Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 66


    "ఓ హో...మీరా? చెప్పండి, చెప్పండి"

 

    "ఏం చెప్పనండి బాబూ! మీరిచ్చిన ఉడ్హవుస్ పుస్తకం సింప్లీమోర్వలెస్! గుడికొస్తారా?"

 

    "మీరూ వస్తున్నారా?"

 

    "వెళ్ళబోతూ ఫోన్ చేసేను"

 

    "మరి చెప్పరే! సరిగ్గా నేను కూడా గుడికెళ్ళబోతుంటే మీ ఫోను వచ్చింది"

 

    "ఉడ్ హవుస్ అభిమానులంతా ఇంతేనండీ, అయితే త్వరగా వచ్చేయండి మరి"

 

    "ఒకె! ఒకె!"

 

    శేషు ఫోన్ పెట్టేసి, జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకుంటుండగా, సెక్రట్రీ సోమసుందరమనే గుమాస్తాతో లోపలికి వచ్చేడు.

 

    శేషు సోమసుందరాన్ని చూస్తూ అన్నాడు.

 

    "ఏవిటండి? ఏం కావాలి?"

 

    సోమసుందరం సెక్రట్రీ వేపు చూసేడు. సెక్రట్రీ గుర్తుచేసే ప్రయత్నంలో అన్నాడు.

 

    "లెడ్జరు పోస్టింగు చేసిందెవరో పిలవమన్నారుకదా! అతనే ఇతను!"

 

    "ఇట్సాల్ రైట్..ఇప్పుడు నేనెవరితోనూ మాటాడను. రేపు కనిపించమనండి. దట్ టూ మార్నింగ్ అవర్స్..." అనుకుంటూనే శేషు గది దాటి వెళ్ళిపోయేడు.

 

    సోమసుందరం సెక్రట్రీ వేపు అమాయకంగానే చూసేడు. సెక్రట్రీ నిజమే చెప్పేడు.

 

    "ఏదేవుడో నిన్నివాళ కాపాడేడు బతికి పోయావు"

 

    -ఆ మాటకి సోమసుందరం ఆకాశంవేపు చేతులు జోడించి నమస్కారం చేసేడు.

 

    -ఆఫీసులోంచి బయటకొచ్చి కారెక్కబోతున్న శేషుకి సింహాచలం కనిపించేడు.

 

    అతన్ని చూడంగానే శేషు క్షణమాగి 'మీరు' అని ఏదో అడగబోతుండగా-

 

    సింహాచలం ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు. శేషుకి రెండోసారి పిచ్చెక్కినంత పనయింది.


                                      20


    గుళ్ళో గంట మోగింది.

 

    ఆ గంటమీద రెండు చేతులున్నాయి. ఒక చెయ్యి శేషుది. రెండోది జయది!


    
    మోగిన గంట సరిగమలు పలికింది. ఆ సరిగమలు జయా శేషుల గుండెలకు తాకి పరవశం కలిగించేయి.

 

    అంచేత-

 

    ఇప్పుడు వాళ్ళ చూపులు బరువుగా, సిగ్గుగా మారిపోయేయి.

 

    పూజారి వాళ్ళని ఏదో అడిగేడు. వాళ్ళు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారంతే.

 

    అట్లా మొహమొహాలు చూసుకోడంతో పూజారికి వాళ్ళభాష అర్థమైపోయింది. కులుకుతూ గర్భగుడిలోకి వెళ్ళి గబగబా మంత్రాలు చదివేస్తున్నాడు.

 

    బహుశా ఆ మంత్రాలు దంపతులకు సంబంధించినవై వుండాలి. అది రూలు.

 

    -జయ శేషులిద్దరూ మంటపంమీద కూర్చున్నారు. శేషు కొబ్బరి ముక్కకొట్టి జయకిచ్చేడు. జయ నోట్లో వేసుకుంది.

 

    ఇప్పుడు జయ కొబ్బరి ముక్క కొడుతుండగా వేలు చిట్లి రక్తం కారింది. అదిచూసిన శేషు ఆమె వేలిని చొరవగా నోట్లో పెట్టేసుకున్నాడు. అతని నోట్లో ఆమె వేలుంది. వాళ్ళిద్దరి కళ్ళు కలిసేయి. కవిత్వం మాటాడుకున్నాయి.


                                      21


    లవ్ ని కరెంటు షాకుతో పోల్చేరు పెద్దలు.

 

    అంటుకొనే కూడదు. అంటుకున్నదో దుంప తెంపేగలదు. శేషు విషయంలో అదే జరిగింది.

 

    ఆఫీసు కొస్తున్నాడన్నమాటేగాని-ఆఫీసు పనిమీద బొత్తిగా ధ్యాసలేదు.

 

    జయకు ఫోన్ చేయడం ఆఫీసు వదిలి వెళ్ళిపోవడం, మామూలై పోతోంది. ఈ కార్యక్రమాలవల్ల సోమసుందరమనబడే లెడ్జరు గుమాస్తా ప్రాణానికి హాయిగా వుంది.

 

    అందుచేత శేషు ఫోన్ చేసి బయటకు వెళ్ళే ప్రతిసారీ సోమసుందరం ఆకాశం వేపు చేతులుచాచి నమస్కారం చేసుకుంటూనే వున్నాడు.

 

    జయ శేషులిద్దరూ పట్టపగ్గాల్లేకుండా తిరుగుతున్నారు. ఒకర్ని విడిచి మరొకరు వుండలేని స్థితికి వచ్చేసేరు.

 

    పబ్లిక్ పార్కు-

 

    శేషు పసిపిల్లాడిలాగా జయ గుండెమీద తలపెట్టేడు జయ అడిగింది-

 

    "ఏం వినిపిస్తోంది?"

 

    "ఊహు...తెలీడం లేదు"

 

    "చెప్పనా..."

 

    అంటూ జయ తన గుండెల్లోని భాషని పాట రూపంలో వినిపించింది.

 

    పాట పూర్తయింది. ఇద్దరూ కౌగలింతలో వున్నారు. శేషు కళ్ళకి సింహాచలం కనిపించేడు.

 

    సింహాచలాన్ని చూడగానే శేషు అకస్మాత్తుగా కౌగలింత నుంచి దూరమయ్యేడు.

 

    పూలసెజ్జా వగైరాలతో వచ్చిన సింహాచలం పాత పాటే ప్రారంభించేడు.

 

    "పేరు అడగవద్దు. అడ్రస్సూ అడగొద్దు. సగటు మనిషిని-"

 

    "స్టాప్ దట్ బ్లడీ టాక్!" అరిచేడు శేషు. అతని అరుపులు పట్టించుకోలేదు శేషుకి పూలసెజ్జ యిస్తూ అన్నాడు సింహాచలం.

 

    "ఇంటికి వెళ్ళండి. నాన్నగారికి బొట్టిపెట్టి, ప్రసాదమిచ్చి మేడ ఎక్కండి. లోక కళ్యాణం జరిగిపోతుంది!"

 

    అని చెప్పేసి వెళ్ళబోతుంటే శేషు అతన్ని పట్టుకున్నాడు అతని వేపు సీరియస్ గా చూస్తూ అడిగేడు-

 

    "ఇంతకీ ఎవర్నువ్వు!"

 

    "నిరుద్యోగిగా ఏడందలేభై జీతగాడిని"

 

    "రికార్డు పెట్టేవంటే చంపేస్తాను. నీకు జీతమిస్తుందెవరు?"

 

    "రూలు ప్రకారం చెప్పకూడదు"

 

    "ఎందుకు నన్ను వెంబడిస్తున్నావో అదైనా చెబుతావా?"

 

    "రూలు ప్రకారం అది కూడా చెప్పకూడదు"

 

    "చెప్పకపోతే నాచేతుల్లో చచ్చేదిఖాయం!"

 

    "చెబితే మీ నాన్నగారి చేతిలో చచ్చేది తథ్యం!"

 

    ఆ మాటకి శేషు అదిరిపోయేడు 'మా నాన్నగారా' అంటూ గొణుక్కున్నాడు.

 

    ఇక తప్పని సరై సింహాచలం అసలు కథ చెప్పేడు.

 

    "అవునండి శ్రీ మీనాన్నగారే జీతమిచ్చి పోషిస్తున్నారు గనుక-నన్ను చంపడానికి వారికి పూర్తి హక్కులున్నాయి"

 

    "అసలు నీకెందుకిస్తున్నాడు జీతం!"

 

    'సింపులుగా చెప్పాలంటే తమకి తెలీకుండా తమ వ్యవహారాలు ఆచూకీ తీసి శ్రీ మీ నాన్నగారికి చెప్పడం నా డ్యూటీ. అందుకే యిస్తున్నారు జీతం! (ఇంక ప్రాధేయపడటం ప్రారంభించేడు) సార్. మీరు ప్రేమించుకోండి. డ్యూయెట్లనీ పాడుకోండి. నేనేమీ అనుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ, శ్రీ మీ నాన్నగారికి ప్రతిరోజూ బొట్టు పెట్టడం ప్రసాదమివ్వడం మరవకండి సార్, ఈ బొట్టూ ప్రసాదాల్తోనే నా బ్రతుకు ఆధారపడి వుంది సార్. (గంభీరంగా అన్నాడు) నా పేరు సింహాచలమండి. నా అడ్రస్సు పదహారు నందివాడ వారి వీధండి!"

 

    అనేసి అతను అక్కడ్నించి కదిలేడు.

 

    "సింహాచలం!" శేషు అతన్ని పిలిచేడు. సింహాచలం ఆగిపోయేడు.

 

    "మా ప్రేమ విషయం నాన్నతో చెబుతావా?'

 

    "చెప్పాలో చెప్పకూడదో-అదింకా నిర్ణయించుకోలేదుసార్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS