Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 67


    "చెప్పకుండా వుంటే నెలకి వెయ్యి రూపాయల జీతం నేనిస్తాను."

 

    "అప్పుడు నా జీతం పదిహేడు వందల ఏభై రూపాయలవుతుంది సార్!"

 

    శేషు అతని వరస గమనించి యింకో పాయింటు కూడా చెప్పాడు.

 

    "మా ఇద్దర్నీ ఒకింటి వాళ్ళని చేస్తే ఇంకో వెయ్యి యిస్తాను."

 

    "అప్పుడు మొత్తం జీతం రెండువేల ఏడువందలేభై అవుతుంది సార్".

 

    "ఇప్పుడు చెప్పు. నీకు ఏ జీతం కావాలి?"

 

    "రెండు వేల ఏడు వందల ఏభై సార్!"

 

    "గుడ్ లక్! ప్రొసీడ్."

 

    "థాంక్యూ సార్." అనేసి సింహాచలం సీరియస్ గా వెళ్ళిపోయేడు.

 

    ఈ తతంగంమంతా విచిత్రంగా గమనిస్తున్న జయ, వెళ్ళిపోతున్న సింహాచలాన్ని చూస్తూ శేషునడిగింది.

 

    "ఇంతకీ ఎవరితను!"

 

    "మన ప్రేమ కథకి సూత్రధారి! మిగతా వివరాలడక్కు. మెల్లి మెల్లిగా అన్నీ నీకే తెలుస్తాయి.


                                                                22


    వామనరావు చేతిలో కాగితముంది. సింహాచలం తన చేతిలో వున్న కాపీ చదువుతూ గాలి కొడుతున్నాడు.

 

    "మూడు నుంచి మూడున్నర వరకు అనకావల్లి బ్రాంచి మేనేజర్ని తిట్టేరు. మూడున్నర నుంచి నాలుగువరకు బందరు బ్రాంచి వారిని మెచ్చుకున్నారు. నాలుగు నుంచి అయిదు వరకు మోస్ట్ కాన్ఫిడెన్సీయల్ వర్క్."

 

    "మధ్య కాన్ఫిడెన్సీయల్ ఏమిటయ్యా?" చిరాగ్గా అడిగేడు వామనరావు.

 

    కాగితం పక్కకి పెట్టి సంజాయిషీ యిచ్చేడు సింహాచలం.

 

    "అబ్బాయిగారికి తప్ప మరొకరికి తెలీకూడని పనిసార్. డిస్టర్బ్ చేయకూడదని ఆర్డర్ సార్, (కాగితం చూస్తూ) అయిదు నుంచి ఆరింటివరకు గుడి. క్షణంలోనే, అర-క్షణంలోనే ఇంటికొచ్చేస్తారు."

 

    అప్పటికే ఇంట్లో అడుగుపెట్టిన శేషుని చూసి అన్నాడు వామనరావు.

 

    "వచ్చేసేరు"

 

    "ఇంక నేను తప్పుకుంటాను సార్!" అని అక్కడ్నించి కదిలేడు సింహాచలం. శేషు తండ్రి వేపు వెళ్ళకుండా పూలసజ్జెతో మేడ మెట్లెక్కబోతుండగా-చాటుగా తండ్రి వేపు వెళ్ళకుండా పూలసెజ్జతో మేడ మెట్లెక్కబోతుండగా-చాటుగా నిలబడ్డ సింహాచలం సైగల్తో ప్రాధేయపడటంవల్ల తండ్రిని చేరుకుని బొట్టు పెట్టేడు. ప్రసాదమిచ్చేడు.

 

    ప్రసాదం కళ్ళకద్దుకుంటో అడిగేడు వామనరావు.

 

    "తప్పుచేసిన బ్రాంచి మేనేజర్ని తిట్టడంలో తప్పులేదు. వాళ్ళక్కోపం వచ్చేలాగా తిట్టకూడదు. (ఆగి అన్నాడు) బైదివే. ఇవాళ నువ్వు చేసిన కాన్ఫిడెన్సియల్ వర్క్ ఏమిటి?"

 

    శేషు సింహాచలం వేపు చూసేడు. ఏదో ఒకటి కోసెయ్యమని సింహాచలం సైగచేసేడు.

 

    శేషు చాలా కరెక్టుగా సమాధానం చెప్పేడు.

 

    "సారీ నాన్నా! అది నువ్వడక్కూడదు. నేను చెప్పకూడదు"

 

    అంటూ అతను మేడ మెట్ల వేపు కదిలేడు. సింహాచలం వామనరావుని చేరుకుని సీరియస్ నెస్ నటిస్తూ అన్నాడు.

 

    "అబ్బాయిగారి కాన్ఫిడెన్సియల్ వర్క్ గురించి తమరు అడక్కుండా వుండాల్సింది సార్!"

 

    వామనరావు చాలా గర్వంగా అన్నాడు.

 

    "వాడి సమాధానం విన్నావుగదా! అయ్ లైక్ దట్. తండ్రయ్యేది, తాతయ్యేది. కాన్ఫిడెన్సియల్ అంటే కాన్ఫిడెన్సియలే. అయ్ టెల్యూ-డిసిప్లిన్ విషయంలో శేషు నా కంటే గొప్పవాడు."  

 

    సింహాచలం నసుగుతూ అన్నాడు.

 

    "అబ్బాయిగారి డిసిప్లిన్ మీద గానీ, వారి శీల సంపద మీద గానీ నా కెటువంటి డవుటూ లేద్సార్! రోజులే, అంత బాగా లేవు."

 

    వామనరావు సీరియస్ గా అడిగేడు.

 

    "నీ కడుపులో ఏదో పెట్టుకున్నావ్! కక్కెయ్!"

 

    "ప్రేమించి పెళ్ళి చేసుకోడం తమ సిద్ధాంతానికి వ్యతిరేకం గదా."

 

    వామనరావు ఆందోళనగానూ-అనుమానంగానూ అడిగేడు.

 

    "అబ్బాయిగారు ఎవర్నైనా ప్రేమించేడా?"

 

    సింహాచలం అట్నుంచి నరుక్కొచ్చి అన్నాడు.

 

    "తండ్రికి తగ్గ తనయుడు. ఆ విషయంలో అబ్బాయిగారు నిప్పు సార్. కాణీ, అబ్బాయిగారి అందచందాల-ఆస్థి అంతస్థులూ చూసిన ఆడపిల్లలు ఆశపడి అబ్బాయిగార్ని వలలో వేసుకుంటేనో."

 

    వామనరావు ఆ పాయింటు మీద అర్జంటుగా కలకంటున్నాడు.


                                                              23


    అదొక అందమైన రోడ్డు.

 

    శేషు కార్లో వెడుతున్నాడు. దార్లో ఒక అందమైన అమ్మాయి లిఫ్టు కోసం సైగ చేస్తూ నిలబడింది.

 

    శేషు కారు ఆపేడు.

 

    అమ్మాయి చాలా ఆత్రంగా కారు దగ్గరికి వచ్చి వయ్యారంగా అడిగింది.

 

    "కొంచెం లిఫ్టిస్తారా? (ఆగి అనునయంగా, దీర్ఘాలు తీస్తూ అడిగింది) ప్లీజ్...కాదనకండి. ఆడపిల్లని..."

 

    శేషు కారు తలుపు తీసేడు. పిల్ల శేషు పక్కకు చేరింది.

 

    కారు కదిలింది. కారు వేగంగా పోతుంటే, అమ్మాయి జరిగి జరిగి అబ్బాయికి అతుక్కుపోయింది. అతుక్కుపోతూ, కులుకుతూ అంటోంది.

 

    "నా పేరు నీలవేణి. నీలూ అని పిలిస్తే చాలు. మరి మీ పేరో,

 

    "శేషు"

 

    "అబ్బ తియ్యగా వుంది పేరు. తీపి పేర్లంటే నా కెంతో యిష్టం"

 

    అంటూ గబుక్కున శేషుబుగ్గ మీద ముద్దెట్టేసుకుంది.

 

    ఆ దెబ్బకి కారు అటూ ఇటూ మెలికలు తిరిగిపోయింది.

 

    "బాగుందా?" అని అడిగింది అమ్మాయి. శేషు బుగ్గ తుడుచుకున్నాడే గాని మాటాడలేదు. అమ్మాయి యింకా కులుకుతూనే వుంది.

 

    "మాంచి హోటల్లో మాంచి కాఫీ తాగాలి డియర్!"

 

    కారు కాఫీ హోటల్ దగ్గిరే ఆగింది.


                                      24


    అదొక ఖరీదైన హోటలు.

 

    కౌంటరు దగ్గిర అమ్మాయి నిలబడి చాలా చొరవగా అడుగుతోంది.


    
    "డబుల్ రూం-ఏ.సి. కావాలి!"

 

    శేషు అమ్మాయితో తడబడుతూ రహస్యంగానే అన్నాడు.

 

    'కాఫీ తాగుదామన్నారు!"

 

    "ఆ తాగేదేదో గదిలోనే తాగుదాం డార్లింగ్. కమాన్..."

 

    అంటూ తాళం తీసుకుని శేషు-మీద వాలిపోతే నడుస్తోంది.

 

    హోటల్ గదిలో అడుగు పెట్టగానే పసిపిల్లలా కేరింతలు కొట్టేస్తూ మంచం మీద వెల్లకిలా పడిపోయింది.

 

    ఆ ఫోజు శేషుకి కిక్కునివ్వగా బిత్తర పోతున్నాడు. నీలవేణి పమిట తప్పించింది. దాంతోపాటు ఆటోమేటిగ్గా కాళ్ళకింద చీరకూడ తొలగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS