Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 65


    "అయ్ టెల్యూ. నీకిచ్చే జీతం వేస్టని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళూ నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తున్నావని నమ్మేను. నీ తప్పుడు రిపోర్టులకు తలూపేను. తనకిచ్చిన రిపోర్ట్ కాగితం చూపెడుతూ) ఇట్లా ఎన్ని కాపీలు తయారు చేసేవ్, ఎన్నాళ్ళిస్తావ్?"

 

    సింహాచలం నిజం చెప్పక తప్పలేదు.

 

    "సూర్యుడు పడమర ఉదయించవచ్చునేమో గాని, అబ్బాయిగారి రొటీను మారదనే నమ్మకంతో నెలకు సరిపడే కాపీలు టైపు చేసేను సార్ ఇకముందు ఆ కాపీయివ్వనుసార్"

 

    వామనరావుకు ఆందోళన ఎక్కువైంది. అందుకే అనుకుంటున్నాడు.

 

    'ఆరు నూరైనా నూరు ఆరైనా తన అలవాట్లనీ, పద్ధతులనూ మార్చుకోని శేషు ఇంత అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడు?"

 

    "నేనూ అదే ఆలోచిస్తున్నాను సార్"

 

    "సింహాచలం" అరిచేడు కోపంగా.

 

    "యస్సార్" అన్నాడు సింహాచలం వినయంగా.

 

    "అబ్బాయి ప్రవర్తనమీద నాకెందుకో ఆందోళనగా వుంది. అయ్ టెల్యూ. నాకు ఆందోళన ఎక్కువైతే నీ బతుకు అంధకారమవుతుంది. నీ బతుకు బాగుచేసుకోడం నీ చేతుల్లోనే వుందని గుర్తుంచుకో. ఇదే మొదటి వార్నింగు. చివరి హెచ్చరిక కూడాను యూ కెన్ గో"

 

    "యస్సర్" అనేసి వెనక్కి తిరిగి సుడిగాలిలా వెళ్ళిపోతూ గోడకి గుద్దుకున్నాడు సింహాచలం.


                                       18


    మెయిన్ రోడ్డుమీద అదొక పుస్తకాల దుకాణం.

 

    ఆ పుస్తకాల షాపతను శేషుకి ఒక పుస్తకమిస్తూ అన్నాడు.

 

    "యూ ఆర్ లక్కీ సార్. ఇదే చివరి కాపీ"

 

    పుస్తకం తీసుకుంటో అన్నాడు శేషు.

 

    "థాంక్స్. ఎంతన్నారు?"

 

    "ఇరవై రూపాయిలు"

 

    శేషు వందకాగితమిచ్చి పుస్తకం పేజీలు  తిప్పుతున్నాడు. ఇంతలో అక్కడికి గుళ్ళో కనిపించిన అందమైన అమ్మడు ఆదరా బాదరాగా వచ్చి షాపతన్ని అడిగింది.

 

    ఉడ్ హవుస్ పుస్తకం, కారీ ఆన్ జీవ్ స ఉందాండి?"

 

    షాపతను బోలెడు విచారపడిపోతూ చెప్పేడు.

 

    "సారీ మేడమ్! లాస్ట్ కాపీ వారు కొనేసేరు"

 

    వారి వేపు చూసింది అమ్మడు. అమ్మడివేపు చూసేడు శేషు. ఇద్దరి చూపులూ కలిసిన వేళ కలెక్టరాఫీసులో ఒకే ఒక్క గంట కొట్టగా అది ఆ ఇద్దరికీ వినిపించింది. గంట శబ్దం వినగానే అమ్మడు కిసుక్కున నవ్వేసింది నవ్వుతూనే అడిగింది.

 

    "మీరు...మీరు..." శేషు సిగ్గుపడుతూ చెప్పేడు.

 

    "నా పేరు శేషు. మీ పేరు?"

 

    అమ్మాయి అందంగానే మాటాడింది.

 

    "జయ! కలకత్తానుంచి మొన్నీమధ్యనే ఈ ఊరొచ్చేం. ఉడ్ హవుస్ నాకు అభిమాన రచయిత. అతని పుస్తకాలు చదివే వారన్నా కూడా నాకెంతో యిష్టం. నేను కొందామనుకున్న పుస్తకం మీరు కొనేసేరు. పోన్లేండి. ఎవరో ఒకళ్ళం కొనేసేం వస్తానండి"

 

    అనేసి ఆమె వెళ్ళబోతుండగా 'ఆగండి' అన్నాడు శేషు. ఆమె ఆగిపోయింది. అతను తాను కొన్న పుస్తకం ఆమెకిస్తూ 'ఉంచండి' అన్నాడు.

 

    "మరి మీకో?" అడిగింది జయ పుస్తకం తీసుకుంటో.

 

    "మీరు చదివింతర్వాత ఇవ్వండి. ఇది నా విజిటింగ్ కార్డు. కిపీట్ విత్యూ" అన్నాడతను కార్డు యిస్తూ.

 

    "చాలాచాలా థాంక్సండి. ఉడ్ హవుస్ అభిమానులంతా ఇంతేనండి క్షణంలో ఫ్రండ్సయి పోతారు వస్తానండి."

 

    అని ఆమె వెళ్ళిపోతుంటే, అతన్ని ఆమె అయిస్కాంతంలాగా లాగేసింది.

 

    ఆమె వెనకే అతనుకూడా షాపులోంచి రోడ్డుమీది కొచ్చేసేరు.

 

    ఆమె రోడ్డుమీద వయ్యారంగా నడుచుకుంటో వెళ్ళిబోతుంటే, తను నడి రోడ్డుమీద శిలాప్రతిమలా నిలబడి వెళ్ళుపోతున్న ఆమెను చూస్తూ వున్నాడు.

 

    అంతరాత్మ అతన్ని పలకరించింది.

 

    'పుస్తకమే యిచ్చేవో, పుస్తకంతోపాటు నీ హృదయంకూడా యిచ్చేసేవో ఆ పాయింట్ నీకే వదిలేస్తున్నా. దార్లో అడ్డంగా నిలబడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. తప్పుకో"

 

    అప్పుడు చూసేడు అటూ ఇటూ. అతని ముందూ వెనకా కార్లూ బళ్ళూ వగైరా క్యూలో నిలబడ్డాయి. హారను శబ్దాలు అదర గొడుతున్నాయి.

 

    పరాకు నుంచి బయటపడి, రోడ్డు పక్కకి రాగా అక్కడ సింహాచలం ప్రత్యక్ష మయ్యాడు. అతని చేతిలో పూలసెజ్జా వగైరాలున్నాయి.

 

    "నమస్కారం" అన్నాడు సింహాచలం.

 

    "మీరు?" అంటో ప్రతి నమస్కారం చేసేడు శేషు.

 

    "పేరడగవద్దు, అడ్రస్సూ అడగొద్దు. సగటు మనిషిని నిరుద్యోగిగా ఏడొందల ఏభై జీతగాణ్ని (బాధగ) నా బ్రతుకూ, నా భవిష్యత్తూ నా చేతిలో లేనివాడ్ని (పూలసెజ్జ యిస్తూ) తీసుకోండి. ఇంటికి వెళ్ళండి. నాన్నగారికి బొట్టుపెట్టి ప్రసాదమిచ్చి మేడ ఎక్కండి. లోకకల్యాణం జరిగిపోతుంది. (డబ్బులిస్తూ) పుస్తకాలషాపులో మరిచిపోయిన చిల్లరిది. జేబులో వేసుకోండి. ప్రస్తుతానికి సెలవు"

 

    అనేసి సింహాచలం సీరియస్ గా వెళ్ళి పోతుంటే శేషుకి పిచ్చెక్కినంత పనైంది.


                                      19


    వామన్ స్కూటర్స్ ఆఫీసులో శేషు గదిలో గోడ గడియారం నాలుగు కొట్టింది. సెక్రటరీ శేషుముందు నిలబడి వున్నాడు. శేషు గాండ్రిస్తున్నాడు అతనిముందు లెడ్జరుంచి.

 

    "ఏమిటండి ఈ లెక్కలు, కాకుల్లెక్కలు? లెడ్జరు పోస్టింగెవరు చేసింది?"

 

    "సోమసుందరమని"

 

    "మోస్టు ఇర్రెస్పాన్సిబుల్ క్రీచర్ పిలవండతన్ని"

 

    "పిలవచ్చనుకోండి. అన్ని వివరాలూ మాట్లాడటానికి కనీసం మూడు గంటలైనా పడుతుంది."

 

    శేషు గట్టిగానే అరిచేడు.

 

    "మూడు రోజులైనా అయ్ డోంట్ మైండ్. డ్యూటీ ఫస్ట్-పిలవండతన్ని"

 

    సెక్రట్రీ అక్కడ్నించి కదిలేడు. శేషు కాగితాలు తిరిగేస్తున్నాడు.

 

    ఈ యావత్తు గందరగోళాన్నీ చాటుగా చూస్తున్న వామనరావు చాలా తృప్తిగా నిట్టూర్చేడు. తన పక్కనే వున్న సింహాచలాన్ని చూస్తూ మీసాలు మెలివేసేడు కొడుకు ప్రయోజకత్వం గమనించేవా అన్నట్టు.

 

    సింహాచలం చేతులు జోడించేడు ఆనక ఆ ఇద్దరూ అక్కడ్నించి కదిలి వెళ్ళిపోయేరు.

 

    అంతలో శేషు గదిలో ఫోన్ మోగింది. శేషు మొహం చిట్లిస్తూనే ఫోనందుకున్నాడు. హల్లో అన్నాడు.

 

    ఇప్పుడు. రెండు ఫ్రేములు కనిపిస్తున్నాయి ఒక ప్రేములోంచి జయ మాటాడుతోంది...

 

    "గంటగారేనా" అడిగింది నవ్వుతూ?

 

    "శేషు ఆశ్చర్యంగా 'గంటా' అని ఆ తర్వాత విషయం జ్ఞాపకం రాగానే ఎంతో ఆనందంగా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS