ఆలస్యంగా నిద్దరపోయిందేమో రాత్రి , మరునాడు సుమిత్ర కి నిజంగా జ్వరం వచ్చి మెలకువే రాలేదు. రాత్రి పడిన కంగారు సామాన్య మైనదేమీ కాదు. అందుకే , పాపం , మానసికంగా పడిన ఆలసట కి ఒళ్ళు తెలియనంత జ్వరం ముంచుకుని వచ్చింది.
రాత్రి కోపం తగ్గని విశాలి రెండు మూడు సార్లు సుమిత్ర మంచం చుట్టూ తిరిగినా, పంతం ఆగక మళ్ళీ మరు క్షణం లోనే బిగిసిపోయి వెళ్ళిపోతుంది.
కారు వచ్చి ఆగింది ఇంటి ముందు!
కాలాగని విశాలి కారు చప్పుడు విని వరండా లోకి వచ్చింది.
కారు దిగుతూన్న శారద కనిపించగానే చిరునవ్వు నవ్వింది పలకరింపు గా!
"మీ అక్క ఆరోగ్యం బాగాలేదా?' ప్రశ్నించింది శారద. మొట్టమొదటి ప్రశ్నే సుమిత్రను గురించి, తన పరీక్షల ను గురించి ప్రశ్నించకుండా?' అనుకుంది లోపల.
పైకి మాత్రం "ఏమో , ఏమిటో గొడవ . ఇప్పటి వరకూ లేవనే లేదు" అంది చిరాకు అణిచి పెట్టుకుని!
అంట్లు తోమడం చేతకాని వాళ్ళు యాసగా పాముతున్నట్లు కనిపించింది శారద కి, నటన రాని విశాలి చిరాకు అణుచుకోవడం లో ఓడిపోయింది చూసిన తరవాత!
కంగారుగా సుమిత్ర గదిలో ప్రవేశించి ముసుగు తొలిగించి ఒంటి మీదా, నుదుటి మీదా చెయ్యి మార్చి మార్చి చూసింది.
శారద ముఖ కవళిక చూసి ఏదో కొంప మునిగిపోయిందనుకుని సుమిత్ర ని చూసింది విశాలి.
జ్వరం నూట రెండు పైమాటే.
శారద మొహం దీనంగా పెట్టి, "ప్చ్ , దీని కంతటి కీ కారణం నేనే" అంది దిగులుగా.
మగత లో ఉండిపోయిన సుమిత్ర వినిపించుకుంది కాని, జవాబిచ్చే స్థితిలో కాని, కళ్ళు తెరిచే స్థితిలో కాని లేదు, పాపం.
"ఏం?' కంగారుగా ప్రశ్నించింది విశాలి.
"ఈ మధ్య రెండు రోజుల నుండి చాలా సంతోషంగా కనిపిస్తుంటే , సంబరం ఆపుకోలేక నిన్న తను రానని అంటున్నా వినకుండా సినిమా కి లాక్కెళ్ళి పోయాను.
అక్కడికీ, పాపం, ఎన్నో వంకలు చెప్పింది! చివరికి "మా విశాలి చిన్న పిల్ల. డానికి పరీక్షలు. నేను వండి పెట్టి దగ్గిర ఉండి తినిపించక పొతే ఎలా? నేను రాను గాక రాను' అంది. అయినా సరే నేను వినకుండా 'మీ విశాలికి నేను కబురు పంపుతాలే ' అంటూ లాక్కెళ్ళి పోయాను.
వచ్చింది! సగం లో ఏమి జరిగిందో ఏమిటో? నేను వెళ్లి పోతానంటూ వద్దంటున్నా నా మాట వినకుండానే గబగబా లేచి వెళ్ళిపోయింది.
ఏదో అనారోగ్యం చేసిందేమో అనుకున్నాను.
నిజంగా అల్లాగే జరిగింది." బాధగా చెప్పింది శారద నిజాన్ని.
నిజాలన్నీ బాధలు కొని తెచ్చేవి గానే ఉంటాయి మరి.
మొదట నమ్మలేక పోయింది.
ఆ పైన సందేహల పుట్ట కందిరీగల తుట్టలా కదిలేసరికి ప్రశ్న పరంపర ప్రారంభించింది, వీళ్ళిద్దరూ కలిసి నాటకం అడుతున్నారేమో అనిపించి!
'అక్కడ నించే వెళ్ళిపోయారా? ఇంటికి కూడా రాలేదా?" ప్రశ్నించింది విశాలి.
"అంత వ్యవధి ఇవ్వందే నేను! పాపం, ఏదో కూనిరాగం తీసుకుంటూన్న దాని దగ్గిరికి వెళ్లి "ఈ మధ్య చాలా హాయిగా ఉంటున్నావు, ఏమిటి గిరాకీ' అనేసరికి 'నా కేమిటోయ్ లోటు! కళ్ళలో వత్తులు వేసుకుని పువ్వులా చూసుకునే చేల్లెలుండగా' అంది. నేనే పాపిష్టి దాన్ని, ఆ సంతోషాన్ని నిలవనీయకుండా రాను మొర్రో అంటున్నా లాక్కెళ్ళి పోయాను.' తప్పు చేసేసిన తరవాత కానీ పశ్చాత్తాపం రాదు సాధారణంగా!
"సగం లో లేచి వచ్చేసిందా?' ఆశ్చర్యం లో నించి కోలుకోలేక తలమునక అవుతుంది విశాలి!
"అవును, నాకు కారణం తెలియలేదు. అంతవరకూ ఎంతో సంతోషంగా నవ్వుతున్నది హటాత్తుగా లేచి నిలబడి నన్ను అడగ కుండానే, "నేను వెళ్ళిపోతున్నా' అని తన నిర్ణయాన్ని తెలియబరిచి నా జవాబు వినకుండానే వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను, ఏదైనా అనారోగ్యం చేసిందేమో అని!"
విశాలి అడిగిన చచ్చు ప్రశ్న కి కూడా విసుక్కోకుండానే జవాబు ఇచ్చేస్తుంది.
పాపం పరిహారం కావాలంటే , చేసింది పదిమందికి పదిసార్లు చెప్పుకుంటే చాలదు!
పనికి వచ్చేది పదిలంగా అమిరిస్తే చాలు!
పొద్దున్నే ఆస్పత్రి కి పోయేముందు ఒకసారి ఈ ఇంటి పరిస్థితులు చూసి వెడదామని వచ్చిన గోపాలం ముందు వరండా లో కుర్చీకి అతుక్కునే పోయాడు!
మొదట ఎవరో ఆడవాళ్ళు ఉన్నట్లున్నారు అని జంకిన అతని మనస్సు అసలు విషయాన్ని వింటూనే అతుక్కుని పోయింది.
లోపల పదిసార్లు "పాపం, పాపం' అనుకున్నాడు.

"ఏం లాభం?"
అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్న విశాలి అక్కయ్య జ్వరానికి హడలిపోయి ముందు వరండా లోకి వచ్చింది కంగారు గా!
పోతనను శ్రీనాధుడు ప్రశ్నించినది గుర్తుకు వచ్చింది, తొందరగా ముందు గదిలోకి వచ్చిన విశాలిని చూసిన గోపాలానికి!
ఏం చేద్దామని ఆలోచించిందో ఏమో?
కానీ, ఆపద్భాంధవుడులా గోపాలం కనిపించాడు. ఆ సమయంలో , ఆ నిమిషం లో బిక్క చచ్చిపోయినా పరిస్థితి గుర్తుకు రావడం వల్ల, "అక్కకి విపరీతమైన జ్వరం గా ఉంది. కాస్త మందు వేద్దువు గాని రా" అంది అదే కంగారుతో.
విశాలి అనుమతించాక గాని లోపలికి రాలేక పోయాడు గోపాలం.
చూడాలని ఇందాకటి నుండి అనిపిస్తున్నా విశాలి నోటికి జడిసి కుర్చీలో కూలబడి పోయాడు. ఇప్పుడు విశాలి అనుమతించగానే లేచి నిలబడ్డాడు త్వరగా.
గబగబా అడుగులు వేస్తూ పెద్ద ఆప్యాయత మండి పోతున్నట్లు లోపలికి వస్తూన్న గోపాలాన్ని చూసి అసహ్యం ఆపుకోలేక చివాలున లేచి నిలబడింది వెళ్ళిపోయే ఉద్దేశ్యంతో శారద. కాని, సుమిత్ర మీద ఉన్న ప్రేమ వెళ్ళనివ్వ లేదు.
గోపాలాన్ని చూస్తూనే అసహ్యంతో శారద లేవడం చూసి గోపాలం , విశాలి మొహమొహాలు చూసుకున్నా పరిస్థితుల ప్రభావానికి తల ఒగ్గారు.
"ఏం ఫరవాలేదు. మనస్సుకు అత్యంత శ్రమ ఇవ్వడం వల్ల ఈ జ్వరం వచ్చింది. మనస్సు కు ఎక్కువగా శ్రమ కలగ జేయ్యనివ్వకూడదు.: అలవాటులో చెప్పి, ఆ రోగి సుమిత్రే అని తెలుసుకుని వెంటనే ఇంజక్షన్ ఇవ్వడానికి ఉపక్రమించాడు.
మెలుకువగా ఉండి మత్తులో పడిపోయిన సుమిత్ర ఇంజక్షను తో మేలుకుని శారద అందించిన కాగితం మీద సంతకం చేసింది. అది ఆ వేళకి సెలవు చీటీ.
అక్క పరిస్థితి కి నాగుపాము లా తల దేనికయినా బాదుకుని చచ్చిపోవాలను కుంది విశాలి, దీని కంతటికీ కారణం తనే అని తెలుసుకుని!
నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది.
కాలం ఎవరి ఆగిపోలేదు. సాగిపోయింది.
* * * *
కాలం ఎవరి కోసం ఆగిపోకుండా సాగిపోయినా ఒక చిక్కు మాత్రం తెచ్చి పెట్టింది! అదే సుమిత్ర జ్వరం!
హడిలి పోయింది విశాలి పూర్తిగా. మూడు వంతులకు పైగా మారిపోయింది! ఊరికే దిగులూ, గాభరా పాపం.
అర్ధరాత్రి కళ్ళు తెరిచిన సుమిత్ర పక్కనే శారద కునికిపాట్లు పడుతుండడం చూసి అర్ధం కాక బుర్ర గోక్కుంది నీరసంగా! దాహం విపరీతంగా వెయ్యడం వల్ల మంచి నీళ్ళ కోసం దిక్కులు చూసింది. అటువైపు కుర్చీలో గోపాలం కునుకుతున్నాడు. కలేమో అనుకుని దాహం అణుచుకోలేక తెచ్చుకుని తాగుదామని కాబోలు లేవబోయి కూలబడింది.
