"నాకేమిటి?" అన్నాను అర్ధంగాక.
"అదేలే అరుణదేదైనా నీదేకదా? ఇక్కడిది వదిలేసి ఇంకెన్నాళ్ళూ వుద్యోగం?" అన్నాడు.
"ఓ ఆదా? నాకెందుకు బాబూ లేనిపోనీ పెత్తనం? ఇన్నాళ్ళూ చేసినట్టు నువ్వేచేసుకో. నా బ్రతుకుతెరువు నాకుంది." అన్నాను నిర్లక్ష్యంగా. బావ అయోమయంగా నన్నే చూస్తూ వుండిపోయాడు. అప్పుడే అరుణని తీసికెళ్ళే సంగతి కదలేద్ధామనుకున్నాను కాని ఆవిషయం అరుణతో మాట్లాడలేదుకదా? సరే, అరుణని అడిగాకే చూడొచ్చని వూరుకున్నాను.
పన్నెండు గంటలకీ ఇద్దరం భోజనాని కొచ్చేశాం. బావ మళ్ళా వెళ్ళిపోయాడు. నేను పైకివెళ్ళి పడుకున్నాను. అరుణ ఏదో చదువు కుంటూ దగ్గిరే కూర్చుంది. నాకు తెలీకుండానే నిద్రపట్టేసింది-సాయంత్రం అరుణ సినిమా ప్రోగ్రాం పెట్టింది. నాకంతగా ఇష్టంలేకపోయినా ఏమీ అనలేదు. ఆవిడ ముస్తాబుకు వెళ్తే నేను ఏదో పుస్తకం తీసి తిరగవేస్తూ కూర్చున్నాను. అరగంటలో తయారై వచ్చింది. మరీ విలాసంగా అలంకరించుకొంది. పిన్నులు పెట్టి తట్టంత ముడిచుట్టుకుంది. పెద్ద పెద్ద పువ్వుల చీర కట్టుకొంది. కుడిచేతికి మోచేతి వరకూ గాజు లేసుకుంది. హేండ్ బాగు తెరిచి బుగ్గలకి పౌడ రద్దుకుంటూ నిలబడింది అద్దం ముందు అరుణకి కూడా ఈ పిచ్చలనీ వున్నాయని అంతవరకూ నాకు తెలీదు. అరుణని చూడగానే చిరాకేసింది-"నీ డ్రెస్సింగేం నాకు నచ్చలేదు. అందంగా వాలు జడవేసుకొని పువ్వులు పెట్టుకోక ఈముడేవిటి నడినెత్తిమీద? ఛా! ఆచీరకూడా నాకేం బావులేదు. దెయ్యం పువ్వులూ-అదీనూ." అంటూ చిరాకుపడ్డాను. అప్పుడే నాకు నేను తెచ్చిన చీర గుర్తు వచ్చింది. వెంటనే లేచి పెట్టి తెరిచి చీర పొట్లాం తీశాను.
"అరుణా! రాత్రి తెచ్చానని చెప్పింది ఇదే. విప్పి చూడు." అన్నాను. అరుణ అద్దం ముందు నుంచి కదిలిరాకుండా ఇంకా ఏమిటో రంగులు పూసుకుంటూ-"ఉండండి వచ్చేస్తున్నాను." అంది.
నేను తెచ్చిన వస్తువు అరుణ ఆప్యాయంగా అందుకుందా? ఆతృతగా విప్పిచూసిందా? ఎంత కోరికతో తెచ్చాను! ఫలితం ఇది.
పది నిముషాల్లో తెమిలి వచ్చింది-"ఏమి టబ్బా!" అనుకొంటూ పొట్లాం విప్పి చూసింది. అరుణ మొహంలో నాకేమీ సంతోషం-కనీసం సంతృప్తి కూడా కన్పించలేదు. అతి సామాన్యమైన వస్తువును చూసినట్టేచూసి తిరిగి టేబుల్ మీద వుంచేసింది.
"ఎలా వుంది?" అన్నాను.
"బాగానేవుంది దానికేంగానీ మీరు రెడీ యేనా? టైంకా వొస్తోంది. మనం దారిలో ఓ ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవాలి కూడా" అంటూ బూట్లు కట్టుకోసాగింది.
"అరుణా!" అన్నాను అయోమయంగా. నా మనసేమై పోతూందో నాకే అర్ధంకావటం లేదు-"లేవరేం?" అంటూ దగ్గిరికొచ్చింది.
"నేను తెచ్చిన చీర కట్టుకో అరుణా!" అన్నాను.
"ఇప్పుడా?" అంది ఆశ్చర్యంగా.
"అవును నీచీరేం నాకు బావులేదు. నేతెచ్చిన చీరకట్టుకొని వాలుజడ వేసుకొని పువ్వులు పెట్టుకో. బొమ్మలా ఆబొట్టేవిటి చెప్పు? చిన్న కుంకుమబొట్టు పెట్టుకో. అలా నిన్ను చూడాలని ....."
"అబ్బ! ఇప్పుడేవిటి మళ్ళా టైం కూడా లేదే" అంది ఇబ్బందిగా.
"టైం లేకేమైంది? ఇంకా గంటపైనే వుంది. నామాట వినవా?" అన్నాను బుజ్జగిస్తున్నట్టు.
"ఐనా నాడ్రెస్సింగు మీకెందుకు నచ్చలే దేవిటి? ఫేషన్ తెలీకపోతేసరి." అంది మూతి ముడుచుకొంటూ.
"పోనీ అలానే అనుకో. నేనెంతో కోరికతో తెచ్చాను. ఆ చీర కట్టుకోకూడదా? నాకోసం.."
"మీరెన్ని చెప్పండి. నేనిప్పుడు మార్చను. ఇప్పుడంతా ఇదే ఫేషను. ఐనా మీ డ్రెస్సేదైనా నాకు నచ్చక పోతే మార్చేస్తారేవిటి?"
"తక్షణం. ఏం? ఈబట్టలు మార్చెయ్ మంటావా? నా పెట్టి తీసి నీకు నచ్చేవి తీసి ఇవ్వు. కట్టుకుంటాను. నీకంటికే ఇంపులేనప్పుడు నాముస్తాబెందుకు?"
"ఏమో! నేను మాత్రం ఎదటివాళ్ళకోసం నా సర్ధాలు పాడుచేసుకోను."
"అయితే చీర మార్చవన్నమాట." తక్షణంగానే అన్నాను.
"దాని బోర్డరేవిటో మోటుగా వుంది. మీకంత కావాలంటే రేపుదయం ఇంట్లో వున్న ప్పుడు కట్టుకుంటాను."
"అది బయటకు కట్టుకు వెళ్ళదగ్గది కాదన్న మాట."
"నేనేం అలా అనలేదు. వూరికే వాదం వేసుకో కండి. లేవండి టైమవుతోంది."
"నువ్వు చీర మార్చితే తప్ప నేను రాను వెళ్ళు" "బెదిరిస్తున్నారా?"
"నిన్నా? బెదురుతాననేగా? నేను రావాలంటే చీర మార్చు" "రాకపోతే మానండి. నేను వెళ్తాను. ఫ్రెండ్ తో కూడా చెప్పాను. ప్రతీసారి మాటమార్చటం సభ్యత కాదు."
తక్షణం హేండ్ బాగు తీసుకొని నాకళ్ళముందు నుంచే కదిలిపోయింది. మరుక్షణంలోనే కాంపౌండ్ లోంచి కారు దూసుకుపోయింది.
విభ్రాంతున్నయిపోయాను. తల తిరిగి పోయింది. కూర్చున్నచోటే వుండిపోయాను. అరుణ! ఏ స్థితిలో వుందో బాగా అర్ధమైంది. సరే! ఇకనేమీ ఆలోచించలేదు. వెంటనే లేచి టేబుల్ మీది చీర పెట్లో పెట్టుకున్నాను. క్రింద కెళ్ళి గోపీని పిలిచాను.
"టాక్సీగానీ రిక్షాగానీ ఏదైనా పిలు."
గోపీ రోడ్డుమీదకి పరిగెత్తాడు. రిక్షా వచ్చింది.
"నా పెట్టీ బెడ్డింగూ తీసుకురా!" అన్నాను.
"మీనా బాబు?" అన్నాడు అర్ధంగానట్టు.
"అవునోయ్! త్వరగా తీసుకురా!"
రిక్షా కదిలేముందు గోపీచేతులో రెండు రూపాయల కాయితం పెడుతూ "అయ్యగారొచ్చాక చెప్పు నేవెళ్ళి పోయానని." అన్నాడు.
వాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి- "బాబూ!" అన్నాడు.
"అవునోయ్!" అంటూండగా రిక్షా కదిలింది. రాను రాను మేడదూరమై పోయింది. ఆ మేడలో వున్నది ఒక్కరోజు! క్రిందటి సాయంత్రంనుంచి మరుసటి సాయంత్రం వరకూ! ఇరవై నాలుగు గంటలు! కాని ఆ స్వల్పకాలంలో నేననుభవించింది నూరేళ్ళ అనుభవం. ఒక్కరోజు గడపటానికి ఎన్నిసార్లు మనసుని అణుచుకోవాల్సి వచ్చిందో- ఎన్ని అయిష్టాలు సరిపెట్టుకోవాల్సి వచ్చిందో-నాకే తెలుసు.
రైల్లో కూర్చుని తేలిగ్గా గాలి పీల్చాను. రాత్రి పదిగంటల ప్రాంతంలో ఓ స్టేషన్ లో రైలాగితే ఆవూళ్ళో ఫ్రండు ట్రాన్స్ఫరై కొత్తగా వచ్చిన సంగతి గుర్తువచ్చింది. అడ్రసేమంత ఇబ్బంది పెట్టేదికాదు. వెంటనే ఆ స్టేషన్ లో దిగిపోయాను. హోటల్లో భోంచేశాను.
తలుపు తెరిచి నన్ను చూస్తూనే ఆనందం పట్టలేక కౌగలించుకొన్నాడు-"ఎన్నాళ్ళకిలా? ఎంత దయరా! నీవంటి లక్షాధికార్లు దయచేస్తే ఇల్లు పావనం ఐపోతుంది కదరా! ఏమిటి వీడేషాలు? అంతా బావున్నారా? చెల్లాయ్ ఎక్కడుంది? కాపరానికి వచ్చిందా? ఆఁ" అంటూ నిలువునా పరమర్శతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
వాడి పట్టుదలతో రెండు రోజులున్నాను. ఆ రెండు రోజుల్లో వాడి దాంపత్యం సుఖంగా సాగిపోతూందని అర్ధం చేసుకున్నాను. వాడి భార్య అందమైందీ-అణుకువైందీను. నేనున్నా నని వాడు ఆఫీసుకు శలవు పెట్టేశాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం. నా దాంపత్యాన్ని గురించి తరిచి తరిచి అడిగాడు. వాడితో నిజం చెప్పుకోవాలనిపించినా అల్లరిపాలవటం ఇష్టంలేక ముభావంగా తప్పించుకున్నాను.
"ఏవిటిరా ఉసూరుమంటూంటావ్? అంత డబ్బు మెయిన్ టైన్ చేసుకోటం ఇబ్బందిగా వుందా? నన్ను సెక్రెటరీ గా పెట్టుకో మూడు వందలు జీతం పారెయ్. పూర్తి విశ్వాసంతో పని చేస్తా నీకూ నాకూ హాయి".
"నువ్వలా పిచ్చెక్కినట్టు వాగకు. నేనేం లక్షాధికారినీగాను సింగినాదం గాను" అన్నాను చిరాగ్గా.
"పోనీలేగానీ నువ్వు క్రికెట్ నిర్లక్ష్యం చేశావంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుందిసుమా! అది నీ ప్రేయసిని చెప్పేవాడివి. అలా వదిలేశావేం?" అన్నాడు ధోరణిమార్చి నాకోసం తగ్గించేందుకు క్రిందటి రోజు క్లబ్బుకెళ్ళినప్పుడు నా ఆటవాడు చూడబట్టి.
