Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 11

   
    "స్వామీ ! నాకు జీవితం ఎంతో హాయిగా గడిచి పోతోంది. నాకే కోరికలూ లేవు. సంతృప్తిని మించిన సంపద లేదని మీరే చెప్పారు." అన్నాడు కన్నయ్య.
    తన ఉపదేశాలు ఉళ్ళో వాళ్ళ కంటే కన్నయ్య బాగా అర్ధమైనట్లు సాధువుకు తోచింది ---" నీ కోరికలు లేకపోతే పోయాయిలే! ఒకోసారి మనకుండే కోరికలు మనకు తెలియవు. ఆ కోరికలు కలల రూపంలో కనబడతాయి. నీకు నిద్రలో వచ్చిన నుంచి కలలుంటే చెప్పు. వాటిని నిజం చేస్తాను "
    కన్నయ్య తెల్ల ముఖం పెట్టి , "కలల గురించి నేను విన్నాను. ఎందరో తనకు వచ్చిన కలల గురించి నాకు చెప్పారు. నాకు మాత్రం ఎప్పుడూ కలలు రావు' అన్నాడు.
    "కలలు కనని మనిషి ఉండడు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు !" అన్నాడు సాధువు.
    కన్నయ్య చాలాసేపు ఆలోచించాడు. వాడెప్పుడూ నిద్రకు పడినా వెంటనే మొద్దు నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రలో ఏమైనా కలరోస్తాయేమో!కానీ లేచే సరికి వాడికేమీ గుర్తుండదు .
    అదే వాడు సాధువుకు చెప్పాడు.
    కష్టపడి బ్రతికే కన్నయ్యకు మంచి నిద్ర పట్టడమూ సహజమే! తృప్తిగా జీవిస్తున్న కన్నయ్యకు కలలు రాకపోయినా ఆశ్చర్యం లేదు.
    సాధువు ఆప్యాయంగా కన్నయ్య వీపు నిమిరి "ఈ రోజు నుంచీ నీకు కలలు వస్తాయి. వచ్చిన ప్రతి కలా నిజమవుతుంది. దైవానుగ్రహం నా చేత ఇలా పలికిస్తోంది " అన్నాడు.
    కన్నయ్య వెంటనే సాధువు కాళ్ళ మీద పడి, "అడక్కుండా వరమిచ్చారు. ఈ వరం నాలోని సంతృప్తిని పోగొట్ట కుండా మరో వరం కూడా ఇవ్వండి " అన్నాడు.
    సాధువు నవ్వి - " మంచి వాళ్ళనీ, తెలివైనవాళ్ళనీ ఏ వరాలు పాడూ చెయ్యవు. పైగా వాటివల్ల ప్రజోపయోగం కూడా !" అన్నాడు.
        
                                     3

    సాధువు గ్రామం నుంచి వెళ్ళిపోయిన నాటి రాత్రి కన్నయ్యకు ఓ కల వచ్చింది. కలలో వాడికి ఓ బిచ్చగాడు ఎదురయ్యాడు. వాడు కన్నయ్యను ఆప్యాయంగా పలకరించి, తన భిక్షా పాత్రను కన్నయ్యకు ఇచ్చేసి ----"నేను హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుందామనుకుంటూన్నాను. నా భిక్షా పాత్ర అందుకునే యోగ్యుడి కోసం వెతుకుతున్నాను. ఇది పట్టుకుని ఒకే ఒక్క రోజు ఊరంతా బిచ్చ మెత్తు. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు.
    ఆ భిక్షా పాత్రను అందుకున్నాక కన్నయ్యకు మెలకువ వచ్చేసింది.
    నిద్రలేచాక కూడా కన్నయ్యకు ఆ కల గుర్తుండి పోయింది. తనకు కల రావడమే ఒక విచిత్రమైన అనుభవంగా వుంది వాడికి. అప్పుడే వాడికి సాధువు మాటలు గుర్తుకు వచ్చాయి.
    ఆ రోజు నుంచీ తనకు కలలు వస్తాయనీ వచ్చిన ప్రతి కల నిజమవుతుందని సాధువు చెప్పాడు. సాధువు చెప్పినట్లే తనకు కల వచ్చింది. కల నిజమవుతుందా ?
    కన్నయ్యకు రవంత అసంతృప్తి కూడా కలిగింది. కల నిజమైతే మాత్రం అందువల్ల ప్రయోజన మేమిటి? తను అన్ని పనులూ మాని భిక్షా పాత్ర చేత పుచ్చుకుని ఊరంతా తిరగాలి. అలా తానెప్పుడూ చేయలేదు. చేయలేడు కూడా. ఇదేం కల ? ఈ కల నిజమైతే కష్టపడి పనిచేసేవాడు బిచ్చగాడుగా మారిపోతాడు.
    మన మనసులో ఏ మూలనో దాగివున్న కోరిక కలల రూపంలో వస్తాయని సాధువు చెప్పాడు. తన మనసులో బిచ్చ మెత్తుకుని బ్రతకాలన్న కోరిక ఉందా ?
    దిగులుతో, భయంతో కన్నయ్య ఆ రోజు బయట తిరగలేదు. తను బైటకు వెడితే ఆ బిచ్చగాడు ఎదురై , తనను బిచ్చగాడుగా మారుస్తాడేమో నని వాడికి భయంగా వుంది.
    కన్నయ్య ఎప్పుడూ పంతులు గారింట్లో నే పడుకుంటుంటాడు. ఆ రోజు కన్నయ్య ఎప్పటికీ పక్క వదలకపోవడం చూసి అయన వాడిని పలకరించి, "ఒంట్లో నలతగా ఉందా ?" అనడిగాడు.
    అసలు విషయం చెప్పడానికి కన్నయ్య కాసేపు తటపటాయించాడు. కానీ పంతులుగారితో నిజం చెప్పడమే మంచిదని వాడికి తోచింది. సాధువు తన కొచ్చిన వరం సంగతీ, తనకు వచ్చిన కల సంగతీ, దానికి తనెలా భయపడుతున్నదీ వివరంగా ఆయనకు చెప్పాడు వాడు.
    పంతులు నవ్వి, "వెర్రివాడా ! కలలు నిజమవుతాయంటే నిజంగా వచ్చిన ప్రతి కలా జరిగి పోతుందని కాదు. ఇక ముందు నుంచి నీకు మంచి రోజులు వస్తున్నాయి. అదే అయన చెప్పాడు" అన్నాడు.
    "ఇప్పుడు మాత్రం నాకొచ్చిన లోటేమిటి ?" అన్నాడు కన్నయ్య.
    "ఈ ప్రపంచంలో కష్టసుఖాలు , మంచి చెడ్డలు అంటూ ఏమీ లేవు. అంతా పోలికతోనే ఉంది. కొన్నాళ్ళు పోయాక నీ పరిస్థితి గొప్పగా మారితే అప్పుడే నీకు తెలుస్తుంది. ఇప్పుడు నీకొచ్చిన లోటేమిటో ?" అన్నాడు పంతులుగారు.
    అయినా సరే కన్నయ్య ఆరోజు ఇల్లు కదలలేదు. ఆ రాత్రి వాడికి మళ్ళీ కల వచ్చింది. కలలో బిచ్చగాడు మళ్ళీ కనిపించి, "నీకోసం ఈ రోజంతా చూశాను. బయటకు రాలేదేం నాయనా ?" అనడిగాడు.
    కన్నయ్య జవాబివ్వలేదు.
    "నేను త్వరగా హిమాలయాలకు వెళ్ళాలి. ఈ రోజైనా త్వరగా వచ్చి నా భిక్షాపాత్ర నుంచి నాకు విముక్తి కలిగించు. నేను చెప్పినట్లు ఆ పాత్ర తీసుకుని అందరిళ్ళకూ వెళ్ళు. అందర్నీ తలో వస్తువూ అడుగు. ఎవరే వస్తువు నిచ్చినా భిక్షా పాత్ర లోనే వేయి. పాత్రలో వేసిన వస్తువు ఏమైనా పట్టించుకోకు. భిక్ష అయ్యాక పాత్రను జాగ్రత్తగా  భద్రం చేయి. నీకు బిచ్చమేసే వాళ్ళను అలోచించి మరీ వేయమను. నీకిచ్చిన ప్రతిదీ నీ స్వంత మై పోతుంది. మరి వారికి తిరిగి రాదు. మాట ఇస్తే చాలు. ఏ దానాన్నయినా నీ పాత్ర స్వీకరించ గల్గుతుంది" అన్నాడు బిచ్చగాడు.
    కన్నయ్యకు మెలకువ వచ్చింది. వాడికి వచ్చింది కలలా లేదు. అంతా నిజం లాగుంది.
    ఈసారి కన్నయ్య దిగులు పడలేదు. సాధువు చెప్పినట్లే తనకు కలలు వస్తున్నాయి. కలలు నిజమైతే అది తన మంచికే కావచ్చు. దానికి దిగులు పడడం అనవసరం.
    కన్నయ్య ఉత్సాహంగా లేచి తిరుగడమే కాక వూరంతా తన గురించి చాటింపు వేసాడు. అందుకు కారణం ఏమీ లేదు. తను కనుక బిచ్చ మెత్తుకుంటే ఎవ్వరూ తనను తప్పు పట్టరని.
    కన్నయ్య కల గురించి విని చాలామంది వేళాకోళం చేశారు.
    "ఏరా, పనిచేయడానికి బద్ధకం బయల్దేరిందా అడుక్కు తినానలని సరదాగా ఉందా ?' అన్నారు కొందరు.
    "ఒక్క రోజుకే కదా! రెండో రోజు మీరు బలవంత పెట్టినా అడుక్కొను నేను!" అన్నాడు కన్నయ్య .
    "నువ్వడిగితే ఏమైనా ఇచ్చేస్తాం . ఏమిచ్చినా నీ ఋణం తీరదు" అన్నారు కొందరు.
    "అలా వద్దు బాబూ! మనస్పూర్తిగా మీరేదిస్తే అది తీసుకుంటాను" అన్నాడు కన్నయ్య.
    మొత్తం మీద ఈ వార్త ఊరంతా పాకి గురవయ్య కొడుకు భద్రయ్య కు కూడా చేరింది. వాడిది వినగానే కన్నయ్యను ఏడిపించాలనుకున్నాడు. అందుకని వాడు బిచ్చగాడి వేషం వేసుకుని చేతిలో భిక్షా పాత్రతో ఊరంతా తిరుగుతూ ఓ సమయంలో కన్నయ్య కు ఎదురుపడి ఆగిపోయాడు.
    కన్నయ్య భద్రయ్య ను హ=గుర్తు పట్టలేదు. ఎవరో బిచ్చగాడనే అనుకున్నాడు. బిచ్చగాడిలో వాడికి కలలో తనకు కనబడ్డ బిచ్చగాడి పోలికలు కనబడ్డాయి. కుతూహలంగా కన్నయ్య బిచ్చగాడి వంకే చూశాడు.
    "నువ్వు కన్నయ్యవు కదూ ?" అన్నాడు బిచ్చగాడు.
    అవునన్నాడు కన్నయ్య. బిచ్చగాడి వేషంలో వున్న భద్రయ్య అచ్చం కన్నయ్యకు కల వచ్చిన విధంగానే ప్రవర్తించి భిక్షాపాత్ర అందించి వెళ్ళి పోయాడు. కన్నయ్య బిక్షా గాడి వివరాలు తెలుసు కుందామని ప్రయత్నించాడు. కానీ, భద్రయ్య ఎలాగో వాడి కన్ను గప్పి మాయమయ్యాడు.
    కన్నయ్య వెంటనే భిక్షా పాత్ర తీసుకుని ఇంటింటికి బయల్దేరాడు. కన్నయ్యంటే అభిమానం కొద్దీ కొందరు బంగారు కాసులు వేశారు. కొందరు వెండి కాసులు వేశారు. కొందరు కన్నయ్యకు బట్టలు ఇచ్చారు. కొందరు వాడికి పాత్ర సామాగ్రి ఇచ్చారు. కొంతమంది తిండి గింజలు వేశారు.
    తనకు భిక్షగా లభించిన ప్రతి వస్తువునూ కన్నయ్య భిక్షా పాత్రలోనే వేస్తున్నాడు. ఆశ్చర్య మేమిటంటే ఆ పాత్రలో ఎంత పెద్ద వస్తువు అయినా పట్టేస్తుంది. ఎన్ని వస్తువులు వేసినా అ పాత్ర బరువెక్కడం లేదు. చాలామంది ఈ విచిత్రాన్ని గమనించి ఆశ్చర్య పడ్డాడు. కొంతమంది ఈ వింత చూడ్డానికి వాడి వెంట పడ్డారు. ఈ విధంగా వాడి చుట్టూ ఓ పెద్ద గుంపు తయారయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS