ఆయన కూడా ఇతనెవరో అర్ధంకాక తికమకపడ్డాడు.
"మీరు సుబ్బరామశర్మ గారు కదండీ? రామచంద్రపురంలో తెలుగు మాస్టారుగా చేశారు కదండీ" అన్నాడు.
"అవునూ....నువ్వెవరో..."
"నేనూ - మాధవరావుగారి అబ్బాయిని ప్రభాకరాన్నండీ. ఫిఫ్త్ ఫారంలో మాకు మిత్ర భేదం చెప్పారండీ మీరు."
"అదా.... నాకు జ్ఞాపకం లేదు, బాబూ ఏమనుకోకు."
"అయ్యో, దాని కేముందండీ! ఏడాదికి రెండు వందల మంది స్టూడెంట్స్ చొప్పున ఈ పధ్నాలుగేళ్ళలో మూడువేల మంది అయిఉంటారు. చూడగానే మీ రెవరో జ్ఞాపకం రాకపోవడం నాదే తప్పు."
"రిటైరయిపోయాను కదోయ్-బుద్ది కూడా మందగిస్తోంది!"
అప్రయత్నంగా ప్రభాకరం అప్పుడే చతికిలబడుతున్న ఆ ఇల్లాలివైపు చూశాడు. పన్నెండేళ్ళ అమ్మాయి చేతుల్లోంచి ఏడాది ఉంటుందేమో - బాబు-వాడిని అందుకుంటూంది.
ప్రభాకరం ఆయన సంసార స్థితి క్షణంలో గ్రహించాడు. ఈయన రిటైరయి రెండు మూడేళ్ళయినా అయి ఉంటుంది. ఈ బాబు.....ఏడాదివాడు....
"అదిసరే... నీ పేరేమిటన్నావ్? ప్రభాకరమా? రామచంద్రపురంలోనే ఉంటున్నావా?"
"మరేనండీ."
"పెళ్ళయిందా? పిల్లలా? ఏమీ చెప్పావుకాదు. మీ నాన్నగారు పాపం...అప్పుడే లేరు కదూ...మీ అమ్మగారెక్కడుంటున్నారు?"
"పెళ్ళయిందండీ-ఆరేళ్ళయింది."
"ఊఁ....మరి పిల్లలూ?"
"అంత అదృష్టం ఇంకా పట్టలేదండీ" అని అప్రయత్నంగా ప్రభాకరం ఆవిడవైపు చూశాడు.
చామనచాయకీ, పసుపురంగుకీ మధ్యనున్నది ఆవిడ శరీరచ్చాయ పుష్టికీ, ఆరోగ్యానికీ ఉదాహరణగా ఉంది ఆవిడ శరీరం. మాస్టారికన్నా మహా అయితే పదేళ్ళు చిన్న ఉండవచ్చు..... అంటే ఏభై.... కానీ..... ముఫ్ఫై అయిదేళ్ళ ఆవిడలాగా ఉంది. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఏ సంసారానికయినా, ఏ దేశానికయినా ఎంత అవసరమో ఎవరో వెన్నుమీద చరిచి చెప్పినట్లయింది.
మళ్ళీ తన్ను తాను నిందించుకున్నాడు. తన కిలాంటి భావాలు కలగడానికి కారణం..... తన ఇల్లాలు ఆరోగ్యంగా లేకపోవడమే! ఇది తప్పు ఆలోచనలాగా అనిపించింది. కానీ...అందులో నిజం కొట్టవచ్చినట్టు కనిపిస్తూంది.
"అన్నట్టు.....వీర్రాజు ఎక్కడున్నాడోయ్? పాపం....వాళ్ళ నాన్న చాలా మంచివాడుస్మీ!" అన్నాడు.
"వీర్రాజంటే?"
"వీర్రాజు నెరగవుటోయ్? హైస్కూలు పక్క సందులోనే ఉండేవారు. పాపం....మార్కులు బాగా వచ్చేవికాదుగానీ... వాడికి నేను అక్షరాభ్యాసం చేశాను. మరి... వాళ్ళ నాన్నకి నా మీద ఎంత భక్తో కానీ వాడు స్కూల్ ఫైనల్ పాసయ్యే దాకా ఏయేటి కా ఏడు ధాన్యపు బస్తా పంపేవాడు...."
"ఓహో! అతనాండీ..." అని నవ్వుకొని, 'వాడు మీకే కాదండీ.... అందరికీ పంపేవాడు. వాడిని మేం ధాన్యం బస్తా అనే పిలిచేవాళ్ళం' అని మనసులో అనుకొన్నాడు.
"వాడు.... సామర్లకోట షుగర్ ఫాక్టరీలో పని చేస్తున్నాడండీ."
"అబ్బ...ఉండవే" అని చంకలదాకా ఎక్కిన పిల్లని విదిలించి నేలమీద కుదేశాడు మాస్టారు.
"మాట్టాడుకోనియ్యరు వెధవలు....ఇలా రండర్రా" అని ఆవిడకూడా కసిరింది.
ప్రభాకరం ఆవిడవైపు తిరిగి అనుకోకుండానే పిల్లల్ని కళ్ళతో లెక్కపెట్టాడు. పాలు తాగుతున్న కుర్రవాడితో కలిసి ఎనిమిది మంది.
"మా ఘటాలు ఎనిమిది నాయనా" అన్నాడు విసుగ్గా మాస్టారు. "ఓ ఇద్దర్నో ముగ్గుర్నో ఎవడైనా అనాథ శరణాలయంవాడు పట్టుకుపోతే బావుణ్ణు."
"ఊరుకోండి....మీరు మరీనూ....అందరి దగ్గరా ఒకటే దండకం...."
కింద కుదవేయబడ్డ పాప ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్రభాకరం చేతులు చాపాడు. 'నా మూలంగానే ఈ పాపని విదిలించారు...' అని అతను బలాత్కారంగా అనుకొన్నాడు.
మంత్రం వేసినట్టు పాప అతని చేతులమీదికి ఎగప్రాకింది. పాప నెత్తుకొని రెండు అడుగులు వేసి అతను-"ఏం పేరు నీది? ఇదిగో....అల ఏడవచ్చా" అన్నాడు.
పాప ఏడుపు మానింది. కానీ....బుంగమూతి అలాగే ఉంచి, 'అవును, ఏడవకూడదు...' అన్నట్లు బుర్ర ఊపింది.
"బిళ్ళలు కొనుక్కొందామా?" అన్నాడు ప్రభాకరం.
పన్నెండేళ్ళ అమ్మాయి ముందుకొచ్చి, "అస లది ఇందాకటినుంచీ బిళ్ళలకోసమే నండీ ఏడుస్తూంది" అంది.
"ఓస్....ఇంతేకదా!" అని ప్రభాకరం బండివైపు నడిచాడు.
"ఓయ్....ఓయ్....ఇలాంటివి పెట్టుకోకోయ్... ఇవేం తెమిలే సంసారం అనుకొన్నావా?"
"పోనివ్వండి, మాస్టారూ....మీ దగ్గర చదివినన్నాళ్ళు మీ కేమీ ఇవ్వనే లేదు."
గంటైంది. మళ్ళీ లౌడ్ స్పీకర్ రైలు నూట ఇరవై నిముషాలు లేటని అరిచింది.
"నూట ఇరవై నిమిషాల్ట! రెండు గంటలని ఏడవ కూడదూ? బాగా పొయ్యే కాలం వచ్చింది నూట ఇరవై నిమిషాలూ వంద పైసలూ అనుకొంటూనూ" అని తెలుగు మాస్టారు విసుక్కొన్నాడు.
'లేటయినందుకు విసుక్కోవడం మానేసి, నిమిషాల్లో చెప్పినందుకు విసుక్కొన్నట్టు ప్రభాకరానికి స్ఫురించింది. అతను నవ్వాడు.
"అయితే.... ఎగ్జిబిషన్ చూడ్డానికొచ్చానన్నావ్ కదూ?"
"అవునండీ. ఈ ఏడాది మేం కూడా అమృతపాణీలు వేశాం కానీ....ఆయనెవరో భీమవరం రాజుగారు బహుమతి కొట్టేశాడండీ. ఢిల్లీలో మళ్ళీ ఈ గెలిచిన వాళ్ళందరిమధ్యా మరొక ఎగ్జిబిషన్ పెడతారట. దానికి వెళ్ళాలని ఉంది" అన్నాడు ప్రభాకరం.
"నీ కేం నాయనా, ఢిల్లీ అయినా వెళతావు, అమెరికా అయినా వెళతావు. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎన్నుంటే అంత కులాసా నీకు. వెంటపడ్డానికి ఎవరూ లేరుకదా! పిల్లాపీచుల్లేని వాళ్ళదే హాయి ఈ రోజుల్లో!"
"అసలు పుట్టనే లేదా, బాబూ, పిల్లలు?" అని అడిగింది మాస్టారి భార్య.
ప్రభాకరం క్షణంసేపు ఆలోచించాడు. ఈవిడ కున్న సాటి సానుభూతయినా తన చుట్టూ ఉన్నవాళ్ళకి లేదు...
"అవునండీ.... నాలుగు సార్లూ అయిదో నెల దాటకుండానే పోయిందండీ."
"అయ్యో, పాపం! పోనీ, ఏ డాక్టరు కైనా చూపించ లేకపోయారా?"
"డాక్టర్లు చూస్తూనే ఉన్నారండీ....ఎన్ననుకుంటే ఏం లాభం? మా కా యోగ్యత లేదు..."
"అహఁ... అదేం మాట? ఇంకా బోలెడంత వయసుంది..... ఈ మాటు కొంత మందులూ అవీ జాగ్రత్తగా ఉంటే సరి!" అని మాస్టారన్నారు.
ప్రభాకరం నీరసంగా నవ్వాడు.
"ఇదీ ఒకందుకు మంచిదిలాగే ఉందండీ. ఈ రోజుల్లో గవర్నమెంటు కూడా వద్దనే అంటున్నారుగా!"
"ఇద్దరుండచ్చని వాళ్ళూ అంటున్నారు కదుటోయ్. ఎటొచ్చీ మా ఇంట్లోకి మల్లే కుచేల సంతానం కాకుండా ఉంటే సరి!"
"ఏ దెటొచ్చినా కష్టమే కదండీ! ఎక్కువ పిల్లల్ని పోషించలేక బాధపడుతున్నారు కొందరు. మా లాంటి వాళ్ళు ఇంకొక రకంగా బాధపడుతున్నారు.... ఇంక చూసి చూసి ఎవరి పిల్లనో పెంచుకొందామన్న ఐడియా కూడా ఉంది."
మాస్టారూ, భార్యా ఒకరివైపు ఒకరు చూసుకొన్నారు.
ప్రభాకరం "రండి, బాబూ, కాఫీ తాగొద్దాం" అని పిల్లల్ని ఆహ్వానించాడు. చేతిలో ఉన్న పిల్లకాక మరొక ముగ్గురు వెంటరాగా అతను కదిలాడు.
'నా మనసులో ఉన్నది వాళ్ళ కెలా చెప్పడం?' అనుకొన్నాడు ప్రభాకరం.
* * *
