కలల కన్నయ్య

కన్నయ్యకు తల్లీ తండ్రి లేరు. శివపురం గ్రామ ప్రజల దయాధర్మ భిక్షం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు వాడు.
అయితే కన్నయ్యే ప్పుడు దిగులుగా వుండడు. ప్రపంచంలోని సంతోషమంతా తనదే అన్నట్లు ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు వాడికి బద్ధకం లేదు. ఎప్పుడూ ఎవరికో ఏదో పని చేస్తుంటాడు. ఎవరినీ దేనికీ విసుక్కోడు. వాడి ఓర్పు అనంతం.
గురువయ్య ఆ ఊరికి పెద్ద షావుకారు. ఉళ్ళో గొప్ప గొప్ప వాళ్ళు కూడా అయన దగ్గర అప్పు తీసుకుంటారు. ఎక్కడా పంటలు పండనప్పుడు కూడా గిరవయ్య దగ్గర తిండి గింజలు దొరుకుతుంటాయి. గురవయ్య ఎంత సంపదిస్తాడో అంత లోభి. పిల్లికి బిచ్చం వెయ్యడు.
గురవయ్య కూడా కన్నయ్య చేత పనులు చేయించుకుంటాడు. కానీ ప్రతిఫలం ఇవ్వడు. ఆఖరికి గుప్పెడు మెతుకులు కూడా పెట్టడు.
తను కన్నయ్య చేత ఊరికే పని చేయించుకుంటున్నానని గురవయ్యకు తెలుసు. ఆ విషయం ఆయనకు మనసులో బాధించేదేమో ఒకసారి కన్నయ్యతో అయన అన్నాడు.
"ఒరేయ్ కన్నయ్యా పూర్వజన్మలో ఏ పాపం చేశావో కాని ఈ జన్మలో అనాధ బ్రతుకు బ్రతుకుతున్నావు. ఈ జన్మలో ఎవరికైనా రునపడితే తప్ప వచ్చే జన్మలో నీకు తల్లి దండ్రులుండరు. నీ బాకీ తీర్చుకోవడం కోసం వాళ్ళు వచ్చే జన్మలో నిన్ను కంటారు. ఈ ఊళ్ళో ఒక్కరికీ నీ విషయం పట్టినట్లు లేదు. నువ్వెంత చాకిరీ చేస్తే అంతకు అంతా ప్రతిఫలం ఇచ్చేస్తున్నారు. గత జన్మలోనూ ఇలాగే జరిగి ఉంటుంది. అందుకే ఈ జన్మలో నువ్వు అనాధవయ్యావు. వచ్చే జన్మాలో అలా కాకూడదనే నేను నీకు ఋణపడుతున్నాను."
కన్నయ్య ఈ మాటలు విని నవ్వి, "నేను జన్మ జన్మలకు అనాధగా బ్రతికినా ఫరవాలేదు. మీరు మాత్రం నాకు తండ్రి కావద్దు" అన్నాడు.
ఆ సమయంలో ఊరి పెద్దలు కొంతామంది కూడా అక్కాడే ఉన్నారు. కన్నయ్య మాటలకు వాళ్ళంతా పక్కుమని నవ్వారు.
గురవయ్యకు చచ్చేంత అవమానమైంది. అప్పట్నుంచీ ఆయనకు కన్నయ్యంటే కోపం బయల్దేరింది. అలాగని కన్నయ్య చేత పనులు చేయించుకోవడమూ మానలేదు.
కన్నయ్య మీద గురవయ్యకు కోపముండడానికి ఇంకో కారణం కూడా ఉంది.
గురవయ్య కొడుకు భద్రయ్య. వాడికి పొట్ట చించితే అక్షరం ముక్క లేదు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దు పోయేదాకా ఆగమ్మ కాకిలా ఊరంతా తిరుగుతాడు. కూడా కొంతమంది పిల్లల్ని వెంటేసుకుని వాడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తను చేడిందే కాక ఊళ్ళో కొందరు పిల్లల్ని చెదగోడుతున్నాడని వాడి గురించి చాలామంది బాధపడుతుంటారు. ఐతే వాడు గురవయ్య కొడుకు కావడం వల్ల ఎవ్వరూ ఏమీ అనలేక ఊరు కున్నారు.
కన్నయ్య ఉళ్ళో అందరికీ అన్ని పనులు చేసి పెడుతూనే ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పే పంతులు దగ్గర విద్య కూడా అభ్యసిస్తున్నాడు. పంతులు వాడి తెలివితేటల్ని చురుకుదనాన్ని ఊరంతా ప్రచారం కూడా చేశాడు.
ఊళ్ళో అంతా కన్నయ్య నూ, భద్రయ్యను పోల్చి భద్రయ్య ను తిడుతుంటారు. అందుకు భద్రయ్యకు కన్నయ్యంటే మంటగా ఉండేది. ఒకరోజున కోరి తంటా పెట్టుకుని కన్నయ్యను కొట్టాడు. కన్నయ్యకు దెబ్బలు గట్టిగా తగిలాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే ఊరు ఊరంతా ఒక్కటై గురవయ్య ఇంటికి వెళ్ళింది. కన్నయ్యను భద్రయ్య కొట్టినందుకు సంజాయిషీ అడిగింది.
అంతవరకూ ఏ విషయంలోనూ ఊరంతా ఒక్కటిగా లేదు.
గురవయ్య హడలి పోయాడు. భద్రయ్య ను గట్టిగా మందలించి అందరి ముందూ కన్నయ్యాకు క్షమార్పణ చెప్పించాడు. చాలామంది పెద్దలు "ఆ కన్నయ్య ను రోజూ చూసినా నీకు బుద్ది రావడం లేదేమిరా ?" అంటూ భద్రయ్య ను మందలించాడు.
ఇది జరిగినప్పట్నించి గురవయ్యకు కన్నయ్య అంటే కోపం పెరిగింది. ఊరికి పెద్ద షావుకారైన తన కొడుకు చేత తనే కన్నయ్యకు క్షమార్పణ చెప్పించాల్సి వచ్చింది. అంతా తన కొడుకును కన్నయ్యతో పోల్చి తిట్టారు. ఎప్పుడూ వాళ్ళలో వాళ్ళు తగవు లాడుకుంటూ తన దగ్గరకు మాట సహాయం కోసం వచ్చే వాళ్ళంతా కన్నయ్య కోసం ఒకటై పోయారు. తననేదిరించే సాహసం చేయ గలిగారు.
ఊరంతా ఒక్కటే కావడం తనకు మంచిది కాదు.
తన కొడుకును నలుగురూ తిట్టడం మంచిది కాదు.
వీటన్నింటి కి కారణం కన్నయ్య.
కన్నయ్య బ్రతికుండడం తనకు చాలా ప్రమాదం. మంచి అవకాశం చూసి కన్నయ్యని ఊర్నించి తప్పించాలి.
గురవయ్య అవకాశం కోసం చూస్తున్నాడు.
2
కన్నయ్య కిప్పుడు పద్దెనిమిదేళ్ళు. గడచిన ఐదేళ్ళ లోనూ వాడి దినచర్య లో మార్పేమీ లేదు.
ఒక రోజున ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయనకు భూత భవిష్య ధ్వర్తమానాలు తెలుసునని అంతా చెప్పుకున్నారు. అయన గ్రామాధికారి ఇంట బస చేసాడు. ఊరంతా తీర్ధ ప్రజలా రోజూ గ్రామదికారింటికి వెళ్ళి సాధువును దర్శించుకుని వస్తుండేవారు. ఆ సాధువుకు సేవలు చేయడం కోసం గ్రామాధికారి కన్నయ్యను నియోగించాడు. ఏ పనినైనా భక్తీ శ్రద్దలతో చేయడానికి ఎవరైనా కన్నయ్య తర్వాతే నని ఆ ఊళ్ళో అంతా అనుకుంటారు.
సాధువు ఉదయమే లేచి స్నానం చేసి కాసేపు ధ్యానం చేసుకొనేవాడు. తర్వాత ఫలహారం సేవించి వీధిలోకి వెళ్ళి ప్రజలకు దర్శన మిచ్చి వారి కష్ట సుఖాలు విచారించేవాడు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేవాడు. సుఖాల్లో ఉన్నవారికి కష్టం కలక్కుండా ఉండే ఉపాయాలు చెప్పేవాడు. తర్వాత ఆయన గ్రామాధికారి ఇంట భోం చేసేవాడు. భోజనమయ్యాక అయన కాసేపు నిద్రపోయేవాడు. నిద్రలేచాక ఏదో పుస్తకం చదువుకునేవాడు. సాయంత్రం అయన మళ్ళీ స్నానం చేసి జపం చేసుకునేవాడు. రాత్రి అయన భోం చేసేవాడు కాదు. పళ్ళు తిని పాలు తాగేవాడు. రాత్రి అయన గ్రామాధికారి ఇంటి బయట వేసిన పందిరి లో ఏర్పాటు చేసిన వేదిక పై కూర్చుని ప్రజలకు ధర్మోపదేశం చేసేవాడు. మనిషి దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, అందువల్ల ఉపయోగాలేమిటో అయన చెబుతుంటే చిన్న పిల్లలకు కూడా వివరంగా అర్ధమై పోయేది. ధర్మోపదేశం కాగానే అయన నిద్ర పోయేవాడు.
కన్నయ్య ఆయన్ను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండేవాడు. అయన అవసరాలన్నీ అమిత శ్రద్ధతో గమనిస్తిండేవాడు. ఒకసారి అయన పద్దతి తెలిశాక ఆ తర్వాత నుంచి ఆయనకు అన్నీ అడక్కుండానే అమర్చుతుండేవాడు. ఐతే సాధువుకు కన్నయ్య గురించి పట్టించుకోవడానికి గానీ వాడి గురించి ఆలోచించడానికి గానీ వ్యవధి వుండేది కాదు.
సాధువు ఆశ్రమంలో పది రోజులున్నాడు. పది రోజుల్లోనూ కన్నయ్య చాలా విశేషాలు తెలుసుకున్నాడు. గ్రామంలో అంతమంది వున్నారు. కానీ ఒక్కరూ సుఖంగా, తృప్తిగా వున్నట్లు అనిపించదు అందరికీ ఏవో కష్టాలుండనే వున్నాయి. అందరికీ వున్నదానికి మించి ఇంకా ఏదో కావాలనే వుంది.
సాధువులో దైవాంశ వున్నదని కూడా కన్నయ్య గ్రహించాడు. ఆయన తన చేతి స్పర్శ తో చాలా మందికి జబ్బులు నయం చేశాడు.గాలి లోంచి వస్తువులు సృష్టించి భక్తులకు బహుమతిగా ఇచ్చాడు.
సాధువు ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయే రోజున కన్నయ్యను గమనించాడు.
"ఇన్నాళ్ళు నన్ను సేవిస్తున్నావు. ఇంతమంది దగ్గరకు వచ్చి ఏమేమో అడిగారు. కానీ నువ్వేమీ అడిగినట్లు లేదే!" అన్నాడాయన.
"ఈ గ్రామం మీద ఆధారపడి బ్రతికేవాడ్ని. ఊరంతా బాగుంటే నేనూ బాగున్నట్లే కదా స్వామీ !" అన్నాడు కన్నయ్య వినయంగా.
కన్నయ్య మాటలు సాధువు నాకర్షించాయి. అయన కన్నయ్య గురించి తెలుసుకుని, "నువ్వు ఊరందరికీ సేవలు చేస్తూ బ్రతకడం దేనికి ? అందరి లాగే నువ్వూ బ్రతకొచ్చు కదా !" అన్నాడు.
"దేవుడు అందరిలోనూ వున్నాడని మీరే చెప్పారు. అందర్నీ సేవించుకుంటే దేవుణ్ణి సేవించినట్లే కదా !" అన్నాడు కన్నయ్య.
వాడి జ్ఞానానికి సాధువుకు ముచ్చ టేసింది ------"నీకేమైనా కోరిక వుంటే చెప్పు, తీతుస్తాను " అన్నాడాయన ఆప్యాయంగా.
