ఇప్పుడెం చేస్తున్నాడో ఆచూకీ తీసి అతడికీ ఇంకా జానకి పై మోజుందేమో తెలుసుకోవాలి. ఈ వివరాలన్నీ సూర్యారావు కి కావాలి.
జానకి కిషోర్ ని ప్రేమించిందనడంలో సందేహం లేదు. అది మామూలు ప్రేమ కాదు -ఆరాధన! అయితే ఆమె డైరీలో ఆరాధన తప్ప గత స్మృతులు లేవు. గతించిన మధురానుభూతుల్ని మళ్ళీ మళ్ళీ తల్చుకోవడం లేదు. సూర్యారావు ఇప్పుడు ఆమెకు అటువంటి అనుభూతులు కూడా ఉన్నాయేమోనని తెలుసుకోగోరుతున్నాడు.
ఒకప్పుడామే కిషోర్ ని ప్రేమించి ఉండవచ్చు. మనసోకరితో- మను వొకరితో -- లాంటి సంఘటనలు మన దేశంలో కోకొల్లలు. కానీ సూర్యారావు పట్టింపు తనువు గురించి. ఆమె శారీరకంగా కలుషితమైనదా లేదా అన్నది అతడి నిప్పుడు వేధిస్తున్న సమస్య! ఆమె శారీరకంగా కలుషితం కాని పక్షంలో సూర్యారావు తన ఆవేశన్నణుచుకుందుకు ప్రయత్నిస్తాడు.
వెంకన్న కు సూర్యారావు ను చూస్తె జాలివేసింది. పెళ్ళికి ముందు భార్య చేడిందన్న విషయంలో అతడికి సందేహం లేదు. అయితే జానకిని చంపడం అతనికిష్టం లేదు. తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం అతను చేస్తున్న అనేక ప్రయత్నాల్లో తన వద్దకు రావడం ఒకటి!
కోపం వస్తే వరుసగా అంకెలు లెక్క పట్టమని పెద్దలు చెబుతారు. సూర్యారావు తన వద్దకు వచ్చాడు. తన పరిశోధనకు కొంతకాలం పడుతుంది. ఈలోగా అతడి ఆవేశం అదుపులోకి రావోచ్చును.
తన పరిశోధనలో కిషోర్ కూ, జానకి కీ శారీరక సంబంధం ఉందని బైటపడితే సూర్యారావు ఏం చేస్తాడు?" జానకిని చంపెస్తాడా?"
చంపడు. ఆ విషయం ఆమెకు చెప్పి ఆమె రహస్యం తనకు తెలిసిపోయిందని గర్వపడి ఆమె పై తన ఆధిక్యత ఋజువు చేసుకుంటాడు. ఇంతకాలం అతడామె అదుపులో ఉంటూ వచ్చాడు. ఆమె తనకు భర్త అనీ, తనామే భార్య అని అతను చెప్పనే చెప్పాడు. బహుశా తనూ ఆమెకు భర్తలా జీవించాలని అతడి అంతరాంతరాల్లో ఉంది. అందుకోసం ఆమె బలహీనతలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. పెళ్ళికి ముందు పర పురుషుడితో శారీరక సంబంధం ఉన్నదంటే -- ఆడదానికి అంతకన్న బలహీనత ఏమున్నది? భర్త కా విషయం తెలిస్తే ఆమె అతడికి దాసోహం అవదూ?
వెంకన్న తన మనసులోని ఆలోచనలన్నీ అసిస్టెంట్స్ తో చర్చించాడు. సీతమ్మ, రాజమ్మ ఇద్దరూ నోట్సు ప్రిపేరు చేశారు. వెంకన్న ఇద్దర్నీ చదవమన్నాడు. రెండింట్లోనూ ఒకే విశేషాలున్నాయి.
"అయితే ఇప్పుడు నేనేం చేయాలి?" అన్నాడు వెంకన్న.
"మనం సూర్యారావు అత్తగారి ఊరు చేరాలి!" అంది సీతమ్మ.
"సూర్యారావు ఎంతగా భార్య చెప్పు చేతల్లో వున్నా -- అతన్ని మరీ అంత తీసి పారేయనవసరం లేదు. అత్తగారితో తప్ప మాట్లాడనంత అసమర్ధుడు కాడతను. అందుకని సూర్యారావు మామగారి ఊరని అందాం--"అన్నాడు వెంకన్న.
"భార్య చెప్పు చేతల్లో వుండే మగవాళ్ళను మీరెలాగూ సమర్దిస్తారని నాకు తెలుసు --" అంది రాజమ్మ నవ్వుతూ.
ఆమె మాటల్లోని ధ్వని వెంకన్న కు అర్ధమయేలోగా "అన్నట్లు నా ప్రయాణం విషయం శ్రీమతికి చెప్పి రావాలి--" అనేసి నాలిక్కరుచుకున్నాడు.
"మేము మీ కూడా వస్తున్నామని చెప్పారంటే మీ శ్రీమతి గారు కూడా వస్తానంటారు. ఆలోచించుకోండి మరీ వివరాలు చెప్పండి--" అంది సీతమ్మ నవ్వుతూ.
"మీరు నాకూడా వస్తున్నారని ఎవరన్నారు? నేను పద్మావతి మాత్రమే ఊరేడుతున్నాం!" అన్నాడు వెంకన్న.
"ఆహా -- క్లయింట్ కు తగ్గ డిటెక్టివ్!" అంది రాజమ్మ.
6
ఆ ఊళ్ళో డిటెక్టివ్ వెంకన్న రకరకాలుగా వాకబు చేశాడు. కిషోర్ ప్రసక్తి ఎక్కడా రాలేదు. జానకి ఇంట్లో కిషోర్ అన్న పేరు గల వారెవ్వరూ లేరు. ఆమె బంధువుల్లో కూడా కిషోర్ అన్న పేరు గల వారు లేరు. వెంకన్న ఎంతో తెలివిగా జానకి తలిదండ్రుల్ని , అన్న తమ్ముల్ని , దగ్గర బంధువుల్ని ప్రశ్నలు వేసి కిషోర్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు.
అయితే ఎవడా కిషోర్?
ఒకరోజంతా భార్యతో చర్చించాడు వెంకన్న. దాన్ని బట్టి అతడనుకున్నదేమిటంటే జానకి చాలా తెలివైనది . ఆమెకు కిషోర్ తో వ్యవహారం నడిచినట్లు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. కన్నేతనపు తొలిరోజుల్లో అతడంటే మోజుపడి తన్ను తనే అతడికి అపించుకుని ఉంటుంది. ఏకారణం వల్లనో ఆమెకు అతడు అందలేదు.
అలాంటి కిషోర్ ఎవరై ఉంటాడు?"
జానకి స్నేహితురాండ్రయితే ఈ విషయంలో ఏమైనా చెప్పగలుగుతారు . ఎందుకంటె తలిదండ్రులకు తెలియకుండా ఆమె పర పురుషుడితో ఏర్పరచుకున్న సంబంధం -- తప్పక మరో ఆడపిల్ల మద్దతు తో ఏర్పడి ఉండాలి. ఆ ఆడపిల్ల ఇంట్లో మనిషై వుండదు.
జానకికి ఆ ఊళ్ళో నలుగురు ముఖ్యమైన స్నేహితురాండ్రున్నారు. వాళ్ళలో ఒకామెకు మాత్రం వివాహమైంది. మిగతా ముగ్గురు ఇంకా ఊళ్ళో నే వున్నారు.
