Previous Page Next Page 
గురవాయణం పేజి 8


                            'చచ్చి బతకడం' అంటే ఇదేనేమో!

    కోవిడ్ ముమ్మరంగా ఉన్న జూలై నెల ఆ రోజు 24 తారీఖు, అంటే కరక్టుగా లాక్ డౌన్ మొదలయి నాలుగు నెలలు.
    ఈ నాలుగు నెలల్లో మా రెండు హాస్పిటల్స్ లో వేలమందికి కరోనా చికిత్సచేసి, క్షేమంగా ఇళ్ళకు పంపడం జరిగింది, అలానే- ఎన్ని ప్రయత్నాలు చేసినా- వందలమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, కళ్ళముందే చనిపోవడం కూడా జరిగాయి.
    అన్ని జబ్బులుండి, "ఇవాళోరేపో" అని డిక్లర్ చేసిన ఎనభైఏళ్ళ వృద్ధుడు నెల తర్వాత నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేవాడు. కొంచెం జ్వరంతో, వచ్చిన పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన ఆశలు వదిలేసిన ముఫ్ఫై ఏళ్ళ కుర్రాడు వారంలోనే. కాల్చడానికి కూడా బంధువులు రాక, రాలేక- అనాథశవంలా మిగిలిపోయేడు.
    ఇవన్నీ చూస్తుంటే- మా చదువులు, తెలివితేటలు హాస్పిటల్ లేటెస్ట్ పరికరాలు, ఇవన్నీ వ్యర్ధమే అనిపిస్తుంది. చివరికి, కనపడని శక్తి ఏదో- ఎవరుండాలి-ఎవరు పోవాలి- అనేది నిర్ణయిస్తుందేమో అనిపిస్తుంది. మేం అందరం నిమిత్తమాత్రులం అనిపిస్తుంది.
    ఆ రోజు ఉదయం పదిగంటల సమయం. ఓ అంబులెన్స్ ఎమర్జన్సీ సైరన్ తో, హాస్పిటల్ కి వచ్చింది. పేషెంటుని జయ అందాం.
    (పేరు మార్చటం జరిగింది) 22 ఏళ్ళు నిండు నెలల గర్భిణి కరోనా పాజిటివ్ వేరే హాస్పిటల్ లో Intubate చేసి- తర్వాత ప్రసవానికి అని, సన్ షైన్ కి పంపారు. దారిలోనే అబులెన్స్ లోనే కార్డియాక్ అరెస్ట్ అవడంవల్ల పేషెంటు, చివరిక్షణాల్లో ఉంది.
    ECGలో ఫ్లాట్ లైన్ అంటే, గుండె కొట్టుకోవడం మానేసింది అన్నమాట. పొట్టలో ఉన్న బిడ్డ గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటోంది.
    పక్కనే ఉన్న భర్తకీ, తల్లి, చనిపోయిందని, బిడ్డ బతికే అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పేశారు, మా ఎమర్జన్సీ డాక్టర్లు.
    ఇంతలో, గైనకాలజిస్టు, ఆమె బృందం క్యాజ్ వాల్టీకి చేరుకున్నారు. అప్పటి దృశ్యం ఏమిటంటే తల్లి గుండెలో ఇంకా ఏమన్నా ప్రాణం ఉందేమోనని వెర్రి ఆశతో, డాక్టర్లు ఆమెకి CPR (Cardiopulmonary Resuscitaion) అంటే-ఛాతీ మీదచేతుల్తో మర్దన చేసి, గుండెలయని (ప్రోత్సహించడం) చేస్తున్నారు.
    ఫలితం కనబడటంలేదు.
    ECGలో ఇంకా ఫ్లాట్ లైన్ కనబడుతూనే ఉంది. బిడ్డ గుండెమటుకు-
    "నన్ను బతికించరూ- తొమ్మిదినెలలు నన్ను మోసిన అమ్మ-నాకు రక్తం పంచిన అమ్మ-నిశ్శబ్దంగా ఉంది- మీరైనా ప్రయత్నంచేసి-బయటపడేయండి- నాకు గాలి ఆడటంలేదు" అని అల్ట్రాసౌండ్ ద్వారా సంకేతాలు పంపినట్లు అనిపించింది.
    ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది గైనకాలజిస్ట్ మాటల్లో విందాం.
    సిజేరియన్ చేసి బిడ్డను డెలివరీ చేద్దాం అనే నిర్ణయం తీసుకున్నాం. బిడ్డ గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటోంది.
    బతికే అవకాశాలు పదిశాతంకంటే లేదు అని తెలిసినా-ఇంకో పదినిమిషాలు తాత్సారంచేస్తే-ఆ కొంచెం ఆశ కూడా అణగారిపోతుంది కాబట్టి-
    అక్కడే క్యాజ్ వాల్టీలో ఉన్న కొద్ది పరికరాలతోనే పొట్టకోయడం మొదలెట్టాను. ఇరవై ఏళ్ళ అనుభవంలో- 'ప్రాణం లేని' తల్లికి Cesarean చేయడం నాకిదే మొదటిసారి.
    ఈ రకమైన Perimortem ఆపరేషన్- నాకేకాదు-కొన్ని వేలమంది గైనకాలజిస్టులు వాళ్ళ జీవితకాలంలో చూసి ఉండరేమో!
    రెండునిమిషాల్లో బిడ్డని బయటకు తీశాను. ఆడపిల్ల. కొన ఊపిరిలో ఉంది. చిన్నిగుండె- బలహీనంగా కొట్టుకుంటుంది. ఏడ్పులేదు, శ్వాసలేదు, అనస్థీషియా డాక్టరు వెంటనే బిడ్డకి CPR మొదలెట్టారు. గుండె కొట్టుకోవడం మెరుగయింది. వెంటనే Intubate చేశారు.
    అచేతనంగా తల్లి చుట్టూ పదిమంది డాక్టర్లు, పక్కనే ఈ చిన్నితల్లి "ఇక నా పని అయిపోయింది-తండ్రికి చెపుదాం" అనుకుంటూ అలా ECG Monitor వేపు చూశాను.
    ఆశ్చర్యం-Miracle. జయ ECGలో గుండె లయ ప్రత్యక్షమయింది.
    గత ఇరవైనిమిషాలు తల్లి గుండెని లయలోకి తీసుకురావడానికి, ఎమర్జన్సీ డాక్టర్లు చేస్తున్న CPR ఇప్పటికి ఫలించింది. "అమ్మా నాతోపాటు నువ్వు కూడా ప్రాణం పోసుకో" అని బిడ్డ చెప్పినట్లు, ఆ అమ్మ విన్నట్లు అనిపించింది.
    ఐ.సి.యులో 15 రోజులు గడిపినాక అమ్మ, పాప డిశ్చార్జి అయి, ఇంటికి వెళ్ళే ఆనంద క్షణాలు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి.
    ఓ డాక్టరుకి ఇలాంటి తీపి జ్ఞాపకాలే- ఆనందం, ఉత్సాహం, ఊపిరి, ప్రసూతి వైద్యం ఎంత పురోగమించినా "ప్రతి పురుడు, స్త్రీకి పునర్జన్మ" అన్నది నానుడి. అరగంట సుప్తావస్థలో ఉండి, అందరం ఆశలు వదిలేసుకుని, వాళ్ళాయనకి 'తనికలేదు' అని చెప్పినాక- మళ్ళీ జీవం పోసుకుని, ఇన్ఫెక్షన్ లేకుండా, మెదడు దెబ్బతినకుండా, బయటపడిందంటే- జయకు ఇది పునర్జన్మే.
    తప్పు నిర్ణయాలు తీసుకోకుండా, సక్రమ మార్గంలో మా అందరు డాక్టర్లకి, సమయానికి సరైన ఆలోచనల్నిచ్చిన ఆ దేవుడికి ప్రణమిల్లుతూ...
    
                                                                                    జయ-మృత్యుంజయ


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS