Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 66


    పంచుతున్న ముక్కల్ని ఆపి, లోకనాథం కళ్ళల్లోకి తీక్షణంగా చూచినమీదట సానునయంగా అన్నాను రావు.
    "వండరేమిటంటే, ఇవాళ లోకనాథంగారు పూర్తిగా పేకాట పక్షైపోయారు. ఎనిమిదింటికే కార్లో కూర్చునే లోకనాథంగారివాళ పదైనా కదలడంలేదు. ఇవాళ మీ మనసేం బాగోలేదా? పోనీండి-మీ దగ్గిర గెల్చుకున్న డబ్బు అణాపైసల్తో ముట్టచెప్పేస్తాంగాని నన్ను తొందరపెట్టకుండా వెళ్ళిపోండి బాబూ! నేను రోజూ లాగానే ముక్కలు పంచుతానంతే! నూరు ఆరైనా, ఆరు నూరైనా నా పద్ధతి ఛస్తే మార్చుకోనంతే!"
    లోకనాథానికి క్షణంలో కళ్ళెర్రపడ్డాయి. సీట్లోంచి వేగంగా లేచి నుంచోడంతో టేబుల్ చుట్టూతా ఉన్న జనం ఖంగారుపడిపోయారు. రావుగూడా అంత విసురుగా లేవడంతో పెద్ద ప్రళయమేదో జరిగి తీరుతుందని అనుకున్నారు. కానీ, అదేం జరగలేదు. ఎంతయినా, అక్కడ జేరిన జనం కల్చరున్న పెద్దవాళ్ళాయె!
    "ఇటీజ్ టూమచ్ మిస్టర్ రావ్! గుడ్ నైట్ జెంటిల్మెన్! గుడ్ నైట్."
    రావ్ మాటల్ని వినకుండానే లోకనాథం కారు దగ్గిరికి పరుగెత్తాడు. వెనకాతల కొత్త సభ్యుడొస్తున్న వైనం గమనించకుండానే కారు స్టార్టుచేసి, వేగం పెంచాడు. అక్కడ కదిలిన కారు మరో పది నిమిషాల్లో పదిమైళ్ళ దూరంలో వున్న అఫీషియల్ కాలనీలో ఆగింది.
    కారు దిగి అందమైన భవంతిలోకి అడుగుపెట్టాడు లోకనాథం. తనెదురుగా వున్న సోఫాలో ముచ్చటగా కూచుని పుస్తకం చదువుకుంటోంది భానుమతి. లోకనాథం బూటు లేసు విప్పుకుంటూ ఆ పుస్తకాన్ని పరీక్షగా చూశాడు.
    పుస్తకాన్ని సోఫాలో ఓ మూల వదిలేసి భానుమతి లేచినుంచుని వయ్యారంగా కాళ్ళు విరుచుకుంది.
    "నా కర్థంకాదు భానూ! వాడంత గొప్పగా రాసేయగల దిట్టా? ఏమిటి రాస్తాడేమిటి? చెత్త ప్రేమకథలేగా? ఇంకా ఏమైనా రాస్తాడా."
    భానుమతి జవాబివ్వలేదు.
    "ఇప్పుడు పదిమంది దృష్టిలో పడ్డాడు. అదే తేడా" అన్నది భానుమతి.
    "నన్నడిగితే వాణ్ణి మెచ్చుకునే ప్రతి సన్నాసీ పెద్ద ఫూల్! ఈ వెధవకి రేపు టౌనుహాల్లో పెద్ద ఎత్తున సన్మానం, హౌ ఛీ పిటీజ్! నాలుగు ముక్కలు రాసుకునే ప్రతి మురికి వెధవలకీ సన్మానాలు! సన్మానాలు! ఏం పొడుస్తున్నారు వీళ్ళంతా."
    భానుమతి గబగబా నవ్వేసి అడిగింది.
    "నాకు తెలీకడుగుతాను. రేపా సభలో మీరిలాగే మాటాడేస్తారేమిటి ఖర్మ? సభాధ్యక్షులు సభా మర్యాదని పాటించి తీరాలి సుమండీ."
    ఈ హెచ్చరికతో మరింత మండిపడిపోయాడు లోకనాథం.
    "నా మెడకి ఉరివేసి తమాషా చూస్తున్నారు. ఈ బసవరాజొకడు నా పాలిట యముడైపోయేడవతల వాడు నాకు మంచి ఫ్రండవడం మూలంగా ఈ తతంగం యావత్తూ నా కొదిలిపెట్టేంట స్కౌండ్రల్. షూట్ చేసి పారేద్దును. పెద్ద ముండావాడు చచ్చిపోగలడని వూరుకున్నాను. అంత పెద్ద మనిషి ముందు 'నో! అంటే గీర అనుకుంటాడని మోడస్టీ కోసం యస్సన్నాను. వాడికి సన్మానం, నాకు శ్మశానం. డేమ్ హెల్, పెద్దవాళ్ళకి బుద్ధులుండవసలు."
    తాయారమ్మ నీళ్ళు తోడినట్లు వినయంగా చెప్పింది. అయినా అతనా రాత్రి స్నానం చేయలేదు పైగా భోజనవూఁ చేయలేదు.
    ఉదయం ఆఫీసుకి ఫోన్ వచ్చింది. హోటల్ ఊటీలో ఇరవై రెండో గదిలో చిరంజీవికి విడిది ఏర్పాటు చేశారట. వెళ్ళి కలుసుకుని యేర్పాట్లు చూడవలసిందిగా కంపెనీ డైరక్టరు బసవరాజు లోకనాథాన్ని ఫోన్ లో కోరాడు.
    హోటల్ ముందు కారుదిగిన లోకనాథం మనసులో ఏడుస్తూనే ఇరవై రెండోగది దగ్గరికి చేరాడు. అప్పుడే గదిలోంచి నలుగురు మనుషులు బయటకు రావటం చూచి తన 'ఆఫీసరు' హోదా మట్టికలిసినంతగా బెంగపడిపోయాడు. గదిలోకి అడుగుపెట్టి చూశాడు.  
    తళతళా మెరిసిపోతున్నాడు చిరంజీవి. తెల్లగా బొద్దుగా, అందంగా కనిపించాడతను. ఖరీదు పెరిగిపోయిన మనిషిలాగానూ కనిపించాడు. 'అసాధ్యుడు' అనుకున్నాడు లోకనాథం. 'వెధవ బాగుపడిపోయాడు' అని కూడా అనుకున్నాడు.
    లోకనాథాన్ని చూస్తూనే లేచి నించున్నాడు చిరంజీవి. లోకనాథం తన చేతిని ముందుకి చాచాడు. ఆ చేతిని మృదువుగా తాకాడు చిరంజీవి.
    "క్షేమమా?" అడిగాడు చిరంజీవి.
    "ఆహా!" అన్నాడు లోకనాథం.
    ఇద్దరూ కూర్చున్నారు. చిరంజీవి దగ్గిరున్న సిగరెట్లు ముట్టించుకున్నారు. పొగ వదులుతూ అన్నాడు చిరంజీవి!
    "నాలుగేళ్లయింది కదా!"
    "అవును."
    "భానుమతి క్షేమమా?"
    "క్షేమమే!"
    రెండు నిమిషాలు మౌనంగా గడిచినా, లోకనాథం చిరంజీవి కోసం ఏర్పాట్లని వాకబు చేయలేదు. మళ్ళా చిరంజీవే మాట్లాడేడు.
    "పిల్లలా?"
    "లేరు."
    "నాకు పిల్లలంటే మహా సరదా!" వాళ్ళతో స్నేహం బలే తమాషాగా వుంటుందిలే. ఒక చిన్న జోక్ చెప్పేదా!"
    "బోర్! నసపెట్టకుండా కాసేపేదైనా మాట్లాడు. అన్నట్టు నీకెంతమంది పిల్లలు?"
    "లేరు."
    "వెరీగుడ్! మనిద్దరం ఒకే పడవనెక్కాం."
    "కాదు"
    "అదేమిటి?"
    "రెండు పడవలు, నీ పడవలో భానుమతి వుంది. నా పడవలో నేనొక్కణ్ణీ వున్నాను."
    "పెళ్ళి కాలేదా?"
    "ఇంతలో కాదు. నాకు, పిల్లల్ని కనిపెట్టగల అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని వుంది. అందుచేత ఆ వేటలో వున్నానింకా."
    "నీకిక్కడ చేసిన ఏర్పాట్లు బాగున్నాయా?"
    "నిక్షేపంగా వున్నాయి."
    "నాతో ఇంకా ఏమైనా మాట్లాడతావా?" లేచేందుకు సిద్ధపడి అడిగాడు లోకనాథం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS