Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 8

       
    మంచం పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసి పక్కనే టీపాయ్ పైన పెట్టి తలపైన చేత్తో నిమిరి, నుదురుపైన ముద్దుపెట్టుకొని "గుడ్ గరల్" అనుకొంది లలితాంబ.


    కిటికీలోంచి దూసుకొచ్చిన చలిగాలికి ఒళ్ళు జలదరించింది లలితాంబకి.

    
    "పిచ్చి పిల్ల ఇంత చలిగా ఉంటే దుప్పటి కప్పుకోవాలని కూడా తెలీదు" అని భారతికి దుప్పటి కప్పి బయటికి నడిచింది లలితాంబ.


    తల్లి బయటికి వెళ్ళిపోతూంటే భారతి మెల్లగా కళ్ళువిప్పి చూసి నవ్వుకున్నది. ఆమె చందశాసనురాలిలా ప్రవర్తించినా తనంటే ఆమె ఎంత ప్రేమో భారతికి తెలుసు. అందుకే ఆమె ముందు నిలబడి మాట్లాడాలన్నా, ఎదురుచెప్పాలన్నా ఆమెకి భయం.


                                      5


    కాంపౌండ్ వాల్ గేటుమూసి రోడ్డుమీదికి వచ్చింది భారతి. రోడ్డుమీదికి వచ్చేసరికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది భారతికి. కాలేజీలో వుండే సమయం స్వర్గంలా అనిపిస్తుంది భారతికి.


    హిందీనగర్ కాలనీలో కొత్తగా కట్టిన తన ఇంటినించి సన్నని తారు రోడ్డుపైన నడిస్తే సుమారు అరకిలోమీటరు దూరం వుంటుంది. బస్ స్టాపు. ఇంటి నుంచి బస్టాపువరకు నడక తప్పదు భారతి.


    కారుండి కాని దానిలో తండ్రి కోర్టుకెళతాడు. లేకపోతే తల్లి వాడుతుంది. ఏనాడూ కారులో కాలేజీకి వెళ్ళి ఎరుగదు భారతికి.


    యధాలాపంగా ఆ రోడ్ కి కార్నర్ లో ఉన్న మేడకేసి చూసింది భారతి. బాల్కనీలో నించుని ఓ అబ్బాయి నవ్వుతూ చెయ్యి వూపాడు.


    భారతికి నవ్వొచ్చింది.


    అల్లరిచేసే కుర్రాళ్ళకి తిరిగి ఏదో ఒక సమాధానం చెప్పడం భారతికి అలవాటే.


    కొంటెగా చూసి మళ్ళీ చేయి వూపింది భారతి. అది రోజూ జరిగే దినచర్య అయిపోయింది.


    భారతి ఇంటినించి బయల్దేరి బస్టాపులోకి వెళ్ళే ఆ సమయంలో అక్కడ నిలబడి సెండాఫ్ ఇవ్వడం అతనికి రివాజైపోయింది.


    భారతికి అతని వివరాలు తెలుసు. అతను బోసుబాబు. చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా బ్యాచిలరే. ఆ మేడలో పైన అద్దెగదిలో ఉంటున్నాడు.


    బోసు తనంటే పడి చస్తాడని భారతికి తెలుసు, కానీ భారతికే అతనంటే ఏ విధమైన అభిప్రాయం లేదు. అతను కాస్తంత జల్సా పురుషుడని కూడా భారతికి నామమాత్రంగా తెలుసు.


    భారతి వెనక్కి తిరిగి చూచింది. బోసుబాబు అక్కడే నిలబడి వున్నాడు. వెనకగా ఇరవై గజాల దూరంలో బావ సారధి నడిచి రావడం కనబడింది.


    భారతి వడి వడిగా అడుగులు వేసింది.


    సారధి ఎం.ఏ. పాసయ్యి ఉద్యోగ ప్రయత్నంలో వచ్చాడు. ఉద్యోగం దొరికితే వెళ్ళిపోతాడు. భారతికి అతడు స్వయాన మేనత్త కొడుకు.


    బస్టాపులోకెళ్ళి నిలబడి కర్చీఫ్ తో మొహాన్ని అద్దుకొంది భారతి.


    "హలో?" అన్న పిలుపుకి పక్కకి తిరిగి చూసింది భారతి.


     అవంతి నవ్వుతూ దగ్గరకొచ్చింది.


    "నువ్వా? ఇలా వచ్చావే!" ఆశ్చర్యంగా అడిగింది భారతి.


    "ఏం, అలా ఆశ్చర్యపోతున్నావు ఇలా రాకూడదా!" అంది అవంతి.


    "అలా అని అనలేదులే" అంటూ భారతి నవ్వేసింది.


    "చిన్న పనుంటే ఇటొచ్చాను. లక్కీ, ఒంటరిగా బోరుకొట్టిఛస్తున్నాను.


    "అరగంట నించి ఒక్క బస్సాగితే ఒట్టనుకో."


    "బస్సులు అంత తేలిగ్గా దొరికితే, వాటి గురించి చెప్పుకొనే వాళ్ళు వుండొద్దు?"


    అంతలో ఓ ఫియెట్ కారు వచ్చి బస్టాపు దగ్గర ఆగింది.


    "కమాన్ అవంతీ" పిలిచాడు స్టీరింగ్ ముందు కూర్చుని వున్న మనోహర్.


    అవంతి కళ్ళు పెద్దవి చేసి "హలో మనోహర్" అని.


    "పదవే, బ్రహ్మాండంగా లిప్ట్ దొరికింది?" అంది అవంతి.


    "నేను బస్సులో వస్తాను నువ్వెళ్ళు" అంది భారతి.


    "మరేం ఫరవాలేదు రా? అంటూ భారతిని చెయ్యిపట్టుకొని లాగింది అవంతి.


    భారతి కారెక్కక తప్పలేదు.


    అది కేవలం ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని మాత్రం భారతికి తెలీదు.

    
    కారు కదిలింది.


    "ఇతని పేరు మనోహర్, ఇంజనీరింగ్ స్టూడెంట్, విద్యార్థి నాయకుడు కూడా." అని భారతికీ, "ఇది నా ఫ్రెండ్ భారతి. సైన్స్ కాలేజీలో చదువుతోంది" అని ఒకరి నొకర్ని పరిచయం చేసింది అవంతి.


    "నమస్తే?" అంది భారతి.


    "నమస్తే?" అంటూ అతను చిరునవ్వు నవ్వాడు.


    "మా భారతీ వాళ్ళకీ కారుంది. కానీ అదెప్పుడూ బస్సుల్లోనే తిరుగుతుంది" అని చెప్పింది అవంతి.


    "ఐసీ?" అన్నాడు మనోహర్. కారు వేగంగా పోతోంది. అయితే కారు వేగాన్నిమించిన ఆలోచనలు అవంతిని తింటున్నాయి. తను చేసిన ఈ పరిచయం వల్ల భారతి జీవితంలో తుఫాను చెలరేగదుకదా? అని భయపడుతోంది.


    మనోహర్ మనస్తత్వం పూర్తిగా తెలియడంచేతనే అవంతి అలా భయపడుతోంది. భారతిని ఒక్కసారి చూసింది. ఎందుకో ఆమెని చూస్తే అవంతికి తోడబుట్టిన చెల్లెల్ని చూస్తున్న అనుభూతి కలిగింది. రంగుతేడా, మరికొన్ని పోలికలు తప్పితే ఒడ్డూ, పొడుగు, ముఖం వర్చస్సులో ఒకేలా కనబడుతున్నారు ఇద్దరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS