"నాకు నువ్వంటే విపరీతమైన గౌరవముండేది."
"ఇటీజాల్ రైట్ చిరు! సాయంత్రం మళ్ళా సభలో కలుసుకుందాం." అన్నాడు లోకనాథం లేచి నుంచుని.
"ఓ.కె!" అన్నాడు చిరంజీవి కూర్చునే.
లోకనాథం వెళ్ళిపోయిం తర్వాత చిరంజీవి తన డైరీలో ఇలా రాసుకున్నాడు.
"లోకనాథం వచ్చి వెళ్ళాడు. ఈ అవకాశం కోసం నేను చాలా కాలం ఎదురుచూశాను. అతనొచ్చీ రావడంతోనే గొప్ప టార్చర్ యిచ్చి పారేశాను. తర్వాత జాలి కలిగింది. నన్ను వంచించిన లోకనాథం వొట్టి అర్బకుడనే నిర్ణయానికొచ్చాను. భానుమతినీ ఏడిపించాలని వుందిగానీ, ఆడకూతురు కన్నీరు పెడితే, నేను సుఖించలేనేమో ఏమో!"
ఆ సాయంత్రం సన్మానసభ మహా వైభవోపేతంగా జరిగింది. ఆ సభలో చిరంజీవి గురించి చాలా యింపుగా మాట్లాడాడు లోకనాథం.
"ఇతన్నాకు బాగా తెలుసు. చాలాకాలం వరకూ మేమిద్దరమూ కలిసి చదువుకున్నాం. అప్పట్లోనే అనుకున్నాను ఇతనింత గొప్ప రచయితైపోగలడని కనుక ఇప్పుడిక్కడ మీ సమక్షంలో ఇంతెత్తు ఎదిగిన చిరంజీవిని చూచి నేనేం ఆశ్చర్యపడిపోను. అయితే నా మిత్రుడు, నా సహపాఠి గుణవంతుడూ అయిన చిరంజీవిని మీరందరూ జేరి ఘనంగా సన్మానించడం చూచి నేను గర్విస్తున్నాను."
అప్పుడక్కడ వేదికమీదున్న చిరంజీవి మెల్లిగా నవ్వుతున్నాడు 'మేనమామనే మరపించిన ఓ లోకనాథమూ నువ్వీవూళ్లో ఆఫీసరువై ఏం చేస్తున్నావో గానీ, రాజకీయంలోనైతే మీ మేనమామనే తలతన్నేవాడివి గదరా!' అని లోలోన అనుకున్నాడు.
సభ పూర్తయిన తర్వాత లోకనాథాన్ని అడిగాడు చిరంజీవి-
"భానుమతిని తీసుకురాలేదేం?"
"రానన్నది."
"కోస్తున్నావ్!"
"నాన్ సెన్స్."
"పోనీలే ఇప్పుడు నేనే మీఇంటికొస్తాను. తీసుకెళతావా?"
"కుదరదు. నేనర్జంటుగా పొరుగూరు వెళ్ళాలి. మరోనాడెప్పుడయినా చూద్దాం."
చిరంజీవి వేదాంతిలా తలూపాడు.
రైలు కదిలేముందు చిరంజీవి ప్లాటుపారంమ్మీదే నిలుచున్నాడు. అతని చుట్టూ అతని అభిమానులు నించున్నారు. వాళ్ళందర్తోనూ అతను చేతులూపుకుంటూ, బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మాటాడుతూన్న మనిషి కాస్తా ప్లాటుపారం చివర్లో లోకనాథం కనిపించడంతో ఠక్కున మరి మాట్లాడటం ఆపేశాడు.
లోకనాథం చిరంజీవి దగ్గరకొచ్చి, చిరంజీవి చేతిలో ఓ కాగితం ముక్క ఉంచాడు.
"రైలు కదిలింతర్వాత తీరుబడిగా చదువుకో, వస్తా. బై."
తను చెప్పదలుచుకున్నదంతా రెండు ముక్కల్లో తేల్చిపారేసి ఎలా వొచ్చినవాడు అలానే వెళ్ళిపోయాడు లోకనాథం.
రైలు కదిలింతర్వాత సీట్లో కూర్చుని చీటీని విప్పాడు చిరంజీవి. దాన్లో ఇలా వుంది.
"నువ్వు మేడిపండువని ఇప్పుడే అర్థమయింది. నా విషయం నీకు తెలుసు. నేను కేవలం భానుమతికోసమే చదివాను. భానుమతి కోసమే మావయ్యని ఆశ్రయించి పెద్దవాడివయ్యాను. భానుమతిని పెళ్ళిచేసుకొని, ఒక హోదాని నా భార్యకు కొనిపెట్టాను. నే చేసినది, చేసేది-అంతా భానుమతి సుఖంకోసమే. మేమిప్పుడు సుఖంగా ఉన్నాం. నువ్వు మాకు, ముఖ్యంగా భానుకి గుర్తురాకూడదు. నిన్ను చచ్చిపోమని నేను చెప్పను. నువ్వూ పెళ్ళిచేసుకో. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. మళ్ళా ఇటువేపు వచ్చేందుకు ప్రయత్నించకు. ఒచ్చినా-ఈ సన్మాన వ్యాపారం సాగించకు. ఇది నా రిక్వెస్టని భ్రమిస్తే, నేనేం నొచ్చుకోను. మళ్ళీ మాక్కనిపించకోరేయ్!".
చిరంజీవి చీటీని ముక్కలుగా చేసి కిటికీ ద్వారా బయటకు విసిరాడు. సిగరెట్టు ముట్టించి 'ఇంత' పొగని బరువుగా వదిలాడు.
ఈ భూమ్మీదనేకమంది పుట్టి పెరిగినట్టే భానుమతీ పుట్టి పెరుగుతోంది. కానీ, తోటి కోట్లాది జనాభాలో ఇద్దరు 'మనుషులు' కేవలం ఈ భానుమతి మూలకంగా ప్రయోజకులైన (కారణ మేదైనా కావచ్చు) వైనం విన్నప్పుడు నేనెంతో ఆశ్చర్యపోతుంటాను. నాకప్పుడు భానుమతి అతి సామాన్యమైన స్త్రీగా తోచదు.
* * * *
