ఆనందంతో కళ్ళల్లో నిల్చిన రెండు కన్నీటిబొట్లు చెంపలమీదకి జారాయి. కృతజ్ఞతాభావం గుండెనిండా నిండిపోయి, మాటారావడంలేదు.... ఉద్విగ్నంగా తల ఊపింది.
"అల్ ద బెస్ట్"
అయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాక ఇంకా హాస్పిటల్ లో కాలు నిలవలేదు. ఈ వార్త అర్జంటుగా ముందు భరణితో, తరవాత వీణతో పంచుకోవాలనిపించింది. త్వర, త్వరగా పని ముగించి, ఇంటికి బయలుదేరాలనుకుంది కానీ ఏవో ఒకటి రెండు ఎమర్జన్సీ కేసులు రావడంతో కుదరలేదు. సాయంత్రం త్వరగా ఇంటికి బయలుదేరింది.
ఆమె వెళ్ళేటప్పటికి భరణి ఇంట్లోనే వున్నాడు. అప్పుడే వచ్చినట్టున్నాడు.
అనూష కారుదిగి లోపలకి వెళుతూనే భరణి చేతులు పట్టుకుని గుండ్రంగా తిరిగింది.
"మేడమ్ గారు చాలా సంతోషంగా వున్నట్టున్నాడు.... కారణం తెలుసుకోవచ్చా?"
తిరగడం ఆపి, గలగలా నవ్వుతూ అంది.
"నీ పేపర్ కి అనూష గురించిన మరోహట్ న్యూస్ దొరికింది."
"ఏంటది?" అతడి మెడచుట్టూ చేతులు పెనవేసి మురిపెంగా చెప్పింది.
"డాక్టర్ అనూష ఆంద్రప్రదేశ్ నుంచి లండన్ లో జరగబోయే కాన్పరెన్స్ కి వెళ్ళబోతుంది."
"ఈజిట్? ఎన్నాళ్ళు?" అడిగాడు.
"తెలియదు. బహూశా నెలరోజుల పటచ్చు వెళ్ళిరావడానికి. మా చీప్ నా పేరు ప్రపోజ్ చేశారు. భరణీ! నాకు చాలా ఆనందంగా వుంది తెలుసా? అబ్బా! ఈ సమయంలో వీణ వుంటే ఎంత సంతోషించేది? ఫోనన్నా చేయవచ్చుగా."
"అనూ! నువ్వు లేకుండా నెలరోజులు నేను ఒక్కడీనీ ఉండాలా?"
"ఏం పాపయివా? నేను లేకుండా భయమా?" నవ్వింది.
"అదికాదు.... నువ్వు వెళుతున్నావంటే దిగులుగా వుంది. జర్నలిస్టు భరణిగా ఈ వార్తకి స్పందించి పేపర్ లో వేసేవాడిని. కానీ, నీ భర్త ఆనందంగా వున్నా అంగీకరించలేకపోతున్నాను."
"పిచ్చి భరణీ! నువ్వు కళ్ళు మూసుకుని తెరిచేలోగా వచ్చేస్తాను. శాశ్వతంగా వుంటానేంటి?"
"నిజమే! కానీ నాకెందుకో బెంగగా వుంది."
"బెంగాలేదు, ఏంలేదు. పద ఇవాళ మనం బయట బోంచేద్దాం.... రెడీ అవు" అంటూ లోపలకెళ్ళిపోతుంటే అన్నాడు.
"మరి ఊరికి వెళదాం టికెట్స్ తెమ్మన్నావుగా తెచ్చాను."
అనూష తక్కున ఆగిపోయింది.
"సారీ! ఏమిటో మన ప్రయాణం అసలు ముడి పడడంలేదు. ఫర్వాలేదులే మరోసారి వెళదాం క్యాన్సిలు చేయించెయ్."
"ఇది రెండోసారి."
"ఏం చేయను చెప్పు... నేను కావాలని చేస్తున్నానా? అయినా అనందం మన మనసులో వుంటే చాలదూ! దానికోసం ఎక్కడికో ఎందుకు? ఇవాళంతా బయట తిరిగి ఎంజాయ్ చేద్దాం సరేనా?" గోముగా అంది అతని చెంపలమీద మృదువుగా రాస్తూ.
అతనేం మాట్లాడలేదు.
ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా, సరదాగా గడిపింది. భరణిని రెచ్చగొట్టింది, అల్లరిచేసింది, గారాం చేసింది. ఆనందించింది, అనందిపచేసింది. అయితే వీణకి ఈ విషయం చెప్పాలన్న తహతహా మాత్రం అలాగే వుండిపోయింది.
మర్నాడు అనూష కోరిక తెలిసినట్టుగా వీణ దగ్గర్నుంచి మరో ఉత్తరం వచ్చింది. అనూష రెండు, మూడుసార్లు మెయిల్ యిచ్చింది.... కానీ వీణ చూసుకోలేదేమో! రిప్లయ్ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే తను దొరకడం లేదు. వీణ వెళ్ళి కూడా దాదాపు మూడు నెలలవుతోంది. సెలవులు కూడా అయిపోయాయి. ఇంకా రాలేదు... ఎక్కడుందో, ఏంచేస్తోందో, ఆత్రంగా కవర్ చింపింది.
అనూ!
నిన్ను వదిలిపెట్టి వల్లి మూడు నెలలవుతోంది. నువ్వు కంగారు పడుతున్నావు కదా! ఈ శాల్తీ ఎక్కడ తిరుగుతొందా అని. దాదాపు భారత దేశంలోని ముఖ్యమైన స్థలాలు, చారిత్రాత్మక స్థలాలు చూశాను, ప్రస్తుతం ఆగ్రాలో వున్నాను. హరిద్వార్, రుషికేశ వెళ్ళేచ్చాను. పుణ్యస్థలాలు ఎంత అందంగా వున్నాయో! రోప్ వే మీద అమ్మవారి ఆలయానికి వెళుతోంటే అన్పించింది.
దీనిమీదనుంచి నేను పడిపోతే అనూషకి ఎలా తెలుస్తుంది? తిడుతున్నావుకదూ తప్పదు. ఇవన్నీ జీవితసత్యాలు. కల్చుకోవడానికి బాదెందుకు? రామ్ జూలా, లక్షణమ్ జూలా చూశాను. ఇక్కడ రామ భక్తులు అడగడుగునా కనిపిస్తారు. ఎక్కడచూసినా రాముడు పేరే కనిపిస్తుంది. దేవుడ్ని నమ్మనివాళ్ళు మూర్ఖులు అన్పిస్తుంది నాకు.
ఎంత పెద్ద నాస్తికులయినా ఏదో ఒకనాడు దేవుడి ఉనికిని నమ్మితీరాలి. ఈ పవిత్రస్థలాల్లో దేవుడు తిరుగుతాడేమో అన్పిస్తుంది నాకు. నవ్వుకుంటున్నావా అనూ! దేవుడ్ని నమ్మకపోతే జీవితంలో ఇంతదూరం నడిచిరావడం జరిగేదికాదు. అదిసరే ముఖ్యంగా ఒ విషయం రాస్తున్నాను.
లాస్టు లెటర్ లోనే నికీ వుశయం రాయలనుకుని ధైర్యం సరిపోక రాయలేకపోయాను. కానీ నీకు ఈ సంగతి తెలిచేయకపోతే నాకు శాంతి లేదు. నీ మంచి ఇలాంటి కబురు వింటే గుడ్ న్యూస్ అని సంబరపడి పోయి, స్వీట్ తిని, పార్టీ ఇవ్వమని నిన్ను వేధించి వుండేదాన్ని. కానీ నా మంచి ఈ కబురు వినడం అసహజం, సమాజ విరుద్దం. నేను... నేను... తల్లిని కాబోతున్నాను.
తండ్రి ఎవరు? అని అడక్కు. నాప్రయాణంలో అనుకోకుండా అనారోగ్యం పాలయాను. వాంతులు, కళ్ళు తిరగడాలు మొదలైతే ప్రయాణ బడలిక అనుకున్నాను. బయట హోటల్స్ లో తినడంచేత సరిపడలేదనుకున్నాను. కానీ డాక్టర్ దగ్గరకి వెళితే తెలిసింది నాకు మూడోనెల వెళ్ళింది. అనూ! పీరియడ్స్ రాకపోతే నలబై వచ్చిందికదా! మెనోపాజ్ అనుకున్నాను. కానీ నేను గర్బవతీ ని.... యస్ నేను గర్బవతిని.
