Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 9

 

    అతను, ఆమె పార్కులో కూర్చుని ఉన్నారు. ఇద్దరి ముందు కొంత సరంజామా వుంది. ఆ సరంజామాలో మూత విప్పిన క్యారియరు ఉంది. క్యారియరు లోంచి పూరీలు కనబడుతున్నాయి.
    "ఇంకా తినలేనండీ - ఆశగా చాలా పూరీలు తెచ్చుకున్నాం...." అందామె.
    'అలా అంటే ఎలా శోభా -- బాగా తింటేనే గానీ ఆరోగ్యం బాగుపడుతుంది...." అన్నాడతను.
    "నా ఆరోగ్యాని కేం వచ్చిందండీ - దుక్కలాగున్నాను " ఏదో మనకు అదృష్టం లేదు...." అంది శోభ.
    "పెళ్ళయిన అయిదేళ్ళ తర్వాత మళ్ళీ వేస్తున్న ఈ హనీమూన్ ట్రిప్పు మనకు సహకరించగలదనుకుంటున్నాను" అన్నాడతను.
    శోభ కళ్ళలో రవంత సిగ్గు కనిపించింది - "అవును మన పెళ్ళి జరిగి ఐదు సంవత్సరాలయింది ...." అంటూ నిట్టూర్చింది.
    "పూరీలు తినగలవో లేదో చెప్పు. లేకపోతె అవతల పారేద్దాం. ఏ కుక్కలో తింటాయి" అన్నాడతను.
    "ఇంత ఖరీదు పెట్టి కొన్నవి కుక్కలా పాలు కానివ్వడ మెందుకండి. - ఏ ముష్టి వాడికయినా ఇస్తే ఆప్యాయంగా తింటాడు " అంది శోభ.
    "సరే నీ యిష్టం. నేను వెళ్ళి రెండు కూల్ డ్రింక్స్ తీసుకు వస్తాను " అంటూ అతను లేచి వెళ్ళాడు. శోభ చుట్టూ చూసింది. ఆమె దగ్గరలోనే వున్న ఓ బికారి ఆమె నాకర్శించాడు.
    "ఏయ్ !' అంటూ చప్పట్లు కొట్టి పిలిచిందామే . బికారి ఆమె వైపు తిరిగాడు.
    "పూరీలు తింటావా?" ఆడిగిందామే.
    "వద్దన్నట్లుగా తలాడించాడతను.
    "ఎంగిలివి కాదు...." అందామె గట్టిగా.
    అతను చటుక్కున లేచి ఆమెకు దగ్గరకు వచ్చి - "చాలా థాంక్స్ . మంచి ఆకలి మీద వున్నాను..." అన్నాడు.
    ఆమె అప్రయత్నంగా పూరీలున్న గిన్నేనూ, కూర గిన్నెనూ అతనికి అందించింది . అతని బాషలోని సంస్కారం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
    బికారి రెండు గిన్నెలూ అందుకుని అయిదు నిమిషాల్లో పూరీలన్నీ తినేసి "మీ గిన్నెలు ఎంగిలి చేశానని అన్యదా భావించకండి. ఇప్పుడే వీటిని శుభ్రం చేసి తీసుకు వస్తాను " అని దగ్గరలో వున్న కుళాయి దగ్గరకు వెళ్ళి ఆ రెండు గిన్నెలు శుభ్రంగా కడిగి వెనక్కు తెచ్చాడు.
    బికారి ఆమెకు నమస్కరించి - "మీలాంటి వాళ్ళను చూసినప్పుడల్లా నాకు కడుపు నిండిపోతుంది. ఈ ప్రపంచం నిండా మీలాంటి వాళ్ళుండాలని నా కోరిక. కానీ దురదృష్ట వశాత్తు ఈ ప్రపంచంలో దుర్మార్గులు, చాలా ఎక్కువగా ఉన్నారు. ఎవరైనా వాళ్ళను ఏరియదానికి ప్రయత్నించినా అది కేవలం ఉడతా భక్తీ అవుతోంది -" అన్నాడు.
    "ఈ ప్రపంచంలో అన్ని దుర్మార్గాలకూ అవసరమే ముఖ్య కారణం. ఎంత మంచి వాళ్ళైనా అవసరం కోసం ఎటువంటి దుర్మార్గాని కైనా పాల్పడవచ్చు ...." అని నిట్ట్టుర్చింది శోభ ...." ఆ విధంగా నేనూ మంచి దాన్ని కాదు."
    "నేను నమ్మలేను. మనుషుల ముఖాన్ని చూసి, మాటలు విని వాళ్ళ బుద్దుల్ని అంచనా వేయగలను. నన్ను ప్రత్యేకంగా పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరు నా వల్ల ఉపకారం పొందారు. ఈరోజు మీరు నామనసుకు కలిగించిన తృప్తి కారణంగా - మీరు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది ..." ఆన్నాడు బికారి.
    "ఏదో మీ నోటి మాట వల్ల అలా జరిగితే ....' అని ఆగింది శోభ.
    "తప్పక జరుగుతుంది. ఒక సంవత్సరం తర్వాత మీ యింటికి మళ్ళీ వస్తాను. మీ చిరునామా చెప్పగలరా?" అన్నాడు బికారి.
    శోభ చిరునామా చెప్పింది.
    "ఇంకెవరైనా అయితే నేను చిరునామా ఎందు కడిగానా అని లక్ష అనుమానాలు మనసులో పెట్టుకుని అడ్రసు చెప్పడానికి తటపటాయించేవారు. మీరు వెంటనే తడుముకోకుండా చెప్పడం మీ మంచి హృదయాన్ని తెలియ జేస్తుంది. ఒక ఏడాది తర్వాత ఈ జోగినాధం మీ ఇంటి కొచ్చి మీ ఆనందాన్ని కళ్ళారా చూసి వెడతాను...." అన్నాడు బికారి.
    "మీ పేరు జోగినాధమా ?' అనడిగింది శోభ.
    'అవును...." అని జోగినాధం ఉలిక్కిపడి - "అన్నట్లు మీరిచ్చిన అడ్రసు నాకు తెలిసినదే - సుందర్రామయ్య గారు మీ కేమవుతారు ?" అనడిగాడు.
    అయన నా మామగారు. అయన మీకెలా తెలుసు?" అంది శోభ.
    'అది నా దురదృష్టం -" అన్నాడు జోగినాధం. "నావంటి మీద బౌతిక మైన మురికి పెరుకుపోతుందనడానికి ఆయనే కారణం. మీ దృష్టిలో అయన ఎటువంటి వాడు? అయన కేదైనా అపకారం జరిగితే సహించగలరా?"
    "అయన దేవుడి లాంటి వారు. అయన మీద ఈగవాలినా సహించలేను..."
    "అయన దేవుడి లాంటి వాడు కాదని తెలిస్తే ...."
    శోభ ఆశ్చర్యంగా అతని వంక చూసి - "మీరు నా మంచితనాన్ని నమ్ముతున్నట్లే నేనూ అయన మంచి తనాన్ని నమ్ముతున్నాడు. మీరు నా చెడ్డతనాన్ని నమ్ముకూడదని నిర్ణయించుకున్నట్లే నేనూ అయన చెడ్డ తనాన్ని నమ్మకూడదని నిర్ణయించు కున్నాను...." అంది.
    జోగినాధం తన జేబులోంచి ఒక ఫోటో తీసి ఆమెకు అందించి "జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ ఫోటో లో వ్యక్తీ ఎవరో తెలుసా?" అన్నాడు.
    "ఈయనే నా మామగారు. ఇది మీ దగ్గర కేలా వచ్చింది?" అంది శోభ.
    జోగినాధం చటుక్కున ఆ ఫోటోని అందుకుని జేబులో పెట్టుకున్నాడు. "మీరు సుందర్రామయ్య గారి కోడలు కాకపోతే ఎంత బాగుండేది? పోనీ ఈ ఫోటో లో వ్యక్తీ సుందర్రామయ్య కాకపోయినా ఎంత బాగుండేది? అంటూ గొణుక్కుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    బలరాం కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే అతనికి యేమీ తెలియలేదు. కళ్ళు నులుముకుని మళ్ళీ చుట్టూ చూశాడు.
    గది విశాలంగా ఉంది. ఎక్కడా గుమ్మం లాంటిది కనబడడం లేదు. గదిలో కూర్చునేందుకు రెండు కుర్చీలున్నాయి. వాటి ముందు ఓ బల్ల ఉంది. ఓ మూలగా వంట చేసికునేందుకు వీలుగా స్టవ్ ఉంది. గదిలో ఓ పెద్ద వాష్ బేసిన్ ఉంది. ఇంకో మూలగా స్నానం చేయడానికి షవర్ ఉంది. దాని పక్కనే లెట్రిన్ ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఎక్కడా మరుగు లేదు.
    బలరాం జరిగింది గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎంత ఆలోచించినా అతనికి ముసలాయన కాఫీ ఇవ్వడం వరకు మాత్రమే గుర్తుంది. తర్వాతేం జరిగిందో గుర్తుకు రావడం లేదు.
    బలరాం పక్క మీంచి లేచాడు. ముసలాయనే తనకీ గది ఏర్పాటు చేసి వుంటాడని అతనికి అనిపించింది. అతను వాష్ బేసిన్ వద్దకు నడిచాడు. అక్కడ బ్రష్షు , పేస్టూ వున్నాయి. ముఖ ప్రక్షాళనం కావిన్చుకున్నాడు. అక్కడ్నించి బల్ల దగ్గరకు వెళ్ళాడు. బల్ల మీద పేపరు వెయిట్ క్రింద ఓ కాగితం వుంది.
    "నీకు అన్ని సదుపాయాలూ వుంటాయి. వాష్ బేసిన్ కు తిన్నగా నిలబడితే కుడి పక్కన ఉన్న గోడ మధ్యలో చిన్న మీట వుంది. అది నొక్కి చూడు" అని రాసి వుందా కాగితం మీద.
    బలరాం కి ఓ క్షణం పాటు ఏమీ అర్ధం కాకపోయినా తర్వాత పరిస్థితి అర్ధమైంది. అతను పరుగు లాంటి నడకతో కాగితంలో సూచించబడిన చోటకు వెళ్ళి మీటను గుర్తించి నొక్కాడు. వెంటనే గోడలోంచి తలుపులు తెరుచుకున్నాయి. బలరాం ఆశ్చర్యంగా పరికించాడు.
    అక్కడ అలమారా విధంగా వుంది. ఒక అరలో ప్లేటు, ప్లేట్లో ఇడ్లీలు, చట్నీ ఉన్నాయి. పక్కనే ఓ ప్లాస్కు వుంది. ప్లాస్కు పక్కన కప్పు సాసరు వున్నాయి. సాసరు కింద ఓ కాగితం వుంది.
    'అలమారా లోంచి నీకు కావలసిన వనేనే వెంటనే తీసుకో. ఈ తలుపులు అయిదు నిమిషాలకు మించి తెరుచుకుని వుండవు. సూచించినబడిన టైము లో కాక మిగతా సమయాల్లో నీవు మీట నొక్కినా ఈ తలుపులూ తెరుచుకోవు. తిరిగి పన్నెండు గంటలకు మీట నొక్కు" అని రాసి వుంది ఆ కాగితం మీద.
    బలరాంకి  విచిత్రంగాఅనిపించింది. అతను తొందరగా అలమారాలోవన్నీ తీసేసుకున్నాడు. తర్వాత వాటంతటవే బీరువా తలుపులు మూసుకు పోయాయి. బలరాం అప్రయత్నంగా టైము చూసుకున్నాడు. ఏడు గంటలయింది.
    ఇడ్లీలు ఆవిర్లు కక్కుతున్నాయి. చట్నీ చాలా రుచిగా ఉంది. ఆవురావురు మంటూ తినేశాడు బలరాం. తర్వాత అతను ప్లాస్కు మూత తీశాడు. అందులో కాఫీ లేదు. చిక్కటి తీయటి పాలున్నాయి. ఆ పాలు తాగేసరికి బలరాం కి చాలా బలం వచ్చింది.
    ఇప్పుడతను తనున్న పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గదిలోకి తనకు టిఫిన్ అందించే పరిస్థితి ని బట్టి చూస్తె గదిలోంచి బయటకు వేరే మార్గమున్నట్లు లేదు. ఏదయినా మార్గముంటే ఆ బీరువా ద్వారా వుండాలి. ఇడ్లీలు చాలా వేడిగా వున్నాయి. కాబట్టి అక్కడ పెట్టి ఎంతో కాలము అయివుండదు అని అతననుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS