సిన్మాల్లో డాక్టర్లు
నేను డాక్టరు ఎందుకయ్యానో అంతకు ముందే మనవి చేసుకున్నాను. 'క్షయ' నాన్నో, 'గుండె జబ్బు' అమ్మో కారణం కాదు. తెల్లకోటు ఎట్రాక్షన్, ట్యూబ్ లైట్ డిస్ట్రాక్షన్ వల్లే నేను డాక్టర్ అయ్యాననేది అందరికీ తెలిసిన విషయం. కాని చిన్నప్పుడు ఆరాధన సిన్మాలో ఓ సీన్ నన్ను ఎంతగానో ఉత్తేజింపచేసి, నన్ను డాక్టరుని చేసిందనే విషయం ఈ రోజే మీతో పంచుకుంటున్నాను.
అక్కినేని తనవిద్యనంతా ఉపయోగించి, చనిపోబోయే ఓ బీద పేషెంట్ ని బతికించిన సీన్ అని మీరనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలే జీవితగమనాన్ని మారుస్తాయి. కానీ సిగ్గులేకుండా, పడకుండా, చెప్తున్నాను.
నాకు నచ్చిన, ముచ్చటేసిన సీన్- అక్కినేని పొడవాటి స్టెతస్కోప్, సావిత్రి చీరకొంగుకు ముడి పడిన సందర్భం. ఐదేళ్ళు మెడికల్ కాలేజ్ లో తెగ ప్రయత్నం చేసి ఓడిపోయాను. అంత అందమైన సావిత్రిలాంటి చీరకొంగూ, పొడవాటి గొట్టం ఉన్న స్టెతస్కోప్ దొరకలేదు. అప్పటినుంచి సిన్మాలో డాక్టర్లుని చూస్తే నాకు కోపం, కచ్చ.
పాతసిన్మాల్లో డాక్టరుని, యముడికి ఫస్ట్ అసిస్టెంట్ గా చూపడం జరిగేది. దేవదాసులో ఎన్నో జీవితసత్యాల డైలాగులున్నా-నా గుండెల్లో గుచ్చుకొన్న డైలాగు-డాక్టరుదే-చంద్రముఖితో అన్న మాట- "ఇక అట్టే బతుకుతాడని తోచదు" ఆ రోజుల్లో చాలామంది డాక్టర్లు- అలా finaltoneలో funeral toneలో మాట్లాడేవాళ్ళు.
మరి నా మెడికల్ కాలేజ్ బుక్స్ లో ఎక్కడా దొరకలేదు- సినిమా డాక్టర్లు. డబ్బులున్న హీరో తండ్రికి ఇచ్చే వైద్యం- "గుండె చాలా బలహీనంగా ఉంది. షాకింగ్ న్యూస్ ఏదీ చెవిన వేయకూడదు" అంటే లేచిపోయిన కూతురి సంగతి-
చచ్చి బతికిన రెండో భార్య సంగతి, ఆ భార్య కొడుకే తన ఇంట్లో డ్రైవర్ అన్న సంగతీ, ఇలాంటివన్నీ- రెండుగంటలపాటు దాచిపెట్టి- ఆ పేషెంట్ ని బతికించుకుంటారు. అలానే- హీరోకి-
"బ్రెయిన్ కి షాక్ తగిలింది-ఏ ఊటికో, సిమ్లాకో తీసుకువెళ్ళి, చల్లగాలి, 'పిల్ల'గాలి దొరికేట్లు హీరోయిన్ రాత్రింబవళ్ళు సేవచేస్తే- మళ్ళీ మనిషవుతాడు" అనగానే-రెండు రీళ్ళు, నాలుగు కన్నీళ్ళు ఖర్చావడం కూడా చాలా సిన్మాల్లో చూసే ఉంటాం.
హిందీ సిన్మాలో "దవా కాదు దువా (దేవుడి దయ) అవసరం" అన్న డైలాగు వందలసార్లువింటాం. కొన్ని హాస్పిటల్ సీన్లు వెంటాడుతూనే ఉంటాయి. అమర్, అక్బర్, ఆంతోనిలో, ముగ్గురు కొడుకులు వాళ్ళమ్మకి, blood donation చేయడం. Grouping, cross matching, ఇవన్నీ టైమ్ వేస్ట్ కార్యక్రమాలు.
మూడు నదులు, సముద్రంలో కలిసినట్లే ముగ్గురినుంచి blood అమ్మ bodyలోకి ఒకేసారి, హిందీవాళ్ళకైతే ట్యూబ్ లో, బాటిల్సో ఉండాలిగాని, ప్రేమనగర్ లో వాణిశ్రీకి, అవేం అక్కర్లేదు. చక్కగా బత్తాయిరసం ఇచ్చినట్లు, తన రక్తం, ఓ అందమైన క్రిస్టల్ గ్లాస్ లో అక్కినేనికి ఇస్తుంది.
అలానే 'డియా ఔర్ తుఫాన్' అనే ఓ పరమచెత్త సిన్మాలో - brain transplant చూడాలి మీరు తప్పక. చనిపోయిన హీరో బ్రెయిన్ ని అలవోకగా అరిచేతితో తీసేసి, ఓ మైక్రోవేవ్ లో ఐస్ గడ్డలమీద స్టోర్ చేసి, ఆ తర్వాత హీరోయిన్ కి transplant చేస్తారు.
నా స్నేహితులైన neurosurgeons అందరూ సిగ్గుతో తలవంచుకోండి- మీరు ఈ లెవెల్ కి ఎప్పటికి ఎదుగుతారో! హిందీవాళ్ళు బ్రెయిన్ మారిస్తే నేను హార్ట్ మారుస్తానని-సిన్సియర్ Sampoornesh Babu-తన ఓ తెలుగు సిన్మాలో -heart transplant చేస్తాడు. Babu ఇంకా అడ్వాన్స్ డ్.
మైక్రోవేవ్, ఐస్ కూడా అక్కర్లేదు. గాలిలో పావురాన్ని ఎగరేసినట్టు గుండెని అలావిసిరితే హృదయంలో ఇలా సెట్ అయిపోతుంది.
(పై రెండు అద్భుతమైన ఆపరేషన్లు చూడాలి అనుకుంటే U-tube లో Khalarkhan brain transplantation, Sampoornesh Babu heart transplantation అని వెతకండి.)
బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ అయినా, తెలుగైనా, హిందీ అయినా- తరతరాలుగా ఓ డాక్టరు సీన్ మట్టుకు మారలేదు. బీదవాడి తల్లి కిడ్నీకో, తండ్రిగుండెకో, చెల్లికళ్ళకో ఆపరేషన్ చేయాలి.
హీనపక్షం- 5 లక్షలన్నా అవుతుంది. అంతకన్నా ముఖ్యమైన విషయం- ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ వస్తున్నాడు రెండ్రోజుల్లో. మూడురోజులుమాత్రమే ఉంటాడు. అంటే 5 రోజుల్లో 5 లక్షలు బీద హీరో సంపాదించాలి. ఇక చూస్కోండి నా సామిరంగా సిన్మాలో మలుపులే మలుపులు.
సిన్మాల్లో డాక్టర్ ను, తరచూ కమెడియన్ గా కూడా వాడుకుంటుంటారు. సొమ్మొకడిది, సోకొకడిది సిన్మాలో కమల్ హాసన్, రమాప్రభ 'కడుపు' కన్సల్టేషన్ కడుపుబ్బా నవ్వించింది కదా.
శంకర్ దాదాలో చిరంజీవి "బుర్రతో కాదు, గుండెతో ట్రీట్ చేయాలి" అన్న సందేశాన్ని చాలా హృద్యంగా అందించాడు.
అదే చిరంజీవి-ఠాగూర్ సిన్మాలో "శవం మీద డబ్బులు ఏరుకునేవాళ్ళు మీ డాక్టర్లు" అనే అతి మెలొడ్రమాటిక్ సీన్ తో డాక్టర్లందరి మీద, అన్యాయమైన, అపనిందలు మోపి, ప్రజలందరికీ డాక్టర్లమీద నమ్మకం పోయేట్లు చేశారు.
ఇన్ని వందల సిన్మాలు చూశాను. కానీ ఏ సిన్మాలోనూ ఒక్క డాక్టరన్నా బొక్కల డాక్టరుగా కనపళ్ళేదు- ఎంతసేపటికీ, గుండె డాక్టర్ గానో, మెదడు డాక్టర్ గానో తప్ప! నేను రిటైర్ అయినాక, సంపాదించిన డబ్బులన్నీ పెట్టి "అరిగినా, జరిగినా, విరిగినా" అనే సిన్మా తీసి, దాంట్లో హీరోగా బొక్కల డాక్టరుని పెట్టకపోతే ఒట్టు.
