"ఏంటి డాడీ! నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" నయనబాబు అడిగాడు.
"పెళ్ళి పిలుపులప్పుడు నీకు చెప్పలేదు నయన్! గోవాలో సెటిల్ అయిన చిన్నప్పటి నా ఫ్రెండ్స్ వీళ్ళు. మీ అమ్మకి కూడా బాగా తెలుసు మీ మమ్మీ ఇప్పుడు ఉన్నట్లయితే వీళ్ళు మనకి ఎంత బెస్టు ఫ్రెండ్సో చెప్పేది. పాతడైరీలు తిరగేస్తుంటే అడ్రస్ చిక్కింది. శుభలేఖ పంపించాను. నామీదగౌరవంతో వెంటనే బయలుదేరి వచ్చారు" సురేంద్రనాథ్ తన వాళ్ళందరికి చెప్పినట్లే కొడుక్కి కూడా ఈ కల్పిత కథే చెప్పాడు.
సి.బి.ఐ. అధికారి ముందే హెచ్చరించాడు. ఏమీ లేకపోతే మేమెలా వచ్చామో అలాగే పెళ్ళి మాత్రం చూపి చల్లగా జారిపోతాము. అలాకాక శీతల్ రాణి హంతకురాలు అని తేలితే మాత్రం క్షణం ఆగం.
పెళ్ళి ఆగుతుంది. గోల తప్పదు. మంచి జరిగినా, చెడు జరిగినా మీరు నోరు మెదపకూడదు అని.
"సురేంద్రనాథ్ నోరు మెదపదల్చుకోలేదు. ఇది మామూలు విషయం కాదు. మర్డర్ కేసుకి సంబంధించిన వ్యవహారం.
"నయన్!" ఫ్రెండ్స్ పిలవటంతో "మళ్ళీ వచ్చి డాడ్!" అని చెప్పి నయనబాబు తండ్రి దగ్గరనుంచి లేచి అవతలికి వెళ్ళాడు.
వంటరిగా గదిలో మిగిలిపోయిన సురేంద్రనాధ్ కళ్ళు మూసుకుని సోఫాకి వెనక్కి జారగిలబడి తీవ్రాలోచనలో మునిగిపోయాడు. ఆయనకంతా అయోమయంగా వుంది.
అసలు తెల్లవారుతుందా లేదా?
ఈ పెళ్ళి అవుతుందా కాదా?
పెళ్ళికూతురు హంతకురాలు అవునో కాదో!
మనసు మధించే ఆలోచనలతో సతమవుతున్న అలా చాలాసేపు వుండిపోయాడు సురేంద్రనాథ్ ఆ ముందు జరిగింది సినిమారీళ్ళులాగా కనులముందు కదులాడుతున్నాయి.
తనని గురించి సంఘానికి తెలిసింది చాలా తక్కువ తండ్రి తాతలు సంపాదించి పెట్టిన ధనం చాలానే వుండేది. ఈ సంఘంలో తను రిచ్ మాన్. భార్యలేదు, వక్కకొడుకు. తనకొడుక్కి పిల్లనిద్దామని చాలామంది చూశారు కాని తను కోరిన ధనం వాళ్ళు ఇవ్వలేరు, పైగా నయన్ ఆడపిల్లల నెవరిని యిష్టపడలేదు.
ఇదిలా వుండగా తనకి బిజినెస్ లో బోలెడు నష్టం వచ్చింది. రేసుల్లో సర్వం కోల్పోయాడు. తను తండ్రి తాతలాగా కాదు, వ్యసనానికి బానిస. దాంతో ఆస్తీ తరిగిపోయింది. తనేదో కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నా నని చెప్పి వేలు, లక్షలు దొరికిన చోటనల్లా అప్పుడే చేశాడు. పోనీ అదైనా నిలిచిందా? అలాంటిదేమీ లేక డబ్బు ఇచ్చినవాళ్ళ వత్తిడి ఎక్కువయింది.
సరిగ్గా ఈ సమయంలో-
గోవర్ధనరావు తనతో వియ్యం పొందడానికి వచ్చాడు. మధ్యవర్తి కబురు తెచ్చాడు. నయన్ పెళ్ళంటూ చేసుకుంటే శీతల్ రాణిని తప్ప ఎవరినీ చేసుకోనన్నాడు.
"మా అమ్మాయిని చాలా గారాబంగా పెంచాము. పెళ్ళి చేసుకుని మమ్మల్ని వదలి వెళ్ళాలంటే ఇష్టపడడం లేదు. పెళ్ళి పేరు చెబితేచాలు ఏదో ఒక వంక పెట్టి పెళ్ళి చేసుకోనంటున్నది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చాలి అని వాళ్ళ అమ్మ పట్టుదల. పురుషులన్నా, ఈ కాలం వాళ్ళ ప్రేమ గోల అన్నా మా శీతల్ కి భయం. ఒక విధంగా చెప్పాలంటే ఇరవై ఏళ్ళు దాటిన అమ్మాయిలా కాక పదేళ్ళ పాపలా మనసు ఎదగకుండా వుంది. పెళ్ళంటే ఎలాగో అలా ఒప్పించగలను. పెళ్ళి అయింతరువాత ఇక్కడే వుంటే మా మీద ప్రేమతో, బెంగతో కాపురానికి కూడా వెళ్ళనంటుందేమో, పెళ్ళి కాంగానే హనీమూన్ నెపంతో అమెరికా పంపిస్తాను. అక్కడ వున్న మా కంపెనీ బ్రాంచీలో మేనేజర్ అండ్ డైరెక్టర్ గా కొన్నాళ్ళు దంపతులు అక్కడ వుంటే..."
గోవర్ధనరావు అలా అని చెపుతుంటే అప్పుడే తనకి పెద్ద అనుమానం వచ్చింది. ఈ కాలం చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా ధనవంతుల కూతుళ్ళు ప్రేమలంటూ వేసే వెర్రివేషాలు, తాత్కాలికంగా తిరిగే తిరుగుళ్ళు చెడ్డ అలవాట్లు- వీటిల్లో ఏదో ఒకటి గోవర్ధనరావు కూతురుకి వుంది. అసలు విషయం దాచి మనిషి యెదిగింది గాని మనసు ఎదగలేదంటూ కట్టుకథ చాలా చక్కగా వినిపించాడు.
గోవర్ధనరావు కూతురు ఏం చేసిందో తనకి తెలియదు. ఏదో కారణం వున్న మాట వాస్తవం.
నయన్ ఎప్పుడో శీతల్ ని చూశాడు. ఆ పిల్లని తప్ప మరో పిల్లని పెళ్ళాడనని కూర్చున్నాడు.
తనకి అర్జెంట్ గా లక్షలు కావాలి. కావాలి అంటే వచ్చే మార్గం లేదు. తన లోగుట్టు పార్టనర్స్ కి తెలియదు. తెలిసిన మరుక్షణం వాళ్ళంతా కలసి మిగిలిందేదో లాక్కుని తనకి గోచీ గుడ్డ మాత్రం మిగిల్చి సెంటర్ లో నిలబెడతారు. ఆ అవమానం కన్నా చావటం నయం.
బంగారు పూలు అమ్మిన చోట కట్టె పుల్లలు, చితుకులు అమ్మే పరిస్థితి తనకి వచ్చింది. ఈ ఆపద తొలిగి పూర్వవైభోగం తను పొందాలంటే శీతల్ రాణిని తన కోకలుగా చేసుకోవాలి. గోవర్ధనరావుతో వియ్యం పొందాలి. ఇది తనకొచ్చిన గోల్డెన్ ఛాన్స్.
