Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 10

 

                                  నిధి

                                                                      వసుంధర
    "చెల్లాయ్!'అన్న పిలుపు దూరం నుంచి వినపద్దపుడు నేను పట్టించుకోలేదు.
    నాకు అన్నలూ, అక్కలూ లేరు. ఆమాట కొస్తే నా అనే వారెవ్వరూ లేరు. అయితే ఈసారి ఇంచుమించు నా ప్రక్క నుంచే చెల్లాయ్ అన్న పిలుపు వినపడడమూ, ఎవరో నా చేయి బలంగా పట్టుకోవడమూ జరగడం తో నేను చలించడం మాత్రమే కాదు -- విపరీతంగా ఆశ్చర్యపడ్డాను.
    నా చేయి పట్టుకున్నది ఒకయువకుడు. ఇద్దరి కళ్ళూ కలవగానే అతను అంతులేని ఆనందాన్ని ప్రకటిస్తూ "చెల్లాయ్ --నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావా?' అన్నాడు.
    "నేను బ్రతికే ఉన్నాను కానీ నాపేరు చెల్లాయ్ కాదు " అన్నాను జావాబుగా.
    అతను నాచేయి వదిలిపెట్టి --" నామీద నీకింకా కోపం పోలేదన్న మాట." అన్నాడు.
    "ముక్కు ముఖం ఎరగనిఆడపిల్ల చేయి పట్టుకున్నాక పొరబాటుని అంగీకరిస్తూ క్షమించమని అడిగినా ఆపిల్ల కోపం పోకవచ్చు. అటువంటప్పుడు చేసిన తప్పుకు ఇంకా ఏ క్షమార్పనా అడగని నీమీద కోపం నాకు ఇంకా తగ్గక పోవడం అసహజం కాదనుకుంటాను --" అని నాలుగడుగులు ముందుకు వేశాను.
    నాకు తెలుసు కాస్త కంటికి నదురుగా కనిపించే ఆడపిల్లని ఏదో వంకతో తాకడం, పలకరించడం -- ఆతరువాత దాన్నొక ఘనకార్యంగా స్నేహితుల మధ్య చెప్పుకుని మురిసిపోవడం ఈనాటి యువకులలో ఒక పెద్ద ఫేషన్ గా వస్తోంది. అందుకే నేనా అపరిచిత యువకుని విచిత్ర ప్రవర్తనకు అర్ధం గురించి ఎక్కువగా ఆలోచించకుండానే ముందుకు దారి తీశాను.
    అయితే అపరిచిత యువకుడు నన్ను వదలలేదు. 'అలా ముక్కు ముఖం ఎరగని దానిలా నటిస్తా వేవిటే -- ఏదో నిన్న తగువు లాట వచ్చినంత మాత్రాన మనమిద్దరం అన్నా చెల్లెళ్ళు కాకుండా పోతామా?" అన్నాడు.
    నేను ఆగాను. కుర్రాడి సంభోధన నాకు అంత నచ్చలేదు.
    కాస్త తీవ్రంగానే అతని కళ్ళలోకి చూసి -- "చేయి పట్టుకోవడం కోసం చెల్లాయ్ అని పిలవడాన్ని నేను క్షమించగల నేమోగానీ ఏమే అనడం కోసం చెల్లాయ్ అనే వాళ్ళ చెంప పగలగోట్టందే నా మనసు ఊరట చెందదు," అన్నాను.
    ఆ యువకుడి ముఖం తెల్లబోయినట్లు, గమనించాను. "నువ్వు నిజంగా నా చెల్లాయి వి కాదా?' అనడిగాడు. అతని కంఠం లో జాలి ధ్వనించింది. అతని ముఖంలో దీనత్వం గోచరించింది. 'అయినా నా వెర్రి గానీ చచ్చిపోయిన చెల్లాయ్ మళ్ళీ బ్రతికి వస్తుందా?' అన్నాడు అదోలా.
    ఎందుకో నా మనసు కరిగింది. "నీకు అచ్చం నాలాగే ఉండే చేల్లెలుండేదా?" అని జాలిగా అడిగాను.
    అతని ముఖంలో మళ్ళీ వెలుగు కనబడింది. నీలాంటి చెల్లలు కాదు నువ్వే నా చెల్లెలివి" అన్నాడు. ఈసారి అతని కంఠం లో ధైర్యం ధ్వనించింది. ముఖంలో నమ్మకం గోచరించింది.
    నేను చిన్నగా నవ్వి -- "నాపేరు వసంత. మా అమ్మకు నేను ఏకైక సంతానం. ఇదే ఊరిలో మా అమ్మా , నేనూ బహుశా నాకు రెండు మూడేళ్ళ వయసప్పటి నుంచి ఉంటూ వస్తున్నాము. నాకు తండ్రి లేడు. నేనేరిగున్నంత  వరకూ పిన్నిలూ, బాబాయి లూ వగైరా బంధువు లెవ్వరూ లేరు. గత రెండు మాసాల నుంచి నేను తల్లి కూడా లేని అనాధనయ్యాను. ఇప్పుడు నేను ఏకాకిని. ఇటువంటి నన్ను పట్టుకుని నామీదింకా కోపం తగ్గలేదా చెల్లాయ్" అంటూ ఎవరైనా అడిగితె ఏం జవాబు చెప్పగలను" అనేసి ముందుకు నడిచాను. అతను నిశ్చేష్టుడయ్యాడు.
    అమ్మ తలపులోకి రాగానే మనసంతా పాడయింది నాకు. చిన్నతనం నుంచి తెలిసిన ఏకైక ఆప్త బంధువు అమ్మ నన్ను రెండు నెలల క్రితం ఏకాకిని చేసి వెళ్ళిపోవడం నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక భయంకరమైన నిజం.

                                    2
    "నన్ను మీరు క్షమించాలి." అన్నాడతను.
    పార్కులో ఒక మూల బెంచీ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడి చూశాను . అతనే!
    "ఎందుకో?' అన్నాను, కాస్త ప్రసన్నంగానే అతని వంక చూస్తూ.
    అతను మౌనంగానే తన జేబులోంచి ఒక ఫోటో తీసి నాకిచ్చాడు. నేను చూశాను. "నాఫోటో మీ దగ్గర కేలా వచ్చింది" అన్నాను ఆశ్చర్యంగా.
    "అది నా చెల్లెలు సుజాత ఫోటో. కులం తక్కువ వాడిని ప్రేమించి నందుకు ఇంట్లో దాన్ని నాతొ సహా అందరూ నానామాటలూ అన్నాము. తర్వాత ప్రేమించిన వాడు దాన్ని మోసగించడం జరిగింది. ఎవడ్ని నమ్మి అది మమ్మల్నందర్నీ వదిలిపెట్టి వెళ్ళిందో వాడే మోసం చేసేసరికి అది ఏమయ్యిందో మాకు తెలియదు. కానీ తన జీవితం ముగియబోతున్నట్లు ఇంటికి రాసిన ఉత్తరం మాత్రం నాదగ్గర వుంది. అందువల్లనే నిన్న నేను మీ దగ్గర విచిత్రంగా ప్రవర్తించడం జరిగింది. ప్రాణాల కంటే మిన్నగా భావించే చెల్లెలు మరి ఈ లోకంలో లేదని అనుకుంటున్న నా కళ్ళ ముందు మీరు కనబడ్డప్పుడు నా మనస్సులో భావాలేలా ఉంటాయో ఈ ఫోటో చూసి మీరే ఊహించ గలరు" అన్నాడు యువకుడు.
    నేను నవ్వి "మనిషిని మనిషి ఇంతగా పోలి ఉండడం అసంభవం. ఇది మీ చెల్లెలి ఫోటో అయుంటుందని నేననుకోవడం లేదు--" అన్నాను.
    అతను షాక్ తిన్నట్టుగా ముఖం పెట్టి -- "అంటే మీ అభిప్రాయం?' అన్నాడు.
    "మీ కిష్టం లేని వాడిని ప్రేమించి నందుకు ఇల్లు వదిలి పోవడం మినహాగా మరో గత్యంతరం లేదు. ప్రేమించడనుకున్న వాడు మోసం చేస్తే ఆత్మహత్య తప్ప మరే గత్యంతరం లేదు. ప్రాణాల కన్న మిన్నగా భావిస్తున్నాననుకునే మీ ప్రేమ మీ చెల్లెలికి చూపించిన దారులని, ఇటువంటి మీకు చెల్లెలు సజీవంగా కనబడగానే ఆనందానికి బదులు ప్రస్తుతం ఎటువంటి నీచపు జీవితం గడుపుతోందో నన్న అనుమానమూ, దానికి తోడుగా ఆగ్రహమూ రావాలి. అలా జరగలేదంటే నేను మీ చెల్లెలిని పోలి ఉండలేదన్న మాట" అన్నాను.
    అతను నోట మాట లేకుండా ఒక్క క్షణం పాటు నావైపే చూస్తూ  ఉండి పోయాడు. ఆ తర్వాత ఫోటో కోసమన్నట్టుగా చేయి జాపాడు. నేనివ్వగానే ఫోటో తీసుకుని జేబులో పెట్టుకుని మారు మాటాడకుండా వెళ్ళిపోయాడు.
    వెళ్ళిపోతున్న అతని వంకే చూస్తూ అలోచోస్తున్నాను. అతడిని అనుకోకుండానే నేనేడిపిస్తున్నానా అన్న ఆలోచన క్షణ మాత్రం నాలో కలిగింది.
    అప్పుడే నాకు గుర్తుకు వచ్చింది. అతను నన్ను క్షమార్పణ అడగటానికి వచ్చి నేను క్షమించానో లేదో తెలుసుకో కుండనేమధ్యలో వెళ్ళి పోయాడు. ఇంతకీ అతన్ని నేను క్షమించానో లేదో నాకే తెలియదు.

                                     3

    "అరె! సుజాత!" అని నన్ను చూసి ఆశ్చర్య పోయిన ఓ యువతి వంక పరీక్షగా చూశాను. వయసు పదహారు కీ ఇరవై కీ మధ్యలో ఉండవచ్చు. మనిషి నాజూగ్గా ఉంది.
    "నన్నేనా మీరు సుజాతా అంటున్నది?" అన్నాను.
    "నిన్ను కాక మరెవర్ని అలా పిలుస్తాను --నాకు తెలిసిన సుజాతావు నువొకత్తేవె కదా!" అని నేను మళ్ళీ జవాబిచ్చే లోగానే -- "ఇంతకీ ఈ వూరేలా వచ్చేవే..." అనడిగింది.
    నేను ఇబ్బందిగా నవ్వి --"నాకు తెలిసినంత వరకూ నా పేరు సుజాత కాదు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచీ ఇక్కడే ఈ ఊళ్ళో నే ఉంటున్నాను. నాకు జ్ఞానం వచ్చి కనీసం పన్నెండేళ్ళు అయుంటుందని నా అంచనా!" అన్నాను.
    "నాతో రెండు సంవత్సరాలు నా ఊళ్ళో నా ఆత్మీయు రాలిగా మెలగిన సుజాత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో నే ఉంటోందంటే నన్ను నేనే నమ్మలేనేమో --" అందా యువతి.
    "మీరు పొరబడ్డారు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానని అన్నాను. కానీ జ్ఞానం రాక మునుపు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా మొత్తం ఈ ఊరిలోని నా నివాస కాలం, కనీసం పద్నాలుగు సంవత్సరాలుంటుంది."
    "ఏంటే ఈడోంక తిరుగుడు మాటలూ - ఇంట్లో దెబ్బలాడి కోరుకున్న వాడితో ఎక్కడికో వెళ్ళి పోయావని విన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే నిన్ను చూడ్డం ఎంతో వుత్సాహంతో నిన్ను పలకరిస్తే నువ్వు ఏమేమిటో మాట్లాడుతున్నావు. నా సుజాతను నేను గుర్తు పట్టలేననుకోకు. నేను నీ స్నేహితురాలిని. నీ ఉనికి రహస్యంగా వుంచడం అవసరమని నీవనుకుంటే అందుకు నేను నీకు అడ్డంకి కాబోను. దయుంచి ఈ పిచ్చి మాటలు కట్టి పెట్టి ఎప్పటి సుజాతలా నాతొ మాట్లాడు."
    "చూడండి....మీరెవరో నాకు నిజంగా తెలియదు. నేను ఎప్పటి సుజాతలా మాట్లాడడం సంగతి అటుంది. ఎప్పటికీ సుజాతను కానని గుర్తించండి. నాపేరు వసంత మీకేమైనా సందేహాలుంటే ఇక్కడే నేను చదివిన స్కూల్లో ని రికార్డు లూ, ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఆఫీసులోని నా కొలీగ్స్ వగైరా ల వల్ల తీరగలవు. కోరిన వాడిని వివాహం చేసుకోడానికి ఇంట్లో పెద్దలతో దెబ్బ లాడవలసిన అగత్యం నాకు లేదు. నా ఇంటికి నేనే పెద్దను. నాతొ మీరు పరిచయాన్నభిలషించే మాటయితే నేను సుజాతనే కానవసరం లేదు."
    ఆ యువతి ఆశ్చర్యంగా నా వంక చూస్తూ ---------- "నువ్వు ....నువ్వు ...మీరు....మీరు.....సుజాత కాదంటే నా కళ్ళనే నేనే నమ్మలేక పోతున్నాను. మీరు చెప్పేది నిజమయితే నాకు ప్రపంచంలో ఇంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన వుండదని పిస్తోంది" అంది.
    నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీకళ్ళలో మొదట కనిపించిన నమ్మకమూ తర్వాత కనిపించిన ఆశ్చర్యమూ అసలు నేను వసంత నేనా అని నన్ను నేనే అనుమానించే స్థితికి తీసుకొచ్చాయి." అని ఒక్క నిముషం ఆగి "ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే మీరు నా ఇంటికి కానీ, ఆఫీసు కు గానీ రావచ్చును" --- అంటూ ఆ రెండు అడ్రసు లూ ఆమె కిచ్చాను.
    ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లు లేదు. కలలో మనిషిలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పోయింది. ఆమె దృష్టి నుంచి కనుమరుగయ్యాక నాకు గుర్తు కొచ్చింది.  నాకామె పేరు తెలీదు, ఆమె నాకు తన చిరునామా ఇవ్వలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS