పెన్నిధి
ఒకానొక లేడీస్ క్లబ్లు ఆవరణలో ఆగిన కొన్ని కార్లలో నూకరాజు సొంతంగాని కారూ వున్నది. సమయం సాయంత్రం. నూకరాజు కారుని అనుకునించున్నాడు. అతని ముందోకుర్రాడు నూకరాజు చేబుతూన్న ప్రతి చిన్న మాటని అతిశ్రద్ధగా వింటున్నాడు.
"రేయ్ నాయనా! నేను చెప్పేదంతా నిజంరా! సాధారణంగా నేను కోతలు కోయను. ఇక్కడకొచ్చే జాతికి ఆడామగా అనే తేడా లేదురా సన్నాసి! అంతెందుకు ఈ కారు నా చేతికొచ్చి ఎన్నాళ్ళయిందనీ, ఆర్నెల్లు. హార్డ్ లీ సిక్స్ మంత్స్. (ఏడవకరా వెధవా, నేను యసల్సీ తప్పినోడినైతే నయ్యేనుగానీ, ఇంగ్లీషీ మధ్య బాగా వంటబట్టింది ఏమనుకోకు) ఎంత రద్దీగా బతుకుతున్నానో నీకు తెలీదులాగుంది. లేచీ లేవడంతోటి అమ్మగారింటికొచ్చేసి, ఒక దండం పారేసి కారెక్కి స్టీరింగు దగ్గిర కూచుంటాను. నేనమ్మగారి డ్రైవర్ని. అక్కడ్నుంచి వూరేగింపు, ఆస్పత్రి, యిల్లు ఆస్పత్రి యిల్లు. మధ్య మధ్య ఖబుర్లు. పేషెంట్లు, వాళ్ళ బాధలు, సుఖాలూ, నొప్పులూ, జ్వారాలూ, అవన్నీ అయింతర్వాత క్లబ్బులు. ఆడకో క్లబ్బు, మగకో క్లబ్బు, పిల్లలకో క్లబ్బు, ముసలోళ్ళకో క్లబ్బు, సినిమాలు, నాటకాలు, సభలూ, టీ పార్టీలూ, డిన్నర్ లూ-రేయ్ దాసూ! నీ కళ్ళు తిరగడంలేదురా! నిజం చెప్పు" అన్నాడు నూకరాజు.
రామదాసు బుద్ధిగా తలూపి నుంచున్నాడు.
డాక్టర్ ప్రమీలగారి కారు డ్రయివర్ నూకరాజు. చాకులాంటి మనిషతను. అందుచేత అతను లేడీస్ క్లబ్బు గురించి కొంతసేపు మాట్లాడాడు.
"ఈ వూళ్ళో వున్నటువంటి వెలుగంతా యిక్కడ చేరి ఖబుర్లాడతాయి నవ్వుకుంటాయి. చాడీలు చెప్పుకుంటాయి. నోళ్ళు తిప్పుకుంటాయి. గొప్పలు చాటుకుంటాయి. బాధలు దాచుకుంటాయి. మగాడికి చేతకాని పనులు కొన్నిక్కడే క్షణాలమీద సెటిలైపోతాయి. అంతెందుకు? డాక్టరమ్మగారి కారునడిపే నేనెంత గొప్పవెధవనో నీకు తెలుసా? - అలా గంగిరెద్దులా తలూపకరేయ్ నాకు తల్నొప్పి. నీకేం తెలీదని నాకు తెలుసు. ఇక్కడికి నువ్వొచ్చినట్టే మునుపో బి.ఏ.గాడు ప్రత్యేకంగా నాకోసమొచ్చాడు. వాడు నాకు దూరబ్బందువు. బావమరిది వరస. ఏరా బావా, అన్నాడు ఎంతో దిగుల్తో. నా కడుపు చెరువైపోయింది. వాడలా నీరసగా పలకరించేసరికి ఏంకావాలిరా అన్నాను. 'ఉద్యోగం' అన్నాడు బి.ఏ.గాడు. నాకు జాలికలిగింది. నేనుత్త జాలిసన్నాసినిగదా. అంచేత వాడి భుజంతట్టి నీకేం పర్లేదు నువ్వెళ్ళిపో నేను చూస్తానని మాటిచ్చేశాను. తిన్నగా డాక్టరమ్మగారి కీ వైనం చెప్పాను. ఆవిడ ప్రభావతమ్మగారికి..."
"ప్రభావతమ్మగారికే!" అన్నాడు రామదాసు ఖంగారు పడిపోతూ.
"గేదెలాగా అరవకు. ఎవరన్నా వింటే ఏం బాగోదు అవును నువ్వెవరికోసమొచ్చావో సరిగ్గా ఆ ప్రభావతమ్మ గారితోనే మాట్లాడారు. అయ్యిందా - మూడోరోజున బావమరిది బి.ఏ.గాడు ఫైళ్ళతో ప్రత్యక్షమై 'థాంక్స్ రా బావా' అన్నాడెంతో ఆనందంగా. గనక ఇదంతా ఏమిటంటావ్. ఇంద్రజాలం. నేను చెబితే నమ్మవుగానొరేయ్ - ఈ క్లబ్బులో జరగనివంటూ లేవనుకో. ఆఫీసర్లతో చివాట్లు తినే అన్ లక్కీగాళ్ళు, ప్రమోషన్ల కోసం బెంగెట్టుకున్న చాతకానివాళ్లూ, ట్రాన్స్ఫర్ లూ, ఇంక్రిమెంట్లూ, ఎరన్డ్ లీవులూ - సిక్కు లీవులూ, పంచదార కోటాలూ, విలువైన పర్మిట్లూ, ఇన్ కంటాక్స్ మతలబులూ, తోక కోయడాలూ ఒక్కటేమిట్రా తండ్రే, అన్ని తతంగాలకీ యిది కేంద్రస్థానం. ఆడదాని మాట వినని మగవాడెవడైనా వుంటే, వాడికో జై కొట్టి వాడి ఫోటోని నట్టింట పెట్టుకుంటాను. చూపించెవడయినా కనిపిస్తే. అందుచేత దాసూ, నీకొచ్చిన భయం లేదు. నీకుద్యోగం తప్పకుండా దొరికి తీరుతుంది. ఏదీ, ముందో సిగరెట్టు తగలెయ్. నోరెండిపోయింది" అన్నాడు నూకరాజు.
రామదాసు జేబులోంచి సిగరెట్టు పెట్టి తీశాడు. దాంతోపాటు సిఫారసు ఉత్తరమూ బయటకొచ్చేసింది. నూకరాజు సిగరెట్టు తీసుకోకుండా, ఉత్తరం పట్టేసి పూర్తిగా చదివాడు.
"ఏమిటేమిటీ, బసవలింగంగారు స్వయంగా ప్రభావతమ్మగారికే రాసేడు. అవున్రా దాసూ, సదరు వారికి ప్రభావతమ్మగారికి ఎంత పరిచయం ఏర్పడిందేమిటి?"
"వారి మిల్లులో ప్రభావతమ్మగారికి ఖాతా వుందిలే."
"అద్గదీ, అలా చెప్పు. నీ రొట్టివిరిగి నేతిలో పడిందిరా దాసూ! ఏదా సిగరెట్టిలా తగలెయ్" నూకరాజు సిగరెట్టు ముట్టించి మళ్ళా అన్నాడు.
"మొన్నేమైందో తెలుసా? ఈ ప్రభావతమ్మగారే - సినిమా డైరక్టర్నీ, వారి కుటుంబాన్నీ యిక్కడికి పిలిపించేసి సన్మానం చేయించి అందరికీ జైకొట్టి పంపించారు. ఆనక అమ్మగారి దూరబ్బంధువు నొకడ్ని మెల్లిగా వెండితెర కెక్కించేశారు. ఇంత గొప్పపని నీవల్లా, నావల్లా అవుతుందా, అవదు. గనక వాళ్ళంతా మాయగాళ్ళు. నీకేం తెలీదులాగుంది, బుడ్డోడివి. లోకానుభవం తక్కువ... తప్పుకోరా బాబూ, ప్రభావతమ్మగారి కారొచ్చేస్తోంది. నీ ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఆ కారుకింద పడితే కేసుండదు. ఆ డ్రైవరుగాడిది మనకంటే గొప్ప గ్రేడు. అందుచేత వాడి కళ్ళు బొత్తిగా కనిపించవసలు. తప్పుకో... ఎందుకైనా మంచిది. నాతోపాటు ఆ కార్లోకి ఓ నమస్కారం పారేయ్. రెడీ, వన్, టూ..
'త్రీ' అన్నారు మిసెస్ సుగుణా భానుమూర్తి.
"యస్, మేడమ్, నేను తెచ్చింది త్ర్రీనే!" అన్నాడు బాలు అనే కుర్రాడు మూడు డ్రింకులిచ్చి.
సుగుణా భానుమూర్తి కోరిక ప్రకారం, శ్రీమతి విమల డ్రింకు పుచ్చుకుందిగాని, డాక్టర్ ప్రమీల పుచ్చుకోలేదు. డాక్టర్ ప్రమీల ఆ డ్రింకుని శారదకివ్వవలసిందిగా రికమెండ్ చేసింది. కానీ, సుగుణా భానుమూర్తి గారి డాక్టరు మాటని వినిపించుకోలేదు. వినిపించుకున్నా ఖాతరు చేయలేదు. సమయానికి క్లబ్బు గుమ్మమెక్కుతూన్న ప్రభావతిని చూచి గంపెడంత ఆనందాన్ని మాటల్లో పొదిగి అన్నది.
"రండి, రండి, హేవ్ ది డ్రింక్ ఫస్ట్"
మిగిలిన మూడో డ్రింకుని 'అకారణంగా బాలు అతి జాగ్రత్తగా ప్రభావతికి అందించాడు. ఈ చర్యతో అటు డాక్టర్ ప్రమీలా, ఇటు శారదా బాధపడిపోయారు. శారద మరింత కృంగిపోయి అనుకున్నది -
ప్రభావతీ, అదృష్టం నీది! రమణ నీకు దక్కేడు గనుక నువ్వూ అదృష్టవంతురాలివైపోయావు. రమణని నేను కాదన్నాను. పెళ్ళిచూపులకొచ్చినప్పుడు రమణ నాకు అనామకుడిలా కనిపించాడు. అప్పట్లో నాకు రమణ మీద ద్వేషం లేదు యిష్టమూ లేదు. ఇప్పుడిక్కడ నీ ప్రభావం చూస్తూంటే నాకు మతిపోయి, ఈర్ష్య కలుగుతోంది. నా బ్రతుకుమీద రోత కలుగుతుంది. నేను ప్రేమించి పెళ్ళిచేసుకున్న తర్వాత, ప్రేమంటే ఏమిటో తెలిసి వచ్చింది. ప్రేమ ఒక పెద్ద ఊబి, జలుబు, గుడ్డిది. నా మొగుడు గుమాస్తా. కేవలం ఒక సాధారణమైన గుమాస్తా. పేరు సుబ్బారావ్. కె.సుబ్బారావు. గాల్లో వూగే బొమ్మతను. బియస్సి అతని క్వాలిఫికేషన్. అతనికి నేనే అదనమైన క్వాలిఫికేషన్ని. నేను పాడతాను. అందంగా పాడగలను. రేడియోలో ప్రోగ్రాము లిచ్చాను. అంతే అదొక్కటే నా మొగుడి క్వాలిఫికేషన్. పిటీ, పిటీ, పిటీ, బ్రతికిపో ప్రభావతీ, నీకే దిగులూ లేదు. ఘనత చెందిన మొగుడు, ఖరీదైన కారూ, మేడా, అదృష్టం నీది. నాకొచ్చే డ్రింకు నువ్వు తాగేశావ్. డాక్టరు ప్రమీలా, నేనూ మేమిద్దరం నీ ఒక్కదాంతో సరితూగలేకపోయాము. సుగుణా భానుమూర్తి నీకు కొండంత విలువ నిచ్చేసింది. సాక్షాత్తు లక్షల మనిషి నిన్ను గౌరవించి, నెత్తిన పెట్టుకుంది. బ్రతికిపోయావ్."


