Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 12


    మొదటి రకం ప్రేమలో ప్రేమించేవాడికి సుఖం ఉంది!
    రెండో రకంలో ప్రేమించబడేవాడికి సుఖం ఉంది!
    మొదటి రకంలో ప్రేమించబడుతున్న వారు త్యాగం చెయ్యవలసివస్తే, రెండో రకంలో ప్రేమిస్తున్నవారే త్యాగం చెయ్యాలి!
    ఆసలు ప్రేమ త్యాగాన్ని కోరి తీరుతుంది.
    నా విషయాన్ని గూర్చి మనం చర్చిస్తున్నాం కాబట్టి నన్ను మీలా ఆలోచించకుండా, నన్ను నాలానే ఆలోచిస్తే నీకు ఒక విషయం తట్టుతుంది! నాకు నా సుఖంలో ఆనందం లేదు, బాధ తప్ప! నేను ప్రేమించిన వాళ్ళ సుఖం కోసం బాధలు అనుభవించడం లోనే ఉంది నాకు సుఖం. గోపాలానికి తగ్గ జోడీ . ఎంత బావుంటుంది ఆ జంట!
    ఛీ. నువ్వు అల్లా ఆలోచించకూడదు!"
    నిద్రలో మెలుకువ వచ్చి వరండాలో నిద్రపోతున్న విశాలి ఏడుస్తుంది. లేచే ఓపిక లేదు. కాని, ఉంటేనా? రెక్కలు కట్టుకుని విశాలి సమక్షంలో వాలేది సుమిత్ర. అందుకనే శారద ని బతిమాలుకుంది. విశాలిని వెంట బెట్టుకుని తీసుకుని రమ్మని!
    మాటల్లో సుమిత్ర వర్ణిస్తున్నదే చేతల్లో చూసి చలన రహిత అయిపొయింది శారద!
    శారదకు తెలుసు ఇవన్నీ వినిపించడం వల్లనే బహుశః విశాలి ఏడుస్తుండవచ్చు అని. అందుకే ముందు సందేహించినా సుమిత్ర కోసమని విశాలిని వెంట బెట్టుకుని తెచ్చి ఆమె పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టింది. మంచినీళ్ళు అందించింది. అదీసుమిత్ర అజ్ఞ మేరలోనే!
    "ప్రాక్టికల్స్ కోసం వెళ్ళమన్నాను కదా, కాలేజీ కి నువ్వు వెళ్ళలేదా?' కఠినంగా ప్రశ్నించానని అనుకుని మృదువుగా ప్రశ్నించింది సుమిత్ర విశాలిని ఉద్దేశించి.
    "వెళ్లాను. ఎవ్వరూ లేరక్కడ. లేబరేటరీ మూసివేసి ఉంటె వెనక్కి వచ్చేశాను." వెక్కుతూ , వెక్కుతూ చెప్పింది విశాలి.
    "ఆ తరవాత?' ప్రశ్నించింది . సుమిత్ర, ఆ తరవాత ఏం చేసిందో ఊహించుకుని భయపడి.
    "వచ్చి నిద్దర పోయాను. "వినిపించినదని ఎలా చెప్పాలో తెలియక అక్కడితో ఆగిపోయింది విశాలి.
    "పీడ కల వచ్చిందా?" ఆత్రంగా ప్రశ్నించింది సుమిత్ర.
    ఈసారి శారద జవాబు చెప్పింది.
    "ఆ సరిగ్గా పీడకల వస్తూ ఉండి ఉంటుంది. మేలుకువ వచ్చేసే సరికి మనిద్దరం మాట్లాడు కున్నవి విని ఉంటుంది. అందుకని బెంగగా ఏడుస్తుంది తన ప్రేమలోని స్వార్ధానికి.' పూర్తీ చెయ్యడం శారద వంతు అయింది.
    "అయ్యో, విశాలీ, నీ బాధ నేను సహించ లేనని, ఓ మూల చెబుతున్నా వినకుండా ఏమిటమ్మా, ఈ ఏడుపు?" రక్తం చాలా వడిగా ప్రవహిస్తుంది సుమిత్ర ఒంట్లో.
    కంగారు పడుతూ కళ్ళు తుడిచి వేసుకుంది నిశ్చేష్టిత అయిన విశాలి. తమాయించుకుని కాస్సేపు నిద్రపోయింది మానసికంగా క్షీణించి పోతూ.
    జ్వరం తగ్గు ముఖం చూపించడం లేదు.
    విశాలికి కంగారు ఎక్కువై శాంత అక్కయ్య కు ఉత్తరం వ్రాద్దామని వంటింట్లో మూలగా కూర్చుని మొదలు పెట్టింది.
    "సుమిత్రా! ఇప్పటి నీ ఈ అనారోగ్యం తెప్పించిన రోగ క్రిమిని నేనే కదూ! క్షమించు నన్ను. విశాలిని చేసుకున్నా నాకీ బాధ జీవితాంతం మిగిలి పోతుంది.
    ఇప్పుడు నిన్ను ఇంతగా పెట్టిన ఉసురు ఊరికే పోదు. నన్ను వేధించుకుని మరీ తింటుంది. నిన్ను మానసికంగా ఎంత బలహీనురాల్ని చేశానో?"
    బాధ, ఉద్వేగం ఆగక గడగడా చెప్పేస్తున్నాడు గోపాలం, మంచాన్ని అంటుకుని పోయిన సుమిత్ర ను చూసి కన్నీరు ఆపుకోలేక.
    "ఛీ..ఛీ... చంటి పిల్లాడిలా ఏమిటా కన్నీళ్లు? నన్ను ఈ స్థితి లోకి తెచ్చింది నీవనే భ్రమ నీకెందుకు కలిగింది అసలు? చూడు, నీవు నన్నేదో మహా బాధ పెట్టావనీ, ఆ ఉసురు నిన్ను వెంటాడుతుందని అంటున్నావు. అంత మాట అలా అనవచ్చా? నీవు బాధపడుతుంటే విశాలి చూడగలదా? విశాలి ని చేసుకున్నాక నీవు జీవితాంతం ఈ విషయమే ఆలోచిస్తూ గడిపితే అసలు మా విశాలిని చేసుకోవద్దు. డానికి స్వర్గం చూపిస్తాననీ , నందనోద్యాన విహారాల్లో ప్రేమ లోకాల్లో తిప్పుతావనీ ఏమేమిటో అనుకుంటున్నాను. నన్ను ఈ విధంగా బాధ పెట్టావని అనుకుంటూ నిన్ను కట్టి కుడిసే బాధ చూస్తుంటే విశాలి రెండు వైపులా మనశ్శాంతి కోల్పోయింది అవుతుంది చివరికి. నేనేమీ మానసికంగా బలహీనురాల్ని కాలేదు. విశాలిని నీవు సుఖ పెట్టలేని నాడు నా విశాలిని నాకు ఇచ్చెయ్యి. నేనే సుఖ పెట్టు కుంటాను.
    తప్పు కాదూ! అలా అంటారా ఎక్కడయినా...వింటే నా విశాలి ఎంత బాధ పడుతుంది!"
    ఆయాసం అధికమయింది. ఎదటి వ్యక్తీని ఉద్రేకపరిచేవి అనకూడదని తెలిసినా అన్నాడు తను, ఎంత డాక్టర్ చదివినా, కంగారు పడి మరింక నిద్రపోవడానికి మార్ఫియా ఇచ్చి నెమ్మది నెమ్మదిగా నిద్రలోకి జారిపోతున్న సుమిత్రను చూస్తూ కూర్చున్నాడు.
    వంటింట్లో మూలగా ఉత్తరం వ్రాద్దామని కూర్చున్న విశాలి ఆ నిమిషం లో ప్రాణం పోయే ఉపాయాల కోసం ఆలోచించింది క్షణికావేశం లో. అక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో! ఏమిటి తను చేసిన నిర్వాకం? బాధ ఆపుకోలేక కక్కుకోనూ లేక విలవిల లాడింది చిన్ని హృదయం కల విశాలి.

                          *    *    *    *
    ఉత్తరం అందుకుంటూనే అఘమేఘాల మీద వచ్చి పడింది శాంత! వస్తూనే డబుల్ టైఫాయిడ్ అని తెలిసి కంగారు ఆపుకోలేక తల్లి తండ్రులకి ఉత్తరం వ్రాసేసింది.
    శారద కి మూడు వంతుల కాలం సుమిత్రని కనిపెట్టుకుని గడప వలిసిన విధి తప్పింది .
    విధి అనే మాటలో ఓ కరుకుతనం ఉంది!
    అల్లాగే బాధ్యత అనే మాటలో కూడా ఉంది.
    కాశీ ప్రయాణానికి సిద్దమై తయారు చేసుకున్నంత మూటా ముల్లె నెత్తి మీద బలవంతంగా పెడుతున్నట్లుగా స్పురిస్తుంది ఏమిటో తమాషా.
    విధి లేక చేసే పనికి. విధిగా చేసే పనికీ, సంతోషంగా చేసే పనికీ తేడా లేదు మరి?
    అయినా ఏమాట కామాట చెప్పుకోవాలి. సంతోషంగా కావాలనే సేవలు చేసింది శారద.
    సుమిత్రది నిండు మనస్సు. అదే మనస్సును పొందుతుంది ఎవరి దగ్గిర నుండి అయినా.
    శాంత అక్కయ్య ని చూసి తెల్లబోయిన సుమిత్ర కి పది నిమిషాలు స్మృతి తప్పిపోయింది.
    ధైర్యవంతు రాలైన అంత పెద్దక్కయ్య, మంచాన్ని అంటుకుని పోయిన సుమిత్ర ని చూసి, "నాకు తెలుసు నువ్విల్లా అయిపోవడానికి కారణం!" అంటూ చెల్లెలికి స్పృహ వస్తుండగానే అంది. అందుకే కొత్తగా మతి తప్పిపోవడం ఒకటి అలవడింది సుమిత్రకి.
    ఆ తరవాత సుమిత్ర, శాంత ని చూసి, "విశాలి ని పలకరించావా? ఏదీ? ఎక్కడ ఉంది? అంతా దానిని కాకులు పొడిచినట్లు పొడి చేస్తున్నారు. పిలవండి!" అని బతిమాలుకుంది అక్కడ ఉన్నవాళ్ళ నందరిని.
    డాక్టరు అజ్ఞ వల్ల ఎవరూ విశాలి ని తీసుకుని రా సాహసించలేక పోయారు.
    ఇంక సుమిత్ర బతిమాలుకుంటుంటే చూడలేక, విశాలిని అసలు ఎడవ డానికి వీలులేదని శాసించి తీసుకు వచ్చారు.
    విశాలిని చూస్తూనే, దగ్గిరగా పిలిచి, "పరీక్షలకి చదువు కుంటున్నావా? ఫస్ట్ క్లాస్ వస్తుందా? వీళ్ళు ఎవరేనా ఏమైనా అంటే లెక్క చెయ్యకు. తెలిసిందా. యేది నవ్వు. నవ్వాలి" అని రెట్టించేసరికి అసలే నటించడం చేతరాని విశాలి సుమిత్ర గుండెల మీద తల వంచి గట్టిగా ఏడ్చేసింది.

                          *    *    *    *
    గంబీరంగా నటించగలరు కాబట్టి వస్తూనే పై దృశ్యాన్ని చూసినా తట్టుకోగలిగారు రామారావు గారు.
    ఆడదాని మనస్తత్వం -- ఆపైన అసలే మనిషి మరీ ఆబల -- ఆపుకోగలదా? ఆగలేకపోయింది . కలిసివస్తున్న తల్లి తండ్రులని చూసింది. మూసుకుని పోతూన్న కళ్ళు బలవంతంగా తెరిచింది.
    ఆ పైన ఆ కంటి రెప్పలు సుమిత్ర అధీనంలో కూడా లేకుండా పోయాయి.
    అసలు వచ్చిన బంధువుల నందరినీ ఒక గదిలో పడవేసి, పైన గొళ్ళెం పెట్టి, శారద ని మాత్రం-- కాస్త గుండె నిబ్బరం కలది కాబట్టి -- సుమిత్ర ఎదురుగా కూర్చో బెట్టారు.
    విశాలి కి పది మంది డాక్టర్లు కలిసి ధైర్యం నూరి పోస్తున్నారు.
    "నీ నవ్వుతో మీ అక్కయ్య ని నువ్వు రక్షించు కోవాలి. మేము ఎన్ని మందులు పోసినా లాభం లేదు. నీవామేను చూసి ధైర్యంగా నిలబడగలిగితే బతికించేయ్యగలం."
    ఆపుకోలేని అసమర్ధత వాళ్లకి తెలియజేస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది విశాలి.
 ధీసిస్ చాలా బాగా వ్రాసిందనీ, స్కాలర్ షిప్ దొరికిందనీ చెప్పడాని కని వచ్చి అక్కడే ఆగిపోయారు యూనివర్సిటీ స్టాఫ్ లో కొందరు.
    చివరికి నవ్వగలనని ఒప్పుకుంది విశాలి.
    కళ్ళు తెరుస్తూనే , "విశాలీ! " అని విశాలి కావాలని అడిగింది సుమిత్ర.
    నవ్వుతూ లోపలికి వెళ్లి, "పరీక్ష చాలా బాగా వ్రాశాను అక్కా! ఏదీ నీవు లేచి మందు తాగు" అని మందు అందించింది విశాలి. చేతులు మాత్రం తడబడుతున్నాయి కొద్దిగా.
    అది చూసి, "అరె, రాత్రి చాలాసేపు చదివావా? ఆరోగ్యం నాశనం చేసుకుంటారా ఎవరైనా? నువ్వు తాగు మందు --అప్పుడు గానీ నేను మందు తాగను." అంది. జ్వరం రోజుల్లో కోరినవన్నీ జరిగి తీరవలసిందే.
    ఆమందు విశాలి తాగేసి మరో మోతాదు తెచ్చి ఇచ్చింది.
    'ఇక పోయి చదువుకో! నే పిలిచినప్పుడు రావేం?' పంపివేసింది అమె కాలం సద్వినియోగ పరచాలని!
    శారద వైపు తిరిగి, "శారదా! ఏమిటో నీరసంగా ఉందే. మా అమ్మా , శాంతక్కయ్యా వచ్చారు కదూ! ఏరీ వాళ్ళు? ఒక్కసారి చూడనియ్యండే!" అని బతిమాలాడడం ఎక్కువ అయ్యేసరికి సరేనన్నారు డాక్టర్లు. ఒకే ఒక్క షరతు , అందరు నవ్వుతూ మాత్రం ఉండాలని.
    ఇదేదో ఫోటో లోకి దిగడం అంత తేలికా నవ్వమంటే?
    ఈ విధంగా ఎంత మందినో చూసి ఉంటారు. అందుకనే ఆ నిర్లిప్తత.
    తల్లినీ, తండ్రినీ చూస్తూనే నమస్కరించింది.
    శాంత అక్కయ్య ని చూసి నవ్వింది.
    విశాలి నీ గోపాలాన్ని దగ్గిరకి రమ్మనమని ఒకరి పక్కన ఒకరిని నిలబెట్టి వెర్రిగా నవ్వుకుంది.
    ఈ సన్నాహాలు ఇక్కడ ఇలా జరుపుకుంటుంటే తమ్ముళ్ళ ని డాక్టర్లు దాచి వేశారు. కొన్ని కొన్ని విషయాలని మరిచి పోవడం అప్పుడే మొదలు పెట్టేసింది.
    "చాలా బావుంది. " తృప్తిగా గొణుక్కుటుంటే విని ఏ మాలోచించాడో ఏమో గోపాలం?
    "సుమిత్రా! నామీద చాలా నమ్మకం ఉంచి నీ విశాలి ని నా చేతుల్లో వదిలి వెళ్లి పోతానంటున్నావు. నేనసలే మంచి వాణ్ణి కాను. నీ ఇష్టం. నీ విశాలి ని నేను సుఖ పెడుతున్నానో , లేదో కళ్ళారా చూసీ మరీ వెళ్ళాలి నువ్వు. అయినా విశాలి కంటే నాకు శారద చాలా బావుంది ఈ మధ్య."
    కిటుకు తెలియని విశాలి బావురుమంటూ గోపాలాన్ని కావిలించు కుంది.
    సుమిత్ర కోపంగా , "ఆ....నా విశాలి ని నేను లేకపోతె సుఖ పెట్టవూ? నేను చూస్తా. దాని జీవితంలో డానికి విజయం రావలసిందే. అది నిన్నే కోరుకుంటుంది.
    మూర్ఖుడా! నువ్వు శారదని మెచ్చుకుంటున్నా నిన్నే పట్టుకుని వేలాడుతుంది. నేనంటే నీకు భయం అన్నమాట. డాక్టరు గారూ , నన్ను బతికించరూ?" అని దీనంగా బతిమాలు కుంటుంది సుమిత్ర బతికి విశాలి జీవితాన్ని సుఖ పెట్టాలని.
    మొదట్లో అర్ధం కాకపోయినా ఆశ్చర్యపోయారు గోపాలం మేధా సంపత్తి కి అందరు.
    మత్తు మందు ఇచ్చేశారు మరి మెలుకువగా ఉండనీయడం ఇష్టం లేక.
    ఇన్నాళ్ళ నుండి చంటి పిల్లలా మారాం చేస్తున్న సుమిత్ర మందు తెస్తుండడం చూస్తూనే నోరు తెరుస్తుంది.
    ఆమెకి విశాలి పై గల ప్రేమ గుర్తించి తెల్లబోయారు అంతా.
    అదే యూనివర్శిటీ లో సుమిత్ర తో పాటు రిసెర్చి చేస్తున్న శ్రీహరి , ఫారిన్ రిటరర్న్ అంటూ మరొక డాక్టర్ ని వెతబెట్టుకుని వచ్చాడు.
    ఎవరు ఎవరికి ఏ విధంగా చుట్టాలో ఆ సమయంలో ఊహించలేక పోతున్నారు.
    కొత్త డాక్టరు వస్తూనే కొన్ని పద్దతులు మార్చేశాడు.
    రక్తం కావాలన్నాడు రోగి కి.
    విశాలి రక్తం అసలు కలవలేదు సుమిత్ర రక్తం తో!
    మొట్టమొదటి నుండి ఆ విషయం తెలుస్తూనే ఉంది.
    గోపాలం రక్తం తీసుకోవడానికి కొద్దిగా సందేహించాడు డాక్టరు, దొరకక పొతే అదే ఎక్కిస్తా నంటూ!
    చెయ్యి చాపాడు శ్రీహరి.
    పరీక్షిస్తూనే డాక్టరు మొహం వికసించింది.
    ఆ తరవాత గాని అసలు శ్రీహరికి ఉన్న గొప్ప ఆసక్తి ఏమో తెలిసి రాలేదు ఆ ఇంట్లో జనానికి.

                         *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS