Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 10

 

    ఒకటి రెండు పర్యాయాలు అగోదలోని మీట నొక్కి చూశాడు . కానీ ఏమీ కాలేదు.
    బలరాం శుభ్రంగా స్నానం చేశాడు. షవర్ లోంచి నీళ్ళు వస్తున్నాయి. తుడుచుకుందుకు తువ్వాలుంది. కట్టుకుందుకు మంచి బట్టలున్నాయి. ఘుమఘుమలాడే సెంట్ , పౌడర్స్ వున్నాయి.
    స్నానం చేసీ అక్కడున్న సదుపాయాలన్నీ ఉపయోగించుకునేసరికి బలరాం శరీరంలో కొత్త ఉత్సాహం చోటు చేసుకొంది. అతను గదిలోంచి బయటకు వెళ్ళడాని కేమైనా మార్గాలున్నాయేమో చూడసాగాడు.
    పన్నెండు గంటల వరకూ అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పన్నెండు గంటలకు గోడ మధ్య మీట నొక్కాడు.
    వీరువాలో వేడి వేడి విందు భోజనం , సమస్త సదుపాయాలతో సిద్దంగా వుంది. దూరాలోచన మాని అతను ఆ భోజనం బయటకు తీసుకుని తృప్తిగా అరగించాడు.
    అందులో ఉన్న సమాచారం ప్రకారం అతను తిరిగి నాలుగు గంటలకు ఆ గోడలోని మీట నోక్కవలసి వుంటుంది. ఏకారణం వల్ల నయినా అతనా విషయం ఆదమరిస్తే గదిలో కాలింగ్ బెల్ వంటిది వినబడి అతన్ని హెచ్చరిస్తుంది.
    బలరాం కిదంతా విచిత్రంగా వుంది. ఉద్యోగం పేరుతొ తనను చేరతీసిన ముసలాయన తననిలా ఎందుకు బంధించాడు? తననుండి అయన ఆశిస్తున్న ప్రయోజన మేమిటి?
    కాలింగ్ బెల్ మ్రోగుతుందో లేదో తెలుసుకోవడం కోసం బలరాం టైము నాలుగయినా గోడలోని మీట నోక్కలేదు.    
    పది నిమిషాల అనంతరం కాలింగ్ బెల్ మ్రోగింది.
    నిద్రపోతున్న వాడికి కూడా మెలకువ తెప్పించగల శబ్ధమది.
    బలరాం కో అయిడియా వచ్చింది. బీరువా నుంచి తప్ప కుండా బయటకు దారి వుండి వుండాలి. ఈ పర్యాయం బీరువా తెరుచుకున్నప్పుడు తాను అందులో దూరితే!
    ఈ అభిప్రాయంతో అతను ఈ పర్యాయం బీరువా తెరుచుకోగానే అందులోకి దూరాలని ప్రయత్నించాడు. చిన్న చిన్న అరలు కాబట్టి ఒక మనిషి అందులో దూరడం కష్టమే. అదికాక అతను కొద్దిగా లోపలికి చేయి పెట్టి చటుక్కున వెనక్కు తీసేసుకున్నాడు. బీరువాలో అతనికి సరఫరా చేయబడే వస్తువులు కర్ర ట్రేలలో ఉంచబడుతున్నాయి కానీ బీరువా అరలలోంచి కరెంట్ ప్రవహిస్తోంది.
    నాలుగు గంటలకు తెరుచుకున్న బీరువాలో తినుబండారాలున్నాయి. మిక్స్ చర్, వేయించిన శనగపప్పు, ఉప్పు అద్దిన వేరుశనక్కాయలు వగైరాలు. బలరాం అవి తీసుకున్నాడు కానీ ఈ పర్యాయం అతని కంత ఉత్సాహంగా అనిపించలేదు.
    ఏమిటి జరుగుతోంది ? ఎందుకు జరుగుతోంది? ఈ జైలు జీవితం తనకు ఎన్నాళ్ళు?
    ఈసారి బీరువాలో మళ్ళీ ఎన్నింటికి తలుపులు తెరుచుకుంటాయో వివరించే కాగితం లేదు. బహుశా కాలింగ్ బెల్ ద్వారా ఆ విషయం తెలియబర్చవచ్చునని ముసలాయన అనుకున్నాడేమో!
    బలరాం మళ్ళీ తీవ్రంగా పరిశోధించసాగాడు . అతనలా శోధించగా శోధించగా ఓ  చిన్న విచిత్రం కనపడింది.
    వాష్ బేసిన్ వున్న గోడకు మధ్యలో ఓ మీట గోడ రంగులో కలిసిపోయి వుంది. ఏదో వింత జరక్కపోదన్న ఆశతో బలరాం ఆ మీటను నొక్కాడు.
    అది నొక్కిన వెంటనే గదిలో శ్రావ్యమైన సంగీతం వినిపించసాగింది.
    ఆ సంగీతం అతను మళ్ళీ మీటను నోక్కేవరకూ వినబడుతూనే ఉంది. బలరాం కు చాలా నిరుత్సాహం కలిగింది.

                                     5
    బలరాం కి చాలా విసుగ్గా ఉంది.
    అతనా గదిలోకి వెళ్ళి నాలుగు రోజులయింది. పుష్టి కరమైన ఆహారం అతనికి అందుతోంది. కానీ ఏ పనీ లేదు.
    అతని జీవితం నాలుగు గోడలకు అంకిత మైపోయింది. ఎవ్వరూ అతనితో మాట్లాడరు. అసలు ఇంకో మనిషే తనకు కనుపించరు. ఎప్పుడే పాపం చేశాడో కానీ ఇప్పుడీ ఖైదు జీవితం లభించింది.
    అయిదో రోజున బలరాం మళ్ళీ తన ప్రయత్నాలలో తానుండగా బీరువా గోడకు ఎదురుగా వున్న గోడలో ఓ మీట కనుక్కోగాలిగాడు. అంతకాలం అవతని కళ్ళ బడకపోవడం ఆశ్చర్యమే!ఎందుకంటె గోడ మీద మొత్తం ఎనిమిది ఆకుపచ్చ చుక్కాలున్నాయి. వాటిలో ఏడు రంగుతో పెట్టిన చుక్కలు , ఒకటి మాత్రం మీట!
    బలరాం మీటను నొక్కగానే ఆ గోడ భూమిలోకి దిగిపోసాగింది.
    ఆ గోడ అలా భూమిలోకి దిగిపోతుంటే అతను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. రెండు నిముషాల్లో గోడ పూర్తిగా భూమిలోకి దిగిపోయింది. నేల మీద అసలు గోడ వుందన్న అనమాలు కూడా లేదు.
    అంతసేపూ బలరాం దృష్టి గోడతో పాటే కదుల్తోంది. అప్పుడే అతను గోడకవతల ఏముందీ అని చూశాడు. అటుచూడగానే అతనికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు.
    అతనుంటున్నలాంటిదే ఇంకో గది అది. అన్ని విధాలా తన గదితో సరిపోలి ఉంది. బయటకంటూ దారి వున్నట్లు లేదు. ఆ గదిలో కూడా నేల మీద ఓ పరుపు వుంది. ఆ పరుపుమీద .....
    బలరాం కు దాని మీద ఎవరో పడుకుని వున్నారని అనుమానం వచ్చింది. అతను చటుక్కున అటు వైపుకు నడిచాడు.
    అతను నాలుగడుగులు వేశాడో లేదో గదిలోని గోడ మళ్ళీ భూమిలోంచి మొలుచుకు వచ్చింది. అతను చటుక్కున వెనక్కు తిరిగేసరికి గోడ యధాప్రకారం గా అయిపొయింది.
    ఒక గదిలోంచి ఇంకో గదిలోకి మారటం మినహా అతను చేసినదేమీ లేదని తెలియడమే కాక, ఇది ఎవరో కావాలని చేసిన పని అని కూడా అతనికి అనుమానం వచ్చింది.
    గోడ మళ్ళీ మొలిచిన ఆశ్చర్యం కంటే పరుపు మీద వున్న వ్యక్తిని చూడాలన్న కుతూహలం బలరాం నెక్కువగా ఆవహించింది. అందుకే అతడు నాలుగు అంగల్లో పరుపును చేరాడు. ఆ మనిషి ఎవరో కానీ నిండా దుప్పటి ముసుగులా కప్పుకుని వున్నాడు.
    బలరాం కొద్ది క్షణాలు తటపటాయించి -- ఆ మనిషి కప్పుకున్న దుప్పటిని తొలగించి ఆశ్చర్యపడ్డాడు.
    ఆ మనిషి -- ఉమ!
    అతను దుప్పటి లాగగానే ఉమకు మెలకువ వచ్చి చటుక్కున లేచి కూర్చుంది. బలరాం ను చూడగానే ఆమె కళ్ళలో కనబడ్డ ఆశ్చర్య మింతా అంతా కాదు.
    ఓ అయిదు నిమిషాలు మాత్రమే ఆశ్చర్యం సృష్టించిన మౌనం ఆ గదిలో రాజ్యమేలింది. తర్వాత బలరాం తన సంగతీ దేప్పాడు. ఉమ చెప్పినది విన్నాక ఆమె కూడా తనకు వలెనె సకల మర్యాదలతో ఖైదు జీవితాన్ని నాలుగు రోజులుగా అనుభవిస్తున్నాడని అతనికి అర్ధమైంది.
    "ఒంటరితనం చాలా బోరుగా వుంది. మనమిద్దరం కలుసుకోవడం ఒకవిధంగా మంచిదే. కనీసం కాలక్షేపం మయినా అవుతుంది....' అన్నాడు బలరాం.
    "నాకు ఒంటరితనమే చాలా ఇష్టం. నేనొక్క ర్తెనీ వున్నప్పుడు ఇంకొకరు తోడుగా వుండడం అందులోనూ మగవాడు ....నాకస్సలు ఇష్టముండదు. నీ గది లోకి నువ్వెళ్ళిపో ....' అంది ఉమ.
    బలరాం దెబ్బతిన్నాడు. నాలుగు రోజుల తర్వాత కనబడ్డ మనిషి తననిలా అంటుందని అతనూహించలేదు. అతని అహం దెబ్బతింది.
    బలరాం వెంటనే గోడ దగ్గరకు వెళ్ళి మీట కోసం అన్వేషించసాగాడు. అతనెంత ప్రయత్నించినా మీట వంటిది ఏమీ కనబడలేదు.
    "నన్ను మన్నించాలి ...గోడను ఎలా తప్పించాలో నాకు తెలియడం లేదు " అన్నాడు బలరాం.
    "వచ్చినవాడికి దారి తెలీకుండా వుంటుందా?" అంది ఉమ.
    "నీకు అనుమానంగా వుంటే నువ్వే ప్రయత్నించు " అన్నాడు బలరాం.
    ఉమ గోడ దగ్గరకు వెళ్ళి తనూ ప్రయత్నించి"ఆడదాన్ని -- నాలుగు రోజులుగా ప్రయత్నిస్తూ కూడా ఏమీ తెలుసుకోలేకపోయాను. ఆ విషయం నీకు తెలుసు. తిరిగి వెళ్ళడానికి నీకు దారి తెలిసే ఉంటుంది. ఇందులో నీ కుతంత్రం ఏదో వుంది" అంది.
    "ఏమైనా సహించగలను కానీ అపవాదును మాత్రం సహించలేను. నీకు నామీద అనుమానంగా వుంటే ఏం చేయమంటే అది చేస్తాను. పీక నొక్కుకుని ప్రాణాలు తీసుకోమంటావా?"
    ఉమ నిరసనగా అతని వంక చూసి "నీ ప్రాణాలు తీసుకోనక్కర లేదు. నా జోలికి వచ్చి నా ప్రాణాలు తీయకుండా వుంటే చాలు ' అంది.
    బలరాం ఇంకా ఆమెతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అతని ఉత్సాహమంతా చచ్చిపోయింది. ఇంతకంటే ఆ గదిలో ఒక్కడూ వేరే వుండి వుంటే బాగుండేదని అనుకున్నాడతను.

                                     6
    సాయంత్రం నాలుగు గంటలకు గదిలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    ఉమ పరుగున వాఎల్లి గదిలోని బీరువా తెరిచి చూసి ఉలిక్కిపడింది.
    బీరువాలో తినుబండారాలేమీ లేవు. వంకాయలు , బియ్యం, చింతపండు , మిర్చి వగైరా పోపు సామానులు అవసరమైన గిన్నెలు,చాకు అందులో వున్నాయి. గబగబా అవన్నీ బయటకు తీసింది. బీరువా తలుపులు వేసుకున్నాయి.
    బలరాం కూడా కుతూహలంగా అక్కడకు వెళ్ళి అన్నీ చూశాడు. 'వంట చేసుకోవాలన్న మాట! పోనీ ఈ గదిలో అదీ ఒక కాలక్షేపమే!" అన్నాడు అప్రయత్నంగా.
    ఉమ అతని వంక ఉరిమి చూసి ""వంట నాకు చాలా బోరు" అంది.
    "నాకు ఆకలి ఎక్కువ . ఎలా చెయ్యాలో చెప్పు వంట నే చేస్తాను " అన్నాడు బలరాం.
    కాసేపు వాదించుకున్నాక ఇద్దరూ కలిసి వంట చేయడానికి నిశ్చయించుకున్నారు. బలరాం వంకాయలు తరిగాడు. మిరపకాయలు గిల్లాడు. ఆమె అందించమన్నవన్నీ అందించి "ఉద్యోగం వచ్చినా నాకీ సేవలు తప్పలేదు . వారాలు చేసుకునే తప్పడి లాగే ఆడవాళ్ళకు పనులు చేసి పెట్టేవాడ్ని " అన్నాడు . ఉమ మాట్లాడలేదు.
    వంకాయ కూర, అన్నం, చారు, పెరుగులతో ఇద్దరూ సుష్టుగా భోజనం చేశారు. పెరుగు అన్నం తిన్నాక "రేపొద్దున్న పెళ్ళి చేసుకున్నాక ఎక్కడైనా ఇలాంటి సదుపాయాలతో ఇలాంటి గదే దొరికితే ఎంత బాగుంటుంది?" అన్నాడు బలరాం.
    "ఈ గదిలో మనమిద్దరమూ వుండగా పెళ్ళి అనే మాట నా చెవుల పడనివ్వ కూడదు. అసలిదంతా నువ్వు పన్నిన కుతంత్రమని నాకు అనుమానంగా వుంది. జీవితం మీద నాకు చాలా ఆశలున్నాయి " అని కళ్ళు ఒత్తుకుంది ఉమ. తన ఆశలన్నీ భగ్న మైపోతాయే మోనన్న భయం ఆమె కంఠంలో ధ్వనించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS