"అనూషా!" పిలిస్తూ, హాల్లోకి, మిగతా గదుల్లోకి తొంగిచూశాడు.
ఆమె దగ్గరగా వచ్చి-- "ఏంటి? నాబాధ భరించలేక పారి పోయి వచ్చావా?" అడిగాడు.
"తెలిసిందికదా! బుద్దిగా వెళ్ళి పడుకో."
"అమ్మో...! నువ్వు లేకుండా పడుకోడమే.... అదేం కుదరదు.... రావాలి."
"రాను భరణీ.... ప్లీజ్... గొడవచేయకు... వెళ్ళి పడుకో...."
"అనూ! నీకిది న్యాయంగా ఉందా? నేనిక్కడ ఉన్నానన్న ధ్యాన కూడా లేకుండా ఏంటది? ఆ పుస్తకాలు తింటుంటే నాకెలా వుంటుంది? నన్నర్డం చేసుకోవేం."
"సారీ భరణీ! లండన్ వెళ్లొచ్చిందాకా నన్ను మర్చిపో...."
"వీల్లేదు... నా పవళింపుసేవ అయ్యాక నీ ఇష్టం వచ్చినంతసేపు చేదువుకో."
"పవళింపుసేవలేదు-- గాడిదగుడ్డులేదు...."
"లేకపోతే, పెళ్ళెందుకు చేసుకున్నావు?" విసురుగా అడిగాడు.
"బుద్ధిలేక.... ఛ... "విసుగ్గా గదిలోంచి వెళ్ళబోతుంటే, గట్టిగా పట్టుకుని ఆపాడు.
"ప్లీజ్.... ఇవాళోక్కరోజు.... రేపట్నుంచీ డిస్టర్బ్ చేయనుసరేనా?"
"నిజమేనా?"
"నీమీద ఒట్టు... ప్లీజ్..." జాలిగా చూశాడు.
అతనలా జాలిగా అడుగుతుంటే కాదనులేకపోయింది.... నిట్టూర్చింది.
ఆమెని దగ్గరకు తీసుకుని, గోముగా అడిగాడు. "కోపం వచ్చిందా?"
"లేదు" నవ్వింది.
"అనూ! మన పెళ్ళయి ఏడాది కావస్తోంది. నాకింతవరకు నువ్వు గిప్టు ఏం ఇవ్వలేదు."
"ఏం గిప్టు కావాలి? నువ్వేదడిగితే అది ఇస్తూనే వున్నాగా" అతని మీనం మృదువుగా రాస్తూ అన్నది.
"అవి కాదు... స్పెషల్ గిప్ట్..."
"ఏంటది?"
"చెప్పనా?"
"ఊ..."
"నాకు బాబుకావాలి, అమ్మా నాన్నా కూడా లేటరు రాశాను మనవడు కావాలట వాళ్ళకి."
ఒక్కసారిగా ఆమె చేయి అతని మీనం మీద నుంచి జారిపోయింది. వెల్లకిలా పడుకుంది.
"చెప్పు... ఇస్తావా?" దగ్గరగా లాక్కూంటూ అడిగాడు.
"నా వయసు పిల్లల్నికనే వయసా?"
ఏం? తప్పేముంది? నువ్వా స్టేజ్ దాటలేదుగా!"
"కావచ్చు.... కానీ, పిల్లల్ని కని, పెంచి, పెద్దచేసే ఓపిక, తీరిక నాకులేవు భరణీ! ఆ వయసు దాటిపోయాను."
"కానీ, నేను దాటలేదు... కోరికా చావలేదు. పిల్లలు కావాలి."
కొంచెం ఆవేశంగా అన్నాడు. అతని ఆవేశానికి నిర్విణ్ణురాలైన చూసింది.
"ఎందుచేత ఆవేశం? ఈ ప్రపంచంలో ఎందరో అనాదులున్నారు. వాళ్ళంతా మనపిల్లలుకారా?"
"ఛీ... నాకేం ఖర్మ? నేను మగాణ్ణికాదా?"
"భరణీ! ఆవేశపడకుండా ఆలోచించు. ఇప్పుడు నాకు నలబై రెండేళ్ళు... నీకు నలబై వచ్చి వుండవచ్చు. ఇప్పుడు పిల్లల్ల్ని కని, వాళ్ళు పెరిగి పెద్దయ్యేటప్పటకి మనకి అరవై వస్తాయి. అసహ్యంగా వుండదూ? మనవాళ్ళని, మనవరాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో పిలల్ల్ని కనడం..."
"ఉండదు... లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లెందరో వున్నారు. వాళ్ళంతా పిల్లల్ని కనడంలేదా?"
"కానీ, నాకింత తీరికలేదు, ఆ కోరికా లేదు."
"నీకు లేకపోతే నేనెందుకు నా కోరిక చంపుకోవాలి?"
"అంటే! నీ కోరిక తీర్చుకోడం కోసం నేను కానీ ఇవ్వాలా!
"అవును. నా భార్యవి. అది నీ డ్యూటీ."
"భరణీ! ప్లీజ్! నన్నర్డంచేసుకోడానికి ప్రయత్నించు"
"నో! ఇప్పటకి చాలా అయ్యాయి. అన్నీ భరించాను. ఎక్కడికి వెళ్ళేదీ చెప్పవు, ఎప్పుడోస్తావో చెప్పవు. నన్ను అడక్కుండానే ఏవేవో పనులు చేస్తుంటావు. ఇల్లు ఒక పోర్షన్ ఇవ్వమంటే ఇవ్వలేదు.... ఎన్నని సహించను? కోరి చేసుకున్నందుకు అన్నీ భరిస్తున్నాను. ఇంక నావల్ల కాదు.... నాకు పిల్లలు కావాలి.... దట్సాల్...." భరణి చివ్వున మంచం దిగి వెళ్ళిపోయాడు.
అనూష మ్రాన్పడిపోయింది. ఎన్ని మాటలన్నాడు! ఎంత ద్వేషం దాచుకున్నాడు! యధాలాపంగా తను చేసిన కొన్ని పనులను నేరాలుగా భావించి లెక్కకట్టాడు. దాదాపు ఆరేడు లక్షలదాకా అతని పత్రిక్కి ఇచ్చింది. అదేం మాట్లాడలేదు. పల్లి అయిన దగ్గర్నించీ తనే అతడిని పోషిస్తోంది. అతను వున్న ఇల్లు, తినే తిండి,అనుభవించే బోగాలు అన్నీ తను సమకూర్చినవే. కానీ, ఇప్పుడు తనని దోషిగా చేసి మాట్లాడుతున్నాడు.
ఛీ.... భరణికి ఏమైంది? ఈ మనిషి స్వభావమే ఇంతా? లేక పెళ్ళి అయాక తనమీద ప్రేమ, వ్యామోహాలతో ఇలా మారాడా?
అనూషకి ఇంక ఎంత ప్రయత్నించినా చేదువుమీదకి దృష్టి మళ్ళలేదు.... అతడి మాటలే చెవుల్లో మోగుతూ ఆవేదన రగుల్కోలుపుతున్నాయి.
అనూషకి బాగా ఏడుపోచ్చింది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని, లేచి తరవాత పుస్తకాలు చేతిలోకి తీసుకుంది. కానీ మనసు లగ్నం చేయలేకపోయింది. భరణి మాటలు చెవుల్లో మోగుతున్నాయి.
ఊహ తెలిసిన దగ్గర్నుంచీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోడం, స్వతంత్రంగా వ్యవహరించటం అలవాటై కొత్తగా అతనిలో ప్రతివిషయం సంప్రదించాలంటే కుదరటంలేదు. కొన్ని విషయాల్లో స్పాట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వుంటుంది. అలాంటప్పుడు భరణి ఎక్కడున్నాడో వేదికి, చర్చించి నిర్ణయం తీసుకోవడం జరగదు. అల తీసుకోలేదని అతనకి కోపం. అన్ని విషయల్లో అతన్ని కూడా సంప్రదించాలి అంటాడు. ఇంతకాలంనుంచీ అతడి సలహా, సంప్రదింపులతోటే పనిచేసిందా? చాలా దూరం వంటరిగా, స్వతంత్రంగా నడిచి వచ్చింది. ఇప్పుడు ఏ విషయం అయినా, ఒకరి సలహా అడగాలన్న ధ్యాసే వుండదు. అలాంటప్పుడు భరణిని కన్సల్ట్ చేయాలన్న ఆలోచన ఎలా కలుగుతుంది? ఏం జరుగుతోంది....భరణి ఏంటి? ఇలా తయారైనాడు.... ఆమెకేం అర్ధం కానడంలేదు....అలసటగా కళ్ళు మూసుకుపోయాయి.
