4
గోడ గడియారం పది గంటలు కొట్టింది. ఆ గంటలని శ్రద్ధగా లెక్కపెట్టి, గడియారంకేసి చూసింది.
అప్పటివరకు ఇలస్టేటెడ్ వీక్లీ చదువుకొంది. తల్లి ఇంకా ఇంటికి రాలేదు. అంచేతనే అప్పటివరకూ ఆ పుస్తకాన్ని చదవగలిగింది.
మొహం పైకి పడుతున్న జుత్తుని చేత్తో వెనక్కి తోసుకుంటూ లేచి కూర్చుంది.
క్లాసు పుస్తకాలని తప్పితే ఇతరత్రా మాగజైన్స్ ని అస్సలు చదవనీయదు భారతి తల్లి లలితాంబ. ఆఖరికి క్లాసు పుస్తకాలు సైతం పరీక్షలు జరిగే సమయంలో కూడా రాత్రి పదకొండు కారాదు. పదకొండయితే గదిలో దీపాన్ని ఆర్పేసి నిద్ర వచ్చినా, రాకపోయినా సరే పడుకోవాలి.
లలితాంబ మహిళా సమాజం ప్రెసిడెంట్. ఆ రోజు క్లబ్బులో ఆమెకి ఫంక్షన్ వుంది. అందుచేత ఆమె ఇంకా ఇంటికి చేరలేదు.
ఆమె ఇంట్లో వుంటే సింహస్వప్నమే. ఒక్క భారతికే కాదు, ఆమె తండ్రి లక్ష్మిపతికి, బావ సారధికి, పనివాళ్ళకి అందరికీ భయమే.
క్లబ్బులోనూ, మరికొన్ని సమాజాల వాళ్ళ దగ్గర స్త్రీ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛావిధానాల గురించి, మగవాళ్ళు స్త్రీల పట్ల ప్రవర్తించే తీరుతెన్నుల గురించి అనర్గళంగా ఉపన్యాసాలివ్వడం భారతికి తెలుసు.
అలాంటి అభ్యుదయ భావాలు కల తన తల్లి తన విషయంలో ప్రవర్తించే పద్దతి అసలు ఊహకే అందదు భారతికి.
'క్రమశిక్షణ' పేరుతో జైలుల్లోని ఖైదీని చూసినట్టుగా చూస్తుందనిపిస్తుంది భారతికి.
ఉదయం అయిదు గంటలకే లేచి పనులు పూర్తి చేసుకొని పుస్తకాల దగ్గర కూర్చోవాలి. ఏడు గంటలకి కాఫీకి, టిఫెన్ కి డైనింగ్ రూమ్ లోకి వెళ్ళాలి, అదయ్యాక మళ్ళీ చదువు, అటు తరవాత భోజనం కాలేజీ.....కి బస్సులో వెళ్ళాలి.
కాలేజీ నించి తిన్నగా ఇంటికి వచ్చేయాలి.
ఆఖరికి ఫ్రెండ్స్ తో తిరగడం కానీ, సినిమాలకెళ్ళడం కూడా ఆమె ఇష్టపడదు. నెలకోసారి ఆమె కుటుంబ సమేతంగా సినిమాకి వెళుతుంది. అప్పుడే భారతి కూడా వెళ్ళాలి.
చివరికి కట్టుకునే దుస్తుల దగ్గరనించీ ఆమె సెలక్షన్ చేస్తుంది తండ్రికూడా ఆఖరికి ఎప్పుడూ తల్లికి ఎదురు చెప్పడం భారతికి తెలీదు.
తల్లి ఏదన్నా ఊరెళ్ళినా, క్లబ్బుకెళ్ళినా భారతికి బోలెడు సరదాగా ఉంటుంది. పక్షి పిల్లకి రెక్కలొచ్చినంత ఆనందంగా ఉంటుంది భారతితోపాటు ఇంట్లో అందరికీ అంతే, అలాంటి సమయంలో ఇంట్లో భారతిచేసే అల్లరి అంతా ఇంతా కాదు. కూతురలా ఉత్సాహంగా అల్లరి చేస్తుంటే తండ్రికి బోలెడంత ఆనందం. పనివాళ్ళకి ఆరోజు 1947 ఆగస్ట్ 15వ తారీఖులా అనిపిస్తుంది. టేప్ రికార్డర్ ఆన్ చేసి పాశ్చాత్య నాట్యావికి అనుగుణంలా వుండే అడుగులు వేస్తూ ఆడుతుంది. పాడుతుంది.
