మెల్లిగా , బరువుగా కళ్ళెత్తిన సుమిత్ర ఎదురుగా కూర్చుని ఆత్రంగా శ్రీహరిని చూసి తెల్లబోయింది!
"మీరు ...మీరు....." తడబడింది!
"అవును,. బాతసారినే. మీరు నాకు పేరు పెట్టారుగా బాటసారి అని!" చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.
బాధపడింది ఒక్క క్షణం సేపు. "క్షమించండి " అంది ఆఖరికి.
"అప్పుడే క్షమించను. ఒక నెల్లాళ్ళు పోయాక మీరు వెనకటి బలం సంపాదించు కున్నాక గాని క్షమించను." నవ్వాడు చొరవగా . కానీ మొహంలో నీరసం తాండవం ఆడుతుంది అతనికి.
తల్లి, అందరు వచ్చి , "నీ ధీసిస్ చాలా బాగుందిట, తెలుసునా?' అని ప్రశ్నించారు!
"ఆ...విశాలి ఎక్కడ ఉంది?' నీరసంగా అడిగింది సుమిత్ర.
"మీకు మీ విశాలి సంగతే కానీ ఎక్కడా తల్లి తండ్రుల్ని గూర్చి పట్టించుకున్నట్లు లేదే?' నవ్వాడు శ్రీహరి.
"ఆహ....." మళ్ళీ కళ్ళు మూసేసుకుంది.
కళ్ళు మూసుకుని ఉన్నా, మాటలు వినిపించుకునే స్థితిలో ఉందని తెలుసు అందరికి. కాని ఆ విషయాన్ని మరిచిపోయినట్లే మాట్లాడు కుంటున్నారు. అసలు శ్రీహరి కి తెలుసు తను మాట్లాడుతున్నది ఆమె శ్రద్దగా వింటుందని. అందుకే దొరికిన సదవకాశం వదులుకోలేక శాంత ప్రశ్నించగా చెప్పడం ప్రారంభించాడు.
"ఇంట్లో మూలుగుతున్న కొన్ని లక్షల ఆస్తి నేను నీ సొత్తే అంటుంది గాని, అలా అనుకోవడం లో నాకేనాడూ ఆనందం అనిపించలేదు.
ఏకైక పుత్రుడ్ని అని తల్లీ తండ్రీ ప్రేమ అంతా నా మీద ఒలకబోసి ముంచెత్తి చేసేవారు. వాళ్లకి నచ్చిన అమ్మాయిని చేద్దామని నిశ్చయించు కుంటే సరేనంటూ నేనూ అనుమతి ఇచ్చి వేశాను.
చేసుకోవడాని కని అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
ఆ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది.
అంతట్లో నేను ఆమెకు తగననీ కాబోలు తన వెంట తీసుకుని వెళ్ళిపోయింది మృత్యువు, అంతకు మించిన సంబంధాన్ని చూపిస్తానంటూ!
అప్పటి నుండి ఏదో విరక్తి! అల్లాగే జీవితం నెట్టుకుని వస్తున్నా. ఆ తరవాత ఏదో కాలక్షేపం కోసం రిసెర్చి మొదలు పెట్టడం, అదే సమయం లో మీ అమ్మాయిని చూడడం సంభవించాయి. చనిపోయిన ఆమె పోలికలు మీ సుమిత్రలో కొట్టవచ్చినట్లు కనిపించేసరికి ఈమెని చూస్తుండడం లోనే సంతృప్తి ని కొని తెచ్చుకున్నాను.
ఎప్పుడైతే ఈమె విదేశాలకి వెళ్లి పోవడానికి చాలా పట్టుదలగా ఉందని తెలిసిందో, అప్పటి నించి ఇక్కడ ఉండలేక నేను కూడా రిసెర్చి శ్రద్దగా చెయ్యడం మొదలు పెట్టాను.
దేశం కాని దేశాలలో కూడా వెంటాడి బాదిద్దామని నా ఉద్దేశం కాకపోయినా, ఆమెని చూస్తుంటేనే గానీ రోజులు గడపలేనని.
ఆ తరవాత తెలిసింది. మొదట ఆమె కని నిర్ణయించిన వరుణ్ణి చెల్లెలు చేసుకుంటుందని! స్వార్ధంతో ఆలోచిస్తే అందులో ఆనందం లేకపోలేదు గాని, అప్పటి నుండి ఆమె మానసికంగా పడుతున్న బాధ అంతా వెనకటి నా బాధతో పోల్చుకుని గిలగిల లాడి పోయే వాణ్ణి.
ఇద్దరికీ స్కాలర్ షిప్ వచ్చిందని తెలిసి ఎగిరి గంతేసిన నాకు ఈమె ఇలా ప్రమాద స్థితిలో ఉందనే సరికి ఇదే విషయంలో బెంగపడి నేను చచ్చిపోతానని అంతా అనుకున్నప్పుడు నన్ను బతికించిన డాక్టరు గుర్తుకు వచ్చి మొదట అక్కడికి పరుగెత్తుకు వెళ్లి, ఆయనని తోడు తీసుకుని వచ్చాను. ఇదీ నా కధ."
పూర్తిగా పోయిన ఆశ మళ్ళీ వెలిగింది శాంత లో, సత్యవతమ్మ లో, విశాలి లో. మనిషిని గురించి కొంచెం వాకబు చేసి తృప్తిగా తలలూగించారు.
అంతటితో సుమిత్రని పట్టుకున్న శని వదిలి పోతుందని సంతోషంతో ఎగిరి గంతులు వేశారు.
* * * *
కోలుకుంటుంది సుమిత్ర కొంచెకొంచెంగా.
ఆకురాలు కాలంలో మంచాన పడిన సుమిత్ర చిగిర్చి నవ వసంత కాలానికి కోలుకుంటుంది.
కొమ్మ కొమ్మనా, కణుపు కణుపు నా చెట్లన్నీ చిగురుస్తున్నాయి.
ఇంటి ముందున్న వేప విపరీతంగా విరగ బడి పోతుంది. చెట్టు చెట్టంతా పూలతో నిండి పోయింది.
వేప పూలు ఎందుకూ పనికి రావు, ఉగాది పచ్చడి లో చేదు కలపడానికి తప్పిస్తే.
వేపగాలి ఆరోగ్యకరం కావచ్చు కానీ, వేప పువ్వు మాత్రం ఉగాది పచ్చడి కి తప్ప ఎందులోనూ పనికి రాదు.
జీవితం లోని దుఃఖాన్ని చూపించడానికి చేదు కూడా వేస్తారేమో! నవ్వుకుంటుంది మేడ మీద కుర్చీలో తీరికగా కూర్చుని తల అరబెట్టు కుంటున్న సుమిత్ర!
విశాలి ఆయాసంగా రోప్పుకుంటూ , రోజు కుంటూ పరిగెత్తుకు వచ్చి , "అమ్మ ఉగాది పచ్చడి పెడుతుంది. రావాలి! ఓపిక లేకపోతె ఎత్తుకుని అయినా సరే, నెత్తి మీద పెట్టుకుని అయినాసరే తీసుకుని రమ్మంది కూడాను" అంది.
వెనకటి అనుమానపు చాయలు మాట మాత్రంగా నైనా లేవు విశాలి లో. కొంటెతనం చింది పోతుంది పెదవుల నుండి!
"నేను రాలేను బాబూ!" మారాం చెయ్యడం వంతు ఈ మధ్య సుమిత్ర పుచ్చు కుంటుంది.
"అదేం వీలు కాదు, వచ్చి తీరవలసిందే. నేనన్న మాట జరిగి తీర వలిసిందే!" రెట్టిస్తుంది విశాలి మరీ పెంకేగా.
