తను డబ్బు ఇస్తే తీసుకెళ్ళే మనిషి అవంతి.
తన గురించి ఇంత శ్రద్ధగా ఎందుకు ఆలోచిస్తున్నదీ అతనికి అంతుచిక్కలేదు.
అతని మనసు బలహీనమైనది.
చంచలమైనది ఈ ప్రపంచంలో 'సుఖం' అనేది కేవలం ఆడదాని దగ్గర దొరుకుతోందన్న భావనలో వున్నాడు మనోహర్.
"నువ్వెప్పుడైనా 'ప్రేమ' అను రెండు అక్షరాల గురించీ ఆలోచించావా?"
అతను మాట్లాడలేదు.
"పోనీ అసలు ప్రేమ అనే మాట గురించి విన్నావా?"
ఛెళ్ళుమని కొరడాతో కొట్టినట్టయింది మనోహర్ కి ఆ మాట.
అతను తీవ్రంగా చూశాడు.
కానీ..... ఆ క్షణంలో అతని కళ్ళముందో ఆకృతి కనబడింది.
"నీకు భారతి తెలుసా?" అడిగాడు మనోహర్.
ఆ పేరు వింటూనే విస్తుపోయింది అవంతి.
ఆ సమయంలో అతనికి భారతి, ఎందుకు గుర్తుకొచ్చిందో అర్థం కాలేదు. సందేహంగా చూసింది అవంతి.
"తెలుసు కదూ!" మళ్ళీ అడిగాడు మనోహర్. "తెలుసు. సైన్స్ కాలేజీలో చదువుతోంది. లాయర్ లక్షీపతిగారి అమ్మాయి."
"కరెక్ట్. ఆ అమ్మాయిలో కొద్దిగా నీ పోలికలు కూడా వుంటాయి. ఆ పోలికలు నీలో వుండబట్టి నీతో ఇన్నాళ్ళుగా తిరుగుతున్నాను. ఐ లైక్ హర్" అన్నాడు.
"అయితే!"
"భారతిని నాకు పరిచయం చెయ్యాలి" అన్నాడు సిగరెట్టు వెలిగిస్తూ మనోహర్.
అవంతి అసహ్యంగా చూసిందతన్ని.
"నేనేమన్నా బ్రోకర్ననుకొన్నావా? పైగా భారతి గురించి నీకు తెలీదు. ఆ అమ్మాయి చాలా మంచిది. పిచ్చి ఆలోచనలు మానేయి."
మనోహర్ తమాషాగా నవ్వాడు.
"నువ్వన్నావే ప్రేమ!
ఆ ప్రేమనే రెండు అక్షరాలకీ అర్థం భారతి దగ్గర తెలుసుకోవాలని" అన్నాడు మనోహర్.
అవంతి విస్మయంగా చూసింది. "నువ్వు నిజమే చెపుతున్నావా? లేక ఆ పిల్ల జీవితంలో చెలగాటం ఆడాలనా?" తీక్షణంగా అడిగింది అవంతి.
మనోహర్ ఆలోచించకుండా చెప్పాడు.
"నువ్వేమనుకున్నా ఫరవాలేదు. భారతంటేనాకిష్టం." అన్నాడు మనోహర్.
"ఇష్టం, అనే మాటకి నీకో అర్థం తెలిసినందుకు సంతోషంగా వుంది."
"ఇంతకీ ఏం చేస్తావు మరి!
"నువ్వు రౌడీవి. మరి నేను కాస్త ఆలోచించుకోవాలి." అంది నవ్వుతూ అవంతి.
మనోహర్ ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు.
"చలిగా వుంది" అంది అవంతి.
"ఇప్పుడు" మరి కొంచెం కౌగిలిని బిగించి అడిగాడు.
"ఊపిరి ఆడకుండా ఎవరో రాక్షసుడు కౌగిలించు కొన్నట్టుగా వుంది" అంది అవంతి.
మనోహర్ నవ్వాడు.
"నీకు ఇష్టమైనవేమిటో నేను చెప్పనా?" అడిగింది అవంతి.
"ఏమిటి?"
ఆమె చెవిలో అడిగాడు మనోహర్.
"ఆపిల్స్." అంటూ గలగల నవ్వేసింది అవంతి.
ఆకాశం నించి మంచు పూలు వాళ్ళపైన కురుస్తున్నాయి.
రమణి అబార్షన్ చేయించుకొంది. మంచంమీద నీరసంగా మూలుగుతుంటే అవంతి అంది.
"ముందే జాగ్రత్త పడితే ఈ అవస్థ వుండేదికాదు. జరిగిందేదో జరిగిపోయింది. రెస్ట్ తీసుకో."
"అలాగే!" అంది రమణి.
అవంతి మంచంమీద పడుకొని పుస్తకాన్ని చేతిలోకి తీసుకొంది.
"రాత్రి ఎక్కడికెళ్ళావు."
"మనోహర్ కాల్షీట్ ఇచ్చాడు. అవసరం వెళ్ళాను."
"బంగారు పిచ్చికని పట్టేశవే!" అంది రమణి.
ఆ మాటలకి అవంతి పగలబడి నవ్వేసింది.
"పిచ్చిపిల్లా! మనోహర్ పాదరసం లాంటివాడు. వాడు దొరికాడనుకోడం ఎంత బుద్ధిలేని విషయమో నీకు తెలీదు. హి ఈజ్ జస్ట్ టు ఫ్రెండ్. నాకతనిపైన ఏ విధమైన కోరికలు లేవు. ఆశలు లేవు."
"అంతేనా!" నీరసంగా అంది రమణి.
గత రాత్రి నుంచీ అవంతికి ఆలోచనలు తెగడం లేదు. భారతి గురించి మనోహర్ కి గల నిజమైన అభిప్రాయం ఏమిటో తెలీదు.
అతని మాటల్ని నమ్మాలా, లేదా అన్న డైలమాలో పడిపోయింది అవంతి.
భారతిని మనోహర్ ప్రేమిస్తున్నాడా?
అతనికి నిజంగా ప్రేమంటే తెలుసా?
అతనికి భారతిని పరిచయం చేస్తే అభం శుభం తెలీని ఓ ఆడపిల్ల బతుకుని నిప్పుల కుంపటికి తోయడం కాదు కదా!
మర్నాడు భారతిని కలుసుకోటానికి అవంతి నిశ్చయించుకున్నది.
కానీ ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ముందు ముందు ఎలాంటి విపరీతాలకి దారితీయనున్నదో ఆ క్షణంలో అవంతికి తెలీదు.