భారతి మంచం దిగి బాల్కనీలో కొచ్చిచూసింది. కింద ఆఫీసురూంలో తండ్రి ఏదో కేసు స్టడీ చేస్తున్నాడు.
లక్ష్మిపతి మంచి క్రిమినల్ లాయర్. అతను కేసు టేకప్ చేస్తే ముద్దాయిలు గుండెపైన చెయ్యివేసుకొని నిద్రపోవచ్చు.
తెల్లారి లేస్తే పెద్ద గూండాలతో, హంతకులతో వ్యవహారాలు గల తండ్రి కూడా తల్లిని చూస్తే ఎందుకలా భయపడతాడో భారతికి ఈనాటికీ అర్థం కాదు.
భారతి చేతుల్ని కట్టుకుని గదిలోనికెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. కిటికీలోంచి దూరంగా హుస్సేన్ సాగర్, రైలుకట్టా కనబడతాయి. కిటికీలోంచి చల్లనిగాలి లోపలికి దూసుకొస్తోంది. అంచేత కిటికీకి సగంవరకూ వేసిన లేసు కర్టెన్స్ గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తున్నాయి.
దూరంగా రోడ్డుమీద ఏదో కారు వస్తున్నట్టుగా గమనించింది భారతి.
క్లబ్బునించి తల్లి వస్తున్నదన్నమాట. గబగబా వెళ్ళి లైటు తీసేసింది భారతి. ఓ క్లాసు పుస్తకాన్ని గుండెలపైన పెట్టుకొని పడుకొంది. జైలు వార్డెన్లా ఇన్స్ పెక్షన్ కి తల్లి తనగదిలోకి వస్తుందని భారతికి తెలుసు.
కారుకింద పోర్టికోలోకి వచ్చి ఆగడం కిందనెవరో తలుపు తీయడం హడావిడి అంతా వినబడుతూనే వుంది భారతికి.
బయటనించి ఇంటికి లలితాంబ వచ్చిందంటే గాలివాన వచ్చినట్టుగా ఉంటుంది.
"ఆ కేసేదో రేపు చూసుకోవచ్చుగా. పడుకోకూడదు, ఇప్పుడు టైం ఎంతో తెలుసా! రాత్రి పదకొండయింది. మీ హెల్తు అసలే మంచికాదు. ఎందుకొచ్చిన కేసులు. ఉన్న ఆస్తి చాలదా? అసలు ప్రాక్టిస్ మానేయండి"
తండ్రిపైన విరుచుకొని పడిందన్నమాట. భారతి నవ్వుకొంది.
"అదికాదు లలితా, ఈ కేసు రేపు ఫైల్ చెయ్యాలి" అనునయంగా తండ్రి అంటున్నాడు.
"సారీ, చెప్పడంవరకేగానీ, వినడం నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ ప్లనేషన్. ప్లీజ్ గో టూ బెడ్"
"అలాగే?" తండ్రి గొంతు.
"రంగన్నా"
"అమ్మా"
"అమ్మాయి ఏం చేస్తోంది!"
"పడుకొందమ్మా" అన్నాడు రంగన్న.
"ఏమిటా భాష! అమ్మాయిగారు పడుకొన్నారమ్మా అని చెప్పాలని తెలీదు. ఏళ్ళొచ్చాయి మర్రిచెట్టుకొచ్చినట్టు.
"భోం చేసిందా!"
"చదువుకొందా!"
"ఇవన్నీ చెప్పిచావవే!"
"ఎనిమిదికే భోజనం చేసి, పదిగంటలదాకా చదువుకొని పడుకొన్నారమ్మా"
ఇవన్నీ భారతికి వినపడుతూనే వున్నాయి.
పది నిమిషాల తర్వాత గది గుమ్మంబయట అడుగుల సవ్వడి వినబడింది.
భారతి గట్టిగా కళ్ళుమూసుకుంది. లలితాంబ గదిలో అడుగుపెట్టింది. గదిలో లైటు తీసేసి కూతురు నిద్రపోతూ ఉండటం చూసి తృప్తిగా మంచం దగ్గరికి నడిచింది.
