Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 9

                      
    ఒక రెండు రోజుల పాటు కాలం హాయిగా దొర్లిపోయింది.
    విశాలి నన్నెంతో ప్రేమగా చూసుకుంటుందని సుమిత్ర మురిసి పోయింది.
    కలతలన్నీ సమసిపోయేలా చేసినందుకు ఏనాడూ నమ్మకం లేని సుమిత్ర -- వెంకటేశ్వర స్వామి డిబ్బీ లో ఐదు రూపాయలు వేసుకుంటానని మొక్కుకుంది. జడ వేసుకుందామని జడ ముందుకు వేసుకుని, జడలో సగం జడ కూడా ఇచ్చుకుంటానని మొక్కుకుంది పిచ్చి పిల్ల!
    పొడుగాటి జడ బారెడు పొడుగునా నవ్వింది సుమిత్ర అమాయికత్వానికి.
    గోపాలం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
    లాబొరేటరీ లో కూని దీర్ఘాలు తీస్తున్న సుమిత్రను సమీపించి శారద మహా మొహమాట పెట్టేస్తుంది ఏదో విషయమై!
    కూనీదీర్ఘాలు ఆపి, "ససేమిరా వీలుకాదు!" అంటుంది సుమిత్ర చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ.
    ఆ దారినే పోతూన్న దురదృష్టం సుమిత్ర సంతోషం చూసి కన్ను కుట్టే సరికి ఆమెను సమీపించింది.
    "యేది ఏమైనా నువ్వీ వేళ సినిమాకు రావలిసిందే కాదన్నా కుదరదు. లేదన్నా కుదరదు." సుమిత్రని ఊరికే బలవంత పెట్టేస్తుంది శారద.
    "లాభం లేదు అన్నానా....నన్ను ముప్పై సార్లు అడగకు. నాకు ఒళ్ళు మండుకొస్తుంది. నువ్వు అడిగితె అసలే కాదనలేను." దురదృష్టం మెల్లిమెల్లిగా పాకుతుంది సుమిత్ర ఒంటి మీద.
    నిద్రాదేవత వచ్చి తన సంగతి జ్ఞప్తి కి తెస్తూ దురదృష్టాన్ని దులిపీ పడేసింది. సుఖంగా దాని ప్రమేయం లేకుండా ఈ మధ్య హాయిగా నిద్దర పోతూన్న సుమిత్రను చూసి ముచ్చట పడి!
    "బాబూ, నాకు నిద్దర ఆగడు, నే రాను." ఏమయినా సుమిత్ర రాలేనని అంటుంది.
    "ఏమిటా పాడు నిద్ర? ఇంత టీ తాగి పో. నీకు నిద్ర రాదులే. నా మాట విను. ఇవాళ ఒక్కరోజు నా మాట విను." బుజ్జగిస్తుంది శారద. అసలు సుమిత్రను రక్షించే నిద్రా దేవత కి భయపడి దురదృష్టం శారద నోట్లో దూరి సుమిత్రను వెన్నాడుతుందేమో!
    టీ మాట వింటూనే ఉలిక్కిపడి నిద్రాదేవి వెళ్ళిపోయింది ఆవేళ టీ సుమిత్ర కర్మ తప్పించలేక.
    దురదృష్టం స్వైర విహారం చేసింది సుమిత్ర అంగాంగాల్లోనూ ఆవహించి , అందుకే ఒప్పేసుకుంది పాపం, సుమిత్ర సినిమాకు వెళ్ళడాని కని,. ఆఖరుసారిగా "మా చెల్లి ఆసలే చిన్న పిల్ల! పాపం, నే చెప్పకుండా వెడితే కంగారు పడుతుంది. అదీగాక దానికీ మరీ పరీక్షలు కూడానూ. నేను కాస్త సహాయం చెయ్యాలి. నన్ను ఈ వేళ వదిలి వేశానంటే నీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటాను శారదా! నన్ను వదిలేయ్" అంది, పాపం!
    దురదృష్టం వదలాలి గాని, శారద కేం అడ్డు ఉందనీ?
    అందుకే శారద ఎంత మాత్రమూ ఒప్పుకోకుండా , "మీ చెల్లెలి కి నేను కబురు పెడతాను లే. ఈ వేళ ఏమయినా, అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా నీవు మాత్రం సినిమాకు వస్తున్నావు." తన ఆఖరి నిశ్చయం తెలియజేసి శారద వెళ్ళిపోయింది. దురదృష్టం వికటాట్టహాసం చేసింది!
    సినిమా హల్లో సరదాగా  కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ , తుళ్ళుతూ కేరింతలూ కొడుతున్న సుమిత్ర కి తెలియదు సుడి గుండపు గండం మరో పది అడుగుల్లో ఉందని!
    "దాని సంతోషానికి పట్ట పగ్గాలేలేవు!" శారద అంటుంది పక్క వాళ్ళతో.
    "ఆ....అంతే మరి. నాకేం లోటోయ్? కళ్ళల్లో వత్తులు వేసుకుని నన్ను చూసుకునే చెల్లెలు ఉండగా!" సుమిత్ర అంటుంటే విని నవ్వింది శారద జాలిగా ఆమె అతి మంచి తనానికి!
    అదే తమాషా, అంత మంచితనాన్ని చూస్తె మనుష్యులు జాలి పడతారు, మెచ్చుకోవడానికి బదులుగా!
    ఎంత దూరంలో నుండి వినిపించినా సుమిత్ర కంఠన్ని గుర్తు పట్టగలడు గోపాలం!
    సినిమా లో ములిగిపోయింది కానీ విశాలి మాత్రం?....
    ఏదో విషయం మీద నవ్వి తలయెత్తిన శారద, సుమిత్ర గంబీరంగా మారిపోవడాన్ని చూసి గతుక్కు మంది.
    "ఏం జరిగిందే?' బుజాలు కుదుపుతూ ప్రశ్నించింది.
    "నే వెళతానే." లేచి నిలబడింది. ఒక స్థిర నిశ్చయానికి వచ్చి వేసిన వేను వెంటనే.
    కూర్చో'బెట్టడం శారద తరం కాలేదు. అంటే తాతలూ, ముత్తాతలు దిగి రాకపోయినా, ఆ తరాల నుండి ప్రవహిస్తున్న ఆమె రక్తానికే లొంగలేదు!
    నిశ్చేష్ట అయి నోరు మూసుకుంది!
    తన పని కానిచ్చేసుకుని దురదృష్టం వెళ్ళిపోయింది. మరొకళ్ళని పీడించే నిమిత్తమై.
    నిద్రాదేవి సుమిత్రని చూసి జాలిగా నిట్టూర్చింది. "వనజభవుండు నేన్నోసట వ్రాసిన........" నవ్వుకుంది బాధగా.
    ఆదరాబాదరాగా తలుపు తెరిచి లోపల ప్రవేశించింది సుమిత్ర. ఆ కంగారులో ఏం చేస్తుందో ఆమెకే తెలియదు.
    తిన్నగా డ్రాయరు దగ్గిరికి వెళ్ళింది ముందు. రోజూ విశాలి అగరువత్తుల ధూపం అందుకుంటూన్న వెంకటేశ్వర స్వామి నవ్వుతున్నాడు. అతనికి వెలిగించే అగరువత్తుల స్టాండ్ కిందే విశాలి సంతకం తో చిన్న చీటీ ఉంది. ఆత్రంగా తీసి చదివింది సుమిత్ర.
    "స్నేహితులతో సినిమాకు పోతున్నా. రాత్రి ఆలస్యం అయితే కంగారు పడకు. అన్నం తినేసి పడుకో. విశాలి" అని ఉంది అందులో.
    చదువుతూనే , "భగవంతుడా! మనుష్యుల్ని సుఖంగా బతకనీయావేమయ్యా? ఇదెక్కడి కష్టం నాకు? ఇది చదివి తెలిసి ఉండే నేను తనని వెంటాడానని అనుకొంటుందేమో ?' బాధపడి పోతుంది. పాపం!'
    "అన్ని బాధలకి మందులున్నాయి గాని, అమ్మా, కడుపునొప్పి కి మందు లేదే? అన్ని బాధలూ భరించడం ఒక ఎత్తూ, కడుపు నొప్పి ని భరించడం ఒక ఎత్తు" అనేది చిన్నతనం లో సుమిత్ర.
    కడుపు లో బాధ అంటే ఇదే రకం.
    త్వరగా తేరుకుని పోయి ముందు వంట చేసి తిన్నట్లు కాస్త అన్నం విడదీసి వీధిలో అరుస్తూన్న మాదాకబళం బిచ్చగాడిని పిలిచి ఇచ్చేసి విశాలి కి అన్నీ అమిర్చి వెళ్లి పడుకుంది!
    "ఎక్కడో ఓ మూల విశాలి నన్ను చూడలేదేమో!" ఆశ పోటమరించింది.
    నెయ్యి కంచం దగ్గిర పెట్టడం మరిచిపోయి మళ్ళీ లేచి వెళ్ళింది.
    పెరుగూ , మంచినీళ్ళ గ్లాసూ , కూజా, నెయ్యీ, ఆవేళ చేసిన పచ్చళ్ళూ అన్నీ అమర్చి హాలు లోకి వస్తుండగానే రాత్రి కట్టుకునేందుకు చీరా, జాకేట్టూ దాహం వేస్రే మంచినీళ్ళూ కూనిరాగం తీస్తూ అద్దంలో చూసుకోవాలని ఉంటె చూసుకునేందుకు అద్దమూ , ఆవేళ తల్లీ తండ్రీ వ్రాసిన ఉత్తరాలూ అన్నీ ఎదురుగా అమర్చుకుని మళ్ళీ నడుం వాల్చింది.
    ఈసారి మరొకటి గుర్తుకు వచ్చి లేచి కటకటాల ముందు వరండా కి లోపల ఘడియ విశాలి అవతల నుండి తీసుకోవడానికి వీలయ్యేలా వేసి, ఆమె తనను లేపడం అవసరం లేకుండానే మళ్ళీ మంచం చేరింది.
    ఆ కంగారులో నిమిషానికి ఒక విషయం చొప్పున గుర్తుకు రాసాగింది.
    లేవబోతున్న సుమిత్ర అతి పరిచయంగా సమీపిస్తున్న విశాలీ గోపాలాల అడుగుల చప్పుడు విని ముసుగు ఎగదన్ని వేసింది.
    మంచం మీద ఎంత సేపటి నుండో నిద్ర పోతున్నట్లు అభినయించ సాగింది. నటన లో సుమిత్ర విశాలి కంటే నయమే అయినా, అంత నేర్పు లేదు. సుమిత్ర కి నటనకి చాలా దూరం ఉంది.
    విసురుగా అడుగులు వేసుకుంటూ విశాలి వెనకాలే ప్రళయాన్ని ఊహిస్తూ విశాలి అడుగుల్లో అడుగులు వేస్తూ గోపాలం ప్రవేశించారు.
    పది నిమిషాల కాలం ప్రశాంతంగా ఉంది.
    అవును. ప్రళయం ముందు ప్రశాంతం గానే ఉంటుంది మరి!
    "నేను వెళ్లి వస్తానిక ." నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు గోపాలం, ఆవేళ ఇంక గొడవ జరగదనే భరోసా తో.
    "ఎల్లాగూ చూసిందిగా . అయినా ఎన్నాళ్ళీ దొంగ బతుకు? ఇప్పుడే లేపి చెప్పేసి నన్ను వెంటాడ్డం అనవసరం అని చెప్పేస్తా." దూకుడుగా లేపబోయింది సుమిత్రని విశాలి!
    అంతవరకూ ముసుగు లోంచి అలికిడి కాకుండా వారి సంభాషణ చెవులు రిక్కించి వింటున్న సుమిత్ర కి విశాలి మాటలు వినేసరికి దడ ప్రారంభమై ఉచ్చ్వాసవిశ్వాసాలు జోరుగా వదల సాగింది. దుప్పటి కదిలిపోతుంది ఆమె కంగారుకు వెక్కిరింతగా.
    అది గమనించి గోపాలం "పాపం' అనుకున్నాడు పూర్తీ స్వగతం లో అదే అర్ధ స్వగతం అయినా సరే తన చెవులు రిక్కించలేక సుమిత్ర చెవులు ఉడబెరికి పారవేస్తుందని తెలిసి!
    లేపుదామని దగ్గిరగా పోయిన విశాలికి దుప్పటి అడుగు నుండి వెలుపలికి వచ్చి తనను చూసి పరిహసిస్తూన్న సుమిత్ర చీర కనిపించేసరికి కోపం తార స్థాయికి వెళ్ళిపోయింది.
    "ఏం పాపం, ఇందాకటి నుండి నేను పోరబడ్డానని నన్ను ఊరికే వాదన లో ఓడించి ఆవిడ గారిని వెనక వేసుకుని వచ్చావుగా! చూడు. నేనీ చీరనే అప్పుడూ చూసింది. ఏం, ఒప్పుకుంటావా? నీతో చెప్పాను కూడా నీలం రంగు పువ్వుల చీర అక్కకి ఉందని. అలాంటి చీరలు ఈ ఊళ్ళో చాలామందికి ఉన్నాయని నన్ను నిరసించావుగా! చూడు. అక్కే! ఇంక నిర్ధారణ అయిందా నీకు? ఏ చవక బారు డిటెక్టివు నవలలు చదివి ఇలా వెంటాడుతుందో కనుక్కుంటాను. నన్ను వదులు ముందు నువ్వు." సుమిత్ర కి తెలిసిపోయింది విశాలి ని గోపాలం తన చేతుల్లో బంధించాడని. ఒక్క నిమిషం బాధపడినా , తమ చీర మార్చుకొని విషయానికీ, చీర కనిపించేలా ముసుగు సరిగ్గా వేసుకొని విషయానికీ నాలిక కొరుక్కుంది. ఇంకేం లాభం? పెళ్లి కాకుండా ఆడపిల్లల ఒంటి మీద చెయ్యి వెయ్యడం మినహా గోపాలం లో అన్నీ మంచి బుద్దులే అనుకుంది.
    ఏమిటో అనునయించి, "నడు, భోజనానికి. నాకు అసలే ఆకలిగా ఉంది" అన్నాడు గోపాలం.
    "ఒక మూల ఇక్కడ నేను చీటీ పెట్టాను గదా, స్నేహితులతో సినిమా పోతున్నానని. అయినా ఎంత అపనమ్మకమో చూడు. అసలు నేను స్నేహితులతో వెళ్ళానో, నీతో వచ్చానో తెలుసుకునేందుకే అలా వెంటాడింది." విశాలి బుర్ర అలాంటి విషయాల్లో చాలా అమోఘంగా పని చేస్తుంది.
    వంటింట్లోకి వెళ్ళిపోయిన అలికిడి అయింది.
    'అమ్మయ్య" అనుకుంది నిశ్శబ్దంగా ముసుగులోనే సుమిత్ర.
    ఊపిరి సలపక ఒక్క నిమిషం ముసుగు తప్పించుకున్న సుమిత్ర, తననే చూస్తూ సాక్సు విప్పుకుంటున్న గోపాలం కనిపించేసరికి సిగ్గుపడి పోయింది!
    అరక్షణం పాటు నాలుగు కళ్ళూ కలుసుకున్నా , తాను కోల్పోయిన హక్కు అని తెలుసుకుని దిగులుగా కళ్ళు వాల్చేసుకుంది సుమిత్ర. పైగా ఇంకేం చెయ్యాలో తెలియక తిరిగి ముసుగు వేసేసుకుంది. లోపల నుంచుని "ఇంతసేపు ఆలస్యం ఎందుకూ?" అంటూ వెనువెంటనే ముందు గదిలోకి వచ్చి వేసింది విశాలి!
    గండం ఎంత వెంట్రుక వాసిలో తప్పి పోయిందో గ్రహించుకుని తృప్తి గా నిట్టూర్చాడు ముసుగు లో సుమిత్ర, బయట నిలుచున్నా గోపాలమూనూ!
    "వస్తున్నా. ఒకటే తొందర. వేగడం కష్టమే సుమా నీతో" అంటూ విశాలి ని అనుసరించడం, అనునయించడం తప్పని పని అయింది గోపాలానికి.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS