10
నేను క్షేమమని ప్రత్యేకంగా వ్రాయనవసరం లేదనుకుంటాను. ఇంకొకరి ఆరోగ్యాలు కాపాడే మేం, మా ఆరోగ్యాలు చూసుకోవడానికే తీరు బాటు ఉండదు. ఏదేనా వస్తే పరధ్యానంగా ఓ మాత్ర వేసుకోవడం, నిద్రపోవడం. మంచం పట్టేస్తే తప్ప మేం మిగతా టైమంతా ఆరోగ్యంగా ఉన్నట్టే" అని వ్రాసింది జయప్రద, 'నువ్వు కులాసాయేనా' అని వ్రాస్తే. ఒక్కటికి పదిమాటలు వ్రాయడం, మాట్లాడటం జయ స్వభావం.
"అదిసరే. నన్నడిగావు-బాగానే ఉంది. నీ ఆరోగ్యం ఎలా ఉందిప్పుడు? అప్పట్లాగే ఉన్నావా?"
ఫ్రెండు నంటావు, అక్కనంటావు ఇంకా ఎన్నెన్నో కబుర్లు చెపుతావు-కనిపించినప్పుడు మనిషి చాటయితే మరి దొరకవు.
అసలు నీ ఆరోగ్యం గురించి నీకే శ్రద్ధ లేదని పిస్తుంది నాకు. కాకపోతే నాలుగు రోజులు నా దగ్గరి కొస్తానంటే కొడతాడా మీ ఆయన?
డాక్టర్నయి ఇంతమంది ఆరోగ్యాలు బాగుచేస్తూ, నీకు ఉండే బాధే ముఖ్యంగా నా బ్రతుకు తెరువు కదా-నువ్వెందుకు రాకూడదు?"
"అమ్మా.... అమ్మా!" పాప మెట్లెక్కుతూ పిలుస్తూంది.
"ఆఁ..." విసుగ్గా అంది లీల.
"నిన్ను నాన్న పిలుస్తున్నారు..."
"ఎందుకు....నాకు తలనెప్పిగా ఉంది. ఆయన్నే రమ్మను."
"సరే..." గబగబా పాప వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న పాపవైపు చూస్తూ బాధగా నిట్టూర్చింది లీల. తీసుకొచ్చి రెండు రోజులయినా ఈయన ఈ పాప విషయం చెప్పక తప్పించుకు తిరుగుతున్నా రెందుకో?
'ఎక్కడిది?' అంటే 'తీసుకొచ్చాను' అంటాడు. తీసుకొస్తూంటే వాళ్ళ వాళ్ళూరుకున్నారా? కాక...అంత చనువు ఉందా? చనువు ఉంటే పేరెందుకు చెప్పలేరు? అయినా అంతగా పిల్లల్ని వదుల్చుకోవాలని తాపత్రయం ఉన్నవాళ్ళూ, మర్యాద తెలిసినవాళ్ళూ అయితే ఇంటికి వచ్చి ఇద్దరికీ కలిసి పాపని ఒప్పగిస్తే తన కీ తృప్తి ఉండేదిగా?
"లీలా.... ఓ లీలా..." ప్రభాకరం వచ్చాడు.
"......"
"ఏమిటి ఒక్కదానివీ కూర్చుని.....ఏ లోకాల్లో విహరిస్తున్నావు? పలకడం లేదు!' హుషారుగా పలకరించాడు.
"అబ్బే.... లేదండీ."
"ఏదో సీరియస్ గా ఉన్నావు ఓ.... మీ ఫ్రెండ్ ఉత్తరం చదువుతున్నావా? అయితే ఇప్పట్లో నువ్వు మా లోకంలోకి రావులే. మళ్ళా ఏమిటి, గురూప దేశం?"
"అదేం లేదండీ. ఓ సారి రమ్మని వ్రాసింది. జవాబేం రాద్దామా అని ఆలోచిస్తున్నాను."
"పాపెక్కడ దొరికిందో తెలుసా?"
"ఎక్కడ?"
'చెబుతాడు - ఏదో కథ అల్లబోతున్నాడా?' అని అనుమానంగా, కర్కశంగా వచ్చింది ధ్వని.
"వెంకన్నాయుడుగారి మామిడితోటలో గంటై కనిపించక గింజుకుంటున్నానా..."
"అదా ఏమిటీ? గంట కిందట కనిపించక నీతో కూడా కేకేసి చెప్పాగా? నువ్వు వెనకింట్లో పని చేసుకుంటున్నావు. సరేకదా అని నేను చూస్తూంటే ఎదురింటివాళ్ళ నారాయణ కనిపించి 'మీ పాపేమిటండీ-అలా వెళుతోంది?' అన్నాడు. పది నిమిషాల కిందట వెళ్ళిందన్నాడు. రమ్మంటే పెంకితనం చేసిందన్నాడు. వెళ్ళి చూస్తే వెంకన్నాయుడు మామిడితోటలో మన మూర్తి గారి అమ్మాయిలతో ఆడుకొంటోంది ఎప్పుడు స్నేహం చేసుకుందో మరి-హుషారుగా ఎగిరేస్తూ ఎంత పిలిచినా రాదు ..."
"చిన్న పిల్లలు ఇట్టే కలిసిపోతారు" అంది నిర్లిప్తంగా లీల.
"కానీ.... నిజంగా ఎంత భయమనిపించిందో చెపితే నమ్మవు..."
"ఇప్పుడు దొరికిందిగా-ఇంకెందుకూ బాధ?"
"సరే.... నేను చెప్పాలనుకున్న దొకటీ చెపుతున్న దొకటీ..."
"ఏమిటి చెప్పాలనుకొన్నారో చెప్పండి" అంది ఉత్తరం పక్కకి పడేస్తూ.
"పాపని తీసుకుని వస్తూంటే బలరామయ్యగారు కనిపించి పలకరించారు. పాప చాలా బాగుందన్నారు. పేరేమిటని అడిగారు. ఏం చెప్పాలో తోచలేదు..."
"మరేం చెప్పారు?" నవ్వింది లీల. ఆ నవ్వులో చిన్న హేళన ఉంది. అది అతను గమనించనంత హుషారుగా ఉన్నాడు.
"ఏం తోచలేదు. పాపా అని పిలుస్తున్నామండీ, ఇంకా ఏం అనుకోలేదు అన్నాను. ఏదో కొంత ఆలోచించి పేరు పెట్టాలి ముందు."
"దాని కంత పెద్ద ఆలోచనెందుకు?
"పేరు మార్చడానికి కాదోయ్-ఏం పేరు పెట్టాలా అని!"
"వీదో మీకు నచ్చిన పేరు పెట్టండి."
"అబ్బా... పెద్ద సలహాయే ఇచ్చావే! కాకపోతే నచ్చని పేరు పెడతామా ఎక్కడైనా? నచ్చేపేరు ఏదో నువ్వే చెబుతావని నే నొస్తే..."
"మీకే పేరు నచ్చుతుందో చెప్పండి. అది పెట్టి పిలుద్దాం!"
"అలాకాదు. నీకు నచ్చేదే పెడదాం."
"నాకు నచ్చే పేరా?"
"అవును." అతను నవ్వాడు.
"పోనీ.... జయప్రద అని పెడదామా?"
"అలా ఎందుకు?" అన్నట్టు చూసింది లీల.
మళ్ళీ నవ్వాడు ప్రభాకరం. "అలా అయితే కొంపదీసి ఫామిలీ ప్లానింగ్ అంటూ కూర్చుంటుందేమో!"
"ఏం అంత చదువు చదువుతుందేమోనని ఎందుకనకూడదూ?"
"అమ్మ బాబోయ్....జయప్రద గారిమీద ఈగ వాలనియ్యవే!"
"సరిలెండి పాపం! ఆవిడెందెకు ఈ నామకరణోత్సవం మధ్యని?"
"మరైతే ఏం పేరు పెడదాం, చెప్పు?"
"అబ్బ....అంతగా తెగని సమస్యేమిటండీ ఇది! ఏదో ఒకటి పెట్టక...."
"అయితే...లత అని పిలుద్దామా?"
"అలాగే పిలుచుకోవచ్చు..."
"సరే... ఈ వేళకి డాబా దిగి కిందికి దిగివచ్చే ఉద్దేశ్యం లేదా?"
"రానంటే మాత్రం మీరూ, మీ పాపా ఊరు కొంటారా? నడవండి" అంటూ ప్రభాకరాన్ని అనుసరించింది.
"నమస్కారం, బాబయ్యా!" మెట్లు దగ్గరున్న మామిడిచెట్ల దగ్గర నిలబడి ఉన్నాడు వీరన్న.
"ఏంరా, వీరన్నా.....పొలంనుంచే ఇటు వస్తున్నావా?"
"కాదండి. ఇంటికెల్లే వచ్చానండి."
లీలతోబాటు ప్రభాకరం ఇంట్లోకి వెళ్ళబోతున్న వాడల్లా వీరన్న వాటం గమనించి, "మరేం, ఇలా వచ్చావు!" అన్నాడు.
"అదేనండి, మా లచ్చిమికి పెల్లి నిచ్చయ మైందండి."
"అదివరకే చెప్పావుగా!"
"చిత్తం. లగ్గంకూడా పెట్టమని ఆళ్ళు తొందరెట్టేస్తున్నారండి."
"కుదిరాక ఆలస్యం ఎందుకు మరి....చేసెయ్యి."
"తమరి దయుంటే అలాగే అవుద్ధండీ" అన్నాడు వీరన్న తల గోక్కుంటూ, చేతులు నలుపుకొంటూ.
"బాబయ్యా! పైకం తమరు సద్ధితే మళ్ళీ వంటలో చెల్లేత్తానండి."
"నీ ముఖం చెల్లేస్తావు. ఒక్క పంటలో రెండు వేలిస్తావుట్రా..."

"బాబూ... పుట్టిన కాడ్నుంచీ మీ ఇంటి గుమ్మాలే పట్టుకు బతుకుతున్నాం. ఈ యాల కాకపోతే రేపు మీరు తీసుకోలేరా. పిల్లకి పెల్లాగిపోతే మల్లీ నేను సెయ్యగల్నా, బాబూ..."
"సర్లే... సర్లే... ఏవో కబుర్లు చెపుతావు. ఇచ్చేదాకా వదులుతావు కనకా?" అంటూ లోపలికి వెళ్ళి, బీరువాలోంచి లెక్కపెట్టి, రెండు వేలు తెచ్చి వీరన్న చేతిలో పెట్టాడు.
ప్రభాకరం చర్యకి ఆశ్చర్యపోయింది లీల. నోటు వ్రాయించుకోవడం, వడ్డీతోసహా తిరిగి రాబట్టు కోవడం, దానికి కోర్టు చుట్టూ తిరగడం, తను కాపరానికి వచ్చాక చాలాసార్లే చూసింది. కానీ... ఈ వేళ వడ్డీ లేకపోతే పోనీ, కనీసం కాగితంమీదయినా వ్రాయించుకోక రూపాయి కాదు, రెండు కాదు, రెండు వేలు!
ఇంత మార్పెలా వచ్చింది ఇతనిలో! నిన్నటికి నిన్నా, కమతగాడు ఇంటికి పోతూ చేతులు నలుపుకుంటూ "ఇంటికి చుట్టాలొచ్చారు గింజల్లే" వని అంటే, బస్తాధాన్యం కొలిపించి ఇచ్చేశాడు.
తను ఈ ఇంటికొచ్చిన రెండు నెలల్లోనే ఒక చిత్రమైన ఉదంతం జరిగింది.
రాయవరానికి చెందిన నాలుగెకరాల రైతు పోలయ్య. అతనికి ఇరవై ఏళ్ళనాడు చచ్చిపోయిన తన మామగారు ఐదు వందల రూపాయలు అప్పు ఇచ్చారుట. వడ్డీకి వడ్డీ, దానికి వడ్డీ కట్టుకొని, మూడేసేళ్ళ కో మారు నోటు తిప్పి వ్రాయించుకొంటూ వచ్చారు. అది కోర్టు కెక్కి ఆరు వేలకి డిగ్రీ అయి, నాలుగెకరాల భూమిని ఎటాచ్ చేశారు. భూమి పోతే బతుకే పోయిందని పోలయ్య కొడుకు నాగయ్య నాలుగు ఊళ్లూ తిరిగి వెయ్యి రూపాయలు పోగుచేసుకొచ్చి, ప్రభాకరం కాళ్ళమీద పడ్డాడు. మరొక అయిదువందలకి నోటు వ్రాసి ఇస్తాను-డిక్రీ అమలు పరచకుండా ఈ డబ్బు తీసుకొని కుటుంబాన్ని కాపాడమన్నాడు. ఇంటిల్లపాదీ మొర్రో
మని ఏడ్చారు. అయినా పొలం వేలం వెయ్యాలన్నారు-వేశారు.
ఇది అమానుషమని తన హృదయం మౌనంగా రోదించింది. ఇలాంటివి జరిగేటప్పుడు దయ చూపించడం అవసరమని ప్రసంగవశాత్తూ తాను అతనితో అన్నది. కానీ, అప్పుడే కాదు, ఎప్పుడూ దయగా ప్రవర్తించడం కానరాలేదు.
ఎన్నోసార్లు.... ఎన్ని విధాలుగానో మార్చాలని చూసి, ఓడిపోయిన తనేనా....ఈ నాడు.... ఇతనిలోఇంత మార్పుని గమనిస్తున్నది. హఠాత్తుగా వచ్చిన ఈ ఉదారస్వభావానికి కారణమేమిటి? ఈ తెచ్చి పెట్టుకున్న హుషారు ఇంతలో ఆగుతుందా - ఇతనిలో ఈ మార్పు రెండు రోజులలోనూ ఇంతగా పెరిగిందే - మరి ఇన్నాళ్ళకు నమ్మి ఆస్తినంతా ఇచ్చేటట్టు ఉన్నారే! ఈ మార్పు అతనిలో ఎందుకు వచ్చింది? ఎలా? ఎవరి వల్ల?
"లీలా... నేను వీరన్నకి డబ్బు ఇస్తూంటే పాప పక్కనే ఉంది. వడు దాన్ని ఎత్తుకొని "పాపగారూ, మీ పప్పన్నంనాడు మా ఇంటిల్లిపాదికీ బట్టలెడితే కానీ.... మిమ్మల్ని మేం వదలం?' అన్నాడు. నా కేదో....అప్పుడే మన పాప పెరిగిపోయినట్లూ, బాధ్యత నెత్తి మీద తన్నుతున్నట్టూ అనిపించి, కష్టాలు కళ్ళకి కనబడ్డాయి. లీలా, ఇలాంటివాళ్ళకి సహాయం చేస్తేనే చేసినట్టు" అన్నాడు. అతను నిన్న అతని బాధ్యతా, బరువూ-ఇతరుల కష్టాల్ని నెత్తిమీద వేసుకొనేంత దాకా వచ్చాయా అనుకొంది లీల.
* * *
