Previous Page Next Page 
మహావృక్షం పేజి 67

"బోజనం చేద్దామా? ఆకలేస్తోంది" అన్నాడు.
"ఆ.... అరగంటాగి తిందాం. కాస్త పేజీలు తిరగేస్తాను. పేపర్ తయారు చేసుకోవాలి. వచ్చింది సువర్ణవకాశం. వాదులుకుంటే దొరకదు" అన్నది పుస్తకాల్లోకి చూస్తూ.
భరణికి ఈ సమయంలో అనూష లండన్ వెడితే, తన పనులేవీ కావని భయం పట్టుకుంది పైగా, అతనిప్పుడు ఆమెకిభర్త. భర్తగా ఆమె ఉన్నతిని హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోతున్నాడు. ఎలాగైనా ఈ ప్రయాణం ఆపాలని వుంది. కానీ ఎలా?
అనూష సీరియస్ గా హరిశ్చంద్రగారిచ్చిన జర్నల్ చదవడం, తీరిక దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్ళి కావలసిన పుస్తకాలు తెచ్చుకోవడం అవన్నీ రెఫర్ చేయడంలో ఎప్పటికన్నా బిజీగా వుంది. ఒక్కోరోజు నిద్రకూడా పోకుండా, హాస్పిటల్ నుంచి వచ్చి, పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది.
భరణిలో రానురానూ అసహనం అక్కువ అవుతోంది. ఇలా వదిలేస్తే భర్తనీ, కాపురాన్ని కూడా మర్చిపోయేలా వుంది అనుకున్నాడు.
ప్రేమానురాగాలతో ముంచెత్తి, ఆమెని లొంగదీసుకోడానికి నిశ్చయించుకున్నాడు. రోజూ ఆమె చదువుకోడానికి కూర్చోడం, తను కళ్ళు మూసుకుని నిద్రపోవడం చాలా చిరాగ్గా ఉందతనికి. ఏంటి ఈ పనిష్ మెంటు అనిపిస్తోంది.
వయసైపోతోందని అసలే దిగులుగా వుంది. అసలే లేట్ మారేజ్. మధ్య మధ్య ఈవిడ ప్రజాసెవ... అదీగాక... ఇప్పుడు ఈ గొడవ... విసుగ్గా అనిపిస్తోంది. ఈ వయసులో చదువెంటసలు? లాభంలేదు.... ఊరుకుంటే మరీ ఎక్కువవుతోంది. పెళ్ళిచేసుకున్నది. ఇలా వంటరిగా పడుకోడానికి కాదు.
భరణి మంచం మీద కాస్సేపు అటూ ఇటూ అసహనంగా కదిలాడు. నెమ్మదిగా లేచి, ఆమె కూర్చున్న దగ్గరకి వచ్చి, వెనకనుంచి ఆమె భుజం మీద చేయి వేశాడు.
ఉలిక్కిపడింది అనూష.
"నువ్వా...? అబ్బా ఉలిక్కిపడ్డాను... నిద్రపట్టలేదా?" అడిగింది పుస్తకంలోంచి మొహం ఎత్తకుండా.
"ఎలా పడుతుంది? నాకింకా ఎన్నాళ్ళీ విరహం?"
తలతిప్పి అతని మొహంలోకి చూసింది. "అప్పుడప్పుడూ విరహం వుంటేనేప్రేమలో ఘాటు పెరుగుతుంది."
"ఏంటి అనూ! ఇప్పటికే సగం వయసు కరిగిపోయింది. ఇంకా ఈ విరహం ఏవిటి?" అంటూ మారాం చేయసాగాడు.
"ఏంటి భరణీ! చిన్నపిల్లాడివా? కొంచెం నిగ్రహంలేదా? నన్ను చదువుకొనివ్వవెంటి? అంత పెద్ద కాన్ఫరెన్స్ లో నేను పేపర్ ప్రెజంట్ చేయకపోతే ఎంత అసహ్యంగా వుంటుందో తెలుసా? నా పరువుకాదు.... నా పేరు ప్రేపోజ్ చేసినవాళ్ళు పరువు పోతుంది."
"చేసుకోవచ్చులే.... అయినా, ఇప్పటినుంచీ మొదలుపడితే, నువ్వు లండన్ వెళ్ళి వచ్చిందాకా నాకీ పస్తులు తప్పవు. నీకిది న్యాయంగా వుందా?"
"నా కొచ్చిన మంచి అవకాశం దీనికోసం పాడుచేయడం నీకు న్యాయంగా వుందా?"
"నేనేం పాడుచేయడంలేదు.... కాస్సేపు నాతో గడిపినంత మాత్రాన ణీ అమూల్యమైన కాలం వృధా అయినట్టా?"
"లండన్ వెళ్ళొచ్చాక విసుగో చ్చిందాకా ఎంజాయ్ చేద్దాం భరణీ! ప్లీజ్.... ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్.... బ్లాంక్ గా వెళ్ళడం అసహ్యంగా వుంటుంది. నన్నిలా డిస్టర్బ్ చేయడం నీకు ధర్మం ముందు నేరవేర్పు. తర్వాత వేళుదుగాని కాన్ఫెరెన్స్ కి"
"అంటే! నీతో ప్రతిరాత్రీ ఎంజాయ్ చేస్తేనే నేను భార్యగా నా ధర్మం నేరవేర్చినట్టు అవుతుందా?"
"కదా? వివాహం చేసుకోవడం అంటే గృహ స్టే ధర్మాన్ని ఆచరించటం."
ఆమె మెడమీదకి వంగి, జడలో ఉన్న చమేలీపూలు వాసన చూస్తూ ,మత్తుగా అన్నాడు-- " నావకాదు అనూ! ఎదురుగా గులాబ్ జామ్ పెట్టి తినవద్దని శాసిస్తున్నట్టుగా వుంది. ఇంతకాలం  అవలంభించిన బ్రహ్మచర్మం సరిపోలేదా? అయినా, చదువుకోవడానికి కాపురం వదులుకుంటారా? ప్లీజ్...రా అనూ!"
ఆ పర్వంలోని మత్తుకి ఆమె లొంగిపోయింది. అతని అల్లరి చేష్టలకి కరిగిపోతూన్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ అన్నది__" ప్లీజ్ భరణీ! కొంచెం కోపరేట్ చేయి...నేను పైకి రావడం నీకిష్టంలేదా?"
"అదేం మాట...నీ ఉన్నతి నా ఉన్నతికాదా? డాక్టర్ అనూష భర్తగా నేనింత గర్వంగా ఫీలవుతావో నీకు తెలియదు...కానీ, అందుకోసం నన్నిలా బాధపెట్టడం బాగుందా? ఆడపిల్లలైతే, భర్తకి ఇలాంటి విషయాల్లో కోపరేట్ చేయడానికి పుట్టింటికి వెళతారు కొంతకాలం. కానీ, నేనిక్కడకి వెళ్ళాను...? వెళ్ళలేనుకదా! అలాగని ఋప్యశృంగుండిలా వుండలేను...కాస్సేపు నా పక్కన పడుకుని, తరువాత చదువుకో వచ్చుగా..."
ఇంకా అనూష చదువుమీద దృష్టి పెట్టలేకపోయింది. అతని చేతుల్లో ఒదిగిపోతూ మంచం దగ్గరకి నడిచింది.
దాదాపు  ప్రతిరోజూ అలాగే సాగింది... ఆమె చదువుకోడానికి పుస్తకాలు పట్టుకోవడం.... అతను వచ్చి అల్లరి చేయడం, మారాం చేయడం, ఆమెని పరవశింపచేయడం.
ప్రతిరోజూ హరిశ్చంద్రగారు ఎంతవరకొచ్చింది అని అడుగుతుంటే ఏం చెప్పలేక సిగ్గుతో చచ్చిపోతుంది. ఆ రోజు గట్టిగా నిశ్చయించుకుంది. ఏమైనా సరే.... ఇవాళ లొంగకూడదు.... పుస్తకాలు తీసుకుని మరో గదిలోకి వెళ్ళిపోయింది.
భరణి భోజనం చేశాక కాస్సేపు టి.వి చూస్తాడు, అన్ని చానల్స్ లో వార్తలు చూసి, తనకి కావలసిన మెటీరియల్ రాసుకుంటాడు. కాస్సేపు ఇంగ్లీష్ జర్నల్స్ తిరిగేసి, మంచం మీదకి చేరతాడు. ఆరోజు కూడా అలాగే వెళ్ళబోతూ, అనూష కోసం చూస్తే మంచం మాడ లేదు. టేబిల్ దగ్గరలేదు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS