అప్పారావుగారి పార్టీ పెద్దది. అందులో వారి హోదా యింకా పెద్దది. దేశంలో వారి పేరు మహా గిరాకీగా వుండేది. వారు సంఘసేవకులు. నిస్వార్థజీవులు. త్యాగదనులు. అపారమైన హృదయ వైశాల్యం కలవారు, ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు వారనేకసార్లు జైళ్ళ కెళ్ళొచ్చారు. దొరల కళ్ళల్లో పడి, హింసలను పూలదండలుగా స్వీకరించి భరించారు. వారు దేశానికి ముద్దుబిడ్డలు.
ఆ సాయంత్రం వారి గంభీరోపన్యాసానికి ఆ వూళ్ళో ఏర్పాటు చేయడం మూలంగా టి.బి.లో విడిది చేశారు. వారితో పిచ్చాపాటీ మాటాడేందుకొచ్చిన వూరిపెద్ద మనుషుల్లో చెవిటిఫ్లీడరు ఉన్నారు. అప్పారావుగారు చెవిటాయనకి దూరబ్బంధువులని పెద్దమనుషులవరకే తెలుసును. చెవిటాయన పెద్దన్న కొడుకు. డిగ్రీ పుచ్చుకున్న వాడికేదైనా దిక్కుమాలినుద్యోగం వేయించమని అప్పారావుగారిని అడిగారు. అప్పారావుగారంతా విని సోఫాలో కొంచెం సర్దుక్కూర్చున్నట్టు కూర్చుని అన్నారు.
"చూద్దాం. తప్పకుండా చూద్దాం. మీరెళ్ళి రండి. నేను కబురంపుతాను గానీ, మీ అడ్రస్సు సెక్రటరీకివ్వండి. మంచిది. వెళ్ళిరండి."
చెవిటాయన బయటకొస్తుండగా లోకనాథం యెదురుపడ్డాడు. ఇద్దరూ కళ్ళతోనే యేదో మాట్లాడుకున్న తర్వాత చెవిటాయన బయటకి వెళ్ళారు. లోకనాథం లోపలికొచ్చాడు. లోకనాధాన్ని అప్పారావుగారు చూస్తూనే రుద్రులయ్యారు. కోపంగానే అన్నారు గానీ, ఠీవితో ఆ కోపం కొంచెం లోపించినట్లయింది.
"ఊ... అవున్రా ఒరేయ్! ఎలాగైనా పెద్దవాడివి. నేను నీకిప్పటిగ్గాని జ్ఞాపకం రాలేదన్నమాట. నేనొచ్చి ఎంతసేపయిందినా? ఏట్రా నువ్వెలిగించే రాజకీయాలు? ఇంతాలిస్యమా?"
"........."
"బాగా చదివేడుస్తున్నావా? లేక, దాన్నీ నట్టేటిలో ముంచేస్తున్నావా? ఈ ఏడాదైనా మిటకరిస్తావా."
"బాగానే చదువుతున్నాను మావఁయ్యా."
"ఒరేయ్ లోకం! దేనికైనా తెలివితేటలుండార్రా. తెలివి! నేనో సలహా చెప్పనా?"
"చెప్పు మావఁయ్యా"
"మరేం లేదు! నీకూ ఈ చదువుకీ పడకపోతే, వింటున్నావా? మొద్దు మొహమా విను. నువ్వీ జన్మలో ప్యాసవ్వలేవని నమ్మకముంటే, ఏమిటి - చక్కగా కాపీ కొట్టేయ్. కాపీకొట్టి పాసవ్వు. అంతే. తర్వాత నిన్నందల మెక్కించే బాధ్యత నాది. ఏమిటి విన్నావా."
"విన్నాను మావఁయ్యా?" అన్నాడు వినయంగా.
వినయ విధేయతలు ప్రదర్శిస్తోన్న మేనల్లుడ్ని చూచుకొని అప్పారావుగారు మురిసిపోయిన చిహ్నంగా తను రొయ్యమీసాల్ని ఉంగరాలున్న వేళ్ళతో దర్జాగా దువ్వుకున్నారు.
ఆనక, ఆ మామా అల్లుళ్ళ మధ్య కుటుంబ విషయాలెన్నో కదిలాయి.
అప్పారావుగారున్న ఆ రెండురోజులూ లోకనాధానికి క్షణం తీరుబడి చిక్కలేదు. మూడోనాడు సాయంత్రం, నాలుగు రోజుల క్రితం, ఫ్రెండు గౌరీపతి ప్రెజంట్ చేసిన 'సీసా' సీలు విప్పాడు.
సీసాలో మందు కొంచెం కొంచెంగా సోడాతో కలుపుకుని గొంతులో పోసుకుని, ఆ పైన ఇన్ని జీడిపప్పులు (కారంలో కలిపినవి) నమిలి సిగరెట్టు ముట్టించి హోల్డాలుపైన వెల్లకిలా పడుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి చిరంజీవి అతని గుమ్మం ముందు నించున్నాడు.
చిరంజీవి చూచిం తర్వాత లేచి కూర్చుందామనుకున్న లోకనాథం మరి లేచేందుకు ఓపికలేక అలాగే పడుకుని మత్తుగా అన్నాడు.
"సారీ బ్రదర్! బండి కొంచెం ఒడుదుడుకుల్లో వుంది. గుర్రం వేగంగా పనిచేస్తోంది. వొచ్చి అలా కూర్చో!"
చిరంజీవి ఆశ్చర్యపోలేదు. గుమ్మంమీదే కూర్చున్నాడు.
"రెండు రోజుల్నుంచీ నన్ను మావయ్య తినేశాడు. ఇప్పుడే నువ్వొచ్చే ముందే నోరు తడుపుకున్నాను. కాస్ట్ లీ వ్యవహారమేమో త్వరగా తన్నేసింది. ఐయామాఫ్! ఫర్లేదు. వెళ్ళిపోకు కూర్చో! ఏమిటీ విషయం? బొత్తిగా కన్పించడమే మానేశావ్? భానుమతేమంటుంది" అడిగాడు లోకనాథం.
"నేనూ, ఆ ప్లీడరూ పోట్లాడుకున్నాం." అన్నాడు చిరంజీవి.
"సేసో! అయితే జరిగిందన్నమాట ప్రళయం. ప్రేమలో ప్రళయం. వెరీగుడ్. ఈ దెబ్బ ఎలాగుంది నీకు?"
"నేను గదిమారేను. అంగరవారి వీధిలోకి వెళ్ళిపోయాను."
"అంగరవారి వీధా? డజన్ట్ మేటర్ మచ్! మహా అయితే మైలుదూరం. మంది కాదనుకుంటే పదిపైసలు పారేస్తే అద్దె సైకిలు"
"ఇవాళ నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వీ స్థితిలో ఉన్నట్టు తెలిస్తే మరోనాటికి వాయిదా వేసేవాడిని. వస్తా పడుకో." అన్నాడు చిరంజీవి.
"గుడ్ డే బ్రదర్! బై... తలుపేసి వెళ్ళిపో.. బై...... ఛీరియో... ప్రేమకోసమై నననోన నెనేనానం ననినాను."
* * *
నాలుగేళ్ళ తర్వాత -
ఓ రాత్రి ఖరీదైన క్లబ్బులో - ట్యూబ్ లైట్ల క్రింద లోకనాథం కూర్చున్నాడు. అతని చేతిలోని పేకముక్కలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
"ఆల్ కౌంట్. వెరీ బ్యాడ్ డే ఫర్ మీ!"
సిగరెట్టూ యాష్ ట్రేలో కుక్కి ఒళ్ళు విరుచుకున్నాడు లోకనాథం.
"గంగులూ, తొందరగా టీ పట్రా!" అని కూడా అన్నాడు.
గుమ్మందగ్గిర నిద్రకి తూగుతూన్న గంగులు 'సంపుకు తింటన్నాడ్రా మొగుడు' అని విసుక్కున్నాడు.
లోకనాథం పక్కగా కూర్చున్న కొత్త సభ్యుడు బెరుగ్గా అడిగాడు.
"కెనై గో నౌ బాస్"
కొత్త సభ్యుడికి మొన్నీ మధ్యనే పెళ్ళవడం మూలంగా, శీతాకాలపు రాత్రులెంత విలువైనవో గ్రహించగలిగాడు. ఈ విషయం టేబుల్ ముందు కూర్చున్న ఆసాములందరూ పసిగట్టారు కూడాను. కానీ, కొత్త సభ్యుడు వెళ్ళిపోతానన్న మీదట లోకనాథం మండిపోయాడు. నొచ్చుకున్నట్లు నటించి యాంగ్రీగా అనేసినట్టు మాట్లాడేడు.
"నో... ఇంతెర్లీగా వెళ్ళిపోవడం బాగుండదు. గంట పదేగదూ అవుత. టౌన్లోనే భోజనం ముగించి వెళ్ళిపోదాం. బసవరాజింట్లో చేతులు కడుక్కోవాలని ఉందివాళ. మరి ప్రోగ్రాం మార్చేయకండి... కమాన్ మిస్టర్ రావ్! చాలా ఆలస్యంగా ముక్కలేస్తున్నారు మీరు. రెండు రౌండ్లు ఆడిపోతాం. వేగం పెంచండి. ఇలాగైతే తెల్లారిపొతుందలవతల. క్విక్."