తమ్ముళ్ళ నిద్దరిని చెరో చేయీ పట్టుకుని నడిపించు కుంటూ వచ్చి శ్రీహరి దూరంగా నిలబడి చూస్తున్నాడు సుమిత్ర ని.
అదేం గమనించలేదు సుమిత్ర.
"ఇంత పెద్దయి పోయాక ఇంకా చంటి పిల్లలా ఆ పచ్చడి తినడ మేమిటి? నేను రాలేను." పంతం లోకి దిగినట్లుందే వరస అనుకుని విశాలి ఆలోచిస్తూ తల తిప్పేసరికి ఎదురుగా కనబడిన శ్రీహరి ని చూసి ఏమీ ఎరగనట్లే మొహం పెట్టింది.
"పోనీలే , ఈ విషయమే అమ్మతో చెబుతాను." బుంగమూతి తో తమ్ముళ్ళ ని ఇద్దరినీ వెంట బెట్టుకుని వెళ్ళిపోయింది.
"సుమిత్రా! పెద్ద దానవు అయినంత మాత్రాన సుఖ దుఃఖాలు సమానంగా భరించగలుగు తున్నావా, నువ్వు? లేదు. అందుకనే అది తిని తీరాలి" సుమిత్ర పక్కకి చేరుతూ అన్నాడు శ్రీహరి.
"నా జీవితం అంతా వేప పువ్వు లాగే గడిచి పోతుంది. మొదట్లో దాని కెంత విలువ లేదో ఇప్పుడు అంతే. ఈనాడు ఉగాది పచ్చడి లో గాని దాని విలువ తెలిసి రాదు. ఇప్పటికి తీపి, పులుపు, కారం చవి చూసిన మీరు పక్కన లేకపోతె ఇక వేపపువ్వు తినేవాళ్ళే ఉండరు తెలుసునా?" నవ్వుతూ జవాబు ఇచ్చి, పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది సుమిత్ర.
వెనకాలే అనుసరించాడు ధైర్యంగా ఈనాడు శ్రీహరి.అదే ధైర్యం లేక ఎన్నాళ్ళు నిరీక్షించాడో గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ.
సుమిత్ర కోసమని ఉగాది పచ్చడి తో బయలుదేరిన సత్యవతమ్మ చిరునవ్వులు ఒలక బోసుకుంటూ దిగి వస్తున్న ఇద్దరినీ చూసి ఆగిపోయింది.
సుమిత్ర చేతిలో వేప పువ్వులు ఎక్కువ గాను, మిగిలిన ముక్కలు తక్కువ గాను పడ్డాయి.
ఇందాకటి సుమిత్ర మాటలని గుర్తుకు తెస్తూ , "అబ్బెబ్బే ఎక్కువ పువ్వులు నాకిచ్చి ఈ తీపి ముక్కలూ చెరుకు ముక్కలూ మీ అమ్మాయి కి ఇవ్వాలి మీరు. మరి మేం పంచుకోవాలి గదా. ఇన్నాళ్ళూ వేప పువ్వులే తినేది ఆమె! నేను తతిమ్మా ముక్కలు తినే వాణ్ణి. ఈనాడు మరి మార్చు కోవాలిగా కొన్నాళ్ళ పాటు" అని శ్రీహరి అన్నదానికి నవ్వేసింది సత్యవతమ్మ.
"సత్యవతమ్మ ఎంత హాయిగా నవ్వుతుందో!" అనుకున్నారు అప్పుడే ఆ గదిలోకి అడుగు పెడుతూ రామారావు గారు తమ పెళ్లి నాటి ముచ్చట్లు గుర్తుకు వచ్చి. గోపాలం కూడా నవ్వేశాడు. అంతవరకూ విశాలి ని అనుకుని దొంగతనంగా విని.
సిగ్గు దాచుకోలేక సిగ్గు భరణి లో దూరి దాక్కుని పోయింది సుమిత్ర!
(సమాప్తం)
