అనూష ఉలిక్కిపడింది.
వీణ గర్బవతా! మైగాడ్! ఎలా? ఆమె కళ్ళు మిగతా అక్షరాలవైపు పరిగెత్తాయి.
అనూ! మొదటిసారి తల్లి కాబోతున్న ఆడదాని మనోభాకలేంటో నువ్వు ఊహించగలవనుకుంటా నా కడుపులో ప్రాణం పోసుకుంటోన్న జీవి బైట పడ్డాక ఈ సమాజం ఆ జీవిని అక్రమసంతానం అని అవమానిస్తుంది. భాదిస్తుంది... వేధిస్తుంది కదూ!
కానీ నాకలా అనిపించటంలేదు. అక్రమమైనా, సక్రమమైనా ఈ ప్రపంచంలోకి ఒ ప్రాణిని తీసుకురావడం స్రీ కున్న మహత్తర వరం. ఆ వరం నాక్కూడా దక్కినందుకు ఆనందిస్తున్నాను. ఆ పుణ్యకార్యం చేసే మహదవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు పొంగిపోతున్నాను. నాకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా వాళ్ళని చరిత్రకారులుగా మిగిలిపోయేలా పెంచుతాను.
సగర్వంగా, ఈ సమాజానికి పరిచయం చేస్తాను. అయితే, చిన్న అనుమానం ఏంటంటే.... ఒ జీవికిప్రాణం పోసే సమయం స్రీకి పరీక్ష సమయం అంటారుకదా!
ఆ సమయంలో నేను బతికి బైటపడతానో, లేదో... ఒకవేళ బతక్కపోతే, నాకు పుట్టబోయే శిశువుకి నువ్వే ఆధారం. ఎందరికో ఆశ్రయం యిచ్చి, ఎందరికో బతుకునిచ్చిన దేవతా.... ముందుగా నీ దగ్గరమాట తీసుకుని ఈ సృష్టిభారం ఆనందంగా వేయాలని వుంది.
అనూ! మాట ఇస్తావుకదూ! నేను ఇక్కడ ఇంకా వారం వుంటాను ఆ తరువాత ఓపిక వుంటే బాబాయి వెడతాను. ఎప్పటినుంచో గోవా చూడాలని నా కోరిక. నా హొటల్ అడ్రస్ ఇస్తున్నాను. జాబురాయి... భరణి ఎలా వున్నాడు? కొంచెం మొండివాడు కదూ!పైగా అనికున్న ఉన్నతుడు కూడా కాదు.
అయిన పర్వాలేదు. మగవాళ్ళు పూర్తిగా ఉన్నట్లు కాలేదు.... సహజసిద్దమైన కొన్ని బలహీనతలు పుట్టుకతోటే వాళ్ళరక్తంలోజీర్నంచుకుపోయి వుంటాయి. కాబట్టి ఏదన్న తప్పుచేసినా క్షమిస్తుండు. ఎందుకంటే_ ఈ వయసులో మరో పెళ్ళిచేసుకోలేవుగా! జీవితం అమూల్యమైంది అనూ! పూర్తిగా అనుభవించాలి.
అనూషకి గుండెల్ని తన్నుకుంటూ ఉవ్వేత్తిన పొంగింది దుఃఖం. వీణా! వీణా! ఎందుకే చేతురాలా జీవితం నాశనం చేసుకుంటున్నావు?
ఎందుకే.... జీవితం ఎంత విలువైందో నాకు చెప్పావుకానీ, నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. తరువాత తేరుకుని, వీణకి లెటర్ రాసింది.
వీణా!
నె లెటర్ అందింది నువ్వు ఈ సమయంలో ఇలా ప్రయాణాలు చేయడం క్షేమంకాదు. వెంటనే హైదారాబాదు వచ్చెయ్. మిగతా విషయాలు పర్సనల్ గా మాట్లాడుకుందాం.
లెటర్ రాజుకిచ్చి ఫోస్ట్ చేయమంది. రాజు వెడుతుండగా భరణీ వచ్చాడు.
వస్తూనే, బాగావచ్చి పోయివున్న అనూష కూడా ఏడుస్తుందా....? ఈమే క్కూడా కన్నీళ్ళున్నాయా? అయితే ఈ కన్నీళ్ళుకు కారణం ఏవిటి? ఆ కారణం ఎంతటి విషాదకరం అయి వుండాలి? ఈ గంభీర, దీర వనితను కదిలించిన కారణం ఏవిటో?
కాస్సేపటికి సర్దుకుంది.
"అనూ! వెళ్ళి మొహం కడుక్కురా..." మృదువుగా అన్నాడు.
ఆమె వెళ్ళి చన్నీళ్ళతో మొహం కడుక్కుని వచ్చింది.
అప్పటికే భరణి టీపాయ్ మీద ఉత్తరం చదివాడు. అతని మనసంతా వీణ జుగుప్పుతో నిండిపోయింది.
ఏ మనిషి? అసలు ఆడదేనా? ఛీ.... సిగ్గులేకుండా ఈవిడకి ఉత్తరం రాసింది. అది చదివి ఈ విడ శోకాలు పెడుతోంది. స్వయంక్రుతాపరాధం. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? విచ్చలవిడిగా తిరిగేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా?
ఆమె అక్రమ సంతానాన్ని అనూష పెంచాలా....? చచ్చినా తను అంగీకరించడు. చస్తే, వాడిని కూడా ఏ చెత్తకుండీలోనే పదేస్తేసరి.... అతనలా ఆలోచిస్తుండగా, అనూష మొహం కడుక్కుని టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చింది.
"సారీ! భరణీ! నిన్ను ఖంగారుపెట్టాను కదూ!" అన్నది.
"ఖంగారు సరేగానీ, అనవసరమైన విషయాలకి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, నీ మనసు, ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటాన్నానవిపిస్తోంది. ఆవిడ చేసిన తప్పుకి నువ్వెందుకు భాధపడడం?"
"ఉత్తరం చదివినా?" సీరియస్ గా అడిగింది.
"ఇక్కడే ఉందిగా...నువ్వు ఏడవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తుంటే ఉత్తరం కనిపించింది...."
"చదివావు.... సరే...ఇది వీణ ఉత్తరం కాబట్టి చదివావు. ఇక ముందు అలా నా పేరుమీద వున్న ఉత్తరాలు చదవద్దు."
"నేనెందుకు చదువుతాను? అయినా, ఇహనుంచీ ఆవిడా మనింటికి రావడం, ఆవిడతో మన స్నేహం కంటిన్యూ అవడం నాకిష్టంలేదు."
"అవన్నీ మాట్లాడుకోవద్దు భరణీ! వీణ పర్సనల్ మాటర్ తప్ప నువ్వేం మాట్లాడినా నేనేం అనుకోను."
"సరే.... మన విషయం మాట్లడాతాను....విను. ఆవిడా పిల్లల్ని పెంచుతానని, అదనీ ఇదనీ వాగ్దానాలు చేయకు."
"అసలా ఆలోచన ఎందుకు రావాలి? వీణ చావు నేను కోరుకోవడంలేదు. నువ్వీ విషయం మర్చిపో ఇంక...." అంటూ అక్కడినుంచి లోపలకెళ్ళిపోయింది.
భరణికి కోపం ఉవెత్తున లేచినా, అది సమయం కాదని అణిచేసుకున్నాడు.
అనూష టీ తాగి, పుస్తాకాలు ముందేసుకుని కూర్చుంది.కానీ, మనసు లగ్నం చేయలేకపోయింది. వీణ గర్బవతి అన్న వాస్తవం జీర్ణించు కోలేకపోతుంది. ఆలోచనలు వదిలించుకుని పుస్తకాలు చేతిలోకి తీసుకునేటప్ప, భరణి వచ్చాడు.
