అతను నవ్వాడు. "కొన్ని కొన్ని అనుమానాలకు అర్ధం లేదు. మీరు నన్ను తర్వాత మోసం చేయరని నమ్మక మేమిటి? అయినా మిమ్మల్ని నా ముఠా లో చేర్చుకుందుకు నేను సిద్ద పడడం లేదు- అలాగే కొన్ని కొన్ని విషయాలను నమ్మి వూరు కోవలసిందే."
నేను నవ్వాను "నా ముఠా లో చేరినవాడు నన్ను మోసం చేయలేడు. అందుకు కావలసిన ఏర్పాట్లు నేను చేసుకున్నాను" అన్నాను.
"సరే, ఇప్పటికైనా బాస్ నని ఒప్పుకున్నారు" అన్నాడతను నవ్వుతూ.
"మరి చేయి చేయి కలుపుదామా?"
నేనుచేయ్యి జాపాను. అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
"మరి వెడదామా - మా స్థావరానికి?' అడిగాడు.
ఒక్క క్షణం సంకోచించి "వెడదాం పదండి!" అన్నాను.
అతని స్థావరం వూరికి చివర్లో లేదు. వూరికి కేంద్రం అయిన గోపాలపురం లో మాములుగా కనిపించే ఒక పెద్ద పెంకుటింట్లో వుంది. మేమా ఇంటికి వెళ్ళిన పది నిముషాలకు తలుపులు దబదబా బాదిన చప్పుడయింది. ఏవేవో చూస్తున్న నేను చూపిస్తున్న అతనూ కూడా ఉలిక్కి పడ్డం జరిగింది. మాములుగా వెళ్ళి అతను తలుపులు తీశాడు.
పోలీసులు!
క్షణాలలో అతని చేతులకు అరదండాలు పడ్డాయి.
ఇంటి చుట్టూ బారులు తీరి పోలీసులున్నారు.
13
చెల్లాయి కి పెళ్లవుతోంది.
బావగారిని చూస్తోంటే ఎప్పుడో ఎక్కడో ఒకపర్యాయం చూశానా అనిపించింది. అయన నన్ను చూసినప్పుడల్లా ముసి ముసిగా నవ్వుతున్నాడు.
ఏ గొడవలూ లేకుండా పెళ్ళి ముగిసింది. అంతా సద్దు మణిగాక నేనూ, బావగారు ఇంటి వరండాలో కూర్చున్నాం చెరో కుర్చీలో.
"మిమ్మల్నేక్కడో చూసినట్లుంది బావగారూ అన్నాను.
"మీసంగతి నాకు తెలియదు గానీ నేను మాత్రం మిమ్మల్ని నిత్యం చూస్తూనే ఉండే వాడిని" అన్నాడాయన.
"ఇంపాజిబుల్" అన్నాను.
"మీరలా గనుకోవడమే మంచిది. లేకపోతే నీకునిజం తెలిస్తే చాలా రహస్యాలు బట్టబయలై పోతాయి. చిత్ర నిజమే చెప్పింది"అన్నాడాయన నవ్వుతూ.
"ఎలా?'
"ఎలాగా! ఓ కోటీశ్వరుడికి గారాల పుత్రిక వుంది. ఆమెకో రోజున తన తండ్రి స్మగ్లర ని తెలిసింది. అంతేకాదు తన తండ్రికి డబ్బు మీద తప్ప వేటి మీదా ఆఖరికి కూతురు , మాతృభూమి మీద కూడా ప్రేమ లేదని తెలుసుకున్నాక తనకు తెలిసిన కొద్ది పాటి రహస్యాలతో అతి రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేనురంగం లోకి దూకాను.
ఒక నకిలీ బాస్ ను సృష్టించాం. కుందేలు, సింహం కధ తెలుసు గదా. చాలా సరుకు నకిలీ బాస్ చేతిలోకి జారి పోతున్నట్లు నమ్మించాం. అందువల్ల అయన నకిలీ బాస్ కోసం అన్వేషించ సాగాను. మీరే ఆ నకిలీ బాస్.
తన కూతురు పోలీసుల మనిషి అని ఆ తండ్రి ఊహిన్చలేడు. మాకు పూర్తిగా ఆమె సహకారముంది. అందువల్ల ఎన్నో వ్యూహాలు జయప్రదంగా వేశాం. నకిలీ బాస్ ను గొప్పవాణ్ణి చేశాం. చిట్టచివరకు ఆ కోటీశ్వరుడు మిమ్మల్ని కలుసుకుని తనే రింగ్ లీడర్ నని బయట పెట్టుకున్నాడు. మిమ్మల్ని తన స్థావరానికి తీసుకువెళ్ళి అన్ని విధాలుగా దొరికి పోయాడు."
"మరి చిత్ర ఏమయింది?"
"ఆత్మహత్య చేసుకుంది. తన ఆస్తి నంతా రాజేశ్వరి పేరున రాసింది."
"నిజంగా?"
"అంతే కాదు. మేమా కోటీశ్వరుడిని పట్టుకోడానికి వేసిన పధకాన్ని వెలుగు లోనికి రానివ్వలేదు. ఈ విషయంలో తన సహాయాన్ని బాగా మరుగున ఉంచమని చిత్ర కోరింది. ఈవిధంగా ఆ అద్భుత త్యాగమయి కధ తెరచాటు నే ఉండి పోయింది."
నా మనస్సు బాధతో నిండి పోయింది. చిత్ర మరణించిందంటే ఏమిటలా గుంది. ఎంత గొప్ప వ్యక్తీ ఆమె.
"బావగారు ఒక్క సందేహం. మిమ్మల్ని కలుసుకుని ఉండకపోతే నా అనుభవాలకు జవాబులు దొరికి ఉండేవి కావు. మీరు చేసిన చాలా మిస్టరీ లు పోలీసుల సహకారంతో జరిగినవే నని తెలుస్తోంది. అంటే హిప్నాటిజమన్నది అసత్య మన్న మాట. అవన్నీ అలాగుంచితే నాకో సందేహ ముంది. చిత్ర టాక్సీ డ్రైవర్ గా నాకు తోడొచ్చి స్మగ్లర్ అనుచరుణ్ణి ఎలా హిప్నటైజ్ చేయగలిగింది?"
బావగారు నవ్వారు. "అసలు వజ్రాల సూట్ కేసు ముందు సీట్లో చిత్ర దగ్గరుంది. తిరిగి మీరు టాక్సీ దిగి అతన్ని గమనిస్తున్న సమయంలో ఆమె మీ స్థానంలో అసలు సూట్ కేసు నుంచింది. అంతే!"
"పోలీసులు నేననుకున్న దాని కంటే తెలివైన వాళ్ళు" అన్నాన్నేను.
'అందుకే వాళ్ళతో చెలగాటం మంచిది కాదు" అన్నారు బావగారు.
"అవునవును. ఫ్యాన్సీ దుకాణం ఉన్నవాడ్ని. ఆ సంగతి బాగా గుర్తుంచుకోవాలి!"
"ఇంక మీకు ఫ్యాన్సీ దుకాణం కర్మేమిటి. బావగారూ లక్షల ఆస్తితో రాజేశ్వరి మీ స్వంతం కాబోతుంటే నూ " అంటూ నవ్వాడు బావగారు.
* * * *
"నాకు నిజం తెలిసిపోయింది. మా బావగారన్నీ చెప్పేశారు" అన్నాను రాజేశ్వరి తో.
"అన్నీ అంటే."
"మొత్తం అన్నీ. ఆఖరికి మీ గురించి కూడా."
'అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారా?"
"ఈనాటికీ ఏనాటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అన్నాను నేను.
"ఒక ముఠా నాయకుడి కూతుర్నని అసహ్యించుకుంటారనుకున్నాను. తండ్రికే ద్రోహం చేసిన దుర్మార్గురాలిగా త్రుణీకరిస్తారనుకున్నాను" అంది రాజేశ్వరి.
"వ్వాట్" ఉలిక్కిపడ్డాను. "అయితే నువ్వు చిత్రవా?"
"ఆమె కూడా తడబడుతూ , "మీ బావగారు అన్ని విషయాలు చెప్పారన్నారు?" అంది.
నాకు అపుకోలేనంత నవ్వు రాగా, "చిత్రా అన్నీ వివరంగా చెప్పేయ్. నిన్ను కాదనగల ధైర్యం ఏ పరిస్థితుల్లో నూ నాకుండదు"అన్నాను.
"చెప్పడాని కేముంది? మీ బావగారు మీ డ్యూటీ నాకు అప్పగించిన అతి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని నేను ప్రేమించాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. రాజేశ్వరి అనే పాత్రను సృష్టించి, ఆ పేరుతొ మీ భార్యగా స్థిర పడదామని, చిత్ర పాత్రను మధ్యలోనే తొలగించేయదల్చుకున్నాను. అందుకే ద్విపాత్రాభినయం చేశాను."
'అయితే పుట్టు పచ్చ...."
"అది మీలో చిత్ర, రాజేశ్వరి వేరు అని బలపడడం కోసం నేనాడిన నాటకం."
"ఇంత తెలివైనదానివి నా స్వంత మవుతూన్నా వంటే ఏదో భయంగా కూడా వుంది"
'అలాంటి భయాలు పెట్టుకోకండి. అందుకే ముందు జాగ్రత్తగా మీ చెల్లెలు మీ బావగార్ని బుట్టలో వేసుకుంది. మీ కుటుంబ వ్యవహారాలు ఆచూకీ తీయడానికి మీ ఊరు వెళ్ళి మీబావగారు ప్రేమలో పడ్డారు" అంది చిత్ర.
"అది సరే, మీ ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటుండేవారు " అనడిగాను.
"మర్చిపోయారా? అయన అసలు సిసలు పాక హోటల్ యజమాని లా గుండెవాడు. నేనాయన్నక్కడే ఏదో వంకతో కలుసుకునేదాన్ని."
ఉలిక్కిపడ్డాను. మొత్తం కధంతా మంచులా విడిపోయింది.
నేను నా పరువు నిలబెట్టుకోవడం కోసం సింగిల్ టీ హోటల్ ప్రోపయిటర్ని పిలిచి చిత్రను చూపిస్తే , అతను ముందు భుజాలు తడుముకున్నాడు. ఆ తర్వాత నన్ను నకిలీ బాస్ నుచేశాడు.
ఆనందంతో రాజేశ్వరి ని కాదు, కాదు చిత్రను హృదయానికీ గట్టిగా హత్తుకున్నాను.
-----: అయిపొయింది :------
