Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 11


    ఆ చప్పుడు విని అప్పుడే నిద్రలోకి ఒరిగిన శారద, గోపాలం లేచి కూర్చున్నారు. ముందు వరండా లో వెక్కి వెక్కి ఏడుస్తున్న విశాలి కన్నీరైనా తుడుచుకో కుండా కన్నీటి చారికలతో ఎరుపెక్కిన కన్నులతో గబగబా లోపలి గదిలోకి వచ్చింది.
    "దాహం." సన్నగా అడిగింది సుమిత్ర.
    శారద ని చూసి నవ్వి, "ఇక్కడ ఆగిపోయావా? మీ వాళ్ళు, పాపం, ఏమీ అనుకోరూ?' అంది. బలహీనంగా ఉంది కంఠం! నవ్విన నవ్వులో జీవం లేదు. పేలవంగా ఉంది ఆ నవ్వు.
    మంచినీళ్ళు అందిస్తున్న విశాలి కన్నీటి చారికలు చూసి, ఏడుస్తున్నావా?' అంది ఏంతో బాధగా.
    మంచం దగ్గిరికి వచ్చి నిలుచున్న గోపాలం , "అబ్బే! నిద్రపోయి లేచింది. అందుకని అల్లా కనిపిస్తుంది." అంటూ విశాలి మొహానికి, సుమిత్ర కి అడ్డుగా నిలుచుని గ్లూకోజ్ కలపడం లో నిమగ్నుడై పోయినట్లు నటిస్తున్నాడు.
    పూర్తిగా కాకపోయినా, పరిస్థితిని కొద్దిగా అర్ధం చేసుకుని, "నాకేం బాధగా లేదు. నిన్న రాత్రి సినిమాలో హటాత్తుగా వచ్చేశానని కోపం వచ్చిందా, శారదా, నీకు క్షమించవూ?' అని దిగులుగా అడిగింది. బలహీనమైన రెండు చేతులతోనూ శారద చేతులు అందుకోవడానికి ప్రయత్నించి.
    కన్నీరు ఆపుకోలేక విశాలి నిష్క్రమించింది.
    గోపాలం, పాపం, సిగ్గుతో తల వంచేసుకున్నాడు.
    గ్లూకోజ్ నీళ్ళు అందిస్తున్న గోపాలం మనస్సులోని వేదన అర్ధం చేసుకుని, "విశాలి ఏదీ?' అని ప్రశ్నించింది సుమిత్ర.
    "కన్నీళ్లు ఆపుకోవడం నావల్ల కాదు. నేను రాలేను బాబూ!" దిగులుగా అంటుంది విశాలి, "రమ్మనమని " పిలవడానికి వచ్చిన గోపాలం మీద పూర్తిగా ఒరిగిపోయి!
    శారదని చూసి మళ్ళీ అడిగింది సుమిత్ర, "విశాలి ఏదీ?' అని.
    లోపలికి పోయి శారద, "ఇది విచారించే సమయం కాదు, నిన్ను చూడాలని ఊరికె అడుగుతుంది. నడూ కళ్ళమ్మ ట నీరు రానీయకుండా ప్రయత్నించు." అంటూ బలవంతంగా విశాలిని వెంటబెట్టుకుని వచ్చింది!
    దిగులుగా ఉన్న విశాలిని ఒళ్ళు నిమురుతూ , "చదువుకోవాలమ్మా శ్రద్దగా. పరీక్షలు ఇంకా ఎన్నాళ్ళున్నాయి?" అంది. ఒకమూల ఆరోగ్యం సరిగా లేకపోయినా, విశాలి మీద తీసుకునే శ్రద్దలో లోపం జరగనియ్యలేదు. ఆప్యాయత సడలి పోలేదు.
    అదే భరించలేక ఏడుస్తుంది విశాలి.
    అది చూసి, గోపాలం, "అనవసరంగా కంగారు పెట్టి విశాలి కి ఏడుపు తెప్పించడం ఎందుకు? నిద్రపోండి కాస్సేపు." డాక్టరుగా రోగిని బలవంత పెడుతున్నాడు.
    "సరే, సరే , విశాలీ! నిద్రపోవాలి మరి. శారదా, ఏమిటో మీ అందరినీ ఊరికే శ్రమ పెట్టేస్తున్నాను. మీరంతా నిద్రపోయాకే నేను నిద్రపోతాను." మారాము చేయడం మొదలు పెట్టింది!
    అందరూ సరేనని యధా స్థానాల్లోకి వెళ్ళిపోయారు.
    విశాలి మాత్రం తన ఎదురుగానే నిద్రపోవాలని పట్టుబట్టింది సుమిత్ర. జ్వరంతోనే సాధించ గలిగింది కొన్ని కొన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధించ లేకపోయినా!
    మరికొంతసేపు కాలమే స్తంభించింది.
    మళ్ళీ నిద్రాదేవత పని తగిలింది.
    ఆ గదిలోకి అడుగు పెడుతూనే మంచాన్ని అంటుకు పోయిన సుమిత్ర ని చూసి కంగారు పడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న విశాలి తన ఏడుపు అక్క చూడకుండా ఉండాలని అవస్థ పడిపోవడమూ చూసింది.
    సుమిత్ర ప్రేమకి నిర్ఘాంత పోయి శారదా, గోపాలాలు కాలాన్ని అంటి పెట్టుకుని ఉండడమూ చూసింది.
    ప్రేమ ఆపుకోలేక గబగబా సుమిత్రని సమీపించి ఒళ్ళంతా నిమిరింది. ఆత్రంగా ఆమె చేతి చలవ వల్ల బాధలు మరిచిపోయి మెల్లిమెల్లిగా నిద్ర లోకి ఒరిగింది సుమిత్ర.
    తరవాత శారద ని పడుకోబెట్టి, ఆ పైన గోపాలాన్ని కొంచెం సేపు ఏడిపించి చివరికి కరుణ చూపించాలని విశాలి మీద మాత్రం ఏ విధంగాను కరునించకూడదనీ అనుకుంది! కాని, పశ్చాత్తాప పడుతున్నట్లూన్న వాళ్ళిద్దరిని చూసి కరుణించి త్వరగానే జోకొట్టి వెళ్ళిపోయింది.

                         *    *    *    *
    మూడు రోజులయింది. టెంపరేచరులో పెద్ద మార్పు లేదు. సుమిత్రని చూసేందుకు పెద్ద దిక్కు కూడా లేదు.
    విశాలి చాలా చిన్నపిల్ల, పాపం , ప్రతిదానికి ఆవేశం, ఉద్రేకం, మించి మరొకటి ఆలోచించని వయస్సు అమెది! శారద సరేసరి. కలవారి ఇంట్లో కాలు కింద పెట్టకుండా పెరిగింది. కష్టాలనేవి ఉంటాయనే తెలియదు ఆమెకి.
    ఆవేళ చాలా చాలా పోరిపోరి చిట్ట చివరకు పంపగలిగింది స్పెషల్ గా ప్రాక్టికల్స్ చేసుకోవడాని కని విశాలిని సుమిత్ర!
    శారద సాయంగా మిగిలిపోయింది.
    గోపాలం కాలు ఎటూ ఆడడం లేదు!
    తాను చెప్పదలుచు కున్న విషయం కాస్తంత తీరిక దొరకగానే మొదలు పెట్టింది శారద.
    "చూడు విశాలి విషయం నీతో మాట్లాడు తున్నందుకు కోపగించకు మరి. ఒక్కటే ఒక్క విషయం చెప్పదలుచు కున్నాను. నామీద నీకున్న అభిమానం, ప్రేమ, గౌరవం -- వీటన్నింటి నీ చూసి మరీ చెప్పదలుచు కున్నాను ." శారద అంటుంది దీనాతి దీనంగా మొహం పెట్టి!
    అంతటి దీనత్వాన్ని భరించలేక , "సరే చెప్పు" అంది సుమిత్ర.
    "ఇప్పుడు నీకీ జ్వరం రావడానికి ముఖ్య కారణం నీకు తెలిసిందో లేదో! నేను చెబుతున్నాను విను. గోపాలం లేనిదే నీకు బతకలేవు. అతనిని విశాలికి దానం చేసి చేతులు కడుక్కుని ఋణం తీర్చుకుని వెళ్లి పోదామను కుంటున్నావేమో! ఈనాడు  విశాలి సుఖం కోసం గోపాలాన్ని వదులుకున్నావు కనకనే నీకీ విధంగా మానసికంగా గాయం తగిలింది.
    ఇప్పటికైనా మించిపోయింది లేదు.
    నా మాట విను. విశాలి ఇంకా చిన్నపిల్ల. నీకు తగిలిన దెబ్బ కంటే ఆమెకు తగలబోయేది చాలా చిన్న గాయమే అవుతుంది. నీవే ఎక్కువగా నష్టపోతావు ఆమె కంటే. నేను ఈ విషయాన్ని గోపాలానికి చెబుతున్నాను. నన్ను కాదనకు. పరులకు మనస్సు ఇయ్యని నేను, నిన్ను ఎంతో సన్నిహితురాలుగా చూసుకుంటున్నాను ఇన్నాళ్ళు. నీవు లేని నేను బతకనే లేను. వ్రుద్దులై పోతున్న మీ తల్లి తండ్రులను గురించి కూడా ఆలోచించుకో.
    అన్నిటికి మించి నీవే నిలబడ లేకపోయినప్పుడు ఎందుకా దానం? మరో మాట నీకు కోపం రాకుండా ఉంటె నీవు చేసేది అపాత్ర దానం."
    శారద మాటలు మధ్యలోనే అందుకుంది సుమిత్ర.
    "శారదా! నీకు నా మీద ఉన్న అభిమానానికి కొన్ని జన్మల వరకూ ఋణపడి ఉంటాను కాని, నా విశాలి ని ఏమీ అనకు. డానికి నేను చేస్తున్నది ఒక దానంగా భావించి , అందులోనూ అది అపాత్ర దానం అంటున్నావు. విశాలి హృదయ నైర్మల్యం నీకు తెలియదు.
    దాని మనస్సు స్పటికం లాంటిది. స్వచ్చమైనది. దాని హృదయానికి లోతు లేదు, వైశాల్యమే కాని! అందుకే మీరెవ్వరు దాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నారు. దాని ప్రేమకు , నా ప్రేమకు చాలా పెద్ద తేడా ఉంది. దానిది "పోసేసివ్ లవ్" అంటారు.
    అది ఎవరినైనా ప్రేమించిందంటే వాళ్ళు అచ్చంగా కావాలి డానికి. ఎటువంటి కష్టాల పరంపర రానీ కోరుకున్నది లభించాలి!
    కాని వేరే రకమైన ప్రేమ ఉంది. ప్రేమించిన వాళ్ళ సుఖం తప్ప మరో ధ్యాస ఉండదు! ఉదాహరణ కి నేను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాననుకో. కాని నీకు సుఖం నాకంటే సరోజ స్నేహం లోనే దొరికే మాటయితే నిన్ను సుఖపడ నియ్యడం కోసం నేను నిన్ను వదులు కోవడానికి కూడా సిద్దపడతా నన్న మాట! ఒక్క సంగతి మరిచిపోకు నాకు కావలసిందల్లా వాళ్ళ సుఖమే.
    మరో ఉదాహరణ. నేను ప్రేమించిన వాళ్లకు కొన్ని కొన్ని ఇష్టాలుంటాయనుకో. అవి నాకు పరమ ద్వేషాన్ని , అసహ్యాన్ని కలిగించేవి అయినా, ఇష్టమైన వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచు కోవాలని, అవి నాకు ఎంత ఇష్టం లేకపోయినా, చేసేస్తాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS