ది గ్రేట్
నాలుగేళ్ళ క్రితం-
ఆ ఊరి కాలేజీలో లోకనాధానికి మంచి సరదాగా ఉండేవాడని పేరు. అస్తమానూ గోలచేస్తూ తిరిగేవాడు. అతనిమీద చాలామందికి సదభిప్రాయం లేనట్టే- బహు కొద్దిమంది ప్రాణం పెట్టేసేవారు. ప్రాణం పెట్టే మనుషుల్లో చిరంజీవి మొదటివాడు.
లోకనాధానికి ఎల్లప్పుడూ కుడీ, ఎడమా చెరోవైపు అయిదుగురు చొప్పున మనుషులుంటేనేగాని తోచదు. అతననేక విషయాలమీద ధారాళంగా మాట్లాడేయగల ఘనుడు. అతనేది మాట్లాడినా విని 'ఔను, యస్స'నే తన ఆత్మీయుల్ని అతను సర్వసాధారణంగా మెచ్చుకుంటూనే వుండేవాడు.
అతనెక్కువగా చదివేవాడు కాదు. చదువుమీద బద్ధకం, ఇతర విషయాల్లో ఆసక్తి - ఈ రెండూ జాస్తీగానే వుండేవి. ఆ వూళ్ళో విడుదలయ్యే ప్రతీ సినిమా అతన్ని తప్పించుకుపోయేది కాదు. ఈ సినిమా పిచ్చివల్ల అతను విపరీతంగా పాఠాలకి ఎగనామం పెట్టేవాడు. ఎక్కువ పీరియడ్లే అతనికి హాజరుపడేది. అయితే, హాజరుపడిన ప్రతి పీరియడ్ కీ హాజరయ్యేవాడు గాదు. అతని ఆత్మీయుల్లో యెక్కువ భాగం అతని ఎజంట్లే (ప్రాక్సీలు), ఏ లెక్చరరుకైనా లోకనాధాన్ని కళ్ళ చూస్తేనే తప్ప అతను హాజరైనిదీ, లేనిదీ తెలిసేది కాదు.
టూకీగా లోకనాధం యొక్క గుణగణాలూ, లీలా విలాసాలు ఇవి. లోకనాథాన్ని అంటిపెట్టుకు తిరిగే చిరంజీవి నెమ్మదస్థుడని లోకనాధం అభిప్రాయం. పాడు కంపెనీలో చేరి తన మంచితనాన్ని ఖర్చు చేసుకుంటున్నాడని ఎక్కువ మంది అనుకునేవారు. లోకనాథం స్నేహం మానుకోమని వాళ్ళు చిరంజీవిని హెచ్చరించినప్పుడు నవ్వేసి-
"మీతో పాటు నాకు లోకనాథమూ కావాలి!" అనేవాడు.
ఈ మాటకి మంచి విద్యార్థులు హర్షించనప్పుడు చిరంజీవి నొచ్చుకోనూ లేదు!
చిరంజీవి అద్దెకుండే గదిముందు ప్లీడరుగారిల్లుండేది. ఆయనకు పుట్టెడు చెవుడు. కొన్ని పరికరాల సాయంతో ఆయన ఎదుటివాడి బాధని అర్థం చేసుకునేవారు. ఆ ప్లీడరుగారింటికి పావలా ఛార్జీ అని రిక్షా వాళ్ళంతా ఓ ఎగ్రిమెంటు కొచ్చేసినట్టు ఖచ్చితంగా బేరం చెప్పేవారు. సాయంత్రం అయిదున్నర, ఆరు ప్రాంతాల ఆయనకేమీ తోచదు. అప్పుడాయన తెల్లటి దుస్తుల్తో, వేళ్ళ మధ్య వెలుగుతున్న సిగరెట్టుతో స్టేషనువేపు వెళ్ళేవారు. ఆయనటు వెళ్ళిం తర్వాతగాని ఆ యింట్లో ప్రాణికోటికి ఆటవిడుపు దొరికేది కాదు. ఆ సమయంలో ఆ యింటి గుమ్మం ముందు తళుక్కున మెరుస్తుండేది ఒక అందమైన చుక్క.
ఆ చుక్కమ్మ పేరు భానుమతి!
భానుమతి చిరంజీవి వాళ్ళ కాలేజీలోనే చదువుకునేది. కాలేజీకి వెళ్ళేప్పుడు గానీ, తలెత్తి పరిసరాలు చూచేది కాదు. అర్జంటు పనున్నట్టు గబగబా అడుగులేయడం భానుమతికి అలవాటు.
చిరంజీవికి ఆడపిల్లలంటే వల్లమాలిన భయం లాంటి గుణం. వాళ్ళేదైనా మాట్లాడటం వింటే సిగ్గు. అందమైన ఆడపిల్లలకి రొంప పడితే బాధ. అప్పుడు ముక్కు చీదుతుంటే అసహ్యం. భూమ్మీద మనోహరమైన సృష్టి ఆడజాతని అతని ఉద్దేశం. మనోహరమైన యీ సృష్టి సర్వదా మనోహరంగా వుండాలనేది అతని సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి మచ్చుతునకగా భాసిల్లేది ఎదురింటి భానుమతి!
ఈ భానుమతిని కాలేజీలోనే తీరుబడిగా చూచేందుకు వీలు చిక్కేది కాదు. ఇంటిదగ్గర, అద్దె గది కిటికీ వారగా కుర్చీలో కూర్చున్నప్పుడు సాయంత్రం ఆరు ప్రాంతాల భానుమతి కనిపించేది. అప్పుడతని మనస్సు గాల్లో తేలి, భానుమతిని చేరి పారవశ్యం చెందేది.
అందుచేత, అతను సాధారణంగా సాయం సమయాలు వృధా చేసేవాడు కాదు. ఒక్కోసారి వర్షం లాంటిదొచ్చి తన ప్రయత్నాన్ని తినేసినప్పుడు అతనెంతో కృంగిపోయేవాడు. మరో సందర్భంలో చెవిటి ఫ్లీడరు స్టేషనువేపు వెళ్ళడం మానుకున్నప్పుడు కాలరుచ్చుకుని రెండు వాయించేద్దామనిపించేది. అయితే అతడి మనసులోని ఈ మాటలెప్పుడూ అతనెవర్తోనూ చెప్పేవాడు కాదు.
ఏదో సందర్భంలో లోకనాథం దగ్గర నోరు జారిన క్షణంలో లోకనాథం యెంతో ఆశ్చర్యపోవడం గమనించి తల దించేసుకున్నాడు. లోకనాథం అప్పుడతని భుజాన్ని చరిచాడు. అతి విశ్వాసపాత్రమైన గుర్రాన్ని రౌతు బుజ్జగించినట్లు బుజ్జగించాడు. తలెత్తి తనవేపు తిన్నగా చూడమని ఆదేశించాడు. చిరంజీవి బెరుగ్గా అతనివేపు చూశాడు. లోకనాథం కుడి కన్నొక్కటే మూసి మళ్ళా తెరిచి నవ్వేస్తూ అన్నాడు.
"గాడ్! చిరంజీవి సామాన్యుడు కాదు."
నిజానికి చిరంజీవి సామాన్యుడేం కాదు. అతను బుద్ధిగా చదువుకునే క్లాస్ వన్ బుద్ధిమంతుడు. విద్యార్థుల్లోనూ, అధ్యాపకుల్లోనూ అతనికి విలువ వుండేది. ఎకనామిక్స్ లో బ్రిలియంటని గొప్ప పేరూ వుండేది.
ఓరోజు ముసురు పట్టిన సాయంత్రం అద్దెగదిలో చిరంజీవి మనసు దిగులు చెందినవేళ భానుమతి అతని గుమ్మం దగ్గర ప్రత్యక్షమైంది. అతనప్పుడు కలవరపాటు చెందాడు. ఏం చేయాలో నిర్ణయించుకునే ముందే భానుమతి చాలా ఖరాదుగా అడిగేసింది.
"మీరేం అనుకోకపోతే మీ ఎకనామిక్సు నోట్సు ఓ తడవ యివ్వండి. మళ్ళా రెండు రోజుల్లో యిచ్చేస్తాను."
చిరంజీవి కేవలం నోట్సు ఒక్కటే యిచ్చిం తర్వాత చాలా బాధపడిపోయాడు. ఈ విధంగా నోట్సు ఇవ్వవలసి వస్తుందని ముందే తెలిస్తే ఎంచక్కా 'ప్రేమలేఖ' గూడా పొందుపరిచే ఏర్పాటు చేసేవాడిని గదాని బాధపడిపోయాడు. ఈ ఉదంతం యావత్తూ లోకనాధానితో చెప్పి అతని ఉద్దేశాన్ని అడిగినప్పుడు మాత్రం తను చేసిన పనే సబబని తోచింది. లోకనాథం సృష్టి ధర్మాన్ని వివరించాడు.
"నువ్వు ప్రేమించిన మనిషి ఆడది. ఆడది తలుచుకుంటే మగవాడి జాతకం బజారుపాలైపోవడం ఏమంత దుస్సాధ్యమైన కార్యం కాదు. అందునా భానుమతి ప్లీడరుగారమ్మాయి. ప్రేమలేఖ ఆడనుంచి మగకు వస్తేనే సుఖం. అంతేగాని ఇట్నుంచి అటు అనగా మగ నుంచి ఆడకు వెళ్ళగూడదు చిరంజీవీ! హేస్టీ స్టెప్స్ తీసుకోవద్దు."
ఆర్నెల్లు గడిచిం తర్వాత అట్నుంచి యిటు ప్రేమలేఖ రాకపోయినా, అటుకీ యిటుకీ సన్నిహితత్వం యెక్కువయ్యింది.
ఓరోజు లోకనాథం చిరంజీవి అద్దెగదికి వచ్చాడు. భానుమతి విహారాలు చూశాడు. అకస్మాత్తుగా గదిలోంచి బయటకొచ్చి స్టేషను రోడ్డువేపు నడక సాగించాడు. మరో అరగంటకి చెవిటి ప్లీడరుతో పాటు లోకనాథం భానుమతి వాళ్ళింట్లోకి వెళ్ళడం చూచిన చిరంజీవికి యేమీ అర్థమైంది కాదు.
